Tuesday, 20 January 2015

మల్లాది గారి త్రీ మంకీస్ చదివారా ?

మల్లాది గారంటే ? ఇప్పటి వాళ్లకు కొంత ప్రశ్నార్ధకం . 
అప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు తనను తానె మార్చుకుంటూ 
కాలానికి తగ్గట్లు కలాన్ని తిప్పుతూనే ఉన్నారు . ఈ మధ్య 
సాక్షి లో ఆయన ''త్రీ మంకీస్ '' సీరియల్ చదివితే ఇప్పటి అలవాట్లను ,
టేక్ ఇట్ ఈజీ లైఫ్ ని ఆయన ఎంత గా గమనిస్తున్నారో తెలుస్తుంది . 
ఇది పూర్తి అయిన తరువాత నేను వ్రాసిన ఒపీనియన్ ఈ రోజు సాక్షి ఫ్యామిలీ లో 
చదవండి . థాంక్యు సాక్షి . 

(3 monkeys pai naa sakshi opinion ikkada )

ఇప్పటి వాళ్లకి పుస్తకాలు విలువ తెలీదు చాలా మందికి ,
కాని విదేశాల్లో చాలా మంది తమ పిల్లలకు చేసే అలవాటు పుస్తకాలు చదవడం . 

పుస్తకం ఒక జీవితం , పుస్తకం ఒక మిత్రుడు ,పుస్తకం దారి చూపే దీపం ,
పుస్తకం మన ఊహలు అల్లుకునే చెట్టు కొమ్మ , పుస్తకం మన మనస్సుని 
కట్టుకొని పైకెగిరే గాలిపటం , పుస్తకం పక్క వాడి కష్టాన్ని మనకు తెలియచేసి 
గుండె బరువు దింపు కొనే అశ్రు కణం . నిజమా అంటే ..... 
నిజంగా నిజం . నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది దాని విలువ . 

ఆడపిల్ల ఇక బయటకి వెళ్ళకూడదు అనగానే మా కోసం ఒక కొత్త 
ప్రపంచం తెరుచుకుంటుంది . పెద్ద వాళ్ళ దగ్గర నుండి సహస్ర నామాలు ,
సుప్రభాతాలు ,రామాయణ భాగవతాలు , పినమ్మల దగ్గర నుండి 
వార ,మాస పత్రికలు ,ఆంద్ర భూమి ,జ్యోతి ,వనితా జ్యోతి ,విపుల ,చతుర 
కొంచెం పెళ్ళికి ముందు స్వాతి ఇంకొంచెం తరువాత నవ్య , ఇంకా 
ఫ్రెండ్స్ నుండి ప్రేమతో ఇచ్చి పుచ్చుకొనే నావల్స్ మల్లాది , యండమూరి ,
యద్దనపూడి ,మాదిరెడ్డి ..... లిస్టు వెళుతూనే ఉంటుంది లోకపు 
సంఘర్షణలో ,సంతోషాలో మొదటి పేజ్ తీసానంటే చివరి పేజ్ దాకా 
ఆపేది లేదు . అన్నం తింటూ కూడా చదవడమే . ఎలాగో మాకు అన్నం 
అమ్మే కలిపి ముద్దలు చేసి చేతులో పెడుతుంది . కూర ఏదైతే ఏమిటి 
అక్షరాలు నంజుకుంటే భలే రుచి . ఫ్రెండ్స్ పలకరింపు మొదటగా .... 
ఫలానా నావల్ చదివావా ?అని . పెళ్లి అయ్యి వెళ్ళే వాళ్ళు మాకు ఇచ్చి 
వెళ్ళే ప్రేమ కానుక ''లైబ్రరీ కార్డ్ '' . అదిగో అప్పటి అభిమాన రచయిత 
మల్లాది గారు . ఇప్పుడు వ్రాస్తే ఏదో ఒకటి చెప్పకుండా ఉండగలనా !
అందుకే ఇది వ్రాసాను . మల్లాది గారు మీరు నావల్స్ లో చెప్పిన 
విషయాలు మాకు తరువాత జీవితం లో చాలా ఉపయోగపడ్డాయి . 
మల్లాది గారు మిమ్మల్ని మేము మరచిపోము . థాంక్యు . 


No comments: