Saturday, 27 April 2013

మొగుడు ...ఒక కమ్మని వరం


మొగుడు ...ఒక కమ్మని వరం 
చెప్పు నిజంగా నాతోనే ఉంటావా?''ప్రేమ చూపులుగా మారి 
మనసు లోతుల్లోకి వరదలాగా దూసుకేళుతూ....
రెప్పల టపటప ల సన్నాయి రాగం లో సిగ్గుల మొగ్గ అవుతుందేమో అనుకొని 
మురిపెంగా చూస్తూ ఉన్నాడు....తటాలున పడింది చురుగ్గా తల మీద ఒక 
గట్టి మొటిక్కాయ......రాక్షసి లేత తమలపాకుల కాడలకు యెంత బలం ఉందే?
టేకు చెక్కతో మోదినట్లు ఉంది....చటుక్కున లేచి కొంగు పట్టుకోబోయాడు....
అందకుండా తుర్రుమన్నది....''పిచ్చి మొహమా....నీకోసం కాక పోతే 
ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నాను''అని అతని చెవుల్లో అమృతం పోస్తూ
ఊరించి ఇంట్లోకి రివ్వున పరిగెత్తింది......అయిపొయింది.

తీయన ఊహలు బుగ్గల ఎరుపై ....అబ్బ ఇంకా కొంచెం సేపు కధ ఉంటె బాగుండేది.
అనుకుంది లలిత.
అసలు వేరే వాళ్ళ కధ చదివితే కాదు ఎలాగైనా కధ వ్రాయాలి....అవును వ్రాయాలి...
భలే హుషారు వచ్చింది.ఈయన సాయంత్రం ఇంటికి రావడానికి ఇంకా రెండు గంటలు 
ఉంది.వ్రాసేస్తాను.కలం ,కాగితం ముందు పెట్టుకొని కూర్చుంది.
దేని గూర్చి వ్రాయాలి?ఆ పాపం ఆ సందు  చివర అడుక్కునే అవ్వ గూర్చి వ్రాస్తే,
చా కాదు ముందుగా సంతోషంగా ఉండే కధే వ్రాయాలి .....ఏమి వ్రాద్దాము...
క్షణాలు సూర్యుని వెలుగుతో పాటే కరిగిపోతున్నాయి....ఆ పక్కింటి కొత్త దంపతుల మీద 
వ్రాస్తే ,ఎప్పుడూ యెంత బాగా కువ కువ లాడుకుంటూ ఉంటారో .....
కాదు ఎదురుగా ఉండే కాన్వెంట్ మీద వ్రాయాలి ఏమి కుక్కుతారు పిల్లలని బస్తాలో మిరపకాయలు లాగా ....
ఏమి తేలడం లేదు.చిరాగ్గా ఉంది.
ఈయనకి ఫోన్ చేసి చూద్దాము ఏమంటారో....
''ఏమండీ'' ''చెప్పు''అవతల నుండి ......
''నేను కధ వ్రాద్దాము అనుకుంటున్నాను.దేని గూర్చి వ్రాయాలి?''
''వ్రాద్దువులే ఇప్పుడు లాండ్రీ అబ్బాయి వస్తాడు ఆ లెక్క సరిగ్గా వ్రాసుకో.
ఒక్క సారి అయినా సక్రమంగా వ్రాసావా?మనసు పెట్టి వ్రాయి.ఆ పచారి 
సామాన్లు తీసుకున్నప్పుడు లెక్క కరక్ట గా చూసుకో...''చెపుతూనే 
ఉన్నాడు.ఛీ...విసుగ్గా ఆపేసింది ఫోన్.

ఇలాగ కాదు అమ్మని అడుగుతాను.''అమ్మా''
''చెప్పు తల్లి''
''నేను కధ వ్రాయాలి అనుకుంటున్నాను''
''అలాగే వ్రాయమ్మా...ఆ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటాడు.ఆయన గూర్చి వ్రాయి''
''సరే'' హ్మ్...అనుకుంటూ పెట్టేసింది....
ఇలాగా కాదు సరళ కు చేస్తాను.
''సరళా '' ''చెప్పవే ...ఏమిటి బహు కాల శ్రవణం?''
''నేను కధ వ్రాయాలి అనుకుంటున్నాను''సూటిగా చెప్పింది.
''వ్రాయవే నీకు అడ్డేముంది....నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు.
''దేని గూర్చి వ్రాయాలి''
''కొత్తగా వ్రాయవే ,కంప్యూటర్స్ గురించో,ఫేస్ బుక్ గురించో''
కాలింగ్ బెల్ మోగుతూ ఉంది.ఫోన్ కట చేసి వెళ్లి తీసింది.
''రండి''వెళ్లి టీ పెట్టుకొని ఇచ్చి తను కూడా  తాగింది.
కుక్కర్ పెట్టి వచ్చేసరికి అయ్యగారు మఫ్టీ కి మారడమే కాక 
న్యూస్ ఛానల్ పెట్టేసి ఉన్నారు.ఇక ఈ రోజు కధ వ్రాసినట్లే.....
వంటకు తరుగుతూ కూర్చుంది.బుర్రలో ఆలోచనల అలలు.
పరుపు మీదకు వాలిన తరువాత కూడా రెప్పల వెనుక ఆలోచన సుళ్ళు...
అలాగే నిద్రలోకి జారిపోయింది.

                      ****************************
ఒకమ్మాయి....ముద్దుగా ,కళ్ళు రెప్పలు ఆర్పుతూ 
అమ్మ చేతికి జుట్టు ఇచ్చి కూర్చొని నెల మీద 
సుద్ద తో ముగ్గులు మెలితిప్పుతూ ఉంది....

''అమ్మాయి జాగ్రతగా విను, నిన్ను చూసుకోవడానికి 
పెళ్లి కొడుకు వస్తున్నాడు.మాటలు అన్నీ అయిపోయాయి.
ఇక పెళ్లి అయితే అతనే నీ మొగుడు.ఎప్పుడూ ఎదురు మాట్లాడకూడదు.
తల ఎత్తి చూడకూడదు సరేనా''చెప్పింది అమ్మ.
''ఓహో నాకు మొగుడు వస్తే నేను తల ఎత్తి చూడకూడదు.
మొగుడు అంటె రాక్షసుడా భయం వేస్తుందా?''అడిగింది అమ్మని.

''నీ మొహం....పోను పోను నీకే తెలుస్తుంది.ఏది పడితే అది అడిగేయ్యడమే''
విసుక్కొని జుట్టు చివర్లు రిబను తో ముడి వేసి లోపలకు వెళ్ళింది అమ్మ.
ముగ్గు మళ్ళా మెలి దిప్పుతూ ఉంది కాని అమ్మాయి మనసులో ఎన్నో ఆలోచనలు...
''మొగుడు అంటె ఎవరో?పెద్ద మీసాలు ఉంటాయేమో తాతయ్య లాగా?
నేను భయపడతాను అని చూడొద్దు అనింది అమ్మ''అనుకొని బువ్వ తినేసి 
నిద్రపోయింది.
కలలో అంతా  మీసాల రాక్షసుడే...బాబోయ్ ఎందుకు వస్తున్నట్లో 
భయం తో కూడిన కుతూహలం.

బామ్మ దగ్గరకు చేరింది''బామ్మ మొగుడు అంటె ఏమి చేస్తాడు?''
అనుభవం తో కూడిన ముచ్చటైన నవ్వు పెదాలపై విరిసింది బామ్మ మోహంలో.
''మొగుడు అంటె నీ కలల రాజకుమారుడమ్మ.నువ్వు నోములు,పూజలు చేసేది,
గొబ్బెమ్మలు పెట్టేది....మొగలి పూవంటి మొగుడినియ్యవే అని పాడేది ...
అచ్చంగా అయన కోసమే అన్న మాట.''

''ఓహో రాజ కుమారుడన్న మాట......
''రాత్రంతా తెల్ల గుర్రం మీద రాజ కుమారుడే....
ఎప్పుడొస్తాడో ఏమో అని ఉదయాన్నే లేసేసింది.చక చక స్నానం చేసేసింది.
ఇల్లంతా సందడి గా ఉంది.నాన్న అందరిని పురమాయిస్తూ ఇంటిని మామిడి తోరణాలతో 
అలంకరించారు.అమ్మ మిటాయి,వడలు చేసింది.
ఇరుగు పొరుగు వచ్చి 
''దామ్మా  అలంకరిస్తాము అని...చీర కట్టి సిద్ధం చేసారు.
''నా బంగారు తల్లి యెంత బాగుందో''ప్రేమగా బుగ్గలు పుణికి మెటికలు 
విరిచింది పిన్ని.
''ఇంకెన్ని రోజులు ఉంటుంది మీ బంగారు తల్లి...ఎత్తుకొని పోయే రాకుమారుడు వచ్చాడుగా ''నవ్వారు అమ్మ లక్కలు.
''బాబోయ్ మొగుడు అంటె ఎత్తుకేల్లిపోతాడా??''అమ్మాయి లో భయం మొహం పై పాకుతూ 
పెరిగిన గుండె శబ్దం,టప టపా కొట్టుకున్న రెప్పలపై మెరిసాయి.
అదిగో వచ్చేసారు.సందడి మొదలు అయింది.మర్యాదలు...కాఫీలు.
దగ్గరి వాళ్ళే సంభంధం పోతుంది అని గట్టిగా వీళ్ళ పెళ్ళితో ముడి వేసుకుంటున్నారు.
భయం తో అమ్మాయి గుండెలు అదిరిపోతున్నాయి.చూడొద్దు అని అమ్మ చెప్పిన మాటలు 
మనసులో ....అయినా మెల్లిగా కిటికీ లో నుండి తొంగి చూస్తున్న వాళ్ళ వెనుక నుండి చూసింది.

