Friday, 30 August 2013

నా జీవితపు కలాం కల నేరవేరిందోచ్చ్ :)))))))))))))))))))


రైలు కిటికీల నుండి బయట కనపడే చీకటి చూస్తున్నాను . 
మనసులో ఏదో ఆనందం ఎప్పటి కల ..... అసలు నిజం అవుతుందా అని 
ఊహించని కల ..... నిజంగా మనసు చాలా హుషారుగా ఉంది . 
ఎనిమిది మంది హై స్కూల్ఆడ పిల్లలు వాళ్లకు ఎస్కార్ట్ గా నేను నెల్లూరు జిల్లా 
నుండి . వాళ్లకు ఎస్కార్ట్ కి ఎఫిషియెంట్ టీచర్ కావాలి ,నాకు కలాం గారిని 
చూడాలనే కల నిజం కావాలి . పలితం ఇదిగో ఈ పిల్లలతో హైదరాబాద్ కు 
ప్రయాణం . పిల్లలకు చాలా హుషారుగా ఉంది రైల్ ప్రయాణం . ఒక్కరు నా స్కూల్ 
మిగిలిన వాళ్ళు వేరే స్కూల్స్ . వీళ్ళకు కలాం గారి గొప్పదనం పరిచయం చేస్తే 
ఎంత గొప్ప వ్యక్తిని కలుసుకొనే అవకాశం వచ్చిందో తెలుస్తుంది ,ఈ రోజు ఆంధ్ర జ్యోతి 
నవ్య లో ఆయన గూర్చి బాగా వ్రాసారు . పిల్లలలో చిన్నపాటి ఆలోచన వేసే 
అవకాశం వచ్చినా వదులుకోవడం నా టీచర్ వృత్తికి చేసే ద్రోహమే . చెప్పి 
వాళ్లకు ఇచ్చాను .చదువుతూ  చర్చించుకుంటూ ఉన్నారు . ఈయన అన్నం 
తిన్నాడా ?ఫోన్ చేసాను .నా సంగతి నీకు ఎందుకు ?నీ కల నెరవేరుతుంది 
కదా ... టకామని ఫోన్ పెట్టేసారు . ఏమి చేద్దాము .కొన్ని సార్లు మన మనసు 
తెలుసుకోవాలి అంటే అవతలి వాళ్ళు అచ్చంగా పిల్లలు అయిపోవాలి . ఆ కుతూహలం ,
పెదాలపై విరిసే నవ్వు ,సంతోషం తో మోగే చప్పట్లు ..... కావాలి పిల్లలుగా . 

పాపా కలాం గారిని చూసే అవకాశం వచ్చింది అనగానే మా పాప 
''సూపర్ మా వదులుకోవాకు . అసలు నువ్వు ఎస్కార్ట్ వెళ్ళడం ఆ పిల్లలు చేసుకున్న 
అదృష్టం '' అనింది . బాబుకు చేసాను '' మా అది నా డ్రీం మా .నువ్వు నిజం చేసుకుంటున్నావు . 
నిజంగా నువ్వు గ్రేట్ మా ''అన్నాడు . 
ఇంకా మా తమ్ముడు కూతురు అయితే ''అత్తమ్మా ముందు చెప్తే నేను వచ్చేదాన్ని ''
అని బాధపడింది . పిల్లలకు బాగానే అర్ధం అవుతుంది .... పెద్దలకే .ఎందుకు ఫీలింగ్స్ ని 
చంపుకుంటారు . పిల్లలవి బలహీనమైన వోట్లు .ఇంట్లో చెల్లవు . అందుకే ఇరవై రెండేళ్ళు 
కాపురం లో ఎప్పుడూ ఉపయోగించని భార్య అనే వీటో పవర్ ఉపయోగించి .... కొంచెం 
మనసు కష్టం గానే బయలుదేరాను . నా లైఫ్ స్పాన్ లో నాతో జీవించి ఈ దేశం కోసం 
ఉన్న ఒక విజన్ ని చూడటానికి .... ఆ లైటనింగ్ కాండిల్ నుండి కొంత అయిన వెలుగు పొందటానికి . 
                                                                @@@@@ 
సెక్రటరీ గారు ఎక్కడా రాజీ పడకుండా రెండు లక్షలు  ఖర్చు పెట్టి మరీ గౌలి దొడ్డి స్కూల్ 
లో మంచి స్టేజ్ ,భోజనాలు అన్నీ సూపర్ గా అరేంజ్ చేయించారు. ''వేదిక మీద పెద్ద అక్షరాలతో 
''Infinite sermon to swaroes'' మెరిసిపోతూ స్వరోస్ అంటే ఎత్తుకు ఎగరాలి అని ... 
మా సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ గారు మా పిల్లలకు ఆ పేరు పెట్టారు . మూడో జోన్ కి సరిగ్గా 
వేదిక ఎదురుగానే సీట్స్ ఇచ్చారు. మా ముందు ఉండే సోఫా వెనుక గా నిలబడి 
దూరంగా మోగుతున్న స్వాగత బాజాలు వింటూన్న అందరిలో ఏదో ఉత్సాహం ,
చాలా చాలా .... అదిగో ''స్వారోస్ టవర్ ''ఫౌండేషన్ స్టోన్ వేసి కలాం గారు వస్తూ ఉన్నారు . 
నేను మొదటి వరుసలో సోఫా వెనుక నిల్చొని కమెరా తీసి ఆయన రెడ్ కార్పెట్ మీదకు 
వస్తూనే తీద్దాము అని నిలోచొని ఉన్నాను . పిల్లలు ,పెద్దలు అందరిలో ఏదో ఉత్సాహం 
చప్పట్లే చప్పట్లు . న పక్కనే మొత్తం మీడియా కెమరాలు షూట్ చేస్తూ కలకలం . 

అదిగో వచ్చేసారు . చూస్తూ ఉన్నాను కలా ,నిజమా ?ఎనబై చిల్లర వయసు . 
నేరుగా వచ్చి నా ముందు సోఫాలో కూర్చున్నారు . పక్కన సెక్రెటరీ గారు . 
నా ముందు ఆయన .యెవరిని చూడాలి అని ఇన్ని కష్టాలు ఓర్చుకొని వచ్చానో 
అయన . నా చేతిలో కెమరా చూసి ప్రెస్ అనుకున్నారో ఏమో అక్కడ సెక్యురిటీ కూడా 
ఏమి అనలేదు . అలాగే నిల్చొని చూస్తూ ఉన్నాను  . మనసు లో నుండి 
ఎక్కడో '' హీ ఈస్ దేర్'' హెచ్చరిస్తుంది చూడమని . చూస్తున్నాను .కాని 
తెలీడం లేదు .ఉన్నట్లుండి నేను  రెండుగా విడిపోయిన ఫీలింగ్.... ఏమిటో అది 

ఆయన స్టేజ్ మీదకు వెళ్లి ఆంకరింగ్ చేసిన పిల్లలను అభినందించారు . మెల్లిగా 
మొదలైన ఆయన మెసేజ్ ''బాగున్నారా?'' అడిగారు . తెలుగు అనగానే అందరికి 
సంతోషాల వెల్లువ . ఆపకుండా చప్పట్లు . చిన్నగా మొదలైన వాక్ప్రవాహం మెల్లిగా 
చిన్న పద్యాలుగా పలికిస్తూ ,మురిపిస్తూ ,నవ్విస్తూ వ్యక్తిత్వ మార్పుకు 
మాకు తెలీకుండానే శ్రీకారం చుట్టిస్తూ హృదయం కదిలిపోతుంది అందరికి . 
పెద్దలు , పిల్లలు అందరు ఆయన ఏమి పలకమంటే అది హుషారుగా పలుకుతూ ... 
 ''Iam born with potential 
Iam born with goodness 
Iam born with confidence 
so Iam not ment for crawling 

bcoz I have wings
I will fly .... I will fly ....I will fly ''

''I enjoy my neighbours victory also '' 
what a man .... man of misson ....man of vision 
......which I felt a great opportunity that god gave for me. 
thank you god . 

అగ్ని లో  ఏదైతే ఎనెర్జీ పొందానో అదే ఎనెర్జీ నిరంతరంగా అందరి హృదయాలలో 
ప్రవహిస్తూ . నేను గర్వంగా చెప్పగలను నేను చూసాను ''తన కోసం 
మాత్రమె కాక ఒక దేశం కోసం తపిస్తూ కొట్టుకునే గుండెని '' 
తరువాత అంతా మౌనంగా ఉండటమే నేను చేసింది . ఎందుకో నాకే తెలీదో 
ఒక్కో సారి అనంతమైన సైలన్స్ లోకి వెళ్లి పోతాను . నాకే తెలీకుండా . 
                                              @@@@@@@@@ 

పక్క రోజు ఖాళీ . రాత్రికి ట్రైన్ .ఫ్రెండ్ కి చేసాను . నేను దారి చెపుతాను రండి 
అంది . ఒక్క దాన్ని వెల్లడమా ... చూద్దాము . ఇప్పటికైనా ప్రపంచం తెలుసుకోక పోతే 
ఎలా . ఆఫీస్ కి వెళ్లి మేడం కోసం చూస్తూ రిసిప్షన్ లో కూర్చున్నాను . నేను వచ్చాను 
అనేది నాకే కల లాగే ఉంది . లేకుంటే ఇంతకు ముందు కలలో వచ్చానో ?
మేడం వచ్చారు . ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని ఆఫీస్ అంతా చూపించారు , 
తన కొలీగ్స్ ని పరిచయం చేసారు . కాలం తో పరుగులు పెడుతూ సెకన్ల కు 
కూడా విలువ ఇవ్వాల్సిన ఉద్యోగాలు అర్ధం అయింది . అందరు సిస్టం ల ముందు కూర్చొని 
బుర్రను కొద్దిగా దానికి కలిపి కుస్తీ పడుతున్నారు . మేడం నన్ను పరిచయం చేయగానే 
కొని సెకన్లు త్యాగం చేసి నన్ను పలకరించడం ,చిరు నవ్వు ,కొంచెం కాఫీ ,టీ  
అంత పని వత్తిడిలో నా కిచ్చిన మనస్పూర్తి గౌరవంగా నేను ఫీల్ అయ్యాను . 
వాళ్ళ హెడ్ గారు కూడా నన్ను ఆప్యాయంగా పలకరించి అతిధి మర్యాదలు 
చేయడమే కాక గబుక్కున నా కప్ కూడా పక్కన పెట్టేసారు . తాగిన కప్పులు 
పక్కన పెట్టేంత సంస్కారం తనది . కాని ఇల్లాలిగా తన చేత చేయించినందుకు 
నాకు కష్టం అనిపించింది . కాని అది తన మీద వంద రెట్లు గౌరవాన్ని పెంచింది . 
అయితే ఇదంతా మా ఫ్రెండ్ తన చుట్టూ తన చిరు నవ్వుని ,చక్కని మనసు ని 
ఉపయోగించి చేసుకున్న స్నేహ పరిమళపు తోట . లేకుంటే చూడని నన్నే 
నా ఆకలి చూసి అన్నం తెచ్చింది . మాట వరసకు చెప్పాను మూడు రోజుల నుండి అన్నం సరిగా 
తినలేదు అని .... అంతే ఇంటి నుండి ఆకు పప్పు ,చిక్కుడు తాలింపు ,గుంత పొంగాలాలు 
పెరుగు అన్నం కొసరి కొసరి వడ్డిస్తూ ..... నా కైతే అవి తింటూ ఉంటె 
ఇంటి మీద బెంగ తన్నుకోచ్చేస్తూ ఉంది .బెంగ వచ్చేస్తే ఇక కోటి రూపాయలు 
ఇచ్చినా ఉండను . మా పుట్టింట్లో అయినా సరే . ఎమివ్వగలం అ ప్రేమకు బదులుగా 
''అన్న దాత సుఖీభవ ''అంతే . 
ఆ లిఫ్ట్ లో అన్ని అంతస్తులు ఎక్కడం దిగటం చూడటం ,ఎక్కడా ఆకాశమే కనపడదే . 
ఏమో గుహలో ఉన్నట్లే ఉంది . అంత కలగానే ఉంది కాని నా మోచేయికి 
రోడ్ మీద దాటే టపుడు ఆటో తగిలిన గాయానికి ఆ మేడం దగ్గర ఉంది 
ఫర్స్ట్ ఎయిడ్ చేయిస్తూ టించర్ వేయించారు చూడండి .... అప్పుడు చురుక్కుమని 
''అబ్బ '' మంట . హమ్మయ్య కల కాదు . 

