Monday, 17 June 2013

ఆలు లేదు ... చూలు లేదు ...


 ఆలు లేదు ... చూలు లేదు ... కొడుకు పేరు సోమ లింగం :)
నిజమేనా ? ఇంకా పుస్తకమే బయటకు రాలేదు కదా దాని గూర్చి వ్రాస్తే 
ఇలాగే ఉంటుందా ?కాదు లెండి . ఆలు చూలు ఉన్నాయి . ఇదిగో క్రింద వ్రాసిన ముందు మాట 
సారంగ బుక్స్ వారి ముందు మాట  చూడండి .  
రాజిరెడ్డి అనే పేరు కేవలం వొకానొక పేరు కాదని ఇప్పుడు మనకు తెలుసు. ఆ సంతకం పైన కనిపించే వాక్యాలు కూడా సాదాసీదా వాక్యాలు కాదనీ తెలుసు. రాజిరెడ్డి చిరు వచన దరహాసాన్ని “పలక-పెన్సిల్” పుస్తక రూపంలో సారంగ బుక్స్ ద్వారా త్వరలో మీకు అందించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ ఏడాది సారంగబుక్స్ ద్వారా వెలువడుతున్న తొలి పుస్తకం “పలక-పెన్సిల్”. ఆ పుస్తకం నించి వొక మెచ్చుతునక మీ కోసం!

(saranga ku link ikkada )

ఎవురబ్బ ఈ రాజి రెడ్డి
నేను మాత్రం చూసానా ఏమిటి
సాహిత్యాభిమానిని కాబట్టి అక్షర రూప
పరిచయం .

ఏమి ఉంటుంది ఈ పుస్తకం లో ?
లింక్ లోకి వెళ్లి చూస్తే అర్ధం అవుతుంది .
కాని ఒక్క రెండు మాటలు కాదు లెండి కొన్ని
కబుర్లు చెపుతాను . అప్పుడు మీకు ఈ
పుస్తకం చదవాలి అనిపిస్తుంది .

మళ్ళా ఇంకో సారి అదే ప్రశ్న .... ఎవురబ్బ ఈ పూడూరి రాజిరెడ్డి ?

ఒక సారి రెండేళ్ళ క్రితం ఫండే లో పదాలు పెదాలు చదువుతూ ఉన్నాను .
ఎందుకో ఒక వాక్యం దగ్గర మనసు ఆగిపోయింది . అది ఒక తండ్రి ,బాబు
ఆడుకొనే దాగుడు మూతలు . అది ఆట కంటిన్యు చేయమని చెబుతున్నాయి 
వాడి కళ్ళు నవ్వుతూ .... మరి ఆ స్పృహ నాకెందుకు లేదు అని . 
ఉలిక్కి పడ్డాను . నాకు ఇలాంటి భావాలే వస్తూ ఉంటాయి .
ఎలాగు అభినందించడం లో నేను చాలా హుషారు కాబట్టి బాగుందని మెయిల్
చేసాను . పాపం ఆయన మొహమాటానికి మీకు ఇంట్రస్ట్ ఉంటె నా బ్లాగ్
చూడండి అని లింక్ ఇచ్చారు .
అసలు బ్లాగ్ అంటే తెలీని నాకు అప్పుడు ఒక కొత్త  ప్రపంచం
ఇది మంచి మాధ్యమం నా రచనా సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి అని అనుకోని
బ్లాగ్ మొదలు పెట్టి దేవుని దయ వలన ఇప్పటి దాకా అందరు మంచి ఫ్రెండ్స్
సహాయంతో కొనసాగిస్తున్నాను . పాపం ఆయనకు తెలీకుండానే నాకు
లింక్ ఇచ్చి సహాయం చేసారు కదా అందుకు థాంక్స్ కూడా వ్రాసేశాను .

ఒక పాటకురాలిగా నాకు రచయిత తో పని లేదు . నన్ను హంట్ చేసే అక్షరం ,
దానిని ప్రయోగించడం లోని సొగసు ,చివరలో మనసులో ఉప్పొంగే మంచి
భావన ఇవి కావాలి .
అసలు ఈయన ఏమి వ్రాస్తాడు ? మా బాబు అడుగుతుంటాడు.... ఎముందమ్మ
దీనిలో అన్ని సార్లు చదువుతావు ,నిజమే ఏమి ఉండదు , ఉత్తినే మనం
రోజు చూసేవే వ్రాస్తాడు . ఏముంది లే  దీనిలో అనుకొనే లోపు ఏదో ఎమోషన్
మనలను ఎక్కడో టచ్ చేస్తుంది . రచయిత  మహా మాంత్రికుడు సుమండీ . 
ఆయన హిడన్ అజండా లు ''పలక -పెన్సిల్ '' లో దులిపాడంట .
మనకెందుకు అనుకుంటాము . మన లోవి గట్టిగా దాచుకుంటాము ఎక్కడ
జారి అందరు ముందు పడిపోతాయో అని .... ఆయన కొబ్బరి బొండం త్రాగితే
మనకేమి లేకుంటే మనకేమి అనుకుంటాము . ఇంతలో ఎక్కడో మన త్రాగలేక పోయిన
కోక్  గుర్తుకు వచ్చేస్తుంది . ఆయన దస్తి కుడి జేబులో పెట్టుకుంటే ఏమిటి ?
ఎడమ జేబులో పెటుకుంటే ఏమిటి అనుకుంటాము ... ఇంతలో మనం
జంకుగా ఎదుర్కున్న ఫైవ్ స్టార్ హోటల్ గుర్తుకు వస్తుంది .
ఎత గట్టిగా పట్టుకున్నా ఇద్దో ఈయన గమ్మత్తు ముందు మొత్తంగా
మన హిడన్ అజెండా బయట పెట్టీ పెట్టక నువ్వు నా తమ్ముడివి ,ఫ్రెండ్ వి
ఇలాగా అక్షర రూపం లో ఆయనను ఏదో ఒక రూపం లో హత్తుకుంటాం
ఆత్మీయంగా ...... ఇంతా మాయ చేసి అమ్మకు నోరు చూపించిన కృష్ణుడి
మల్లె మన నోరు తెరిపించి ,స్వేచ్చగా బ్రతకడం ఈ జన్మ లో నాకు రాదు
అని మన పుస్తకాల రాక్ లో ఆత్మీయంగా బందీ అయిపోతాడు . 

