Thursday, 18 September 2014

పుట్టిన రోజు ముచ్చట (4)

పుట్టిన రోజు ముచ్చట (4)

(puttina roju muchchata 3 parts link ikkada )


''అమ్మా ఇవేంటి ''మూడేళ్ళ మాధురి వీపు మీదెక్కి ఊగుతూ 
నా వళ్ళో ఉన్న రంగుల పేపర్స్ చూపించి అడిగింది . 
పక్కన ఉన్న రెండు నెలల బాబు నివాస్ ని పాప కాలు 
తగలకుండా చిన్నగా జరిపాను . నిద్ర లో విసిగించాను కాబోలు 
''ఊ '' అని చిన్నగా మూలిగాడు . చిన్నగా కాళ్ళు విదిలించాడు . 
మధురి గబుక్కున చిచ్చు గొట్టి ''అమ్మ లేరా ''అని నచ్చచెప్పింది . 
వేలెడంత లేదు పిల్లలు అంటే ఎంత ఇష్టమో . వీడికి ఇది కూడా 
అమ్మే . 

''చెప్పమ్మా '' మళ్ళీ అడిగింది . చిన్నప్పటి నుండి కూడా మరీ 
మొండికేసి విసిగించదు . మెల్లిగా అడిగి తీసుకుంటుంది . మనం 
ఏమైనా చెపితే శ్రద్ధగా వింటుంది . 
''మరి నీ పుట్టిన రోజు వస్తుంది కదా . నువ్వు కేక్ కట్ చేసేటపుడు 
ఇవన్ని ఇంట్లో చుట్టూ తగిలిస్తాము '' చెప్పాను . 
''పుట్టిన రోజు అంటే ''.... బాబోయ్ మాటలు ముద్దుగా ఉంటాయి ,
కాని ఈ పిల్లల ప్రశ్న లకు సమాధానం చెప్పటం మొదలు పెడితే 
ఇక అంతం ఉండదు . 
''అంటే ఇప్పుడు ఇక్కడ తమ్ముడ్ ఉన్నాడు కదా !
అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు ?''
''నీ పొట్టలో ''చెప్పింది . కళ్ళలో కరక్ట్ చెప్పాను అనే వెలుగు . 
చిన్నగా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని ..... 
''అలాగే నువ్వు నా పొట్టలో ఉన్నావు . నీ పుట్టిన రోజు అప్పుడు 
ఇదిగో తమ్ముడి లాగా పుట్టావు ''చెప్పాను . 
''నా పుట్టిన రోజు నాకెలా తెలిసింది ?''అయిపోయాను . ముందు 

విషయం డైవర్ట్ చేయాలి . 

''నువ్వు ఎప్పుడు పుడితే అప్పుడే బంగారు అది . 
చూడు నీకోసం చిన్న టోపీ చేసాను . అది పెట్టుకొని కేక్ 
కట్ చేస్తువు సరేనా ?''
''మరి ఇన్ని టోపీ లు ఎందుకు ?''
''ఇంకా పిల్లలు అందరు వస్తారు కదా వాళ్లకి . ఇంకా వాళ్లకి 
నువ్వు చాక్లెట్స్ , కేక్ ఇవ్వాలి . ఇస్తావా ?''
''ఇంకా నానమ్మకి ,జేజినాయనకి ,బాబాయిలకి ,అత్తమ్మకి 
కోట తాతయ్యకి ,అమ్మమ్మకి , రాణి పెదమ్మకి ,హర్షా కి 
అందరికీ పెడతావా ?''
''ఊ పెడతాను . తమ్ముడికి కూడా ''గుర్తు చేసింది . 

దీని మొహం . దీనికే ఉన్నాడు తమ్ముడు . ప్రతి విషయానికి 
ముందో వెనకో తమ్ముడు అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ,
రైల్ ఇంజెన్ బోగీలను లాక్కోచ్చినట్లు . 
''తమ్ముడు తినడమ్మా ,పాలు ఒక్కటే తాగుతాడు . చిన్నవాడు కదా ''

ఇదేమిటి ఇదేమిటి అని అడుగుతూ ఉంది . 
కలర్ పేపర్స్ తో కట్ చేసిన పాప పేరు , టోపీలు ,పేపర్స్ తో 
తోరణాలు నేను హనుమకొండ లో షాప్స్ లో చూసినవన్నీ 
పుట్టిన రోజు వరకు చేస్తూనే ఉన్నాను . పాపకు ఏది కొరత 
ఉండకూడదు అని తపన .  అసలు దీనికి పుట్టిన రోజు చేయాలి 
అని ఎప్పటి కోరిక . ఏదో ఈ నివాస్ పుట్టాడు కాబట్టి ఇప్పటికి 
మెటర్నిటీ లీవ్ లో ఉండి చేయగలుగుతున్నాను . 