బయటకు వచ్చినాక వాళ్ళ ఆఫీస్ చూసాను .... కింద నుండి పైకి . 
నాకు ఎలా ఉంది అంటే ''హనీ ఫాబ్ ''అవును తేనే పట్టు .యెవరికి వాళ్ళు 
పని చేసుకుంటూ .... పరుగులు పెడుతూ . వీళ్ళు అందరిని సమన్వయం చేస్తూ 
హెడ్స్ ఉన్నట్లే తేనే పట్టు లో కూడా ఆ ఈగల మధ్య సమన్వయము చేయడానికి ఎవరు ఉంటారో ? 
నోటీస్ బోర్డ్ లో చూసాను .యెవరికొ ''RIP'' .తప్పదు అలా క్షణాల్లో పరుగులు 
పెడుతుంటే .... పని వాళ్ళు కంపనీ ను గుర్తుంచుకుంటే .... పై వాళ్ళు 
కింది వాళ్ళ ఆరోగ్యాన్ని ఆహారాన్ని గుర్తుంచుకోవాలి . లేకుంటే స్కిల్డ్ హాండ్స్ ని 
వాళ్ళు కోల్పోతారు . ఎందుకంటె సిస్టం లను కొనగలం కాని వాటిని పని చేయించే 
స్కిల్ ని కొనలేము ఎన్ని కోట్లు పోసినా . ఒక సంస్థకు వాళ్ళ నమ్మకమైన 
ఉద్యోగుల కంటే ఆస్థి ఇంకేమి ఉంటుంది . 
                                             @@@@@@@@@@ 
తిరుగు ప్రయాణం లో నాలుగు రోజుల కోసం నా వొడిలోకి చేరిన ఎనిమిది 
చిన్ని గువ్వలు నన్ను విడి పోలేక ఏడుస్తుంటే ఏమి చేసేది ?జీవితం 
లో ఇవన్నీ మామూలే .... ఈ జ్ఞాపకాలతో ముందుకెళ్లాలి అని చెప్పి 
వాళ్ళలో నేను వేసిన విత్తనాలు మొలకెత్తి దేశానికి సౌభాగ్యాన్ని 
చేకూర్చాలి అని దేవుడిని వేడుకోవడం తప్ప . 


Wednesday, 21 August 2013

నా పరిచయం ''జాజి మల్లి గారి ''బ్లాగ్ స్పాట్ లో

నా పరిచయం ''జాజి మల్లి గారి ''బ్లాగ్ స్పాట్ లో 

కాకుంటే తన్నీరు శశి ... పన్నీరు కాదు :)
నా మనసు చూసి వ్రాసున్తరేమో మల్లీశ్వరి గారు 
(ఇలా ఊహిస్తే బాగుంది కదా )

మల్లీశ్వరి గారికి బోలెడు థాంక్యులు 

(link ikkada)


