Wednesday 7 August 2013

మది నిండిన సౌందర్యం

      
                                                                    
కధ కొంచెం ఉంది కదా . అది మళ్ళా వ్రాస్తాను . 
ప్రస్తుతానికి రవీంద్రుని తలుచుకుంటూ ఈ కవిత . 
ఇది ''కవి సంగమం ''లో ఇప్పుడే పోస్ట్ చేసాను . 
''కవి సంగమం '' అంటే ఫేస్బుక్ లో ఒక గ్రూప్ .  
  ఫేస్బుక్ లో దాదాపు పద్నాలుగు వందల మంది 
ఉండే ఒక గ్రూప్ .దానిలొ సాహితీ ప్రేమికులు తమ అక్షరాలూ 
పంచుకోవడానికి ,భావాలను పెంచుకోవడానికి వీలు ఉంటుంది . 
దీనిని ఒక మంచి ఆశయం తో స్నేహ పూర్వ వాతావరణం కల్పిస్తూ 
''యాకూబ్'' గారు చక్కగా నిర్వహిస్తున్నారు . దీని క్యాప్షన్ ఏమిటో 
తెలుసా ? 

''పచ్చటి చెట్టు నువ్వైతే పిట్టలు అవే వాలుతాయి ''
మరింకేమిటి మీరు  కూడా సాహితీ పక్షులు అయితే చక్కగా ఈ చెట్టు పై 
వాలి కువకువ లాడండి . ప్రస్తుతానికి ఈ కవిత చదువుకోండి . 

     మది నిండిన సౌందర్యం                8/8/2013       
                                                                    
దోసిలొగ్గి ఒక్కటే అడిగాను 
నా హృదయం నిండిపోయే సౌందర్యం కావాలి అని ... 
అలివికాని ఆరాటం తో సౌందర్యం కోసం పరుగు 
ఎక్కడ  నా హృదయపు ఆర్తి ని తీర్చే 
మౌన తపస్విని 
అదిగో కొండ కొమ్మ పై వాలిన మబ్బు సొబగులోనా 
లేత చివురు కుండే మత్తు ఎరుపులోనా              
అమ్మాయి మెడ వంపులోనా 
నది చుట్టే కొండ మలుపులోనా 
బోసి నవ్వులోనా 
మట్టిని తాకే తొలి చినుకులోనా 
మదిని ఒరుసుకొనే జ్ఞాపకం లోనా 
చిరునవ్వు వంపే మల్లెల జల్లు లోనా 
చెలి పలుకులోనా 
మధు పాత్రలోనా 
ఒక్క సారి తాకితే నా ఉనికే సౌందర్యం కావాలి 
ఎక్కడుందో ఇవ్వండి 
ఎన్నో సార్లు చాపి ఎన్నో కానుకలు అందుకున్న చేతులను చాపి 
రిక్త హృదయం తో ఆర్తిగా అడిగాను

చిరునవ్వుతో చేయి చాపి నా రిక్త హృదయాన్ని 
ప్రేమగా తాకిన స్పర్శ ..... 
ఒక్క సారి తనువెల్ల పులకరించి శాంతి సౌందర్య ఆవిష్కరణ 

ప్రభు బదులుగా నీకు ఏమి ఇవ్వగలను 
ప్రేమతో నిండిన ఒక చిరునవ్వు తప్ప .......  

             (రవీంద్రునికి అక్షరాంజలి )

No comments: