Tuesday 19 February 2013

వస్తావా నాన్నా ....

నాన్న వేలు పట్టుకొని (3)   (ఎర్ర అరుగుల కధలు)
(రెండో బాగానికి లింక్)
(నాన్న వేలు పట్టుకొని మొదటి భాగం లింక్ )
వరుసగా ఐదు గుమ్మాలు.వెనుక పెంకుల పంచ.
దాని పక్కన బావి.మా మేనమామ బావిలో నీళ్ళు తోడి పోసుకుంటూ ఉన్నాడు.
కావలి ఎర్ర గులక నేల.బావికి వరలు అవసరం లేదు.
తవ్వుకుంటూ వెళ్ళడమే.నీళ్ళు కూడా స్వచ్చంగా ఉంటాయి.
ఎండాకాలం లోతుకు వెళ్ళినా మామూలుగా చాలా ఎత్తు
 వరకు ఉంటాయి నీళ్ళు.ఒక్క చాంతాడు తో  తోడుకోవచ్చు.
మా మావయ్యకు అలా తోడుకొనే పోసుకోవడం ఇష్టం.
అలా పోసుకుంటూ వీడి గుమ్మం దగ్గర మనిషి తచ్చాడడం చూసాడు.
అమ్మమ్మ వంటిట్లో వంట చేసుకుంటూ ఉంది.
గబా గబా వాళ్ళు తుడుచుకొని వచ్చి తలుపు దగ్గరకు నడిచాడు.
కమ్ముల తలుపు నుండి కనిపిస్తూ ఉన్నాడు పులయ్య.
తలుపు తీస్తే లోపలి వచ్చాడు.
''ఏమ్మా పాప ఎలా ఉంది'' అమ్మని పలకరించాడు.

పుల్లయ్య డి కిరాణా షాప్ ,తాతయ్య చనిపోయిన తరువాత ఇంట్లో
ఆడవాళ్ళు సామాన్లకు రాలేరని షాప్ కు పోయేటపుడు వచ్చి
 ఏమి కావాలో అడిగి సాయంత్రం తెచ్చి ఇస్తాడు.
గొంతు విని అమ్మమ్మ కూడా బయటకు వచ్చింది.

''పుల్లయ్యా  పెంచెలు సామాన్లు చీటీ ఇచ్చాడు కదా?''అడిగింది.
''ఇచ్చాడమ్మా  అదే అడగటానికి వచ్చాను.ఆ సామాను ఏబై మందికి కూడా
సరిపోదు .మీకు బంధువులు ఎక్కువ కదా?''అడిగాడు.

''ఏమి చెప్పమంటావు పుల్లయ్య , ఆడ పిల్ల పుట్టింది.
వాళ్ళ నాయన వస్తాడా లేదా అనేది భయంగా ఉంది.బార సాల కూడా
పెట్టుకుందామా వద్దా అనుకున్నాము.మగ దిక్కు లేని సంసారం .
భయం తో చేతులు కాళ్ళు ఆడటం లేదు.
రేపు కాకుండా ఎల్లుండి బారసాల.
దగ్గరి వాళ్ళు అయినా రాక పొతే ఎవురు పనులు చేస్తారు.
అసలు దిగులుతో నాకేమి అర్ధం కావడం లేదు''చెప్పలేక చెప్పలేక చెప్పింది.
అమ్మ,పెదమ్మ,మావయ్య మౌనంగా వింటూఉన్నారు .
పెదమ్మ కు అప్పటికే ఒక అబ్బాయి,ఇద్దరు ఆడపిల్లలు.
ఆ ఊరిలోని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా అమ్మమ్మతో అక్కడే ఉంది
ప్రస్తుతం.పెదనాన్నే షాప్ నుండి అన్నానికి ఇక్కడకు వచ్చి వెళుతూఉన్నారు.

అదిగో బయట ఉన్న మంచం అంత  పెద్దగా రెండు వైపులా ఉన్న
ఎర్ర అరుగుల నిండా పిల్లల గోల ఆడుకుంటూ.
వాళ్లకు ఇవేమి పట్టవు.
అన్నిట్లో ఉంటూ ఏమి అంటకుండా....
బాల్యం ఎంత హాయి....రాలే చినుకు నుండి
ఇంద్ర ధనుస్సు విచ్చుకున్నట్లు వాళ్ళ నవ్వుల్లో వేల కాంతులు.

అదిగో సులోచనక్క''ఏమి చిన్నఅమ్మాయి ఏమి చేస్తుంది నీ బుజ్జి
కూతురు?''అమ్మ కళ్ళలో నీటిపొర.
''ఏడవకు లెమ్మ ,ఏమి కాదులే ,వస్తాడు మీఆయన .
భార్యా బిడ్డల్ని వదిలేస్తారా ఏమిటి?''
సుఖాల్లో పలకరించక పోయినా కష్టాల్లో పలకరించాలి అంట.
ఇందరం ఉన్నాము భయం లేదు అని చెప్పటానికి,ఇంతా అంతా
కష్టమా ఆడపిల్ల పుట్టటం....అందులో అమ్మమ్మ అందరికి సహాయం
చేస్తూ ఉంటుంది.ఎవరి పెళ్లి అయినా మా ఇల్లే విడిది ఇల్లు.అందుకని
అమ్మకి ఆడ పిల్ల పుట్టింది అని తెలిసి వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో
ఇల్లు సందు లేదు.అరుగులు కళ కళ లాడిపోతున్నాయి.పిల్లల కేక లతో,
గుర్రం ఎక్కినట్లు ఆడే వాళ్ళు,పడవ ఎక్కినట్లు ఆడే వాళ్ళు,యెగిరి దుమికే వాళ్ళు
అమ్మ వాళ్ళు లాక్కుని పోతుంటే అరుగులు వదిలి రామని కేకలు
వేస్తున్నారు.ఇప్పుడు నా బుజ్జి కాళ్ళకు సత్తువ ఉంటె ఎంత బాగుండును.
వాళ్ళతో యెగిరి ఉందును.

''సరేనమ్మ నేను వస్తాను.సామాను సాయంత్రం పంపిస్తాను''
బయలుదేరాడు పులయ్య.
''పుల్లయ్య మామిడాకుల సంగతి చూడు''చెప్పింది.
సరే అని వెళ్ళిపోయాడు.

''సులోచన నువ్వు పూల సంగతి చూడు,అసలే కోట వాళ్లకు పూలు అంటే
 భలే ఇష్టం ''చెప్పింది అమ్మమ్మ.

''రెండు లీటర్లు మల్లె పూలు,సన్న జాజులూ తెప్పిస్తాను.అనసూయ వాళ్ళ
ఇంట్లో కనకాంబరాలు కోసి పంపమంటే సరి పోతుంది.''అనింది అమ్మమ్మ.
''అలాగే కట్టి పంపిస్తానులే పిన్ని.మరి చిన్నఅమ్మాయి  సంగతి ఏమిటి?
(అమ్మ పేరు నాగరత్నం .అయినా అందరు ఇలాగే పిలుస్తారు )
బాలింత విచ్చిన పూలు  పెట్టుకోకూడదు.ఆ రోజు ఉదయాన్నే అంగడిలో
ఉన్న మొగ్గలు తెప్పించు.వెంటనే కట్టి ఇచ్చేస్తాను.ఓయ్ బుడ్డి పిల్ల
నీకు కూడా లాంతరుచెండు కుట్టిస్తాలే(*)''నన్ను చూసి నవ్వుతూ అనింది.

నాకు అర్ధం అయింది నన్నే పిలుస్తున్నారు అని .....
అమ్మ చెంగు లోనుండి బయటకు చూసి మళ్ళా
లోపలకు తల పెట్టేసాను.
''దాని మొహం దానికి లాంతరుచెండు  ఏమిటి?
జుట్టు మోస్తుందా?''
''ఏమి కాదు లేవే మూడు మొగ్గలు వేసి కడుతాను చిన్నది,
ఆడ పిల్ల పూలు లేకుండా ఏమిటి.అసలు దానిది రింగుల జుట్టు.
ముద్దుగా ఉంటుంది''
నవ్వింది అమ్మ చినగా నా రింగుల జుట్టు వేళ్ళతో దువ్వుతూ.
ఆమె కూడా వెళ్ళిపోయింది.