నిజానికి నాకైతే ఈయన వ్రాసిన వాటి లో ఓన్ చేసుకొనేవి ఏమి లేవు ...
నేను మహా ధైర్యం ..... అదిగో ఒక్కటి ఉంది . రోజు పక్కేనే వెళ్ళే
ఇంట్లో మామిడి చెట్టు కూడా చూడక పోవడం .
ఇలాటివి నాకు స్కూల్ లో బొలెడు . మీటింగ్ లో నేను అక్కడే ఉన్నా
సమన్స్కురాలినై ఉండనని మా స్తాఫ్ఫ్ మొత్తానికి తెలుసు .
అందుకే ప్రిన్స్ పాల్ పది సార్లు అయినా అడుగుతుంది ''శశి ఏమి చెప్పానో
చెప్పు '' అని ...... సరే ఈయన వ్రాసేవన్నీ బాగుంటాయా అంటే ......
కొన్ని ఉంటాయి అండి  మా వరకు బియ్యం మధ్యలో నల్ల రాళ్ళు లాగా ....
ఎలా ఉంటాయి అంటే
''నాకు మాత్రమె నూట రెండు మంది ప్రియురాళ్ళ మినహాయింపు ఉండొద్దా ''
అంటాడు . దీనిని ఇప్పుడు మేమెలా జీర్ణించుకోవాలి . కూసింత తల తిప్పెసుకొని
నవ్వుకుంటూ సగటు భారతీయ స్త్రీల గౌరవం పెంచేస్తూ ముందుకు వెళ్లిపోతాము .

అది ఎలాగా అంటే ..... ఇప్పుడు స్కూల్ లో పిల్లలు ఫంక్షన్స్ అప్పుడు డ్యాన్స్
వేస్తుంటారు . మేము ఉంటె సినిమా పాటలు ఎంజాయ్ చేయ లెరు.
ఈలలు ,చప్పట్లు ఉంటేనే వాళ్లకు తృప్తి . చేసేదేముంది వాళ్ళ వయసు ముచ్చట
గౌరవించి మేము నవ్వుకుంటూ తల తిప్పేసి దూరంగా వెళ్లి పోతాము .
అలాగని శృతి మించితే భాద్యత తో కూడిన మా దండం దశ గుణం భవేత్
ఎలాగు ఉంటుందని వాళ్లకు కూడా తెలుసు .
మనలో మాట ఈయన గురు కులం లో నా స్టూడెంట్ అయ్యుంటే ఎంత బాగుండును .
మరి నా శిష్యులలో ఎన్నో ఉద్యోగాల  వారు ఉన్నారు కాని రచయితలు లేరు :(
 నిజంగా నా శిష్యుడు అయి ఉంటె బాగా వ్రాసినా ఆయుక్షీణ  భయంతో పొగడకుండా
''బడుద్దాయి ఏమిటా ఇంగ్లీష్ తెలుగు కలిపిన బాషా సంకరం '' అని తృప్తిగా
తిట్టి ఉండేదాన్ని . టీచర్స్ నాలుక కరుకు అయినా..... ఆశీస్సు నిష్కల్మషం
సుమండీ .
ఇంకో మాట ఈయనకి ఈయన వ్రాసినవి మనం చదువుతుంటే మన ముఖ కవళికలు
ఎలా ఉన్నాయో చూడాలి అని ఉందంట .... నాకైతే నేను పై వాక్యం లో
వ్రాసిన తిట్టు ని ఆయన చదివితే ఎలా ఉంటాడో చూడాలి అని ఉంది ....
ఎందుకంటె మంచులో తడిసి వెచ్చని సూర్య కిరణాలకి విప్పుకొనే
తెల్లని నంది వర్ధనం ఎలా ఉంటుందో ..... హృదయానికి ఆత్మీయత తగిలినపుడు
పెదాలపై విరిసే నవ్వు ఇంకా స్వచ్చంగా ఉంటుంది . ఏమంటారు ?

ఖచ్చితంగా ఆ బుక్ నా చేతులు తాకగానే దాని సమీక్ష నా బ్లాగ్ లో రేకులు
విప్పుతుంది చూడండి :) 

No comments: