Thursday, 20 November 2014

ఇదొక లెక్కా ?(3)

(part 1, 2 link ikkada )
బస్ వెళుతూ ఉంటె కాళేశ్వరం ఇంకా ఎంత దూరం ఉందొ 
అనుకుంటూ దేవుడు కిటికీ లో నా కోసం ఇచ్చిన ప్రకృతి 
ఫోటో ఆల్బం చూస్తూ కూర్చున్నాను . ఉన్నట్లుండి ఒక నల్ల మబ్బు 
 సూర్యుడిని కప్పుతూనో ,దూరంగా తెలిపోతూనో ఎక్కువగా చెట్లు 
మధ్యలో చిన్న కొండ గుట్టలు .... ఇక్కడ అడవిలో జంతువులు 
ఉంటాయా ,ఉండవా ..... ఎక్కడో ఒక్క ఊరు . దానిని ఊరు 
అని కూడా అనలేము . ఒక ఇరవై ఇళ్ళు అంతే . ముందుకు చూసాను . 
నాన్న వడిలో నుండి జారి పాప పరిగెత్తుతూ ఉంది . వాళ్ళు 
నవ్వుకుంటూ పట్టుకుంటున్నారు . నేను మా వారి వంక చూసేసరికి 
ఆయనే కూతురుని గొప్పగా చూసుకుంటూ ,నవ్వుకుంటూ ఇకీ 
నా వంక చూసారు . దొంగ మొహం అమ్మమ్మ దగ్గర ఉండిపోయింది . 
కనీసం అమ్మ దగ్గర కు వెళతాను అని ఏడవడం కూడా లేదు . 
వాళ్ళు నెల్లూరు కి వెళ్ళనీ చెపుతాను . 

అదిగో ఈ ఊరిలో ఒక చిన్న ప్రభుత్వ బడి . హమ్మయ్య చూస్తే 
సంతోషం వేసింది . ఇక్కడ కూడా బడు లు ఉన్నాయి పర్వాలేదు . 
నేను కాని సి .ఎమ్ అయితే (ఇది కొంచెం ఎక్కువే కాని ,చిన్న లక్ష్యం 
నేరం అని కలాం గారు చెప్పారు కదా అందుకు ) ప్రతి ఊరికి ఒక 
స్కూల్ పెట్టి అవన్నీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ గా మార్చి శాటిలైట్ 
తో అనుసంధానం చేసేస్తాను . పెద్ద స్క్రీన్ విడియో కాన్ఫెరెన్స్ ల కోసం ,
ఇంకా ప్రతి దగ్గర నుండి ప్రతి సంస్థకు లింక్  ఉండేటట్లు ,అన్నీ సోలార్ తో 
పనిచేసేట్లు .......... ఆ ఊరి పిల్లలనే ఇద్దరినీ నిర్వహించే జాబ్ 
ఇచ్చేస్తాను . 
అసలు పల్లెటూరి లో ప్రభుత్వ బడి ఎంత స్ట్రాంగ్ గా ఎన్ని వసతులతో 
ఉంటె ప్రభుత్వం అంత చక్కగా పాలించగలదు . 
నిజమేనా ? మరి ప్రభుత్వ బడి అంటే పల్లెటూళ్ళలో ఎంత 
ఉపయోగం తెలుసా ?తుఫాన్ షెల్టర్ అదే ,చదువుల గుడి అదే ,
పోలియో టీకాలు అక్కడే ,ఎన్నికల బూత్  లు అక్కడే ,
రచ్చబండలు అక్కడే , పిల్లల ప్లే గ్రౌండ్ అదే ,కొన్ని సార్లు 
న్యూస్ పేపర్స్ దొరికే గ్రంథాలయము ,ఇంకా చదువు రాని 
వాళ్ళు ఉత్తరాలు వ్రాయించుకునే దక్కడే ,ముహూర్తాలు రొయ్యల 
చెరువు కోసం పెట్టేది అక్కడే ,గ్రామ సభలు అక్కడే ,
కష్ట సుఖాలు  అక్కడే ,ధాన్యం ఆరపోసుకుంది అక్కడే ,ఒక్కోసారి 
బర్రెలను కట్టేది అక్కడే ..... ఇంకా సెలవల్లో పేకాట రాయుళ్ళ వేసవి విడిది . 

ఇలాంటి స్కూల్స్ ని ఇంకా పెంచుకుంటూ ఉంటె అవి ప్రభుత్వానికి 
సామంమత రాజుల కోటల్లాగా ఉపయోగపడుతాయి కాని ,
రేషనలైజేషన్ పేరుతో మూసేస్తే ప్రభుత్వానికి బలం తగ్గినట్లే . 
అసలు విద్య మీద పెట్టేది ఎంత పెంచితే దేశ అభివృద్ది సూచిక అంత
పెరిగినట్లు . 

ఆలోచనల్లోనే కాళేశ్వరం వచ్చేసింది . బస్ ఆగే స్థలానికి దగ్గర లోనే 
గుడి . పెద్ద పురాతనంగా లేదు . కొత్తగా కట్టినట్లే ఉంది . 
మరి యముడు స్థాపించాడు అన్నారు . గుడి చూస్తె అలా లేదు . 
గుడిలోకి అడుగు పెట్టగానే మాధురి పరుగో పరుగు . ఇంత సేపు 
దానికి కాళ్ళు కట్టేసినట్లు ఉన్నాయి పాపం . అందరం నవ్వుకొని 
ఆడుకోనీలే అని వదిలేసాము . ప్రాంగణం లో చిన్న నాలుగు స్తంభాలతో 
ఒక మండపం . దాని పైకప్పు మన నడుములు దాక వస్తుంది . 
ఏమిటబ్బా ఇది అనుకుంటూ వంగి చూసాను . ''యమ కోణం ''
అని వ్రాసి ఉంది. వీళ్ళు అందరు నా వైపు చూస్తున్నారు . ఇలాంటి 
సత్య శోధనలు నాకు భలే ఇంట్రెస్ట్ . అక్కడ బాణం గుర్తు ఉంది . 
ఓహో చక్కగా వంగి అవతలకి దూరాను . ఏముంది ఇక్కడ ?
ఏమి లేదే !అక్కడ ఇంకో బాణం మళ్ళీ వంగి మండపం నుండి 
బయటకు వచ్చాను . మొత్తానికి మండపం లో ప్లస్ లాగా దారిలో 
వెళ్లాను . ఏమిటో ఇది అర్ధం కాలేదు . 

లోపలి వెళ్ళాము . పెద్దగా జనాలు లేరు . ఇలాగ ఉంటె నాకు చాలా 
ఇష్టం . తోసుకుంటూ ఉంటె అసలు ఇష్టం ఉండదు . లోపలికి 
వెళ్లి లింగం వైపు చూసి నమస్కరిస్తూ ఆశ్చర్య పోయాము . 
ఒకే పానపట్టం పై రెండు లింగాలు . మళ్ళా ఒక లింగం మీద 
రెండు రంద్రాలు . 
''ఏమిటి స్వామీ ఇది ?''అడిగింది అమ్మ . హేమ చేత 
నమస్కారం పెట్టించింది . ఎక్కడకు వెళ్ళినా ఆ స్థలం 
గూర్చి అడగడం శ్రద్ధగా వినడం ,మళ్ళీ పిల్లలకు అర్ధం 
అయ్యేట్లు చెప్పడం మా అమ్మా నాన్నలకు అలవాటు . 
నాకు కొద్దిగా ఇలా అడగడం అలవాటు అయింది . 


''అమ్మా ఇది యముడు చేత స్థాపితం ,ఇది కాళేశ్వరుడు
ఇది ముక్తేశ్వరుడు. ''
''మరి ఒక లింగం మీద రెండు రంద్రాలు ఏమిటి ?''
''అవి నాసికా రంద్రాలు . శివుడు మీద పడిన అభిషేక జలం 
ఈ రంద్రాల గుండా వెళ్లి గోదావరిలో కలుస్తుంది ''

బాప్రే నిజమా !అందరం ఆశ్చర్య పోయి మళ్ళా భక్తిగా 
నమస్కరించుకున్నాము . హేమా మాత్రం పెట్టను అని మొండికేసి 
ఆటలో మునిగి పోయింది పక్కన ఉండే ఉడుతను చూస్తూ .   

''స్వామీ మరి బయట ఆ పొట్టి మండపం ఏమిటి ?''అడిగాను 
ఆత్రుతగా . 
''అది యమ కోణం . ఆ బాణం గుర్తులలో అందులో తిరిగితే 
యమ బాధలు ఉండవు ''అని చెప్పారు . 
గ్రేట్ . ఇంత చిన్నగా తిరిగితే యమ బాధలు ఉండవని తెలిస్తే 
ఎవరు మాత్రం తిరగకుండా ఉంటారు . తిరుగుదామని బయటకు వెళుతూ 
ప్రహరి గోడ పక్కనుండి చూసాను . కనుచూపు ఆనేంత 
దూరం లో గోదావరి నది .ఆకాశం నుండి బ్లూ రిబ్బన్ వేలాడదీసినట్లు ,
మరి లింగం పై పడిన అభిషేక జలం 
అంత దూరం వెళ్లి కలుస్తుందా !ఏమి టెక్నాలజీ !!
బహుశా అంతకు ముందు గోదావరి గుడికి ఇంకా దగ్గరలో 
ప్రవహించేదేమో !

అందరం మళ్ళీ యమ కోణం దగ్గరకు వెళ్లి అందులో నుండి 
దూరి ప్రదక్షిణం చేసాము . 
''హేమా నువ్వు వెళ్ళు ''అని వదిలాను . ఎదురుగా వెళ్ళు 
అంటే పక్కకు వెళుతుంది ,పక్కకు అంటే ఎదురుగా ,
కోప్పడదాము అంటే చప్పట్లు కొట్టి పక పక నవ్వేస్తుంది . 
దాని చేత సక్రమంగా ప్రదిక్షణం చేయించే యమ బాధ పడి 
హమ్మయ్య ఇంకా ఎవరికీ యమ బాధలు ఉండవు అని 
ఆనంద పది బయటకు వచ్చాము . ప్రహరి ప్రక్కనే 
సరస్వతి దేవి గుడి అమ్మవారు చక్కగా పసుపు పూసి 
అలంకరించుకొని వీణ పట్టుకొని నిజంగా అమ్మవారే ఎదురుగా 
కూర్చున్నంత కళగా ఉన్నారు . 
ప్రశాంతంగా మండపం లో కూర్చొని తినేసరికి బస్ శబ్దం . 
నిజానికి ప్రయాణమే ఎక్కువగా ఉంది కాని గుడిలో గడిపింది 
అరగంటే . అయితేనేం ఎంత ప్రశాంతంగా ఉంది . ఈ ఊరు ,
మనుషులు ,దేవుళ్ళు అన్నీ ఎంత ప్రశాంతంగా ..... ఎందుకో 
నెల్లూరు వాళ్ళు ఇక్కడకి పెద్దగా రారు . ఇక్కడ కూతుర్నీ 
నెల్లూరు  లో కోడలుగా చూడలేదు , అక్కడ  కూతురిని 
ఇక్కడ కోడలుగా చూడలేదు . ఒక్క సారి గుడి వైపు 
హాయిగా చూసి తిరుగు బస్ ఎక్కేసాము . కానీ ఈ 
ప్రశాంతత వెనుక రాబోయే కల్లోలం నాకు తెలీదు . 
                                               (ఇంకా ఉంది )

Tuesday, 18 November 2014

ఇదొక లెక్కా ? (2)

(part 1 link )
ఉదయాన్నే లేచి ఉప్మా ,పులిహార చేసేసి పాపను రెడీ 
చేసేసాను . రెడీ చేసినంత సేపు నువ్వు ఏమైనా 
చేసుకో, అని పాప తూగుతూనే ఉంది . కాళేశ్వరానికి
గంటకో బస్ ఉంది అని చెప్పారు . అయినా తొందరగా 
వచ్చెయ్యాలి అమ్మా నాన్న రాత్రి ట్రైన్ కి నెల్లూరు కు తిరిగి 
వెళ్లిపోవాలి . అబ్బా వెళ్లి పోతారా ! మనసు కొంచెం బాధగా 
మూలిగింది . వచ్చినట్లు లేదు వెళ్ళినట్లు లేదు . నాన్న 
పాపను ముద్దు చేస్తూ కళ్ళు తెరవమని బ్రతిమిలాడుతూ ఉన్నాడు . 
''మాధురి కళ్ళు తెరువమ్మా '' ఇదేమో మబ్బులోనుండి చంద్రుడు 
తొంగి చూసినట్లు కొంచెం తెరవడం ,గబుక్కున మూయడం ,
పక పకనవ్వడం . ఈయన తాళం బుర్ర చేతిలోకి తీసుకున్నాడు . 
అందరం బయటకు వచ్చేసాము .   

బయట ఇంటి ఓనర్ భార్య ముగ్గు వేస్తూ ఉంది . మామూలుగా 
లేవదు . మేము ఎక్కడకో వెళుతున్నాము కదా అని ముగ్గు వేస్తూ 
ఉంది . నాకు ఇక్కడ ఈ పద్ద్దతి భలే నచ్చింది . పక్క వాళ్లకు 
అవసరమేమో అనిపిస్తే వాళ్ళకై వాళ్ళే వచ్చి సహాయం కావాల్నా ?
అని అడుగుతారు . పాపను చూసి ''మాధురి ''అని హెచ్చరించు కుంది . 
ఇదేమో లేస్తే కదా !మెల్లిగా బుగ్గ పట్టుకొని లేపాను ,తన వైపు 
తిప్పి చూపిస్తూ . ''పోనీయ్యి పాపం మస్తు నిద్ర లున్నట్లుంది ''
వారించింది . 

''పాలు మా ప్రిజ్ లో పెట్టుకొండ్రి . మళ్ళయితే ఈమె పరేషాన్ చేస్తాదేమో ''
''ఏమి లేవు లెండి . వచ్చేటపుడు పేకెట్ తెస్తాను చెప్పాను ''పాపను 
భుజం మీద సర్దుకుంటూ . దానికి కోపం విసుగు వచ్చేసి 
మూతి ముడిచి ''కుయి ''అనింది మొదలుపెడతాను అని సిగ్నల్ 
ఇచ్చి . మళ్ళా వీపు మీద తట్టాను . ప్రిజ్ ,టి . వి లే కాదు 
కాట్స్ కూడా లక్సరీలు అనుకునే రోజులు . ఎప్పుడైనా 
అవసరం వస్తే తనే సహాయం చేస్తుంది . నేను మొహమాట పడుతానేమో 
అని అడుగుతూ ఉంటుంది . ఎంత సహాయం చేస్తున్నారు అంటే .... 
''ఏమైతది పాలు పెట్టుకుంటే మా వాళ్లకు చదువైతే చెప్పుండ్రి చాలు ''
అంటుంది . 
''కాళేశ్వరం మస్తు దూరం బిడ్డకు పెయ్యి నొచ్చుతాదేమో ,ఈడే  ఉంచరాదా ''
బాబోయ్ నిజంగా చాలా దూరమా !అనవసరంగా పెట్టుకున్నమా ప్రయాణం . 
కాని నాన్నకి అమ్మకి పాపతో గడపాలని ఉంది . 
''వద్దు లెండి తీసుకేళతాము ''చెప్పాను . 

తాళం వేస్తున్న మా వారిని చూసి చెప్పింది . 
''అదో ఎదురింటి వాళ్లకి ట్యూషన్  కావాలంట . అడగమన్నారు''
ఎదురిల్లు అంటే మధ్యలో కారు పోయేంత చిన్న రోడ్ అడ్డం అంతే . 
అక్కడ సేట్స్ ఫ్యామిలీ . ఉమ్మడి కుటుంభం పెద్ద ఇల్లు . చాలా 
మంది పిల్లలు ఉంటారు . కాకుంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్పాలి . 
''లేదండి . అలాగా ఇంటికి వెళ్లి చెప్పను ''మెల్లిగా చెప్పారు ఈయన .  
పిల్లలే గురువు దగ్గరకి రావాలి చదువుకోను, అని మాత్రమె మాకు 
తెలుసు . అదే ఒక గురువుకు గౌరవం . కాని ఇలాగ గంటల 
లెక్కన ట్యూషన్ చెపుతారని , ఓన్లీ మాథ్స్ అంటే డిమాండ్ అని 
తరువాత తెలుసుకొని ఆశ్చర్య పోయాము . ఏమో ఎప్పుడూ 
నిలబడి నీళ్ళు తాగే పద్దతే మాది ,పరిగెత్తి పాలు త్రాగాలి అనుకోము . 

పాప చేత నిద్రలోనే టాటా చెప్పించి బస్ స్టాండ్ కి వెళ్ళాము .
బస్ ఎక్కిన తరువాత పాప అమ్మా నాన్న చేతిలోకి వెళ్ళిపోయింది . 
మేము ఇద్దరం వెనుక సీట్ . అందులో నేను కిటికీ పక్కన కూర్చున్నాను . 
ఇంకొక సీట్ పక్కన ఖాళీ . కండక్టర్ టికట్ రేట్ చెప్పగానే మా వారి 
వంక చూసి కళ్ళు ఎగరేసాను ఆశ్చర్యంగా అంతనా !అని . 
కాని.....  ఏమి చేద్దాము అన్నట్లు తల ఊపారు . భావాల మార్పిడి కి 
కొన్ని సార్లు మాటలు అవసరం లేదు . ముఖ్యంగా బార్యా భర్తలకు . 

బస్ కదిలి పొలిమేరలు దాటేదాకా కొద్దిగా జనాలు కనిపిస్తూ ఉన్నారు 
బయట . పోను పోను ఎక్కడో ఒక్క గ్రామం . ఎక్కే  వాళ్ళు దిగే వాళ్ళు . 
కొన్ని నెలలుగా చూసే వాళ్ళే అయినా ఇక్కడ పల్లె వాళ్లకి, మేము 
చూసిన పట్నం వాళ్లకి కొంత తేడా !పెద్ద వాళ్ళంతా అవే పంచె లు 
కడతారు కాని పిల్లలలో చాలా మార్పు పల్లెకి ,పట్నానికి . 
కాని ఎంత చదువుకున్న వారైనా వాళ్ళు పల్లె నుండి వచ్చిన 
వారైతే మనసులో బెరుకు మనకు తెలిసిపోతూ ఉంటుంది . 
పెద్దగా ఎవరికీ అహం ఉన్నట్లు అనిపించదు . తప్పకుండా 
పలకరిస్తారు . మా వైపు మనసులో బెరుకు ఉన్నా అప్పటికి అపుడు 
అవసరమైతే కొంత పులి ముసుగు వేసేస్తారు . ఇక్కడ అదింకా 
అలవాటు లేదు లాగుంది . ముక్కు పుడకలు ,నేత చీరలు , 
ఇంకా కాళ్ళకు మెట్టెలు దిగుతూ ఎక్కుతూ ,పల్లె దర్శనం 
దగ్గర నుండి పరిశీలిస్తూ నేను , మెట్టెలు చూసి వాళ్లకు పెళ్లి 
ఎన్ని  ఉంటుందో ఊహిస్తూ ఉన్నాను . మెట్టెలు అరిగి కొత్త మెట్టెలు 
తీసుకోవాలి అంటే ఇక్కడి వాళ్ళు చాలా పెద్దవి తీసుకుంటారు . 
ఎంత పెద్దవి అంటే ..... పెళ్లి అయి పదేళ్ళు అయి ఉంటె కాలి వేళ్ళకు 
చిన్న పురి కొస అంత లావు ఉంటాయి . ఇక పాతిక, ముప్పై 
ఏళ్ళు పెళ్లి అయి దాటి ఉంటె ఇంక చెప్పలేము .... కొబ్బరి తాడు 
అంత లావున ,బాబోయ్ నిజంగా ఎలా మోస్తారో వీళ్ళు . 
చదువుకున్న వాళ్ళు కూడా సంప్రదాయాలు వదులుకోవడానికి 
ఇష్టమే పడరు . మా కొలీగ్ ఎడమ చేతికి వాచ్ వేసుకొని కూడా 
దానికి మళ్ళా మట్టి గాజులు వేసుకుంటుంది . ఎందుకు అంటే 
మా అమ్మ అరుస్తుంది వేసుకోక పోతే అంటుంది . చూస్తూ 
ఉన్నాను . పంచెలు , తల పాగాలు ,మాసిన బట్టలు 
పిల్లను ఎత్తుకున్న చేతులు ,ఒక పక్క రాడ్ ను పట్టుకొని 
నిల దోక్కుకుంటూ ,ఇంకో పక్క బిడ్డను హత్తుకుంటూ మట్టి గాజుల 
చేతులు ,వాళ్ళ కూరగాయల బుట్టలు .... ఉల్లిగడ్డ దానికి 
పచ్చటి మొక్కలు ,గంగ బైలాకు ఇక్కడే చూసాను నేను . 
ఉల్లి గడ్డలతో కూరేట్లా చేస్తారో !బహుశా సాంబారు లో 
వేస్తారేమో . వాళ్ళను అటూ ఇటూ తోస్తూ ''జరంత జరుగుండ్రి ''
చిన్నగా కసుర్లు . ఎక్కే కాళ్ళు వేగంగా ,దిగే కాళ్ళు సాలోచనగా ,
మధ్యలో అక్కడక్కడ లంబాడి వాళ్ళు ,వాళ్ళ సీతాపలం గోతాలు . 
వీళ్ళకు కూడా గాజులు వేసుకోవడం లో పెళ్లి అయిన వాళ్లకి , 
కాని వాళ్లకి ఏదో తేడా ఉంది . గుర్తు లేదు . 
మా నాన్న కొందామా ?అన్నట్లు తొంగి చూసాడు . 
వద్దు అని అడ్డంగా తల ఊపాను . ఇక్కడ ఒక్కటో ,రెండో 
లేదా అరడజన్ విడిగా అమ్మరు . బస్తా కొనాల్సిందే . పెద్ద 

రేటు కూడా ఉండదు . పదుల్లొనె . అసలు పిల్లలు అయినా సరే 
ఒక్కసారి ఐదు పండ్లు ప్లేట్ లో పెట్టుకొని తినేస్తారు . అలా తినడం 
లో భలే మజా పొందుతూ ........... మాకు ఒకటి తింటే ,
అమ్మో జలుబు చేస్తుంది అనుకుంటాము . 

పోయే కొద్దీ ఊర్లు తక్కువ ,అడివి ఎక్కువ . ఎత్తుగా పెరిగిన టేకు ,మద్ది చెట్లు ,
ఇంకేవో .... గబుక్కున ఒక దగ్గర నాలుగు చినుకులు ,చెట్లకు 
చక్కగా లాల పోసేసి ....... మళ్ళా లేత ఎండ ఆకులపై నిలబడిన 
చినుకులను ముద్దాడి ఇంద్రధనుసులు సిగ్గుతో వచ్చేస్తూ .... 
ఇద్దో ఇలాంటి వేల కిటికీ పక్క సీట్ ఇవ్వు దేవుడా ఇంకేమి వద్దు 
అనుకుంటాను . అక్కడో పేరు తెలీని పిట్ట జుయ్య్ అని ఎగిరింది . 
పిట్టలు , చెట్లు మనిషిలోని పల్లెతనం ...... బాగుంది ప్రయాణం . 
రాకుండా ఉంటె ఇదంతా మిస్ అయ్యుండే దాన్ని . ఇంకా చాలా దూరం 
ప్రయాణం ఉంది . ముందేమీ జరుగుతుందో మనిషి ఊహించగలడా !

                                                            (ఇంకా ఉంది )

Thursday, 13 November 2014

ఇదొక లెక్కా ?(1)

''అమ్మా కొత్త పోస్ట్ లు ఏమి వేయలేదా ?'' అత్తగారింట్లో 
ఉన్న బంగారు తల్లి హేమ అడిగింది . అత్తగారింట్లో పువ్వుల్లో 
ఉంచుకొని చూసుకున్నా ఆడపిల్లకు కాసింత అమ్మ పై 
గాలి మళ్ళు తూనే ఉంటుంది . తన బాధ్యతా  తాను చూసుకుంటూనే 
ఉంటుంది . ఒక రకంగా మన ఆడ పిల్లలను  ఇలా ఉండటం 
చూసి ముచ్చట పడటం ఆడ పిల్ల ఉన్న ప్రతి ఇంట్లో అనుభవమే !
ఇప్పుడేమి వ్రాయాలి ?తన చిన్నప్పటి అందెల  చప్పుళ్ళా,
పెరిగిన తరువాతి నవ్వుల ముచ్చట్లా ?ఆడ పిల్లల తల్లి తండ్రుల 
గుండెను తడితే ప్రతి కణం ఏదో ఒక ముచ్చట చెపుతుంది .... తమకు పుట్టినా
''తల్లి ''అని తమ చేత పిలిపించుకున్న కూతురు గురించి . 
చిన్నప్పుడు తనకే తెలీని(గుర్తు లేని ) ఒక సంగతి వ్రాస్తాను . తన పిల్లలకు 
చెప్పుకుంటుంది వాస్తవ ప్రపంచపు ఆనవాళ్ల పరిచయం లో ...... 


పడుకున్నానే కాని మనసులో పొంగుతున్న ఆనందం తో నిద్ర రావడం లేదు . 
పక్కకి చూసాను . ఈయన మెల్లిగా నిద్రలోకి జారుకుంటూ ఉన్నారు . 
హేమ మాధురి సాయంత్రం అన్నం తినగానే నిద్ర పోయింది . అసలు ఇక్కడ 
పొద్దే ఎక్కువ ఉండదు . ఉదయం చాలా సేపుకు గాని తెల్లవారదు . 
సంతోషం పంచుకుందాము అంటే ఈ వేళ లో ఎవరు దొరుకుతారు ?
అమ్మ ,నాన్న రేపుదయం వస్తున్నారు ఇక్కడికీ అంటే ఎలా ఉంది 
అసలు ..... గాల్లో ఈక తేలినట్లు మనసు తేలిపోతుంది . ఆనందం లో 
మునకలు వేసుకో అని నిద్ర కూడా దగ్గరకు రాకుండా చోద్యం చూస్తూ 
ఉంది . మనసు మెల్లిగా పాత జ్ఞాపకాల వైపు ఊగుతూ ఉంది . 

ఎలా వచ్చాము కొన్ని నెలలు ముందు నెల్లూరు నుండి హనుమకొండకి నా 
ఉద్యోగం కోసం , కేవలం దేవుడమ్మ జ్యోస్యం చూసి ''మీరు ఎక్కడికి 
పోయినా ధర్మం పలుకుతుంది . మీకు ఎక్కడకు పోయినా అన్నం ముద్ద 
దొరుకుతుంది ''అని చెప్పిన రెండే మాటలు భరోసాగా ఉంచుకొని ,
నేను ఈయన ఇన్ని వందల కిలో మీటర్లు అయిన వాళ్ళు అందరికి 
దూరంగా మనిషిలోని మంచితనాన్ని నమ్ముకొని వచ్చేసాము . 
వెనుక ఆస్తులు కూర్చొని తింటే కరిగిపోవా !ఇద్దరికీ ఉద్యోగాలు లేవు . 
ఎవరో ఒకరు తెడ్డు వేస్తేనే కదా నావ నడిచేది . ఆడ మగ అహాల ను 
దగ్గరకు రానియ్యని మా మధ్య ప్రేమను నమ్ముకొని ఆయనకు ఉద్యోగం 
లేక పోయినా నా ఉద్యోగం నమ్ముకొని ఇక్కడకు వచ్చేసాము . 
స్కూల్ పక్కనే నరసింహా రెడ్డి గారి ఇల్లు దొరికింది . చదువుకున్న 
వాళ్లకు ,చదువు చెప్పే వాళ్లకు ఇక్కడ ఎంత గౌరవం . వారి 
ఇంట్లోనే కాదు వారి మనసులో కూడా మాకు చోటు ఇచ్చారు . 
మా పాపను సొంత బిడ్డలా వాళ్ళు  చూసుకుంటే, వాళ్ళ ఇద్దరు పిల్లలకు 
మేము చక్కగా చదువు చెప్పేవాళ్ళం . ఒకరు ఒకటో తరగతి 
ఇంకొకరు ఎల్ . కె . జి . ఎప్పుడో కాని మా ఊరు నుండి బంధువులు 
రారు . మీరే రండి అందరిని చూడొచ్చు అంటారు . జీతం లో 
నాలుగవ వంతు తినేసే చార్జీ ల దృష్ట్యా అది నిజమే . 

ఇన్ని రోజులకు మా ఊరి నుండి అదీ అమ్మా నాన్న వస్తున్నారు . 
వాళ్లకు ఇక్కడ వన్నీ చూపించాలి . దగ్గరవి వేయిస్థంబాల గుడి ,
భద్ర కాళి గుడి ఇవి సరే .... కొంచెం దూరంగా వాళ్లకు గుర్తు 
ఉండేటట్లు ఏమి చూపించాలి . అప్పుడు గుర్తుకు వచ్చింది 
''కాళేశ్వరం ''.... వేరే కొలీగ్ చెపుతుంటే విన్నాను . 
గోదావరి ఒడ్డున యముడు స్థాపించాడు అని . అదే చూపించాలి . 
ఎందుకు పుడతాయో ఇలాంటి కోరికలు అని నేను బాధ పడే 
క్షణం వస్తుందని అప్పుడు ఊహించలేదు . ఆలోచనలలో 
రెప్ప వాలక ముందే తెల్ల వారిపోయింది . వాళ్ళు స్టేషన్ నుండి 
వచ్చేసరికి నాన్నకు ఇష్టం అయిన దోస ,వేజటబుల్ కర్రి . 
అమ్మకు కారం దోస కూడా . 

అమ్మ నాన్న రాగానే ''మాధురి ఏది ''మొదటి మాట . 
బుజ్జి పిల్ల దుప్పటి లో దూరి వెచ్చగా నిద్రపోతూ ఉంది . 
''ఓయ్ ''నాన్న మెల్లిగా పరుపు మీద కూర్చొని బుగ్గలపై 
తట్టాడు . లేస్తే కదా . 
''లెయ్యి తల్లి తాతయ్య అమ్మమ్మ వచ్చారు చూడు ''నా 
మాటల్లో ఉత్సాహం ,''లేయ్యి మాధురి ''
మా వారు వంత పాడారు . ఇన్ని సుప్రభాతాలు విన్నా లేస్తుందా 
మొద్దు మొహం . ''లెయ్య వె ''లేపి కూర్చోపెట్టేసాను ,ఎందుకు 
లేయ్యదో చూద్దాము అని . ఒక్క సారి చిన్నగా రెప్పలు తెరిచింది . 
నాన్నను చూసింది . మళ్ళా రెప్పలు వాల్చేస్తూ ......... 
''చూడవే తాతయ్య వచ్చాడు ''అమ్మ చెప్పింది ఇంకా తప్పదు 
అన్నట్లు మెల్లిగా చూసింది . గుర్తు పట్టేసింది . రెండేళ్ళ పిల్ల . 
గబ్బుక్కున నాన్న భుజం మీదకి ఉరికింది ఎత్తుకో అని . 
అమ్మ నాన్న ఇద్దరు నవ్వుతున్నారు . అసలు కంటే వడ్డీ ముద్దు ,
ఇంకా మొదటి మనవరాలు ఆయే ,బోలెడు ముద్దు . ఇంకా నిద్ర తీరక 
ముక్కు కళ్ళు నలుపుతూ ఉంది . 
''ఇటివ్వమ్మా ''అని ఎత్తుకొని ''మీరు కాసేపు రెస్త్ తీసుకోండి 
మధ్యాహ్నం భద్ర కాళి గుడికి వెళదాము ''చెప్పాను . 
మధ్యాహ్నం బోజనాలు అయినాక ఆటో లో భద్ర కాళి  గుడికి 
వెళ్ళాము . చాలా పాత గుడి . అమ్మవారి మొహం బండరాతి 
మీద చెక్కినట్లు కొంచెం భయం వేసేతట్లే ఉంది . గుడి మొత్తం 
రంగులు వేసి ఉన్నారు . స్థంబాలకి చుట్టూ ఉన్న బొమ్మలకి 
కొత్తగా జీవ కళ వచ్చినట్లు . అమ్మ ఎత్తుకొని మాధురి కి 
అన్నీ చూపిస్తూ కబుర్లు చెపుతూ ఉంది . దానికేమో అర్ధం 
అయినట్లు ఊ కొడుతూ ఉంది . క్యూ గుండా వెళుతూ ఉంటె 
ముందు అమ్మవారి వాహనం ..... ఉన్నట్లుండి  
పాప గజ గజ వణికి పోయింది . 
''ఏమైంది ''అందరం కంగారు పడిపోయాము . 
పక్కకు తిరిగేసరికి పెద్ద సింహం బొమ్మ నోరు తెరుచుకొని కోరలు చూపిస్తూ ,
నోరు ఎర్రగా వేసారు . 
భయపడి ఏడుస్తున్న పాపని తీసుకొని ఓదారుస్తూ చేరాము . 
కాసేపటికి భయం నుండి తేరుకుంది . అమ్మవారిని చూసి 
బయటకు వచ్చి పక్కన ఉన్న చిన్న కొలను దగ్గర కూర్చున్నాము . 
పాపకు భయం తీరిపోయింది కాబోలు నీళ్ళు చూస్తూ 
నవ్వుకుంటూ తాతయ్య అమ్మమ్మతో ఆడుకుంటుంది . 
''రేపు కాళేశ్వరం వెళదాము ''చెప్పాను ఈయన వంక చూస్తూ . 
ఈయన మా నాన్న వైపు చూసారు . 
''ఎంత దూరమో అమ్మ ,మళ్ళీ రాత్రికి ట్రైన్ కి వెళ్ళాలి కదా ?''అన్నారు . 
''ఏమి కాదులే నాన్న రాత్రికి వచ్చేయ్యమా !''
అది ఎంత దూరమో తెలీక పోయినా అమ్మా నాన్నలకు ఏదో ఒకటి 
చూపించాలి అనే కోరికతో అనేసాను . 
ఇంటికి వచ్చి ఉదయానికి ప్రణాలికలు వేసుకుంటూ అలిసిపోయి 
పడుకున్నాము . అసలు ఆ దారి గూర్చి తెలీని నాకు హాయిగా 
నిద్ర పట్టేసింది . 
                                                                  (ఇంకా ఉంది )