అమ్మమ్మకి ఇంకా భయంగానే ఉంది
''పెంచెలు బావా వాళ్లకి రమ్మని ఉత్తరం
వ్రాసావు కదా.''''వ్రాసాను''చెప్పాడు.
''అది కాదురా మావయ్యని,అత్తమ్మని ,బావని ,వాళ్ళ చేల్లెల్లని ,
తమ్ముళ్ళని,పెద్ద బావని,అక్కని అందరిని
పేరు పేరునా రమ్మని వ్రాసావు కదా''
''వ్రాసాను అమ్మ.తప్పకుండా రావాలి అని వినయంగా వ్రాసాను''

''హ్మ్..ఏమో నాయన ఆ పరమేశ్వరుడు ఈ గండం ఎలా గట్టేక్కిస్తాడో
ఏమిటో?..అవును చిన్నమ్మాయి మీ అయన ఏమి బంగారు తెస్తాడో
దీనికి ,తెలిస్తే బాగుండును.మనం వేరేది చేయించవచ్చు''

''హ్మ్...అసలు వస్తాడో రాడో  తెలీడం లేదు.ఇంత దురదృష్టవంతురాలికి
ఎందుకు పుట్టావే తల్లి''అని నన్ను హత్తుకొని కన్నీళ్ళతో నిండిపోయింది.

''అయ్యో వద్దులే తల్లి ,బాలింత ఏడవకూడదమ్మ ,ఏడవొద్దు తల్లి
ఏడవొద్దు.పురిట్లో వచ్చిన జబ్బులు పుడకల దాకా పోవంట.
ఏడవకు తల్లి.''
అమ్మమ్మ కన్నీటి పర్యంతం అయిపోతూ....
మావయ్యను దగ్గరికి పిలిచింది.
''రే పెంచేలు.ఆచారి దగ్గరకు పోయి బంగారు దండ కొంచెం బరువుగానే
చెయ్యమను.ఆడపిల్ల ఎదిగితే బోసిమెడ తో ఏమి తిరుగుతుంది.
అదసలె పుట్టెడు కష్టం లో ఉంది.మనం దాని కష్టం తీర్చలేము.
ఎలాగో వంకీలు,మొలగజ్జెలు ఉన్నాయిలే.దండ బాగా చేసి ఎల్లుండికి
ఇచ్చెయ్యాలి అని చెప్పు.మళ్ళా మీ బావా వాళ్ళు వచ్చేస్తారు''

''సరే అమ్మ అని ఒకటిన్నర కిలోమీటర్ దూరం లోని విష్ణాలయం
 దగ్గర ఉన్న ఆచారి దగ్గరకు బయలుదేరాడు మావయ్య.
మళ్ళా పిలిచింది
''అలాగే కొత్త బజారు,పిన్నమ్మ,రంగమన్నారు బాబాయి లను రమ్మని చెప్పు.
నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ,త్వరగా రమ్మని చెప్పు''

మళ్ళీ పిలిచింది
''పాతూరుకి పోయి పాల వాళ్లకి పదిహేను
లీటర్ల పాలు కావాలని చెప్పు.బాగా పోయాలి అని చెప్పు''

పాపం డిగ్రీ చదివే మావయ్య మొగ పిల్లవాడు కాబట్టి లేత భుజాల మీద
అన్ని బాధ్యతలు వేసుకొని తిరిగింది తిరిగిందే...అక్క కష్టం కొంత
అయినా తీర్చాలి అని.

''చిన్నమ్మాయి రూపాయ మిద్దె (*)వాళ్ళను పిలవాలా?''అడిగింది.

''పిలవక పొతే ఎట్టమ్మ!తోడుకోడలు అక్క వాళ్ళు కదా''చెప్పింది అమ్మ.

ఇక మా పెదమ్మ వాళ్ళ ముగ్గురు పిల్లలు,మా అక్కపని,
బాలింత పని, ఇంకా  వంట,
బారసాల పనులు,వచ్చే పోయే వాళ్ళను పలకరించడం
ఇవన్నీ ఒక ఎత్తు , మా అమ్మని ఓదార్చడం ఒక ఎత్తు .
కాలం ఎవరి కోసం ఆగుతుంది రేపే బారసాల.

