Friday, 8 April 2016

హమ్మయ్య ! ఉగాది కి ఊపిరి పీల్చాను

హమ్మయ్య ! ఉగాది కి ఊపిరి పీల్చాను 
అదేనండి ఊపిరి సినిమా లో ఊపిరి పీల్చాను . 

ఎప్పటినుండో .... ఎవరో ఫేస్బుక్ రివ్యు లో 
మొత్తం కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి నవ్వుతోనో !
ఏడుపుతోనో ! అని పెట్టినప్పటి నుండి ఈయనికి 
రిక్వెస్ట్ పెడితే కొన్ని పనులు ,కొన్ని వీలు కాదులు ,
కొన్ని క్రికెట్ లుగా రోజులు దొర్లి , దేవుడి దయ వలన 
మనోళ్ళు ఫైనల్ కి రాలేదు కాబట్టి ఈ రోజుకి 
వెళ్ళగలిగాను . ఇందు మూలంగా మీరు నాకు 
దేశ భక్తి లేదని మీరు భావించవద్దు . ఇన్ని వత్తిడుల 
మధ్య దేని కోసం అయితేనేమి నా దేశ ప్రజలు 
కేకలు వేస్తూ నవ్వుకునేది ఏదైనా నాకు 
''మామ్ '' '' జి ఎస్ ఎల్ వి '' ప్రయోగాలంత  గొప్పదే!
''లోకా సమస్తా క్రికెటో భవంతు ''
''సర్వేజనా సంతోషం భవంతు '' 

ఇది ఇంటచ్బు బుల్స్ కి రీమేక్ . మనకు చేరే రీతిలో 
మలచి పి వి పి వాళ్ళు తీసారు . కధలో ఎంత లీనం అయిపోతాము 
అంటే ఇప్పుడు లిరిక్స్ ఎలా ఉన్నాయి ,సీన్స్ 
ఎలా తీసారు మళ్ళా చూడాలి అనుకుంటున్నాను . 
కధ  చెప్పే ముందు మా వారు సర్టిఫికేట్ చెప్పేస్తాను . 
''అసలు సినిమా అప్పుడే అయిందా అన్నారు ''
ఆయన అన్నాడు అలాగ అంటే ఆ సినిమా కి  ఆస్కార్ 
వచ్చినట్లే ! 

కొంత వరకు మీకు తెలుసు కదా ,విక్రమాదిత్య (నాగార్జున )
చాలా హుషారు సాహసం గల బిజినెస్ మాన్ . 
పారిస్ లో గ్లైడింగ్ చేస్తూ కింద పడి చేతులు కాళ్ళు 
పారలైజ్ అయిపోయి వీల్ చైర్ లో ఉంటాడు . అతని 
పి . ఏ . తమన్నా (కీర్తి ) ఫ్రెండ్ లాయర్ ప్రకాష్ రాజ్ (ప్రసాద్ ) 
నాగార్జున ను చూసుకోవడానికి పెరోల్ మీద బయటకు వచ్చిన 
శీను (కార్తీక్ ) చేరుతాడు . తరువాత అతనికి చేరువై 
అతనిలోని డిప్రెషన్ తొలగించి నవ్విస్తాడు . కాని 
తన భవిత ను వదిలేస్తూ అతని సేవలు చూస్తూ కూర్చోలేడు 
కదా అందుకే '' మీకు బాధ పడే పరిస్థితి రాకుండా చూసే 
మనిషిని చూసాను '' అని అతనికి ఇష్టం అయిన ప్రియ ను 
కలిపేస్తాడు . 

నిజానికి ఇది ఒక కధ కాదు , ఒక డిసేబుల్డ్ పర్సన్ ,ఒక 
సామాన్య వ్యక్తి రెండు కోణాలలో చూపిన కధ . 
కధ లో మనం నవ్వుకుంటూ ఉంటాము . అటు శీను 
ఇంటి నుండి ఏదో ఒక ఎమోషన్ సీన్ , మళ్ళా ఇటు 
నాగార్జున తో ఉంటాము అటు ఏదో ఒక ఫ్లాష్ బాక్ , 
నిజంగా స్క్రీన్ ప్లే హాట్స్ ఆఫ్ . కంచె తరువాత 
మళ్ళీ మంచి సినిమా చూసాను . విక్రమాదిత్య కు 
బాగయి పోవడం లాంటి తెలుగు సినిమా ముగింపు లు 
పెట్టలేదు పైడిపల్లి వంశీ కాని ముగింపు లేకుండా 
కధ ఉండదు కాబట్టి చనిపోవడం కాకుండా ప్రియతో 
కలిపాడు . ఇది తాత్కాలిక ముగింపే , ఏదో పెయింటింగ్ 
అభిరుచి తో వాళ్ళు దగ్గర అయ్యారు . కాని నిజానికి 
దగ్గర అయిన తరువాత లోపాలు పెద్దవిగా కనిపిస్తాయి . 
అందులో చేతులు కాళ్ళు రెండూ లేనివాళ్ళతో సాహచర్యం 
అంటే గాంధారి లాగా జీవితం అంతా కళ్ళు కట్టేసుకోవడమే !

ఒక లిరిక్ ఉంది దీనిలో ''నీవేం ఇచ్చావో నీకైనా తెలుసా 
నేనేం పొందానో తెలుసా " 
నిజానికి శీను లాంటి భాద్యత లేని వ్యక్తి విక్రం కి ఎలా 
నచ్చాడు ?ఏమి ఇవ్వగలిగాడు ? 
అదే అడిగిన మిత్రుడు ప్రసాద్ తో ''వాడికి జాలి దయ 
లేవు . ఇప్పుడు నాకు వాడే కరక్ట్ '' అంటాడు విక్రం 
శీను యెంత జాలి దయ లేని వాడు అంటే కాళ్ళకు 
స్పర్శ లేదని వేడి నీళ్ళు పోసి నవ్వుకుంటాడు . 
అర్ధ రాత్రి విక్రం కి ఊపిరి ఆడనపుడు పట్టించుకోక 
ఐ . సి . యు లు చేర్చాల్సి వస్తుంది . ఇక వానిలో 
విక్రం కి కావాల్సింది జాలి లేని తనం . 

అంటే డిసేబుల్డ్ పర్సన్స్ సారీ పిజికల్లీ చాలెంజ్ద్ పర్సన్స్ 
ఇతరుల సానూభూతితో ఎంత విసిగి పోయిఉంటారో నాకు 
బాగా తెలుసు , స్వీయ అనుభవం.  అప్పటికీ నాకేమి 
పెద్ద లేదు పార్షియాల్ డెఫ్ , అదీ రెండిటి ఆడియో లెవల్స్ 
తేడా కాబట్టి మాట నాకు సరిగా అర్ధం కాదు చిన్నగా ఉంటె . 
ఇందిర గారు , ఏదో నాతొ అభిమానంగా చెపుతున్నారు . 
నాకు వినపడటం లేదు అని ఎలా చెప్పాలి , అది 
ఎలా ఉంటుంది అంటే జోలె పట్టి జాలి అడుక్కున్నట్లు . 
చెపితే అవతలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా 
చెప్పలేము , నవ్వే వాళ్ళు కూడా ఉంటారు . మెల్లిగా 
ఆగమని చెప్పి చెవిలో దూది తీసి చూపించాను . 
ఏమి అనకుండా ఇంకొంచెం పెద్దగా మాట్లాడుతాను అని 
చక్కగా మాట్లాడారు . ఎంత చక్కని సంస్కారం తన 
పెదాల మీద ఉండే చిరు నవ్వు అంత  అందంగా . అది 
కదా కావాల్సింది !

డబ్బు ఉన్నా ఆరోగ్యం లేక పొతే సుఖం ఉండదు ,సుఖం 
సంతోషం ఎక్కడ ఉంటాయి వాళ్ళు వాళ్ళుగా ఉన్నప్పుడే ! 
శీను లో విక్రం కి నచ్చినది అదే , అతనిలో తన చైతన్యం 
తన పార్శ్వం కనిపిస్తూ ఉంది . ఆగిపోయిన తనలోని 
అదే హుషారు జోరు ఒక్కసారి ఇంకో రూపంలో , అందుకే 
శీనుకి విక్రం బాగా కనెక్ట్ అయిపోయి అతను డ్రైవ్ చేస్తుంటే 
తానె చేసినంత హ్యాపీ . ఆతను వదిలి వెళ్ళిపోతే తనలోని 
ఒక బాగం వీడిపోయినంత బాధ . ఫ్రస్టేషన్. మనకి కూడా 
కొందరంటే భలే ఇష్టమో ప్రేమో ఏదో ఒకటి కలుగుతూ ఉంటుంది . 
కారణం ఇదే , అక్కడ ఉండే మనమే . మనం మనంగా 
ఉండే అవకాశం సమాజం ఇవ్వదు . నియమాల మధ్య 
నడవమంటుంది . ఒక రకంగా మనం కూడా చేతులు కాళ్ళు 
లోలోపల పారలైజ్ అయిన స్టేజ్ లోనే ఉన్నాము . 
''నాకు ఎగరాలి అని ఉంది శీను '' అని విక్రం అన్నప్పుడు 
నిజంగా మనకు కూడా ఎగురుతున్న అనుభూతి ! 


ఇక ఆడవాళ్ళతో విక్రం రెండు సీన్స్ ఒకటి తనకు 
ఆక్సిడెంట్ అయినందువలన తనతో సుఖ పడదు అని 
బలవంతంగా నచ్చలేదు అని చెప్పి వదిలేసిన 
పాత ప్రేయసి నందిని ని విక్రం కలవడం . తనకు 
పుట్టిన పాప స్పర్శ ను మనసారా ఆస్వాదించడం . 
అదీ ప్రేమంటే ! తనకు నచ్చిన వాళ్ళు బాగుండాలి 
అని కోరుకోవడం , వాళ్ళ ఆనందాన్ని తానూ మనస్పూర్తి 
గా అనుభవించడం . అది ఫీల్ అయిన వాళ్ళు తప్ప 
ఇలాంటి సీన్ వ్రాయలేరేమో . 

రెండోది వీల్ చైర్ మీదే పారిస్ లో ఒక అమ్మాయి ని తనతో 
డేట్ కి ఒప్పించడం . నిజంగా నాగార్జున మన్మధుడు 
అనిపించడానికే ఈ సీన్ వ్రాసి ఉంటారు . అన్నీ ఉన్న 
భర్తలు కూడా అలా భార్యలతో ప్రవర్తించక వాళ్ళ 
థాంక్స్ కోల్పోవడమే కాక ద్వేషాన్ని రగిలిస్తున్నారు . 

నిజంగా పాత్రధారులు ఆ కేరక్ట ర్స్ కి ప్రాణం పోశారు . 
పాటలు , మ్యూజిక్ , కెమరా అన్నీ భలే ఉన్నాయి . 
చూడక పోతే మీరొక మంచి సినిమా మిస్ అయినట్లే :-)

                       @@@@@@@