Friday, 5 August 2016

నివాస్ నీ ఫర్స్ట్ ఫ్రెండ్ ఎవరు ?




రే నివాస్ గుర్తుందా ? నువ్వు బిటెక్ అప్లికేషన్ వ్రాసిన రోజు .
అప్లికేషన్ నేను నింపబోతుంటే శ్రీనివాస్ గారు
"మీరెందుకు నింపుతున్నారు , తననే నింపనివ్వండి " అన్నారు

"తప్పులు పొతే ఎలా ? " అడిగాను .
"పోనివ్వండి . ఎలా చేస్తే కరక్టో నేర్చుకుంటాడు " సింపుల్ గా చెప్పేసాడు ,
అమ్మ మనసు ఆయనకు ఏమి తెలుస్తుంది !
తప్పులు అనే ముళ్ళు తన బిడ్డ పాదాలకు తగలకుండా
బిడ్డ పాదాల కింద తన అరచేతులు పెట్టాలి అనుకుంటుంది తల్లి .

కాని నాకు అర్ధం అయింది ఈ లోకం లోకి నువ్వు ఒక్కడివే వెళ్ళాల్సిన
రోజు వచ్చేసింది . ప్రస్తుతానికి దాని పేరు కె . ఎల్ . యు .
కాని అక్కడి నుండి నువ్వు రెక్కలు బలంగా చేసుకుంటూ ఎగరడమే కాని
ఇక నారెక్కల్లో ఒదుక్కోవు. ఇప్పటి దాకా అమ్మ గా ధైర్యాన్ని ఇచ్చింది ఈ
లోకాన్ని ఎదుర్కోవడానికే , కాని చిత్రం లోకం లోకి నువ్వు ఒంటరిగా
వెళుతున్నావు అనే బాధ !

ఒక్కటే సంతోషం , నేను నేర్పిన విషయాలు నువ్వు ఏవీ మర్చిపోలేదు ,
చుట్టూ ఉన్న లోకాన్నే నీ స్నేహం తో అమ్మగా చేసుకున్నావు .
ఇప్పుడు నిన్ను కాపాడే అమ్మ చాలపెద్దది . తన చేతులుగా నిన్ను
రక్షించే బోలెడు మంది స్నేహితులు .

విప్రో లో చేరటానికి వెళ్ళగానే , మీ నాన్న తో అన్నాను
"ఎలా చేస్తాడో వాడు , ఏది మంచిదో ఏది చెడ్డో ఎలా
తెలుస్తుంది ?"అన్నాను

ఒక్కటే ఆయన సమాధానం
" వాడెప్పుడో వాడి ఫ్రెండ్స్ దగ్గర కనుక్కొని ఉంటాడు లేవే ! "

స్నేహం తల్లి లాగా దారి చూపిస్తుంది . నీ బాధ్యతలు చేస్తూనే దానిని
ఎప్పుడూ పెంచుకో . అది విలువైన ఆస్తి .
నేస్తాలు ఒకే అమ్మకు పుట్టినపిల్లలు . ఆ అమ్మ పేరు జీవితం .
మరి అమ్మని మర్చిపోకు . అమ్మ కూడా ఒక ఫ్రెండే  :-)