( part 5 link ikkada )
కాళేశ్వరం నుండి హనుమకొండకు వచ్చేదారిలో బస్ ఆపేసి
దిగి వెళ్ళమన్నారు . బాంబ్ బ్లాస్టింగ్ వలన రోడ్ పాడయ్యింది
అని రోడ్ దిగి నడుచుకుంటూ వెళితే కొంత దూరం తరువాత
బస్ లు దొరకచ్చు అని చెప్పారు . అప్పుడే ఏర్పడిన కాలిబాట
లో కొంచం నలిగిన పచ్చిక మీద ముందు ఈయన , వెనుక నేను
రెండేళ్ళ మాధురి ని ఎత్తుకొని , వెనుక అమ్మా నాన్న .... పాపం
ఇంత జరుగుతుందని తెలిస్తే వాళ్ళను తీసుకొని వచ్చేదాన్ని కాదు .
కాళేశ్వరం , గోదావరి చూసిన ఆనందం అంతా ఎటు పోయిందో !!
రోడ్ మీద చెల్లా చెదురుగా శవాలు , చూడకూడదు అనుకున్నా
చూపుకి పక్కన ఎక్కడో తగులుతూ ..... కడుపు తిప్పేస్తుంది .
రోడ్ మీద నుండి చూపు మరలించేటట్లు లీలగా ఏదో ముళ్ళ చెట్టు పై
కదులుతూ ..... దగ్గర కు వచ్చేసరికి చూస్తె , ఒక పోలీస్ టోపీ
తగులుకొని వేలాడుతూ ,మానవత్వం ఉరి తీసింది అని చెపుతున్నట్లు .....
ఎక్కడ రోడ్ ,ఎక్కడ కంప ..... అక్కడ నుండి ఒక మనిషి తల నుండి
యెగిరి ఇంత దూరం వచ్చి పడింది అంటే ఎంత బ్లాస్టింగ్ జరిగి ఉండాలి .
వంటిలో భయం తో కూడిన జలదరింపు ,ఇక రోడ్ మీద చూసే ధైర్యం
లేదు . తల వంచుకొని ఆ టోపీ ని వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు
వెళ్లాను . మెల్లిగా చేయి నొప్పి పుడుతుంది . సమస్య చిన్నదే అయినా
ఎక్కువ కాలం మోస్తే తీవ్రం అనిపిస్తుంది .
''ఏమండీ పాపను ఎత్తుకోండి '' ఇచ్చాను ఆయనకి .
నిద్ర లోనే కళ్ళు తెరిచి మళ్ళా నాన్న స్పర్శకి భుజం మీద వాలి
కునుకు లోకి జారింది . మెల్లిగా రోడ్ ఎక్కాము .
అంతా సందడి సందడి గా ఉంది . మళ్ళా ఏదో లోతైన నిశ్శబ్దం ఉంది .
వచ్చిన వెహికల్స్ అక్కదే ఆగి వెనుదిరుగుతున్నాయి .
అదిగో హనుమకొండ వెళ్ళే బస్ . ప్రాణం లేచి వచ్చినట్లు ఉంది .
''మావయ్య తొందరగా రండి '' ఒక్క ఉదుటున బస్ ఎక్కి బస్
ఆపారు ఈయన . అందరం ఎక్కి బస్ సీట్లలో సర్దుకొని కూర్చున్నాము .
అందరు మౌనంగా ఆలోచన ల్లో ఉన్నారు . నా కైతే ఏదో స్తబ్ధత .
ఇప్పుడు ఈ తెలంగాణా నాకేమి నాకేమి ఆనందం కలిగించడం లేదు .
కుండెడు నమ్మకం లో ఎవరో ఒక్క ఉప్పు రాయి వేసేసారు .
ఎంత బాగా నమ్ముతానో ,అది వీగిపోయినపుడు అంతే బాధ పడుతాను .
ఏదైనా సిన్సియర్ గా చేయడమే అలవాటు . అలసిన శరీరం
నిద్రలోకి జారిపోయింది . హనుమకొండ శబ్దాలు లేపే వరకు వళ్ళు తెలీలేదు .
మంచిది ,నిద్ర కూడా మనసు గాయానికి మందే .
ఆటో లో ఇంటికి వస్తూ ఉంటె
'' శశి పాపను తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి .
నేను హోటల్ కి వెళ్లి టిఫిన్ తీసుకొని వస్తాను ''
చెప్పి దిగేశారు ఈయన . మంచిది ఇక ఒక
గంటె టైం ఉంది ,అమ్మ వాళ్ళ ట్రైన్ కి . మళ్ళా
కాజీపేట కు వెళ్లి ట్రైన్ ఎక్కాలి .
ఇంటి ముందు ఆటో దిగుతుంటే అమ్మ మాధురి ని తీసుకొని
ముద్దు పెట్టుకుంది . నిద్ర కళ్ళతోనే నవ్వింది బుజ్జి తల్లి
అమ్మమ్మ ను గుర్తు పట్టి . నాన్న కూడా '' ఓయ్ తల్లి ''
పలకరించాడు దాన్ని . మరి ఇంకా కొంత సేపే కదా దానితో
ఆడుకునేది . వాతావరణం కొంత తేలిక పడ్డా మనసు బరువు
ఇంకా ఉంది . అసలు ఇక్కడ ఇంత దిస్తారబెంస్ ఉంది అనేది
నా ఊహలో కూడా లేని విషయం . అమ్మా వాళ్ళు ఇంట్లోకి
వెళితే ఇంటి ఓనర్ బయటకు వచ్చి నవ్వుతూ పలకరించింది .
''అచ్చినార ,మస్తు దూరం ఉంది కదా ,పాలు ఉన్నయి
తీసుకోండి . అట్ల పిండి కూడా ఉంది . కావల్నా ?''
గుండె లోతు గాయాన్ని ఈ గంధం లేపనం ఎలా మాన్పుతుంది .
మాములుగా అయితే దోసె , పండు మిర్చి తొక్కు అంటే
ఇష్టంగా తినేస్తాను .
''వద్దు , ఈయన తెస్తాను అన్నారు '' ముభావంగా వెళుతున్న
నన్ను చూసి ఆమె మొహం లో వేలాడుతున్న ఆశ్చర్యం .
అందరం టిఫిన్ తింటూ ఉంటె ఇందాకటి సంఘటన మళ్ళా
మాటల్లో దొర్లుతూ ......
''ఏమి చేస్తారు ?'' మానేసి వస్తారా అన్న ప్రశ్న అమ్మా , నాన్నల కళ్ళలో .
మానేసి వెళ్ళ డమా !!! వెళ్లి ఏమి చేసేది ఇద్దరికీ ఉద్యోగం లేకుండా .....
బాంబ్ బ్లాస్టింగ్ కంటే పెద్దది అయిన జీవితం ఇంకా భయాన్ని కలిగిస్తూ ,
అవును నిరుద్యోగాన్ని ఎదురుకుంటూ జీవితం లాగడం కంటే
ఈ బాంబ్ బ్లాస్టింగ్ పెద్ద లెక్క కాదు . మనుషుల కామెంట్స్ కంటే
ఇవి బాధాకరమైనవి కాదు . అయినా టౌన్స్ లో ఇలాటివి జరగవు లే ,
అది అడివి కాబట్టి జరిగింది ..... నాన్న చెపుతున్న ధైర్యం కొంచెం
మనసును కుదుట పరుస్తూ .
ఇంక ఎలాగైనా ట్రాన్సఫర్ పెట్టుకొని వెళ్లిపోవాలి . అంత వరకు
ఇక్కడ జీవితం ఈదగలం . కాదు కాదు ఈదాలి . సముద్రం లోకి
దూకినాక నిర్ణయాలు తీసుకోవడం ఉండదు . కాళ్ళు చేతులు
కదిలిస్తూ ప్రాణానికి క్షణాల ఆయువు కలుపుతూ ముందుకు పోవడమే .!!
జీవిత బ్లాస్టింగ్ ముందు , ''ఇదొక లెక్కా ''
వెళుతున్న అమ్మా నాన్నలకి మాధురి చేత టాటా చెప్పించాను .
ఇద్దరు మళ్ళీ మాధురి ని ఎత్తుకొని ముద్దులతో ముంచేశారు .
అసలు కంటే వడ్డీ ముద్దు మరి !!
జాగ్రత్త ,ధైర్యం చెపుతూ వెళుతూ ఉంటె ఇద్దరి కళ్ళలో సన్నటి
కన్నీటి పొర . యెంత ఎదిగినా మేము వాళ్లకు చిన్న బిడ్డలమే .
''ఏమి కాదులే నాన్న '' నోరు తెరిచి ధైర్యం చెప్పాను .
వెళుతున్న ఆటో చూస్తూ మెల్లిగా మాధురి ని ఎత్తుకొని
లోపలి వెళ్లాను .
''అసలు ఒకరిని ఒకరు ఎందుకు చంపుకుంటారు వీళ్ళు .
ఏమో మరి నాకేమి తెలుసు !!! చంపెవాడికి కారణాలు
ఉంటాయి ,చచ్చేవాడికి కూడా . ఎన్నో సిద్ధాంతాలు , రాద్ధాంతాలు
మీద నిర్మింపబడిన హింస ఇది . మూలాలు బాగు చేయాలి
అని ఎవరు అనుకోరు . ఎదుటి వారు తుపాకి చూపించినపుడు
శాంతి కపోతాలు ఎగరేస్తూ కూర్చోరు . నా వాళ్ళు , నీ వాళ్ళు అని
విడదీసుకుంటూ పోవడం లో ఏదో ఆనందం ఉన్నట్లుంది .
ప్రతి దానికి కారణం ఉంటుంది . మనం ఎవరి వైపు ఉన్నాము
అనే దాన్ని బట్టి మన మనసు తప్పు ఒప్పు ల తీర్పు ఇస్తూ
ఉంటుంది ''
''కారణం ఏదైనా కాని మనిషి ,మనిషి ని చంపుకోవడం
నాగరికత మోకాళ్ళ పై తల ఉంచి బోరుమని ఏడవాల్సినంత
విషాదం ''
నివాస్ హనుమకొండ లో మేము ఇంకో ఇంట్లోకి మారినపుడు
పుట్టాడు . ఎనిమిది నెలల బాబుని తీసుకొని ఇక్కడకు
వచ్చేస్తుంటే ఆ ఇంటి ఓనర్ కూతురు కి పెట్టినట్లు వడిబియ్యం
పెట్టి ,బిడ్డని నన్ను కళ్ళ నిండా నీళ్ళతో సాగనంపిన సంగతి నేను మర్చిపోలేను .
వీడు మొన్న హనుమకొండ కు కాలేజ్ పని మీద వెళితే కాకాజీ
కాలనీ కి వెళ్లి వాళ్ళను చూసి రారా అని చెప్పాను . ఎనిమిది నెలల
బిడ్డగా ఆ వీధి చూసాడు . ఇప్పుడు తెలుస్తుందా ఆ వీధి గురించి .
అయినా అమ్మ చెప్పింది కదా అని విజయ టాకీస్ నుండి ,ఆర్ . టీ. సి
డిపో వరకు ప్రతీ సందు తిరిగాడు వాళ్ళ కోసం వీడు . ఫలితం లేకపోయినా
బిడ్డ నా మాట విన్నాడు కదా అనేది తృప్తి .
''తెలంగాణ నా పుస్తకాల్లో దాచుకున్న నెమలీక '' అంతే ....
ఇంక చెప్పేదేమీ లేదు . (అయిపొయింది )
@@@@@@@@@@@@@@@@
No comments:
Post a Comment