Friday, 27 July 2018

గురు పూర్ణిమ రోజు దొరికిన ఆశీస్సులు




ఎంత చక్కటి రోజు!!
నేను చెప్పిన కొన్ని కృతజ్ఞతలు
వాడ్రేవు చినవీర భద్రుడి గారి దగ్గర నుండి ఇంత చక్కటి ఆశీస్సులు గురుపూర్ణిమ రోజు తీసుకుని వస్తాయి అనుకోలేదు.
సార్ మీ మంచి మనసుకు వందనాలు.
Sasi Thanneeru గారు, ఇంత ఆదరణీయంగా రాసిన మీరే నాకు గురువులు. చిన్నవారు కాబట్టి ఆశీస్సులు, గురుత్వం చూపించినందుకు నమస్సులు.

మీరు రాసిన పోస్టుని  తిరిగి నా మిత్రులకోసం ఇక్కడ యథాతథంగా పంచుకుంటున్నాను.

____________________________

వాడ్రేవు చినవీర భద్రుడు గారికి నమస్సులతో గురుపూర్ణిమ శుభాకాంక్షలు.

నిండుగా పూసిన అక్షరాల చెట్టు.

రేపటి దాకా సమయం ఇచ్చి గంటకే పని ఎంతవరకు వచ్చింది అని అడిగే జీవిత వత్తిడిలో కాళ్లకు చక్రాలు కట్టుకోని పరిగెత్తుతూ ఉంటే ఒక చక్కని పరిమళం సేదతీరమని దారి పక్కకు పిలిచి దాహం తీర్చే చల్లని నీటినిచ్చి, నీడను ఇస్తే ఎలా ఉంటుంది?

ఇదుగో భద్రుడు అని ప్రేమగా సాహిత్యలోకం పిలుచుకునే వాడ్రేవు చినవీరభద్రుడు గారి అక్షరాలంత హాయిగా ఉంటుంది!!

'నిండుగా పూసిన మామిడి చెట్టు ఎదుట ఏ ఒక్కరు ఒంటరి కారు'
...... చినవీరభద్రుడు

ఆయన మాటలంత నిండుగానే ఎన్నివ్యాసాలు, ఎన్ని అనువాదాలు,ఎన్ని కవితలు,ఎన్ని సమీక్షలు,ఎన్ని ముందుమాటలు ,ఎన్ని తర్కాలు. నిజంగా నిండుగా పూసిన మామిడిచెట్టు!!

ఎవరి ప్రచురణ కోసమూ ఎదురు చూడరు.జ్ఞానం నాకే ఉండాలి అని దాచుకోరు.

నేర్చుకుంటే చెట్టును మించిన గురువు లేరు ఎక్కడా!

ఈ జ్ఞానపు చెట్టు నీడలో అందరం నేర్చుకొనే శిష్యులమే

నేర్చుకోవడం లోని బాల్యకాలపు ఆనందం ఈయన వద్ద నేర్చుకోవాలి.

ఈ వయసులో సాహిత్యం బాటలోనే నడుస్తూ ఇంకోవైపు నీటిరంగులు అద్దుకున్న ప్రకృతిని తన కుంచె నుండి జాలువారుస్తూ . ... కబీరు నాది దుఃఖం లేని దేశం పుస్తకం మీద తన కుంచె అందాన్నే ముఖ చిత్రంగా నిలపడం ఎంత బాగుంది!

కెంజాయ రంగు ఆకాశం క్రింద నీటిలో తన ప్రతిబింబము చూపిస్తూ ఉన్న హంస , పుస్తకపు లోపలి మాటలను ముందే తనలో చూపిస్తూ''అతని'' స్పృహ వల్లనే కబీరు తాను ఎక్కడ నుండి వచ్చాడో అక్కడకు చేరుకుంటాడు. ..... ఎక్కడికి? తన బింబం ఏదో అక్కడకి చేరుకుంటాడు.

ఎంత చక్కగా గీసారు , ఎంత చక్కగా వ్రాసారు!

ఒక వైపు ఋగ్వేదం లోని సూక్తులు వివరిస్తూ తర్కిస్తూ ఉంటారు,ఇంకో వైపు నాచ్చియార్ తిరుమొళి భక్తి ఆవేశాన్ని విచారిస్తూ ఉంటారు, ఇంకో వైపు అనువాదాలను,100 రోజులు నీగ్రోల స్వతంత్ర స్వరాన్ని గానం చేయగల కలం బలం వీరికి గాక ఎవరికి ఉంది?

పాల్స్ రోబన్ ,లొరేయేన్ ,మాయా ఏంజిలో అందరూ తమ భావాలను భాష దాటి సజీవంగా ఈయన కలం లో ఒంపుతూ ఉంటారు. మాయా ఏంజిలో గురించి వై ద కెజెడ్ బార్డ్ సింగ్స్ అని వివరిస్తూ వీరు చెప్పే వ్యక్తిత్వ పాఠాలు దాచుకోతగినవి.

ఇంకో వైపు తన ఉద్యోగ అనుభవాలు, గిరిజనులు కోసం చేసిన పోరాటాలు మనతో పంచుకుంటూ ఉంటారు. కొత్త బోధనా పద్ధతులు చర్చిస్తూ ఉంటారు. ఎప్పుడూ నేర్చుకుంటూనో, నేర్చుకున్న జ్ఞానం పంచుతూనో ఉండే చలివేంద్రం ఈయన!!

ఒక వైపు ''ఒక శతాబ్దానికి దర్పణం మునిపల్లె రాజు '' అని పోయినవారి  జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటూ గౌరవిస్తూ, చిన్న పాప వ్రాసిన కవితలోని ''ఇప్పుడు వచ్చిన అమ్మ కన్నీళ్లు ఖచ్చితంగా ఉల్లిపాయలివి కాదు'' అనే వాక్యాలను సమభావంతో స్మరిస్తూ ఉంటాడు.

ఎలా అర్ధం చేసుకోగలం వీరిని .... వీరు రూమి నుండి మనకోసం పట్టుకొచ్చిన వాక్యపుష్పాల పరిమళం తో తప్ప!

''కొందరు మనల్ని పలకరిస్తే కస్తూరి పరిమళం గుప్పుమంటుంది. మరికొందరిని పలకరిస్తే పొగ కమ్ముకుంటుంది'' ..... రూమీ

నిరంతరం నేర్చుకుంటూ ఉండటం పక్క వారికి ఆ వెలుగు పంచడం,చివరికి ఒక చిన్న గీత తెలుగును రెండుగా విభజించి ఆయన ఈ వైపుకు రావాల్సి వచ్చినపుడు కూడా , ఇల్లు వదిలిన బెంగతో వదలినపుడు కూడా ఒక మాట అంటారు ''ఇపుడు నేను కొంచెం వంట చేయడం నేర్చుకుంటూ ఉన్నాను. ఆడవాళ్ళ కష్టం నాకు అర్ధం అవుతూ ఉంది''

''సాయంకాలపు చెర్రీపూలు
నేడు అప్పుడే రేపుగా మారిపోయింది''.
                                జపనీయ కవి హైకూలు నుండి .

''అది పేపర్ లో వచ్చిన ఆర్టికల్ అయినా ,'పుస్తకం ప్రచురించినా, 'ఫేస్ బుక్ పోస్ట్ అయినా కనపడేది ఒకటే- ఆ వ్యక్తి శ్రద్ధ, నిరంతర అధ్యయనం!

ఆయన వాక్యాల్లోనే ..

''మనిషిని కవి చేసేవి రెండే
ఒకటి అతను పుట్టిన ఊరు
రెండు ఉందని అతడు నమ్మే ఇంకో ప్రపంచం''

ఆ ఇంకో ప్రపంచమే ఇప్పటి కవితల పుస్తకం ''కొండ మీద అతిథి '' వైపు ఆ కాలాన్ని నడిపించి ఉంటుంది.

ఇంకా మొన్న చిగుర్చిన ఉగాది కవితలోని పంక్తులు-

''చెట్టులాగా ఉగాదిని శిరసావహించడం ఇంకా సాధన చేస్తూనే ఉన్నాను ''.

ఆకులు చిగురించినా , రాలిపోయినా అదే స్థిత ప్రజ్ఞతతో ఉండే చెట్టు నుండి ఇది నేర్చుకోవాలి అని తానే ముందు సాధన చేస్తూ చెపుతున్నారు.

''జీవిత కాలం పొడుగుతా నన్ను నేను శృతి చేసుకుంటూనే ఉన్నాను:"

మనిషి జీవితం మొత్తం తప్పులు సరిదిద్దుకుంటూ పయనిస్తూనే ఉంటాడు. నేను తప్పులే చేయను అనేవాడిది ఎంత మూర్ఖత్వం. ఈయన తనను తానూ శృతి చేసుకుంటూ పయనిస్తున్నారు అని యెంత చక్కని స్వరాన్ని వినిపించారు!

''ఒక చెట్టులాగా, ఒక చెరుకు గడ లాగా ,ఒక కోయిల లాగా ఉగాదిని స్వీకరించాలి, అందరికీ ఆ తీపిని పంచాలి అనే ఆకాంక్ష ఎంత గొప్పది''

ఈయన పేస్ బుక్ ఫాలోయర్ గా నేను అందుకున్న జ్ఞానానికి ఎన్ని కృతజ్ఞతా వాక్యాలు చెప్పినా చందమామకు నూలుపోగు సమర్పించినట్లే!

ఎక్కడివో ఈయనకు ఇంత చక్కటి ఆలోచనలు. బాల్యకాలావస్థ లోనే ఉంటూ విమర్శలకు కూడా నవ్వును పంచేె ఆ ధీరత్వం!!

బహుశా ఈయన వ్రాసినట్లు ... రోజువారీ జీవితం లోంచే స్వర్గం వైపుగా నడిచే విద్యని రూమీ నుండి కబీరు, కబీరు నుండి ఠాగూరు, వారినుండి వీర భద్రుడు గారు నేర్చుకొని ఉండవచ్చు.

***

ఇంకా అంటారు కదా ..

''ఇంత జీవితం వృథాగా గడిపాను ,చీనా జపాన్ చిత్రకారుల్లాగా ఒక  వెదురుపోదనో, తూనీగనో చిత్రీకరించితే చాలు అని !

- శశి తన్నీరు