Tuesday, 15 July 2014

పుట్టిన రోజు ముచ్చట (2)

పుట్టిన రోజు ముచ్చట (2)

( part 1 link ikkada )

''ఎప్పుడూ సంక్రాంతి కి మీ అత్తగారిల్లేనా ?
ఈసారి కోటకు రండి '' అమ్మా నాన్న ల ఆహ్వానం . 
కాదన లేము, అందులో అసలు కంటే వడ్డీ ముద్దు 
అని ''హేమ మాధురి '' ఫస్ట్  మనుమరాలు అయిపోయే . 
దాని బుల్లి చేతులతో భోగి మంటల్లో తాటాకు లు 
వేయించాలని అమ్మమ్మకు ,తాతయ్యకు ,మేన మామకు 
సరదా .... వాళ్ళకే కాదు  మాకు కూడా సరదాగా ఉంది . 
అందులో కొత్తగా పెళ్లి అయిన మా చెల్లి సునీత, వాళ్ళ ఆయన 
మస్తానయ్య మొదటి పండుగ కు వస్తున్నారు . ఏ విధంగా 
చూసినా వెళ్లి తీరాల్సిందే . 

''సరే వరంగల్ నుండి బయలుదేరి మా అత్తగారింటికి 
వెళ్లి వాళ్లకు ఒక మాట చెప్పి పాపను తీసుకొని 
మేము ఇద్దరం కోటకు వస్తాము '' చెప్పేసాను . 
ఇక కోటలో సందడే సందడి . తాటాకులు తెప్పించి 
ఎండలో పరిచేసారు . పండుగ కళ ఇల్లంతా .... 
                           *******
చక్కగా అడుగులు వేస్తూ మాధురి ఇల్లంతా తిరుగుతుంటే 
నవ్వులే నవ్వులు . పిన్నమ్మలు పక్కింటి వాళ్ళు 
చెల్లెళ్ళు , తమ్ముళ్ళు ..... అబ్బ ఫస్ట్ పుట్టే వాళ్ళను 
తిప్పటానికి ఎన్ని గుర్రాలో !
వచ్చే పోయే వాళ్ళ కామెంట్స్ ... 
''ఏమి బుగ్గలే పిల్లకి ,మీ వాయుగుండ్ల వాళ్ళ బుగ్గలు 
వచ్చేసాయి . మీ అత్తగారి ప్రింట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి చెన్నూరు లో ''
అనటం . నేను టకామని దిష్టి తీయడం . 
అయ్యో పాల బుగ్గలే కదా ,   ఎవరికైనా అలాగే 
ఉంటాయి . స్కూల్ కి వెళితే  ఉండవులే అనడం . 

మొత్తానికి మామిడి తోరణాలు కట్టిన వాకిట్లోకి 
భోగి పండుగ వచ్చేసింది . తెల్లవారకే ముందే 
అందరం లేసేసాము . మా చెల్లి వచ్చి పాపను 
లేపేసింది . దానికి అర్ధం కాక ముందు వెలుగుతున్న 
మనిషంత ఎత్తు మంటను చూస్తూ నిద్ర ఇంకా ఉండేసరికి 

కళ్ళు నులుముతూ ఉంది . 
అందరు చుట్టూ చేరి మాధురి ... మధురి అని 
నవ్విస్తూ ఉండేసరికి మెల్లిగా నిద్ర మత్తు పోయి 
తాతయ్య దగ్గరకు పోయి చూస్తూ ఉంది . 
మా మరిది  గారు , ఈయన ''దామ్మా ... ఆకులు  మంటలో 
వేద్దాము ''అని పిలిచి ఎత్తుకోపోయారు . 
భయంతో చేయి లాక్కొని వాళ్ళ తాతయ్య కు 
చుట్టుకుంది . 

''భయం లేదు చూడు మేము వేస్తున్నాము . ''
అని నేను చెల్లి తాటాకులు మంటలో వేసాము . 
అయినా రావడం లేదు . 
మెల్లిగా వాళ్ళ తాతయ్య ఎత్తుకొని చిన్న తాటాకు 
దాని పిడికిలి సరిపోయేంత గా చూసి చేతిలో పెట్టాడు . 
అటూ ఇటూ ఊపింది . నచ్చిందేమో ఊపుతూ 
నవ్వుతూ ఉంది . మెల్లిగా తాతయ్య మంట దగ్గరకు 
తీసుకేల్లి విసురు అన్నాడు . వేసేసింది . 
నెలల పిల్ల గా ఉన్నప్పటి నుండి అంతే !
మా నాన్న మాట భలే వింటుంది . 

చక చకా వాకిలి ఊడ్చి నేను , చెల్లి రంగులతో 
ముగ్గు వైకుంట వాకిళ్ళు గీస్తూ ఉంటె చూస్తూ 
మా చుట్టూ తిరుగుతూ ఉంది . 
తరువాత అందరం తలంటు కొని కొత్త  బట్టలు 
వేసుకున్నాము . పాప  గౌను అందరికి చూపించాలి 
అని పిన్ని కూతుళ్ళు శిల్ప , సింధు , రేఖ 
వచ్చి తీసుకొని వెళ్ళారు పాపని . 
బిచ్చగాళ్ళకి బియ్యం , దోసలు అవీ వేస్తూ వంట 
చేస్తూ అందరం బిజీ . 
ఎప్పుడో ఖాళీ గా ఉన్నప్పుడు దీని పుట్టిన రోజు 
సంగతి గుర్తుకు వచ్చింది . ఈ సారి కూడా 
ఇరవయ్యో తేది స్కూల్ కి వెళ్ళాల్సిందే :(
మరి దీని పుట్టినా రోజు కోరిక ఎలా ?

దుఖానికి కారణం కోరికే అంటారు . కాని ఈ 
చిన్ని ముచ్చట్లు కోరిక అవుతాయా ?
లేకుంటే దీనిని తీర్చుకోవాలి అని అంత 
ఆలోచన ఎందుకు ?ఏమో పిల్లల మధ్య మూడేళ్ళు 
గాప్ ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాము కాబట్టి 
పైసారికి రెండో వాళ్ళు వచ్చేస్తారు . 
ఇక దీని ముచ్చట్లకు టైం ఎక్కడ ?

అమ్మ వినగానే 
''సరే కానీ ఈ సారి కూడా 
అందరిని పిలిచి భోగి పళ్ళు పోద్దాము ''చెప్పింది . 
నాన్న వెంటనే గుమస్తాలను పంపి రేగు పళ్ళు 
తెమ్మని పంపాడు . 
వాళ్ళు మొత్తం తిరిగి 
లేవంటూ వచ్చారు . 
''ఇప్పుడెలా ?'' అందరం ఆలోచనలో పడిపోయాము . 
                                              
                                                  (ఇంకా ఉంది )


3 comments:

హనుమంత రావు said...

very good narration.. we could see the sankranti sobha in your post. congrats. waiting for the next episode.

శశి కళ said...

thanks hanumantha rao garu

కిరణ్ కుమార్ కే said...

ఈ పార్ట్ కూడా చాలా బాగుంది. మీ పండగ కళ్ళకు చూపించినట్లు రాసారు/