రాత్రికి అమ్మ కంటికి కునుకు పడితే ఒట్టు.అంటుకోని రెప్పల నడుమ
కన్నీటి చెలమ ఊరుతూనే ఉంది.ఫోన్ లు ఉన్నా బాగుండును.

నేను ఇక్కడ ఉంటిని.అక్కడ మా నాన్న మనసులో ఏముందో నాకేమితెలుసు!
''వస్తాడా?ఈ పాపని ఎత్తుకుంటాడా ?ఏమంటాడో?''భయం,దుఖం
 కలగలిసి సంద్యా సమయం లాగా.....
దిండు మీద వాలిన అమ్మ మనసులో చుట్టూ
అలుముకున్నలాంటి చీకటే....ఒక్కటే ఆశా కిరణం,
నాన్నకు చిన్న పిల్లల పై గల ప్రేమ ....

రాత్రంతా పక్క నుంచుకొని వెచ్చగా నిద్ర పుచ్చే నాన్న,
ఏడిస్తే అమ్మ కంటే ముందు ఆకలి తీర్చే నాన్న,
చిరు నవ్వుల కెరటాలు విచ్చుకుంటే పొంగిపోయే నాన్న,
భుజం సింహససనం పై కూర్చుండ పెట్టి చిన్ని పాపాలను 
ఊరేగించే నాన్న .....
ఆడ పిల్ల అనే ఒక్క కారణం తో రాకుండా ఉంటాడా?

ఏమో తండ్రి ప్రేమ జయిస్తుందో,సమాజం ఇచ్చిన మూర్ఖం జయిస్తుందో?
కల్లోల సముద్రం లాంటి అమ్మ మనసులోని అలజడి
ఆమె గుండెల నుండి ఎగసి నాలో కూడా దుఖాన్ని నింపుతూ ఉంది.
''రా నాన్న ప్లీజ్,అమ్మ ఎలా ఏడుస్తుందో చూడు''
నేను చిన్ని కృష్ణుడిని అయినా బాగుండేది ......అమ్మ గుండెల్లోని
అమృతమే కాక ,బాధని కూడా పీల్చేద్దును''

''నా పిచ్చి కాని కృష్ణుడినే  అయితే ఈ ఏడుపులన్నీ ఎందుకు....
వెదవ ఆడ పిల్లగా పుట్టబట్టి కాని ''
                                                    (ఇంకా ఉంది)

(లాంతరు చెండు ,రూపాయ మిద్ది ....ఇలాగా స్టార్ గుర్తులు ఉండేవి
కధలు అన్న మాట.అన్నీ వ్రాయను.కొన్ని వ్రాస్తాను.ఎందుకంటె
ఇవి బుక్ గా  చేసి అమ్మకు ఇచ్చి
''నాకు దేవుడు ఎంత మంచి పాపను ఇచ్చాడో''
అని అమ్మ పొంగిపోతూ నా బుగ్గ మీద ముద్దు
పెడితే ఆనందించాలి అని.....
విషణ  భీషణ గోషణ రోషణ  కోరిక.
...ఇవేమిటి అంటే నాకు మాత్రం ఏమి తెల్సు ..కోరిక బీభత్సంగా ఉంది
అనేదానికి విశేషణాలుగా అవి వ్రాసాను.అర్ధం తెలీదు.
ఎవరు పుట్టించక పొతే పదాలు ఎలా పుడతాయి చెప్పండి?)

2 comments:

A Homemaker's Utopia said...

చాలా బాగా రాశారు శశి గారు.:-)

N.V. SIVA RAMA KRISHNA said...

ఇంతకి సారాంశం, అమ్మాయిగా పుట్టినందుకు ఓర్చుకునే వ్యయప్రయాసలు, కష్టనిష్టురాలు, ఇత్యాది. కానీ, నేటి కాలమాన పరిస్థితులలో ఆడపిల్లలు వీటికి అతీతమని నా అభిప్రాయం.