''అరె ఏమి రాక్షసుడి లాగా  లేడే ?''
చిన్న నూనూగు మీసాలు,దబ్బ పండు ఛాయ...
ఆతను పెద్దలు వేసే ప్రశ్నలకు బిడియంగా నవ్వుతుంటే చూడబుద్ది  అవుతుంది.
కొంగు అంచులు మేలి పెడుతూ .....ఓహో మొగుడు అంటె ఇలాగ అనుకుంది.
మరి పట్టుకెల్లి పోతాడు  అన్నారు...ఎలాగబ్బ అమ్మని నాన్నని వదిలి,అయ్యో బామ్మ,తాతయ్య,తమ్ముడు 
అమ్మాయికి దుఖం తన్నుకొని వచ్చేసింది.చిన్ని బుగ్గలపై ఉబికిన కన్నీళ్లు...వెక్కిళ్ళ 
శబ్దం విని అందరు వెనక్కి చూసారు.ఆ అబ్బాయి కూడా చూసాడు.
లీలగా కనపడ్డాయి అమ్మాయి బుగ్గలపై జాలు వారుతున్న కన్నీళ్లు.
ఎన్ని జన్మల బంధమో మనసు ఊగిసలాడింది ఆ కన్నీళ్లు చూసి....
 ఒక్క సారి తుడవాలి అతని మనసు లాగింది.జాలిగా గుబులు,
వయసు తెస్తున్న  తొందర నిలవనీడం లేదు....మళ్ళా కిటికీ వైపు 
చూసాడు.అమ్మాయి అక్కడ లేదు.''లేదు ఇంకా నీ కళ్ళలో ఇంకా ఎప్పటికీ నీళ్ళు 
జారనివ్వను....ఏమైనా సరే''ధృడంగా  అనుకున్నాడు.
''ఇక ఈమె నా పెళ్ళాము''మనసులో ఎందుకో సిగ్గు...అబ్బాయికి.
పైకి మాత్రం కొంచెం గంభీరంగా అందరి వైపు చూస్తున్నాడు.

అక్కడ అమ్మాయి వెక్కుతూ ఉంది.''అమ్మ నన్ను పంపించేస్తారా?నేను మీ మాట వింటాను...
అల్లరి చేయను,పనులు చేస్తాను..మొగుడుతో పంపొద్దు ''బావురుమంది.
అరె తీగ ఎక్కడైనా చెట్టుకి అల్లుకోను అంటుందా?ఎంత చిత్రం 
మొక్కను పీకి వేరే దగ్గర  వేసేటపుడు పిల్ల వేర్లు తెగాల్సిందే,
ఇంకో చోట వేళ్ళూనుకునేదాక  దాక ఆడపిల్ల బాధపడాల్సిందే.

అమ్మ ప్రేమగా దగ్గరకు తీసుకొని నున్నటి బుగ్గల మీద జాలు వారే 
కన్నీళ్లు తుడిచింది.
''ఏడవకమ్మ మా బంగారు కదూ ....బుగ్గలపై జారిన కాటుక రేకలు..
చందమామను కమ్మిన మబ్బుల్లా....''నాన్న మాత్రం నిన్ను వదిలి ఉంటాడా?ఏమిటి?
అదిగో మన పక్క వీధే వాళ్ళది.అయితే అబ్బాయి చదువు కోసం వేరే ఊర్లో ఉన్నారు.
చదువు అయిపోగానే వచ్చేస్తారు''
''ఓహో నన్ను ఇంక ఎక్కడికీ పంపరు కదా''అనుమానంగా అనింది.
''పిచ్చి తల్లి మూడు ముళ్ళు పడే దాకానే ఈ దిగులు,తరువాత ఆ అబ్బాయి 
ప్రేమలో మునిగి రమ్మన్నా రావు''ముసి ముసి నవులూ నవుతూ మళ్ళా 
అమ్మాయిని సిద్దం చేసింది.

''ఓహో మొగుడు అంటె మంచోడే.ప్రేమగా చూసుకుంటాడు అన్నమాట''
బుద్దిగా అమ్మ పక్కన నడిచి వెళ్లి తల ఎత్తకుండా కూర్చుంది.
అమ్మ ఎత్తవద్దని  చెప్పినా కుతూహలం ఆగటం లేదు.
కొంచెం తల ఎత్తి ఓరగా చూసింది.
పెద్దలు కట్న,కానుకలు పనిలో ఉన్నారు.

చిత్రం అబ్బాయి కూడా ఇటే చూస్తున్నాడు.తుమ్మెద రెక్కల్లా వచ్చీరాని
మీసాల కింద నవ్వు  తళుక్కుమంది ..చూపులు కలవగానే.
గుండె గబుక్కుమని తల వంచేసింది.
''నా పెళ్ళాము''గర్వంగా అనిపించింది అబ్బాయికి.

''అబ్బో మొగుడుని చూడటం నిజంగా కష్టమే''రెండో సారి తల ఎత్తాలన్నా  
ఎత్తలేక వంచేసింది ఓణి చివరలు మెలిపెడుతూ....
ముచ్చటైన అబ్బాయి,అమ్మాయిల పెళ్లి కుదిరిపోయింది.
రెండేళ్లు ఆగే చేద్దాము....వాళ్ళకు ఉహ వస్తుంది.అబ్బాయి చదువు అయిపోతుంది.
సరే అలాగే అనుకున్నారు.
''మొగుడు అంటె ఇలాగా?అనుకుంటుంది ఆ నవ్వుని గుర్తుకు తెచ్చుకుంటూ 
మొగుడు అంటె అలాగా అనుకుంటూ మనసులోని నవ్వు బుగ్గలపై పాకి 
చిత్రం అమ్మాయికి పెళ్లి సోయగం పెరిగి పోతూఉంది.రోజు రోజు కు.
అప్పుడప్పుడు తిరణాలకు వచ్చే అబ్బాయిని కిటికీ లోనుండి చూస్తూనే ఉంది.
ఆ అమ్మాయి ఉన్నా లేకున్నా  ఆతను మాత్రం కిటికీకే చూపులు అతికించే వాడు  పెద్దలు 
చూడకుండా....మరి మనసులో ఏమని అనుకున్నాడో ఏమో.

ఆ కమ్మని రోజు రానే వచ్చింది.ఇల్లంతా అల్లుకున్న పూలవాసన,తాటాకు పందిళ్ళు,
మామిడాకుల తోరణాలు,వంటకాల వాసనలు,బంధు మిత్రుల ముచ్చట్లు,
అబ్బాయి చుట్టూ  చేరిన కేరింతలు,బుగ్గన మెరుస్తున్న దిష్టి చుక్కలు ....మెల్లిగా పీటల మీద కూర్చొని 
పంతులుగారు చేయమన్నట్లు చేస్తూ ...మధ్య మధ్యలో పక్కకి చూస్తూ 
ఉన్నాడు అబ్బాయి కళ్ళతో వెతుకుతూ....

అదిగో వెన్నెల్లో విరిసిన కలువలా తల వంచుకొని అందరితో వస్తూ ఉంది...
చేతిలో పూర్ణఫలం .మధ్యలో తెర గుడ్డ ఒకటి విసుక్కునాడు అబ్బాయి.
ఈ వైపు కూర్చొని కాళ్ళు కడిగారు అమ్మాయి తల్లి తండ్రులు,
అబ్బాయి చేతిలో అమ్మాయి చేతులు ఉంచి కన్యాదానం చేసారు.
ఆ చేతుల స్పర్శ అబ్బాయికి తెలుస్తూ ఉంది.మెల్లిగా తాకాడు కొంచెం నిమురుతూ ..
చిగురాకులా వణికాయి వవేళ్ళు.
''ఇప్పుడెలా ఉందొ అమ్మాయి''చూడాలి అని తొందర అబ్బాయిలో.

''బాబోయ్ ఈయన ఏమిటి?''చిన్నగా జంకు అమ్మాయిలో...
ఇక జిలకర,బెల్లం పెట్టడమే తరువాయి.....
కధ  మామూలే ....ఆగండి.
''ఏమిటి?''అందరు బిత్తరపోయి చూసారు.ఇస్తానన్న డబ్బులు ఏవి?
మధ్యవర్తులు కోపం అమ్మాయి తండ్రి మీద.
''పొలం అమ్ముడు కాలేదు,పొలం దాని పేరనే వ్రాస్తాను అమ్మాయి తండ్రి వేడుకోలు.
''కుదరదు''అబ్బాయి వారి దాష్టీకం.
''నువ్వు లెయ్యిరా ''రెక్క పట్టుకొని లేపారు.
పక్కకి చూసాడు అబ్బాయి.పైకి కళ్ళు ఎత్తింది అమ్మాయి.
ఆ కళ్ళ నిండా నీళ్ళు ఇప్పుడో ఇంకాసేపటికో ఒలికిపోతాయి...
తటాలున కూర్చున్నాడు అబ్బాయి....లేదు నా భార్య కళ్ళ నీళ్ళు 
పెట్టకూడదు మనసులో ధృడంగా ....మొహం గంభీరంగా ఉంది.
కళ్ళు నిశ్చయాన్ని తెలియచేస్తున్నాయి.అబ్బాయి మొండి పట్టుదల 
పెద్దలకు అర్ధం అయింది.
ఇంకేమి చేయలేక....''సరే పొలం పత్రాలు ఇవ్వండి''అన్నారు బింకంగా.

''హమ్మయ్య పరువు దక్కింది''మనసులో అనుకొని కండువాతో కళ్ళు తుడుచుకున్నాడు నాన్న.
''బాబు నువ్వు దేవుడివి''అబ్బాయి చేతులు ప్రేమగా నిమిరాడు.
''ఓహో మొగుడు అంటె దేవుడు...అప్పుడే తన వైపు తిరిగిన చూపులకు బదులుగా 
చిన్న నవ్వు నవ్వింది''తల వంచుకొంటూ.....
''చాలు నా పెళ్ళాం నవ్వు చాలు కట్నంగా ...ఇంకేమి కావాలి?''తృప్తిగా అనుకున్నాడు 

జిలకరా బెల్లం పెట్టేసారు .మూడుముళ్ళ కార్యక్రమం 
ముచ్చటగా తల వంచుకున్నా వీపుపై ముని వెళ్ళ స్పర్శ తెలుస్తూనే ఉంది.
''అబ్బాయికి నమస్కారం చేయమ్మా''పెద్దల ఆదేశం.
లేచి నిలబడి ఉన్న అబ్బాయి కాళ్ళకు నమస్కరించింది.
''నా పెళ్ళాం యెంత మంచిదో''అనుకున్నాడు అబ్బాయి.
ఒద్దికగా పక్కకు జరిగి కూర్చోపెట్టుకున్నాడు.
మెల్లిగా చెవుల మీదకు వంగి ''నువ్వు నాలో సగం''అన్నాడు.
కిల కిల నవ్వింది అమ్మాయి.
''ఓహో మొగుడు అంటె నాలో సగం''అనుకుంటూ....

                  ***********
''టంగ్'' స్టీల్ చెంబు దూరంగా పది ఉంది.....నీళ్ళు  చెల్లా చెదురుగా దొర్లి ఇల్లంతా 
పరుచుకున్నాయి.నిద్ర లో తన్నేసినట్లుగా ఉంది.
కల...నిజమా కలా..యెంత బాగుంది....

ఏదో ప్రేమ ఊపిరి భుజం పై నిమిరినట్లు....
కను పాపలపై సున్నితంగా తడి అద్దినట్లు .....
ప్రేమ ఎంత బాగుంది ....
ముచ్చటైన ప్రేమ ,పచ్చటి పందిరి కింద 
మమతల ముగ్గు వేసినట్లు,
కొత్త పెళ్లి కూతురి చేతికి అద్దిన గోరింట పరిమళం లాగా,
అరిటాకులో పోసుకొని తాగిన జీడిపప్పుల పాయసం లాగా........

భ్రమే ....కలే....పక్కకు చూసింది.ఇంత శబ్దం వచ్చినా అవతల ప్రాణం 
ఎంత హాయిగా నిద్ర పోతుందో ......
నిజంగానే కలే లేకుంటే కాబోయే భార్యల శీలాలు కూడా శంకిస్తూ ఫేస్బుక్ లో 
కామెంట్ల ముళ్ళ కి ఇంటి పరువును వేలాడ దీస్తూ ,
ప్రేమ బంధాన్ని సున్నితమైన ఊహల్ని అనుమానాల శిలువలకు 
వేలాడదీసి వికృతమైన ఆనందాలు జుర్రుకొనే కాలం లో .....
ఇలాంటి పూ రేకులు,తీయని బంధాలు అనీ ఇదిగో ఇలాగే నీళ్ళ లాగే 
భారత దేశపు నేల పై ఒలికిపోయాయి.
ఆ నీళ్ళని దోసేట్లోకి తీసుకోవాలని ఉంది.స్వచ్చమైన గంగాజలం లా మార్చి 
కలిశం లో నింపాలి అని ఉంది.ఆ ఆశ కుదురుతుందా?
ఆలోచిస్తూ అంటుకొని రెప్పల్ని బలవంతంగా మూస్తూ పడుకుంది.
                ********************

Thursday, 25 April 2013

ఒక మంచి నాన్న

శైలబాల రచించిన నాన్న నావల్ గూర్చి నా సమీక్ష 

(శైలబాల బ్లాగ్ లింక్ ఇక్కడ )

ఒక తరం వారు ఇంకో తరాన్ని ఆశీర్వదిస్తూ ఇవ్వవలసిన బహుమతి. 

" నాన్న " నవల

'నాన్న''పుస్తకం చేతిలోకి తీసుకోగానే అక్షరాల సువాసన ,బహుశా ఆత్మీయత 
కలిపినందువలన ఏమో !!

కళ్ళు పుస్తక తలుపు మీటగానే చిన్నారి పాప నవ్వుతూ 
''తల్లి భూదేవి తండ్రి ఆకాశం 
మధ్య విరిసిన హరివిల్లులు బిడ్డలు'' అని చెపుతూ రండి మా నాన్నను 
పరిచయం చేస్తాను అని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది.

ఇది ఒక  నాన్న ఆడ పిల్ల తండ్రిగా ఉప్పొంగిన ఆనందం,
అనుబంధాల ఘర్షణ లో అంతరంగం లో జరిగే మార్పులు 
ఒక మంచి సమాజ స్తాపన వైపు వారు నడిచే తీరు శైల బాల గారి కలం లో
అద్భుతంగా జాలు వారింది.

పుస్తకం లోకి వెళితే చంద్రశేఖరం వారి భార్య ,వారికి ముగ్గురు పిల్లలు .
చివరిదైన అమ్ము పెంపకం లో తన తోడు లో తాను అనుభవించిన ఆనందం గూర్చి 
చంద్ర శేఖర్ గారు మనతో పంచుకుంటారు.ఆయన ఒక మంచి నాన్న .....ఎంత అంటే ....

ఉయ్యాలలో పాప ''ఊహూ''అన్నా పాప ఆజ్ఞగా పాటించే అంత 

పాపకు అక్షరాభ్యాసం తో పాటు ఆమెకు నచ్చిన పేరు అడిగి ఆ రోజే పెట్టె అంత 

పాప ముగ్గు వేయమంది అని పాప కోసం గొబ్బెమ్మలు కూడా దొంగలించుకొని
 వచ్చే అంత 

చివరికి తన పాప లాగా అల్లుడు కూడా చాక్లెట్ తింటాడా తినడా 
అని పెళ్ళికి ముందే పరీక్షించే అంత .....

మంచి అమ్మ ,మంచి నాన్న ,మంచి అమ్ము,మంచి అల్లుడు ,మంచి తాతయ్య,మంచి నానమ్మ 
మరి కధ  ఏముంది?

అదే మరి తెలుసుకోవాల్సినది.
కూతురు  కడుపుతో ఉందని చూద్దాము అని వచ్చిన ఇంత మంచి నాన్నకి అల్లుడు గొంతు
బయటే వినపడుతుంది ''మీ నాన్న ప్రవర్తన నాకు నచ్చదు''అని,
చిన్నపోయిన గుండె తట్టుకోగలదా?
చంద్రశేఖరం ఆ విషయాన్ని తేలికగా వదలదు 
ఎందుకు తన ప్రవర్తన అల్లుడికి నచ్చదో తెలుసుకుంటాడు 
పశ్చాత్తాపం తో తన ప్రవర్తన సరిదిద్దుకోవడమే ఈ కధ .

కాదు బంధాలను  ఇంకో సారి తడిమి చూసుకోమని మనకు ఇచ్చే 
ఒక కోయిల కూత.కమ్మని మనసు పాడే రాగం.

మంచి వాక్యాలు బోల్డ్ చేయడం ,చివరి పేజ్ లో సీతా రాములు చిత్రం 
రచయిత్రి అభిరుచిని తెలియ చేయడమే కాక మనను  ఆత్మీయంగా పలకరిస్తాయి.

ఇంకా అమ్ము (పేరు గీతాంజలి) అమ్మా నాన్న ల సహాయంతో తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దు 
కోవడమే కాక తన చుట్టూ ఉండే వారిని చేరదీయడం మనిషిగా మన బాధ్యత ను గుర్తు చేస్తాయి.

మరీ ముఖ్యంగా వాళ్ళు ''బృందావనం''అనే సామాజిక కార్యక్రమాన్ని 
పరిచయం చేసేటపుడు అందరికి తమ అనుభవాలను చెప్పడం .....
ఒక్క క్షణం రచయిత్రి ఆత్మ అక్షరాలుగా  కనిపించి 
మన హృదయం తడి అవుతుంది.

కొని మంచి వాక్యాలు 

''భర్త దగ్గర భార్యకి ''నిశ్చింత''ఉండాలిరా ఆందోళన కాదు.....
కాని భర్తే ఒక సమస్యగా మారి ఆ పిల్ల ఆందోళన చెందకూడదు''

''చిరుగాలి ఆటలాడుతూ ధడెల్మని తలుపులు తోసుకొని వచ్చినంత 
స్వేచ్చగా ఇంట్లోకి రాగలిగేతేనే ......అది చక్కటి అనుబంధం అవుతుంది''

''నాన్నా  ఒక వ్యక్తి ని ఇష్టపడినపుడు,ప్రేమించినపుడు తర్వాతా
ఎన్ని ఇష్టం లేని కారణాలు బయటపడినా ఆ ఇష్టం  లో ఆ ప్రేమలో 
మార్పు రాకూడదు.ఆ ఇష్టం ,ప్రేమ ఇంకా పెరగాలట.
ఆప్పుడే ఆ ఇష్టం లేని కారణాలను మార్చుకొనే తాపత్రయం,
భరించే ఓర్పు పుట్టుకోస్తాయట.''

''నీ భార్య చెప్పేది పూర్తిగా విను ...
తనను పూర్తిగా గౌరవించు ....
తనను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూడు 
సంపూర్ణంగా ప్రేమించు....''

మనసుని హత్తుకొనే మల్లెల సువాసన లా ఎన్ని మంచి వాక్యాల కూర్పు.

ప్రపంచీకరణ నేపధ్యం లో పరుగులే అవసరం,స్వార్ధమే ముఖ్యం అనుకునే ప్రపంచం లో
బంధాల విలువులు తెలిసిన వారు చదివి తప్పక దాచుకోవాల్సిన పుస్తకం.

ఒక తరం వారు ఇంకో తరాన్ని ఆశీర్వదిస్తూ ఇవ్వవలసిన బహుమతి.

''నాన్న''పుస్తకం శైల బాల జీవితం లో ఒక చక్కని జ్ఞాపకం.

తన్నీరు శశికళ 

Tuesday, 23 April 2013

జీవితం పులి నోట్లో .......

last but not least ......a small sharing on ''life of pi''

''అమ్మా ....నీకు రెండు గంటలు టైం ఖాళీ ఉందా?'' రెండు రోజుల నుండి 
తన ల్యాపీ పట్టుకొని నా వెనుకే తిరుగుతుంది పాప.
మా పిల్లలకి ఏదైనా చూసినా,తెలుసుకున్నా నాతో పంచుకోవడం 
భలే ఇష్టం.ఇంటికి రాగానే వాళ్ళ నాన్న గారు నాకు చెప్పండి అని 
బ్రతిమిలాడినా చెప్పకుండా  నా కోసం వెతుకుతూ ఉంటారు.
ఇదంతా ఒక ఎత్తు వాళ్ళు చూపించినవి చూస్తూ ఉంటె మధ్యలో ''నచ్చిందా"
అని చెవిలో రొద.....వాళ్ళు అనుకున్నది నా కళ్ళలో ,నవ్వులో కనిపించాలి ...
అప్పుడు నచ్చిల్లా ....నీకు నచ్చిల్లా అని చిన్న పిల్లల లాగా సంబరపడిపోతారు.
''సరే చూపించు ''అన్నాను.
''అమ్మా ఇది లైఫ్ ఆఫ్ పై ......సినిమా''చెప్పింది.
''ఏమిటి ఇంగ్లీష్ సినిమానా?నాకేమి అర్ధం అవుతుంది.''
''అబ్బ అసలు డైలాగ్స్ తో పని లేదమ్మా ,నేను చెపుతాను చూడు ''
సినిమా మొదలు.


