Thursday, 11 September 2014

''దేహళి ''... ప్రతి కూతురు కూడా

''కాపురానికి వెళ్ళిందా అమ్మ పాప ''
''అవునక్కా '' ఇప్పుడే అమ్మాయి అల్లుడు
వెళ్ళిపోయి ఇంట్లో మనసులో ఏదో వెలితి .
అర్ధం చేసుకుంది ఎదురింటామె .
''ఇంక అంతే లేమ్మా . దగ్గరే కదా వస్తూ పోతుంటారు లే ''
ఓదార్పుగా అంది . నిజమే ఇద్దరు కూతుర్లను కన్నది .
ఈ బాధను వాళ్ళు కూడా దాటే ఉంటారు . కొంత ముందు
వెనుకగా అందరు దాటుతారు .

ఇంట్లోకి వచ్చేసరికి నివాస్ బెడ్ రూమ్ వైపు చూపిస్తూ
సైగ చేస్తున్నాడు . ఎవురున్నారు ?ఇంట్లో ఈయన
ఒక్కరే  ఉన్నారు .
''వెళ్లి చూడు . నాన్న ఏడుస్తున్నాడు ''వాడికి కొత్తగా
ఉంది . వాడు విజయవాడ కు వెళ్ళినపుడు కూడా
ఎవరం ఏడవలేదు . దగ్గరగా ఉన్న నెల్లూరు కు
అక్కను పంపిస్తే ఎందుకు ఏడవటం పాపం వాడికి
అర్ధం కాలేదు . నాకు కూడా అర్ధం కాలేదు .
ఎంతో పెద్ద సమస్యలు వచ్చినా నేను ఏడుస్తాను కాని
ఆయన ధైర్యం చెపుతూ ముందుకు తీసుకెళుతారు .

వెళ్లి చూసేసరికి దిగులుగా మొహం మీద మోచేయి ఉంచి
పడుకొని ఉన్నాడు ,చేయి పక్కన చిన్నగా జారుతున్న
తడి ......
''ఏమిటి ఏమైంది ?''ఓదారుస్తున్నాను కాని నాకే తెలీకుండా
నా కళ్ళలో కూడా ఊరుతున్న తడి .
ఏమిటో ఎవరు ఎవరికీ ఏమి కారు ,ఇదంతా ఒక నాటకం .
ఊహు ఎంత సముదాయిస్తున్నా పైకి వస్తున్న దుఃఖం .
''ఎందుకొచ్చిన వేదాంతాలు ,సిద్దాంతాలు రాద్దంతాలు ,
కాసింత కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటించలేనపుడు ''
విసుగు అనిపించింది . 

''ఛీ ఆడపిల్లను కనకూడదు ''అంటున్నారు .
''అబ్బో అప్పుడు ప్రపంచం ఏమి అయిపోవాలి ''మొండిగా అన్నాను .
అన్నీ తెలిసి  కూడా ఇలా బాధ పడటం నా మీద నాకే కోపంగా ఉంది .

''ఇరవై మూడేళ్ళు సాకి విద్యా బుద్ధులు చెప్పి ఎవరికో ఇచ్చెయ్యాలి ''
''ఆహా ఇయ్యాక పోతే ఏమి చేసుకుంటావు ?మా నాన్న మాత్రం
ఇస్తేనే కదా ఈ రోజు మీ దగ్గర ఉన్నాను ''అనునయంగా
చెప్పాను .

''రోజు ఇంటికి రాగానే పాపా పాప అని పిలిచే అలవాటు .
ఇప్పుడు ఇంకెవరున్నారు ?''

''మరీ చిత్రం గంట దూరం . చూడాలంటే ఎంతలోకి వెళ్ళొచ్చు .
కాదంటే వాళ్ళు అయినా తెచ్చి చూపిస్తారు . కావాలంటే
రోజు ఫోన్ లో మాట్లాడుకో '' ఏమి చెప్పకుండా మౌనంగా
లేచి ఆయన పనిలో మునిగిపోయారు .
రెండు రోజులకు ఇంట్లో వెలితి అలవాటు అయింది .
ఇక మేము  ఇద్దరమే ఉండాలి అనే సత్యం బోధపడింది .

ఇదిగో ఇదంతా ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసి మళ్ళా గుర్తుకు
వచ్చింది ,నీళ్ళలో రాయి వేస్తే ఒక్క సారి నీళ్ళు కలతబడినట్లు ,
కాసింత ప్రశాంతం కావాలంటే మళ్లి ఎన్ని రోజులు పడుతుందో ,
ఆడపిల్ల తల్లి తండ్రులకు :(

ఆడపిల్ల గడప మీద పెట్టిన దీపం అంట . ''దేహళి ''
రెండు లోగిళ్ళకు వెలుగు ఇస్తుంది నిజమే .
అప్పగింతల పాట మా అమ్మ నేర్పించింది .
''అత్తవారింటికి అంపే దెలాగమ్మా
అల్లారు ముద్దుల అపరంజి బొమ్మ
పోయి రావే పడతి అత్తవారింటికి
వెంకన్న మంగమ్మ అండ నీకుండా .....

పుట్టినింటికి కీర్తి
మెట్టినింటిలో శాంతి
నిలిపి వెయ్యేళ్ళు వర్ధిల్లవమ్మా !

అత్తవారింటికి అంపే దెలాగమ్మా
అల్లారు ముద్దుల అపరంజి బొమ్మ ''

మా మాధురి కూడా మాకు మంచి పేరు తెస్తుంది .
మా పాపే కాదు ప్రతి కూతురు కూడా ప్రపంచాన్ని
వెలుగుతో నింపుతున్న దీపాలే . కాదని హృదయం
ఉన్న ఎవరైనా అనగలరా ?

link ikkada
ప్రతి తండ్రికి కూతురి మీదేనా ప్రేమ ,కూతురికి తండ్రి మీద ఉండదా ?
ఏది గొప్ప అంటే లాజికల్ స్టెప్స్ తో తేల్చగల బంధాలా ఇవి !
నా కధ ''వర్షం లో గొడుగు '' ''మాలిక ఈ పత్రిక '' లో వచ్చినది . 
దాని మీద వ్రాసిన చక్కని విశ్లేషణ చూసి ఎప్పటి నుండో పోస్ట్ 
వేయాలి అనుకుంటుంటే ఇప్పటికి వీలు అయింది . 
వలబోజు జ్యోతి అక్కకు ధన్యవాదాలు . విశ్లేషణ వ్రాసిన 
మంధా భానుమతి గారికి ధన్యవాదములు . 


1 comment: