నివాస్ గాడు పూనే ట్రైనింగ్ కి వెళ్లి ఒకటిన్నర నెల .
మూడు నెలలు అయితే కాని నెల్లూరు కి రానన్నాడు .
ఎంత పిల్లలు పెద్ద అయిపోయారు అని మనసుకు
సర్ది చెప్పుకున్నా తల్లి మనసుకు వాడు ఎలా ఉన్నాడో
అనిపిస్తూనే ఉంటుంది (అందరికీ ఇంతేనా ?)
మంచి చెడు నేర్పెసాము . ఎంచుకున్న విలువలతో
తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటూ వెళ్ళడం ఇక వాడి పని .
జన్మ ఇచ్చెసాము ,మంచో చెడో దానిని నడిపించుకోవడం
వాడి చేతులోనే ఉంది . అబ్బ వాడి చిన్న చేతుల్లో ఇంత
పెద్ద జీవితం పడుతుందా !
ఇంకా ఏమి చిన్నవాడు ..... చక్కగా మీసాలు వచ్చేసి ఓటు
హక్కు కూడా వచ్చేస్తే ....
అయినా సరే అప్పుడప్పుడు చూస్తె బాగుండును .
హమ్మయ్య వీడియో చాటింగ్ లో దొరికాడు :-)
అదిగో రింగ్ అవుతూ ఉంది . వచ్చేసాడు బిడ్డ స్క్రీన్ మీదకి
అమ్మా అంటూ ..... ఛీ ఇప్పుడే మా కెమరా బ్లాక్ అవ్వల్నా ?
వాడికి మాత్రం మమ్మల్ని చూడాలి అని ఎంత కోరిక ఉంటుంది !
సరే ఏమి చేద్దాము .... వాడినైనా చూడొచ్చు ....
''ఏం డూయింగ్ '' అన్నాడు
''చపాతి ఈటింగ్ '' నవ్వాను .
''అబ్బ మా నీ చపాతి కూర తిని ఎన్ని రోజులు అయిందో ''
''ఏది నీ రూం చూపించు రా ''
చూపించాడు . పిల్లలు వీడి లాగానే ఉన్నారు .
టి . వి చూపించాడు . ఏమి చూస్తున్నారు ?
ఓహో ..... మీలో ఎవరు కోటీశ్వరుడు ?
''తెలుగు వస్తాయా రా ?''
''అన్నీ వస్తాయి మా . నువ్వు ఎలా ఉన్నావు ?
నాన్న ఎలా ఉన్నారు ? విశేషాలు ఏమిటి ?''
''అందరు బాగుండారు . మాకేమి విశేషాలు ఉంటాయి !
నువ్వే చెప్పు ''
''అమ్మ ఇక్కడ మూడు పూట లు చపాతీలే ,పావ్ బాజీ
పాని పూరి . పక్కనే పెద్ద మాల్ ఉంది . ఏమైనా దొరుకుతాయి ''
అప్పుడెప్పుడో చూసిన వీడియో గుర్తుకు వచ్చింది .
అక్కడ ఉండే స్టూడెంట్ కి పూనే అమ్మ సాంబారు చేసి పెడితే ,
చెనై లో ఉండే స్టూడెంట్ కి ఇక్కడ ఉండే అమ్మ అక్కడి
వంటలు చేస్తుంది . అలాగ ఎవరైనా మమ్మీ అక్కడ నా బిడ్డకు
దొరికితే బాగుండును . అసలే వాడికి టిఫిన్ అంటే ప్రాణం .
ఎందుకులే వాడికి గుర్తు చేయడం .
''ఒరే అక్క కవిత చదువుతుందట ''
ఓక నిమిషం విని , విననట్లు ఆక్షన్ .
అందరం నవ్వుకున్నాము .
''ఇంకేమిటి విశేషాలు ?'' ఈ ప్రశ్న అక్కడి నుండో ఇక్కడి నుండో
పదిహేనో సారి అడగడం .
ఏముంటాయి మాట్లాడుకోవడానికి !
కాసేపు ఎడుస్తునట్లు , నవ్వుతున్నట్లు , నాలుక బైట ఉంచి ...
ఏదో వాడి తేలీ ఫిలిం అక్క్షన్ చేస్తాడు . పర్లేదు బిడ్డ కళ్ళ
ముందు అల్లరి చేస్తున్నట్లే ఉంది .
ఎవరు కనుక్కున్నారో ఈ వీడియో కాలింగ్
''శతమానం భవతి ''
ఏముంది మాట్లాడింది ..... అంతా ఉత్తుత్తినే .....
అయితే నేమిటి నా బిడ్డ బాగున్నాడు అని తెలిసింది .
వాడు ఏమి తింటున్నాడు అని తెలిసింది .
ఫ్రెండ్స్ తో బాగున్నాడు అని తెలిసింది .
జలుబు లేదు అనుకున్నాను .
అన్నిటికి మించి అమ్మ తో మాట్లాడాను అనే తృప్తి వాడికి ....
ఏమి లేదు కాని ...... ఏదో మరి అటు నుండి ఇటు ,
ఇటు నుండి అటు ప్రవహిస్తూ ....
తల్లి బిడ్డలా బంధం అంతేనేమో !
మీ అమ్మ ఇంతేనా :-)
@@@@@@@@