Friday, 2 December 2016

నివాస్ నీ కోసమే



హుష్ .....ఇప్పటికీ తీరింది కన్నయ్య , నీకోసం
పోస్ట్ పెట్టను ఇప్పటికీ వెసులుబాటు .
పనులు గూడ్స్ బండి లాగా వస్తాయో ,లేక
నేను గూడ్స్ బండి లాగా చేస్తున్నానో !

ఏమిరా నాన్న చెప్పు ఈ రోజు నీ పుట్టినరోజు
ఎలా జరుపుకున్నావు . ఇది నీ మొదటి సంపాదనతో
జరుపుకున్నది కదా . ఏమో నువ్వేమో పెద్ద అయిపోయాను
అమ్మ అంటావు , నాకేమో ఒక విషయం గుర్తుకు వస్తూ
ఉంటుంది .......

రే ఇట్రా రా , చేతిలో దువ్వెన పెట్టుకొని పిలిచాను .
అప్పుడే స్కూల్ కి వెళ్ళే చిన్ని బాబు భయంగా కళ్ళు
పెద్దవి చేసి
"కొట్టడానికా ! దువ్వడానికా ! "
ఇంత బుగ్గలు , చిన్నారి కళ్ళు దానిలో బోలెడు భయం .

ద్యేవుడా , ఎప్పుడైనా కొంత చిన్నగా దువ్వెనతో చురుకిఛ్చి
భయం పెట్టిన దానికి , వాడికి ఇంత భయం లోపల నిలిచి
పోయిందా ! ఛా ,ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు .

"నివాస్ లేదులే నాన్నా , దువ్వడానికే దా "
దగ్గరకు తీసుకొని నుదురు మీద చిన్నగా ముద్దు పెట్టి
దువ్వాను . నా పిల్లలు ను ఇంకా దేనితో భయపెట్టకూడదు .
వాళ్ళ కళ్ళలో నేను భయం చూడకూడదు . ప్రేమ తో మెరిసే ,
చిరునవ్వులు విరిసే మొహాలే నేను చూడాలి .

అదిగో అప్పటి నుండి ప్రతి దానికి కథ అల్లడం , చెప్పడం .
నువ్వు నోరు తెరుచుకొని ఆ అంటూ వినడం .

ఇప్పుడు ఒక చిన్న కథ చెపుతాను . మిలరేప దగ్గరకు ఒకరు
వచ్చి ఆత్మ జ్ఞానం నేర్పమని అడుగుతారు .
నేర్పుతాను , ఒక గది కట్టు అంటాడు మిలరేప .

కట్టిన తరువాత ఆతను వచ్చి కట్టాను , ఇప్పుడు చెప్పండి
అంటాడు .
ఇప్పుడు ఇది నలు చదరంగా ఉంది , కూల్చేసి గుండ్రంగా కట్టు
అంటాడు మిలరేప .
ఆతను మళ్ళీ కడుతాడు .

మళ్ళీ కూల్చేసి వేరుగా కట్టమంటాడు .
చివరికి అన్నీ కూల్చేసి నిలబడతాడు ఆతను .

ఎందుకు ఇన్ని సార్లుకట్టడం , కూల్చడం .
ఏమిమిగిలింది చివరికి ., ఆతను అడుగుతాడు .

ప్రపంచం లో నువ్వు చేసినది ఏదీ మిగలదు . నీ చేతులకు
వఛ్చిన నా నైపుణ్యం , నేర్చుకున్న జ్ఞానం , ఇవే ఇంకో జన్మకు
నువ్వు తీసుకెళ్లారాదా

అంతే నాన్న వాస్తవం అదే ! ఈ పరిస్తుతుల్లో ఎలా జీవించాలి అనేది
నేర్చుకోవడానికి వచ్చాము. ఇవన్నీ మనం ఎన్నుకున్నవే .

వచ్చే ఏడాది నీ జీవితం లోకి ఇంకొకరు వస్తారేమో తెలీదు .
కాని ఇప్పుడు మాత్రం పుస్తకాలు చదువు . ఎందరి గురించి
వీలయితే అన్ని , ఒక్కో జీవిత కథ ఒక్కొక్కటి నేర్పిస్తుంది .
కొన్ని ఎలా బ్రతకాలో చెపితే కొన్ని ఎలా బ్రతుకు కూడదో
చూపుతాయి.

చదివి చదివి నీకు ఈ సమాజానికి మధ్య ,ప్రక్రుతి మధ్య ఉన్స్
హద్దు తొలగి పోవాలి . విశ్వము లో నువ్వెంతో నీకు తెలియాలి .
విశ్వ మానవుడివి కావాలి . నీవెన్ని అనుబంధాలు నిలుపుకోగలవో
అదే నీ విజయం .
వివేకానందుడి లాగా నీ హృదయం ఎల్లప్పుడూ నేను దివ్యాత్మని
అని ధైర్యంగా గర్జించగలగాలి . సంపాదన ఎంత ముఖ్యమో
వ్యక్తిత్వ వికాసము అంతే ముఖ్యం .

సీతమ్మ వాకిట్లో సినిమాలో ప్రకాష్ రాజ్ ఏమని చెపుతాడు గుర్తు ఉందా !
ఈ జన్మకే వీడు నీ అన్న , ఈ జన్మకే వీడు నీ తమ్ముడు . మళ్ళీ రమ్మన్నా
ఈ పాత్రలు ఇలాగే నీకు రావు .
ఈ నాటకాన్ని ఎంత మెచ్యూరిటీ తో నడుపుతావో అదే నీవు సాధించిన
జీవిత జ్ఞానం .

నిజం రా నివాస్ , ఒక సామాన్యమైన మనిషి సమాజానికిఏమి
ఇవ్వగలడు ! చక్కగా తీర్చిన తన పిల్లలని తప్ప .

ఇప్పుడు మీ అక్క కొమ్మకి ఇంకో చివురు బుజ్జిగాడి రూపం లో
వచ్చ్చేసింది కదా ఈ ఏడాది ☺

మేనమామ బాధ్యత , మోయగలవా ?
మేనమామ అంటే వాడికి తల్లి తరువాత తల్లి లాంటి వాడు .
భాద్యతలు బరువే అయినా ఎందుకో మరి అదో సుఖం
విజయవంతంగా మోయగలిగితే ☺

నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినందుకు అభినందిస్తూ
మిగిలిన వాళ్లకు అవసరం అయినపుడు అండగా నిలబడమని
చెపుతూ మీ అమ్మ ఆశీస్సులు .

పుట్టిన రోజు శుభాకాంక్షలు కన్నయ్య .
శతమానం భవతి