కధ లోకి వెళితే ''పికాసా పటేల్''అనే పదిహేనేళ్ళ బాబు ,తనను అందరు 
పై అని ఏడిపిస్తూ ఉంటారు.అతని అన్న రవి,అమ్మ ,నాన్న అందరితో కలిసి 
పాండిచ్చేరి లో జీవిస్తూ ఉంటాడు.వాళ్ళ నాన్నకు అక్కడ జూ ఉంది.
అందరి పిల్లల లాగే రాత్రి అమ్మ వళ్ళో వెచ్చగా పడుకొని ''కృష్ణుని కధలు''
దేవుని కధలు చెప్పించుకుంటూ పెరుగుతాడు.కాని వాళ్ళ నాన్న వాస్తవం 
లో బ్రతకమని చెపుతూ ఉంటాడు.
ఎందుకో 'ఫై' కి వాళ్ళల జూ లో ఉండే పులి అంటే చాలా ఇష్టం.దానికి ఒక సారి 
మాంసం చేతిలోకి తీసుకొని చేయి బోనులో ఉంచి తినిపించబోతాడు.
సమయానికి వాళ్ళ నాన్న వచ్చి అరుస్తాడు.కాని పులి కళ్ళలో ఆత్మ కనిపించింది 
....నన్నేమి చేయదు అని చెపుతాడు.వాళ్ళ నాన్నపులి , మేక ను ఎలా తింటుందో చూపిస్తాడు.
బాబోయ్ ఎలా తింటుందో అని భయపడ్డాను.కాని చూపించలేదు.నాకు సినిమా 
చూడటం లో ఇబ్బంది లేకుండా పాప చపాతీలు కూడా చేసి తెచ్చి తింటూ చూడు 
అని చెప్పింది.అమ్మాయిలను కంటే సుఖమే సుమా.

వాళ్ళు జంతువులు  అన్నీ తీసుకొని సముద్రం లో ఓడ పై కెనడా బయలుదేరుతారు.
దారిలో పశ్చిమ సముద్రం లో తుఫాన్ వచ్చి ఓడ మునిగి పోతుంది.ఆ బాబు లైఫ్ బోట్ 
లో చేరుతాడు.అమ్మా ,నాన్న ,రవి అందరు చనిపోతారు.కాని కధ ఇక్కడే ప్రారంభం.

బోట్ లో అతనితో పాటు జీబ్రా,కోతి చేరుతాయి.ఉన్నట్లుంది హైనా వచ్చి వాటిని చంపేస్తుంది.
బాబు అదిగో ఆ బోట్ లో తెల్ల షీట్ మీద  ఉంటాడు.దానిని జంతువులూ ఎక్క లేవు 
కాబట్టి పాపం బ్రతికిపోతాడు.చూస్తూ ఉన్నాను.''అమ్మ బయపడ వాకు ,ఇప్పుడు పులి 
వచ్చి దాన్ని తినేస్తుంది''....అంతే ధబీమని పులి బోట్ లో క్లాత్ కింద నుండి వచ్చి 
తినేస్తుంది.ఉలిక్కి పడ్డాను.ఇక అప్పటి నుండి పులి లోపలి వెళితే బాబు బోట్ లోకి 
వస్తాడు.బోట్  చివరి నుండి క్లాత్ తీసి ఫుడ్ తీసుకొని వెనుక చిన్న తెప్ప చేసుకొని 
దానిలో ఉంటూ ,దానిలో ఇన్స్త్రక్షన్స్ బుక్ ప్రకారం వాన నీళ్ళు పట్టుకొని .......
బోట్లో కెళితే పులి భయం,కింద షార్క్ ల భయం .........పాపం తిండి లేదు,
కంటి నిండా నిద్ర లేదు .....అయ్యో అనిపించింది.


సరే మనం అయితే బిస్కెట్స్ తింటాము.పులి తినలేదు కదా ....పోనీలే 
చచ్చి పోతుంది అనుకున్నాను.కాని ఆ బాబుకి మొదటి నుండి అది అంటే 
ఇష్టం కదా .....దానిని బ్రతికించడం కోసం ఒక చేపను పట్టి ముక్కలు చేస్తాడు.
మళ్ళా అయ్యో జీవ హింస చేసాను అని ఏడుస్తాడు.నిజంగా మన జీవితం లో కూడా 
ఎందుకో మనం తెలీకుండా గుడ్డిగా నమ్మి చెడ్డ వాళ్లకి సాయం చేస్తుంటాము.
ఎందుకు అభిమానం అంటే చెప్పలేము.అలా మాంసం వేసేటపుడు విజిల్ 
ఊదుతుంటాడు.అలాగా వాడు విజిల్ ఊదితే అది బయటకు రావడం నేర్చుకుంటుంది.

మధ్యలో ఒక దీవి మీదకు చేరుకుంటారు కాని అది మనుషులు ఉండేది కాదు.
దాని లో ఉడుతలు లాగా భలే ఉన్నాయి.''ఐస్ ఏజ్ ''సినిమాలో కూడా వీటి డాన్స్ 
నాకు భలే నచ్చింది.ఇంకా దీవిలో రాత్రి పూట వెలిగే పూలు పూస్తూ ఉంటాయి.
ఇక్కడ ,తిమింగలం నీళ్ళ పైకి ఎగిరే దగ్గర త్రీ డీ ఉంటె బాగుండును అనిపించింది.

అలాగా కొద్ది రోజులకు పులి బలహీన పడి వాడికి మచ్చిక అవుతుంది.
ఎంత అంటే దాని తల వళ్ళో పెట్టుకునే అంత ......




చివరికి వాళ్ళు ఒక దీవికి చేరుకుంటారు.చిత్రం దీవి లోకి దిగగానే పులి ఆ బాబు 
వైపు కూడా చూడకుండా అడవి లోకి వెళుతుంది.ఒక్క సారి అయినా తన మీద 
ప్రేమతో తిరిగి చూస్తుంది ఏమో ......అని చూస్తూ ఉంటాడు .......కాని ఆ బాబు 
నమ్మకం తో దానికి పని లేదు.తిరిగి చూడకుండా వెళిపోతుంది .
తరువాత అతనిని కాపాడిన వాళ్లకి పులి గూర్చి చెప్పినా నమ్మరు.వేరే కధ 
చెప్పి అక్కడే ఉండి  పోతాడు.
సినిమా మొత్తం ఫ్లాష్ బాక్ కాబట్టి మనం కధలో సీరియస్ గా లీనం అయితే 
అక్కడ బ్రేక్ అయిపోతుంది.కాని ఎందుకో అలాగ తీసారు.సినిమా బాగుంది.

 ఆ పులి చంపాలి అనుకుంటుంది.చంపలేదు.వాడు చిక్కడు.
కాని దాని పై జాలి.ఇదంతా చూస్తే నాకెందుకో సాదారణ పౌరుడు ,ప్రభుత్వం 
గుర్తుకు వచ్చాయి.సగటు మనిషి ప్రభుత్వం పెంచే ధర లు మధ్య దానిని 
చంపలేడు.తానూ బ్రతకలేదు.క్షణం క్షణం బ్రతుకు భయం.సంపాదించేది 
నలుగురు ఉండే ఇంట్లో ఏ మూలకి ......ఈ పెరిగే ధరల్లో .

Wednesday, 10 April 2013

జన్మలు ఉన్నాయా?

''న్యూటన్ ఇలా రా "
మెడిసెన్ కోచింగ్ కోసం చేరిన అక్క ,ఫ్రెండ్స్ అందరు ఉలిక్కి పడి  చూసారు.
ఒక వేళ  ఈయన ఫిజిక్స్ లెక్చరర్ అయితే మాత్రం ఇలాంటి పేరు
పెట్టుకుంటారా?
తరువాత ఈ విషయాన్ని అక్క నాకు ఆశ్చర్యంగా చెప్పింది.
ఆయన విద్యానగర్ కాలేజ్ లోనే పని చేసేవారు కాని ,నేను ఆ కాలేజ్ లో
ఇంటర్ చదివేసరికే వాళ్ళు నెల్లూర్ వెళ్లి పోయారు ''కోరా కోచింగ్ ''సెంటర్
పెట్టుకొని.అప్పట్లో అది చాలా ఫేమస్.తరువాత దానిని రత్నం లో కలిపేసారు.



మళ్ళా ఆ న్యూటన్ అనే పేరు మెడిటేషన్ లోకి వచ్చిన తరువాత విన్నాను.
ఏదో పిరమిడ్ ఓపనింగ్ కి వచ్చారు అని.ఎప్పుడూ చూడ లేదు.
కాని జీవితం లో ఆ పేరు వింటూనే ఉన్నాను.వాళ్ళ కౌన్సలింగ్ గూర్చి
చెపుతూనే ఉంటారు కొంత మంది.
ఇదిగో ....ఈ రోజు వాళ్ళ మధ్య అనుభంధం గూర్చి ''సాక్షి ఫ్యామిలీ''లో
చదివి ,వాళ్ళను చూసి నిజంగా థ్రిల్ అయ్యాను.
ఎంత చక్కగా చెపుతునారో భార్యా భర్తల భంధం గూర్చి .....
నిజమే మన పార్టనర్ ని చూస్తె వీళ్ళను వదిలి ఉండాలేము ఏమో  అనిపిస్తూ ఉంటుంది,
అది కాని జన్మ జన్మ ల బంధం అయితే .....

(న్యూటన్ శ్రీ లక్ష్మి గార్ల ఇంటర్వ్యు లింక్ ఇక్కడ )