పుట్టిన రోజు ఉదయం నుండే సందడి . వాళ్ళ అత్తతో వెళ్లి అందరికి 
చాక్లెట్స్ ఇచ్చి కేక్ కటింగ్ కి రమ్మని అందరిని పిలిచి వచ్చింది . 
మధ్యాహ్నానికి మా అమ్మ నాన్న ,రాణి అక్క వాళ్ళ బాబు 
హర్షా అందరు వచ్చారు . సాయంత్రం అయ్యేసరికి ఇల్లంతా 
బంధువులు ,చుట్టూ పక్కల వాళ్ళు ఇల్లంతా సందడి . 
వచ్చే వాళ్ళను పలకరిస్తూ బాబాయిలు ,జేజి నాయన 
అంతా సందడి . డెకరేషన్ చూసి అందరు మెచ్చుకున్నారు . 
కేక్ తీసుకొచ్చి లోపల పెట్టారు . 

వచ్చిన వాళ్ళను పలుకరిస్తూ మర్యాదలు చేస్తూ బాబును 
చోసుకుంటూ ఉన్నాను . ఇంతలో ఎందుకో హేమా ఏది 
అనుకున్నాను . హాల్ లో కనపడలేదు . ముందు షాప్ వెనుక 
ఇల్లు కాబట్టి షాప్ లోకి వెళ్లాను . ఏమైనా వీధిలోకి వెళ్ళిందా ?
ఎందుకో భయం వేసి బయటకు వెళ్లి చూసాను . బంగారు నగలు 
కూడా ఉన్నాయి వంటి మీద పాపకి ఏమై  ఉంటుంది?
పాప ఇక్కడకు వచ్చిందా ?మామగారిని అడిగాను . 
''రాలేదే లోపలే ఉందేమో ''అన్నారు . 

లోపల ఉందా ,లేకుంటే...... గబా గబా పరిగెత్తి వంటింటి వైపుకు వెళ్లాను . 
టేబుల్ వెనుక చిన్నగా అలికిడి . చూడగానే ఒకటే నవ్వు నాకు . 
టేబుల్ అందక కాళ్ళు పైకెత్తి ఒక వేలు కేక్ మీద ముంచి క్రీమ్ 
ను తింటూ ఉంది . ''ఓయ్ ''అరిచేసరికి ఉలిక్కి పడింది . 
''తినకూడదమ్మ ఎంగిలి ''చెప్పి చేయి కడిగేసి తీసుకొచ్చాను . 
''ఇంకొంచెం ''అడిగింది . 
''అలాగేలే కేక్ కట్ చేసినాక తిందువు ''నవ్వుతూ చెప్పాను . 
ప్రతి ఒక్కటి అదలా ఎంజాయ్ చేస్తూ ఉండటం నాకు భలే సంతోషాన్ని ఇస్తూ ఉంది . 

కేక్ కట్ చేయగానే అందరు చప్పట్లు కొట్టి 
''హాపీ బర్త్ డే మాధురి '' అంటూ ఉంటె దానికి సంబరం 
చప్పట్లు కొడుతూ ఉంది . 
ఒక్కొక్కరికీ కేక్ పెట్టింది . అందరు అక్షింతలు వేసి డబ్బులు , 
బహుమతులు ఇస్తూ ఉంటె నాకు ఇస్తూ ఉంది . 
అమ్మమ్మ వచ్చి ముద్దు పెట్టుకొని చిన్న ప్లాస్టిక్ కుర్చీ 
గులాబి రంగుది ఇచ్చింది . వెంటనే ఎక్కి కూర్చుంది . 
దాని సంతోషం చూసి నాకు భలే సంతోషంగా ఉంది . 
ఇందుకు కదా నేను పుట్టిన రోజు చేయాలి అనుకున్నది . 

కాని ఏ వయసులో ముచ్చట ఆ వయసులో చేసినపుడు 
దానికి అందం ఇంకా పెరుగుతుంది . ఇప్పుడు చేయబట్టి 
ఎంత ఆనందంగా ఉంది పాప . హమ్మయ్య ఇప్పటికి 
దాని పుట్టిన రోజు ముచ్చట నాకు తీరింది . 

                                  @@@@@@@@@@@   
(అయిపొయింది ) 

No comments: