ప్రేమంటే!!
వాయుగుండ్ల శశికళ
అంటారు ఒక కవి.
సాధారణ జీవితం లో ఈ పదం ఎక్కువసార్లు యువత వద్ద కొన్నిసార్లు జనజీవితం లో వింటూ ఉంటాము.
తనని చూడగానే నా కాళ్ళు,కళ్ళే కాదు మనసు కూడా ఆగిపోయింది.తాను ఉంటే పగలు కూడా వెన్నెల.పెదాలపై విరిసే నవ్వులా.ఎక్కడికీ ఒంటరిగా వెళ్ళలేనే!తన ఆలోచన ఎప్పుడూ నాలోనే ఉంటుంది.ఇక నా ఉనికి కి తావెక్కడ.
పరీక్షలు వ్రాయలేకపోతున్నాను.పనిపై మనసు ఉంచలేకపోతున్నాను.తన ఫోటో చూసినా చాలు,తన గొంతు విన్నా చాలు,నేను లేకున్నా ఫర్వాలేదు తాను బాగుంటే చాలు.ఇదిగో ఇదే ఆలోచనలతో మొదలవుతాయి వయసులో ని
ప్రేమలు.మెల్లిగా హార్మోన్స్ పనితనం తగ్గగానే
స్వార్ధాన్ని చూపి బుసలు కొడుతాయి.నువ్వు ఎవరితో అయినా మాట్లాడగానే జెలసీ.తనకు కాకుండా పోతారేమో అని.అదేమంటే అసూయ ఘాటైన ప్రేమకు గుర్తు అని సపోర్ట్ చేసుకుంటారు,
ప్రేమ అంటే ఏమిటో తెలియకుండానే.
వాళ్ళు ఈ స్వార్ధానికి ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే వీళ్ళు సైకోలు అయిపోతారు.ఒక్కోసారి కాళ్ళు పట్టుకొని ఏడుస్తారు.లేదంటే బెదిరిస్తారు. బ్లాక్ మెయిల్ చేస్తారు.లక్ష్యం ఒక్కటే అవతలి వారు తనకు మాత్రమే చెందాలి.
ఇక్కడ వాళ్ళు ప్రేమించడం లేదా అంటే ప్రేమిస్తున్నారు కానీ దేన్నో తెలుసా?వాళ్ళను తాము అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాము అనే భావనని. వీరు ఎక్కువగా ప్రేమిస్తున్నాము అని చెప్పినా వీరి మాటలు వారిపై వారికి ఉండే ప్రేమను తెలుపుతూ ఉంటాయి.నేను అది చేసాను,ఇది చేసాను నువ్వేమి చేయకపోయినా ప్రేమిస్తూ ఉన్నాను.నువ్వు నాకేమి చెయ్యలేదు.
పట్టించుకోలేదు.నాకు ఎంతో బాగాలేదు,నువ్వు గమనించడం లేదు అనే సెల్ఫ్ పిటీ లోకి వెళ్ళిపోతారు.దీనికి తెలివిగలవారు,చదువుకున్నవారు అని తేడా లేదు.ప్రేమ మెట్లు ఎక్కడం ప్రారంభించిన చాలా మంది అక్కడే జారిపోతారు.
మరి వీళ్ళ మధ్యలో ప్రేమ లేదా,ఉంది కానీ దానికి మించి స్వార్ధం ఉంది,అక్కడ ప్రేమ నిలవలేదు.
భార్య చూడండి .ఎక్కడి నుండో వస్తుంది.మీ నీళ్ల కోసమో,సౌకర్యం కోసమో అందరితో గొడవ పెట్టుకొని అయినా సాధిస్తుంది.చివరికి తనను పెంచిన తల్లి తండ్రులు ను అయినా తన కాపురం కోసం గొడవ వేసుకుంటుంది.పిల్లల విషయం వస్తే భర్తతో కూడా గొడవ పడుతుంది.తాను తింటుందో,నిద్రపోతుందో తెలీదు.ఎప్పుడూ ఉదయం చేయాల్సిన టిఫిన్ గురించో,పిల్లాడు వ్రాయాల్సిన పరీక్ష గురించో,కట్టబోయే ఇల్లు గురించో ఆలోచన.
అందరూ భార్యలు ఇలా ఉండరు,కొందరు నాకేమి కొనిచ్చావు అని సాధిస్తారు కదా!నిజమే అదే నేను చెప్పేది ప్రేమ ప్రారంభం అయినాక ఎక్కడో ఇద్దరు వేరు అని అనిపిస్తుంది,ఇక అక్కడ నుండి సెల్ఫ్ డిఫెన్స్ ప్రారంభిస్తారు.ప్రేమ నిజానికి ఏమీ కోరదు.
పోనీ తల్లి బిడ్డల ప్రేమ గొప్పది కదా అని అంటూ ఉంటారు.కానీ నిజానికి తన శరీరాన్ని,అందాన్ని,ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చేసి పట్టేడు అన్నం కోసం వాళ్ళ పంచలో ఉండే తల్లి ప్రేమ నిస్వార్ధమైనది.కానీ తాను ఎందుకు చేస్తుంది?తన పిల్లలు కాబట్టి.వేరే పిల్లలకు చేస్తుందా?అంటే రిలేషన్ అనే పరిధి ఈ ప్రేమకు ఉంది. ఇది కూడా తన పిల్లల బాగు కోసం మిగిలిన వాళ్ళ చెడు కోరుకునే వైపు ప్రయాణిస్తుంది.కాబట్టి ఇది కూడా పూర్తి ప్రేమ అనలేము.
ప్రేమకు ముఖ్య గుణం వ్యాపన.అది ఎవరి లోపల అయినా ఉంటే దానికి వ్యాపించాలి అనిపిస్తుంది,చుట్టూ ఉన్నవారికి చిరు నవ్వు ఇవ్వాలి అనిపిస్తుంది.కారణం లేకుండానే హత్తుకోవాలి అనిపిస్తుంది.అందరికీ ఏదో ఒకటి ఇవ్వాలి అనిపిస్తుంది.కరుణతో వారి బాధను అర్ధం చేసుకోగలం.వారి బాధను ఓదార్చాలి అనిపిస్తుంది.దీనికి రిలేషన్ ఉండాల్సిన అవసరం లేదు,జెండర్ తో పని లేదు,వయసుతో పని లేదు,ఇంకా వాళ్ళు మనుషులే ఉండాల్సిన పనిలేదు.
మనం చూస్తూ ఉంటాము చాలా మంది పోయిన తమ పిల్లల మీద ప్రేమతో ఆశ్రమాలు,సత్కార్యాలు చేస్తుంటారు.కొందరు కుక్కలను మనుషుల కంటే ఎక్కువ ప్రేమిస్తారు.కొన్ని జంతువులు వేరే జంతువుల పిల్లలకు పాలివ్వడం చూసే ఉంటారు.
భూమి ఎప్పుడో ప్రేమమయంగా మారిపోయింది.
తాకే చల్ల గాలిలో అది తెలుస్తూ ఉంది.గాలికి తలూపుతూ నిన్ను పలకరించే పువ్వులో అది ఉంది.నీ బాధలను తనలోకి తీసుకొనే ఆకాశం లో ఉంది.తన గుండెలు ను ఎంత తోడినా నీకు ఇంకా అన్నం పెడుతున్న భూమి లో ఉంది.ఒక్క మనిషే ఈ ప్రేమంతా నాకే అని మొత్తం నిల్వ చేసుకోవాలనే స్వార్ధం లో తానే నలిగిపోతూ ఉన్నాడు.ప్రేమను ప్రవహించనివ్వాలి.అప్పుడు అది అమృతమే అయి నీకు లోపలి నుండి ఆనందాన్ని శాంతిని ప్రసాదిస్తుంది.లేకుంటే నిలువ నీరులో మురుగు చేరినట్లు నీ స్వార్ధం లో నువ్వు నలిగిపోతావు.ప్రేమ పొందక నిర్జీవం అయిపోతావు.
ఆధ్యాత్మిక శాస్త్రం లో ప్రేమకు చాలా ప్రాధాన్యత ఉంది.ఇది నాలుగవది అయిన అనాహత చక్రం నుండి ప్రారంభం అయ్యే శక్తి
దీనికి నీ స్వార్ధం అడ్డుపడిందా,ఇక మూలాధారానికి దిగజారి కోరిక రూపంలో వెళ్ళిపోతుంది.నిష్కల్మషంగా అది ప్రవహించాలి అనే సంకల్పంతో నీ చేతల్లోకి వదిలావా అది సహస్రారం చేరి ఈ విశ్వాన్ని నీతో అనుసంధానిస్తుంది.అప్పుడు నువ్వు మనుషుల ను మాత్రమే కాదు, మిగిలిన ప్రాణులను ప్రేమిస్తావు,ఇంకా చుట్టూ విశ్వాన్ని ప్రేమిస్తావు.ఇంకా వాటి కోసం నిన్ను నువ్వు మరచి పోరాడుతావు.
అన్ని విషయాల్లో ఉండేది తెలీని శక్తి అయిన ప్రేమే!కానీ అదే దాని పరిపూర్ణ నిర్వచనం కాదు.
నువ్వు నేను చేసిందే గొప్ప అంటే కమండలం లో సూర్యుని చూపడమే.అదే సూర్యుని పరిధి కాదు. నీ శక్తి మేరకు చూపుతున్నావు అంతే. ఎవరి ప్రేమ తక్కువ కాదు,ఎవరిది ఎక్కువ కాదు.అది అందరి ఆనందానికి కారణం అయి ప్రవహించినపుడే దానికి విలువ.
మనసు మమత సినిమాలో చిన్నారి తరుణ్ తండ్రితో ఇలా అంటాడు"ఈ పావురాన్ని నేను కనలేదు.కానీ నేను దీన్ని ప్రేమిస్తున్నాను.మరి నీ కొడుకును కాకపోయినా నన్ను నువ్వు ప్రేమించవచ్చు కదా"
హృదయాలను విశాలం చేసే మాట.మరి మీరు కనని బిడ్డలను మీరు ప్రేమించగలరా?మీకు ఏమీ ఇవ్వని వారికి మీ ప్రేమను ఇవ్వగలరా?ఇంకొకరి దుఃఖాన్ని అర్ధం చేసుకోగలరా?
ప్రేమ ఎలా పుడుతుందో తెలీదు.దేని మీద పుడుతుందో తెలీదు.కానీ పుట్టడం గొప్ప వరం.
ఆ శక్తిని ధ్యానం తో మంచి సంకల్పం వైపు ప్రవహింప చేసినవారు నిజంగా ప్రేమను అర్ధం చేసుకున్నవారు.
@@@@