Sunday, 18 August 2013

జగద్గురువు ఆయన

ఈ రోజు మధ్యాహ్నం స్కూల్ లో డ్యూటీ చూసుకొని రెండప్పుడు 
బస్స్టాండ్ పక్కగా వస్తూ ఉన్నాను . చూడగానే భలే సంతోషం . 
150 సంవత్సరాలు నిండిన సందర్భంగా ''వివేకానందుని రధ యాత్ర''
అసలు నేను డ్యూటీ చూసుకొని వచ్చేదాకా ఉండదు అనుకున్నాను . 
వెంటనే పుస్తకాల వ్యాన్ వద్ద వాలిపోయాను .యెవరికైనా ఇవ్వాలి అంటే 
చిన్నబుక్స్  ఇస్తాను . నేను ఇచ్చిన పుస్తకాలు పిల్లలు అపురూపంగా దాచుకుంటారు . 
 ఈ సోషల్ వెబ్సైట్ ల కాలం లో అక్కడ ఎవరూ కొనే వాళ్ళు ఉండరు అనుకున్నాను . 
కాని చక్కగా ఎంత మంది యువకులు ,పెద్ద వాళ్ళు ..... హమ్మయ్య 
పెద్దవారిని గౌరవించడం , పక్క వారిని ప్రేమించడం ,మన దేశానికి వారసులుగా 
నిలవడం .... బ్రతికి ఉంది మనలో ఇంకా భారతీయత . వివేకానందుని పేరు 
గౌరవింప బడుతున్నంత కాలం మన యువకుల వెన్నెముక లు 
దేశానికి బలంగా ఉంటూనే ఉంటాయి . ప్చ్.... అమ్మాయిలూ ఎవరూ 
కొనేవాళ్ళు లేరు . ఒక స్త్రీ చక్కటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే ఎన్ని తరాలు 
ప్రభావితం చేయగలదు . ఎందుకో దీనిపై ఎవ్వరూ పెద్దగా దృష్తి పెట్టరు. 


 వరలక్ష్మి వ్రతం రోజు వేరే సినిమాకి అనుకోని ఈ హాల్ దగ్గరికి రాగానే 
దానిలోకి వెళ్ళిపోయాను . డైలాగ్స్ భారవి అనగానే ఒక ఎక్స్పెక్టేషన్ 
''పరవశిస్తాము పల్లకీలు మోస్తాము అని ''ఇక రాఘవేంద్ర రావు డైరక్షన్ 
అనగానే కొంచెం సినిమాటిక్ గా తీసినా మంచి చరిత్ర అందరికి చేరాలి 
అంటే అలాగే తీయక తప్పదు . ఇంకా సాయిబాబా మత్తులో నుండి 
బయటకు రాలేదు నాగార్జున నటన నుండి . 
ముందు పాట  ఏమి పెద్దగా నచ్చలేదు . నేను కొంచెం దిగులులో ఉన్నాను . 
కాబట్టి కొంచెం సేపు ఈ సినిమాకి రాక పోయి ఉంటె బాగుండేది ఏమో 
అనిపించింది . రోహిణి అమ్మగా చాలా బాగా చేసింది . మెల్లిగా సినిమాలో లీనం అయిపోయాను . 
గ్రాఫిక్స్ ఒక్కో సారి పెద్దగా రుచించవు . కౌశిక్ చిన్నప్పుడే బాల సన్యాసిగా 
మారడం అందరి వద్ద వినయంగా జ్ఞానం నేర్చుకోవడం ముఖ్యంగా 
నాగార్జున కాటి కాపరిగా ఎదురు వచ్చే సీన్ ,శ్రీ హరి మాయ మాయ అనే 
పాట బాగున్నాయి . కెమరా చాలా బాగుంది . శంకరాచార్యుల కధ పెద్దది 
కాబట్టి రాయలేకపోయారో ఏమో కాని స్క్రిప్ట్ పెద్దగా నచ్చలేదు . 
పద్మ పాదుడు గురువు పిలవగానే నీళ్ళ పై పరిగెత్తే కధ  చూపించి ఉంటె 
శిష్యులు గురువు పై ఉండాల్సిన నమ్మకం అందరికి తెలిసి ఉండేది . 

శంకరాచార్యులు అంటే అందరికి  గౌరవం . నాకైతే ''భజ  గోవిందం ''ఎప్పుడూ 
పాడుకుంటూనే ఉంటాను . ఆయన మీద పెద్ద వివాదాలు కూడా లేవు .. 
రెండు తప్ప . 
సన్యసించినాక  తల్లికి తల కొరివి పెట్టాడు అనేది ఒకటి . 
నువ్వు సన్యాసివి కాని సంసారివి కాని ఈ దేహం అమ్మ తన రక్త మాంసాలతో 
చేసుకున్న కుండ . అది నీ వెంట ఉన్నంత కాలం దానిపై అధికారం తల్లిదే . 
దానికి వివరణ చెప్పించడం బాగుంది . 

రెండోది మండన మిశ్రుడి భార్య  కామ శాస్త్రం లో సందేహాలు అడిగితే 
రాజులో పరకాయ ప్రవేశం చేసి సంసార సౌక్యాలు అనుభవించాడు అన్నది . 
ఉభయ  భారతి గారు ఎంత గొప్ప జ్ఞానో ఆమెను సభకు న్యాయ నిర్ణేత గా 
ప్రకటించినపుడు ఆమె మహిమ గల మాలలు వేసినపుడు ,తన 
భర్త అయినా సరే న్యాయంగా వ్యవహరిస్తున్నప్పుడు మనకు అర్ధం అవుతుంది . 
ఇది నిజం కూడా . అలాంటి వ్యక్తి భర్తను ఓడిస్తే చాలదు భార్యను ఓడించాలి 
అని అంతమంది  ముందుకావాలని  కామ శాస్త్ర ప్రశ్నలు అడగదు . 
మనకు కధ చదివితే తెలుస్తుంది ఆమె ఎంతటి జ్ఞాని అని . ముందు 
ముందు శంకరుడు గురువు గా ప్రకటింపబడి అన్ని శాఖలను ఒక్క
శాఖ గా మార్చి ఎన్నో పీటాలు స్థాపించి భారతీయ ఔన్నత్యాన్ని 
భుజాలపై మోయాల్సిన వాడు. అటువంటి వాడు చపల చిత్తుడైతే  
అతని జన్మకే అర్ధం ఉండదు . తన శరీర ఔన్నత్యాన్నీ ,సన్యాస 
మార్గాన్ని ఎలా కాపాడుతాడో చూద్దాము అని పెట్టింది అమ్మ పరీక్ష . 

శంకరులు కూడా తన శరీరపు ఔన్నత్యాన్ని కాపాడుతూ పరకాయ 
ప్రవేశం చేసి మాయలో పడకుండా తిరిగి వస్తాడు . కృష్ణుని కధలో 
చదువుతాము . ఆయనను గోపికలతో కృష్ణుడు బ్రహ్మచారి అయితే 
దారిమ్మని యమునని అడగండి అని . అలాగే యమున దారి ఇస్తుంది . 
కూరలో గరిట కు కూర రుచి ఎంత అంటుతుందో ... శంకరాచార్యుల 
వారికి అంటిన పాపము అంతే . మాయను జయించిన ఆయన కాక పోతే 
ఆ ''జగద్గురు ''బిరుదుకు అర్హత ఎవరికి ఉంది ? 

ఇంకో విషయం ఈ సినిమా ''ఓన్లీ ఫర్ యూత్ ''అంట . నిజమే మొన్న 
చాగంటి కోటేశ్వర రావు గారి ప్రసంగం లో విన్నాను . యువత చెడిపోతుంది 
అంటున్నారు . వారి తప్పు ఏముంది ,వారి చుట్టూ చెడ్డ నే అందుబాటులో 
ఉంది . మంచి విషయాలు మనసు నియంత్రణ ,వెళ్ళవలసిన మార్గము 
భారతీయ ఔన్నత్యము వారికి చెపుతున్నారా అని . ఏ తల్లి తండ్రులు 
ర్యాంకుల గూర్చి కాకుండా విలువలతో కూడిన జీవితం గూర్చి ,
ఇలాంటి మహనీయుల గూర్చి పిల్లలకు చెపుతున్నారో ఆలోచించుకోండి . 

పగిలిన కుండలు దేనికీ పనికి రావు . వెన్నెముక ,వ్యక్తిత్వము  
లేకుండా మీరు సమాజానికి ఇచ్చే పిల్లల వలన ఆ కంపెనీలు 
బాగుపడతాయి కాని లోకానికి మీరు ఇచ్చేది ఏమి లేదు . 
మూట లు దాచుకోవడం తప్ప ఒక మంచి కుటుంభాన్ని కూడా మీరు 
ఇవ్వలేరు . 
మీరు చేయలేని పని అదిగో నిస్వార్ధమైన వ్యక్తి ''కలాం ''గారు 
తన కలగా రూపొందించారు ''లీడ్ ఇండియా '' 
మూడు రోజుల కోచింగ్ ,ఆరు సెషన్స్ . పిల్లవాడి మనసులో 
విత్తనం వేయాల్నే గాని అది అతని దారినే మార్చివేస్తుంది . 
మీ పిల్లల స్కూల్స్ వారిని అడిగి పెట్టించి చూడండి . 
నా నలభై రెండేళ్ళు లోకాన్ని చూసిన వయసు , ఇరవై ఒక్కేళ్ళు 
టీనేజ్ పిల్లలతో సర్వీస్ లో ఉన్న కమిట్మెంట్ తో చెపుతున్నాను . 
విలువలు నేర్పించని తల్లి తండ్రులు పిల్లలను కనకూడదు . 
మన బాధ్యత మనం చేయాలి . అప్పుడే దేశం మంచి పౌరులతో 
విలసిల్లుతుంది . 

Wednesday, 7 August 2013

మది నిండిన సౌందర్యం

      
                                                                    
కధ కొంచెం ఉంది కదా . అది మళ్ళా వ్రాస్తాను . 
ప్రస్తుతానికి రవీంద్రుని తలుచుకుంటూ ఈ కవిత . 
ఇది ''కవి సంగమం ''లో ఇప్పుడే పోస్ట్ చేసాను . 
''కవి సంగమం '' అంటే ఫేస్బుక్ లో ఒక గ్రూప్ .  
  ఫేస్బుక్ లో దాదాపు పద్నాలుగు వందల మంది 
ఉండే ఒక గ్రూప్ .దానిలొ సాహితీ ప్రేమికులు తమ అక్షరాలూ 
పంచుకోవడానికి ,భావాలను పెంచుకోవడానికి వీలు ఉంటుంది . 
దీనిని ఒక మంచి ఆశయం తో స్నేహ పూర్వ వాతావరణం కల్పిస్తూ 
''యాకూబ్'' గారు చక్కగా నిర్వహిస్తున్నారు . దీని క్యాప్షన్ ఏమిటో 
తెలుసా ? 

''పచ్చటి చెట్టు నువ్వైతే పిట్టలు అవే వాలుతాయి ''
మరింకేమిటి మీరు  కూడా సాహితీ పక్షులు అయితే చక్కగా ఈ చెట్టు పై 
వాలి కువకువ లాడండి . ప్రస్తుతానికి ఈ కవిత చదువుకోండి . 

     మది నిండిన సౌందర్యం                8/8/2013       
                                                                    
దోసిలొగ్గి ఒక్కటే అడిగాను 
నా హృదయం నిండిపోయే సౌందర్యం కావాలి అని ... 
అలివికాని ఆరాటం తో సౌందర్యం కోసం పరుగు 
ఎక్కడ  నా హృదయపు ఆర్తి ని తీర్చే 
మౌన తపస్విని 
అదిగో కొండ కొమ్మ పై వాలిన మబ్బు సొబగులోనా 
లేత చివురు కుండే మత్తు ఎరుపులోనా              
అమ్మాయి మెడ వంపులోనా 
నది చుట్టే కొండ మలుపులోనా 
బోసి నవ్వులోనా 
మట్టిని తాకే తొలి చినుకులోనా 
మదిని ఒరుసుకొనే జ్ఞాపకం లోనా 
చిరునవ్వు వంపే మల్లెల జల్లు లోనా 
చెలి పలుకులోనా 
మధు పాత్రలోనా 
ఒక్క సారి తాకితే నా ఉనికే సౌందర్యం కావాలి 
ఎక్కడుందో ఇవ్వండి 
ఎన్నో సార్లు చాపి ఎన్నో కానుకలు అందుకున్న చేతులను చాపి 
రిక్త హృదయం తో ఆర్తిగా అడిగాను

చిరునవ్వుతో చేయి చాపి నా రిక్త హృదయాన్ని 
ప్రేమగా తాకిన స్పర్శ ..... 
ఒక్క సారి తనువెల్ల పులకరించి శాంతి సౌందర్య ఆవిష్కరణ 

ప్రభు బదులుగా నీకు ఏమి ఇవ్వగలను 
ప్రేమతో నిండిన ఒక చిరునవ్వు తప్ప .......  

             (రవీంద్రునికి అక్షరాంజలి )