Thursday, 21 January 2016

మా నేల తల్లి (4) ...... ఎర్ర అరుగుల సీరీస్


మా నేల తల్లి (4) ...... ఎర్ర అరుగుల సీరీస్ 

maa nela thalli part 3 link ikkada

నా కంటే ఒక జానా పొడుగు ఉంటుందేమో ఆ అమ్మాయి !
అంత చక్కగా వంగి నాట్లు వేస్తుంటే నాకు 
భలేగా ఉంది . 
''నాన్నా , నేను కూడా వేస్తాను '' 
''వద్దు తల్లి బురద అవుతుంది '' 
అంతే చటుక్కున మట్టి మీద కూర్చొని ఊ చేస్తాను 
అని రాగాలు . అక్కడ నాయన ప్రాణం ఒప్పుకోదు .,
బిడ్డ ఏడిస్తే . ముద్దు వచ్చినపుడే చంక ఎక్కాలి అని 
ఏ బిడ్డలకు అయినా తెలుసు . 

నేను మడి  లోపలకు కాలు పెడుతుంటేనే 
ఆడంగులు అంతా అడ్డుకునేసారు . 
''వద్దు బుజ్జమ్మా , బురద పడిపోతావు ''అని 
నేనా వినేది  ''మరి ఆ యమ్మి పడిపోలేదే !''
 చూపించాను ఆ అమ్మాయిని . 

''ఆ యమ్మికి పని అలవాటు కావాలా తల్లే ,నీకెందుకు 
ఇయ్యన్నీ ?'' 

''నేను నేర్చుకుంటాను ''
''నువ్వు చదువుకుంటుళ్ళా  బుజ్జమ్మా , ఆ యమ్మి కి 
ఏమి లేదు . పనీ పాట రాక పోతే ఎట్టా బతుకుద్ది '' చెప్పారు . 

''నాన్నా '' పెద్దగా అరిచాను . 

''వెయ్యనీండి మే ''చెప్పేసాడు ''జాగ్రత్త '' అన్నాడు . 

ఇంకేంది దూకాను ..... బురదలో కాలు ఇరుక్కునిపోయింది . 
గౌను మీద మళ్ళీ బురద నీళ్ళు . కాలు లోపల 
నుండి లాగడం కష్టంగా ఉంది . అయినా భయపడి 
పారిపోతానా ..... 

పక్కనామే నాలుగు మొక్కలు ఇచ్చింది
 ''ఎయ్యి బుజ్జమ్మా '' 

చూసాను పక్క్కకి వాళ్ళు సర సర బురదలో మొక్కలు 
గుచ్చుకుంటూ వెళుతున్నారు . 
నేను వంగి లైన్ చూసుకొని ఒక్కటి గుచ్చాను . 
చేయి తీసేసరికి పడిపోయింది . మళ్ళీ లేపి గుచ్చాను . 
నిలబడింది . కాలు లాగుతుంటే బురద లో నుండి 
రావడం లేదు . ఆ అమ్మాయి ఎలా నడుస్తుందో !
పడుతూ లేస్తూ వాళ్ళ తోటే  గుచ్చేస్తుంది . 
ఇంకోటి .... ఇంకోటి .... 
హయ్య నాకు వచ్చేస్తుంది నారు 
వెయ్యడం . 

''అట్టా  కాదు బుజ్జమ్మ , అంత దూరం లో వెయ్యకూడదు ''
చెప్పింది పక్కనామే . 
వాళ్లకు అన్నానికి వేళ అయిపోతున్నా 
నాన్నకు కోపం వస్తుందని వేస్తూ ఉన్నారు . 

''అట్ట ఏస్తే కొన్ని నాట్లే  పడుతాయి ''
''పడితే '' అన్నాను 
'' మీ నాయనకే వరి తగ్గుద్ది '' చెప్పింది .
అమ్మో మా నాయనకు చానా వడ్లు రావాలి . 
దగ్గర దగ్గరగా గుచ్చాను . 

''అంత దగ్గరగా వెయ్యకూడదు బుజ్జమ్మా '' 
''వేస్తె '' 
''మొక్క ఎట్టా పెరుగుద్ది ?
 అప్పుడింక వెన్నులు ఎట్టా వస్తాయి ? 
దోమలు కూడా వచ్చేస్తాయి వెలుతురు పడక పోతే '' 

అర్ధం అయింది . దగ్గరగా వెయ్యకూడదు . దూరం గా 
వెయ్యకూడదు . అమ్మ ముగ్గులో చుక్కలు పెట్టినట్లు 
వెయ్యాలి . ఇది వచ్చేసింది కాని ఈ బురదలో కాలు ఎలా 
లాగాలో తెలీడం లేదు . చేతిలో మొక్కలు అయిపోయాయి . 
'
'ఇంకా కావాలి అన్నాను అటు వైపు నడుస్తూ . 
అంతే ముందుకు పడిపోబోయాను కాలు పైకి రాక . 
గబుక్కున పట్టుకున్నారు . 

''తల్లే నువ్వు వెయ్యబాకమ్మా !నువ్వు పడిపోతే సెట్టేయ్య 
మమ్మల్ని తిడతాడు . ఎళ్ళు బుజ్జమ్మా . గనిమ మీద 
కూర్చో పో '' అందరు బ్రతిమిలాడినట్లు చూస్తున్నారు , 
కొంచెం జాలి కూడా ! 

''సరే పాట  పాడండి అయితే '' 
అన్నాను పైకి ఎక్కి కూర్చొని 

''సెట్టేయ్యో !పాట  పాడితే సినిమాకి డబ్బులు ఇయ్యాల ''
నాన్నను చూసుకొని అడిగారు . 

''అట్టా గే  ఇస్తాను కానీండి మే , ఎప్పుడు సూసినా సినిమాలే 
కాపురాలు చేసేది లే '' అన్నాడు 

''వెంకటేసులన్నో ఎన్ . టి . ఓడి సినిమా , సూడాలన్నా '' 
గబా గబా హుషారు వచ్చేసింది వాళ్లకి పైన సూర్యుడి 
ఎండగా ఉన్నా , లోపల ఆకలి కాలుతూ ఉన్న .... 
ఇంకెంత కొంచెమే . మహా అయితే పది నిమిషాలు . 

ఇంత మందికి సినిమాకి ఇవ్వడము అంటే మాటలు కాదు . 
మా నాయన అంతే . పనిలో మెప్పిస్తే ఇచ్చేస్తాడు . 
అందుకే ఈడ కి రావాలి అంటే ఒక పక్క భయం ఉన్నా 
హుషారుగా ఉంటది వాళ్లకి . 

వాళ్ళు పాడే పాటలు వింటూ రెండు గె నాల మధ్య 
ఉన్న కాలువ నీళ్ళలో దిగి పరిగెత్తాను . 
దెబ్బకి బురద అంతా పోయింది . 

మడి  చుట్టూ రెండు రౌండ్లు పరిగెత్తే సరికి 
ఆడవాళ్ళు నారేతలు అయిపోయి 
మగోళ్ళ కు  సద్ది పొయ్యడానికి దూరంగా 
ఉండే చెట్లు కిందకు వెళ్లి పోయారు .

ఆ అమ్మాయి మాత్రం లేట్ అయినట్లు ఉంది 
ఒక్కటే సద్ది టిఫిన్ తీసుకొని నడుస్తూ 
దూరంగా కనిపించింది . 
ఇంకొంచెం దగ్గర కు వెళ్లేసరికి ఎవరో పెద్దోడు 
ఆ యమ్మి భుజం చుట్టూ చేతులు వేసి లాగుతూ ... 

ఆ పిల్ల ఒక్క విదిలింపు విదిలిస్తూ ఉంది . 
దగ్గరకు పరిగెత్తే సరికి నేను చూసే లోపల విదిలించుకొని 
వెళ్లి పోయాడు . 
ఆ పిల్ల మొహం లో .... ... ఒక్కటే అసహ్యం 
మూడు రెక్కలు విచ్చుకున్న రోజా పువ్వులో నాలుగో 
రెక్క ఎలా వస్తుందా అని తొంగి చూస్తె ఒక్క 
గొంగళి  పురుగు పాకుతూ వస్తే మొహం లో 
కనపడేంత అసహ్యం ..... ఏమిఅయి  ఉంటుంది ? 
తెలుసుకోవాల్సిందే ......దగ్గరగా పరిగెత్తాను . 

                              @@@@@        ( ఇంకా ఉంది )