అంటే బుజ్జి పిల్లి అన్న మాట .
ఇప్పుడు మీకు ఒక మంచి కధ చెపుతాను .
నేను వ్రాసిందే . మీకు తప్పకుండా నచ్చుతుంది .
బుజ్జి పిల్లి పిల్ల . అప్పుడే పుట్టింది .
తల్లి పిల్లి మంచిది . బుజ్జి పిల్ల మంచిది .
అయితే ఆ అమ్మ పిల్లి నోటితో దానిని ఎత్తుకొని తీసుకుని పోతూ ఉంది .
అప్పుడప్పుడు కొంచెం కళ్ళు తెరిస్తే బుజ్జి మియావ్ కి కింద
దారి వెళుతూ ఉంటుంది . లేకుంటే వెనక్కి వెళ్ళే చెట్లు .
చిన్న పిల్ల కదా పూర్తిగా తెరవలేక కళ్ళు మూసేసుకుంటూ ఉంది .
మళ్ళీ తెరిచినపుడు కొంచెం తల ఎత్తి పైకి చూసింది .
మళ్ళా రెప్పలు ఆర్పి చూస్తే అమ్మ పిల్లి చెవుల చివర్లు ....
తెల్లటి చెవులు వెలుతురు పడి కొంచెం ఎర్రడాలుగా .
అది వాళ్ళ అమ్మని చూడలేదు . అది తనను ఎత్తుకుపోతుందని తెలీదు .
బుజ్జి పిల్ల మెల్లిగా శక్తి వస్తూ ఉంటె తోక ఊపుతూ చుట్టూ చూస్తూ ఉంది .
భలే ఉంది కదా ... కధ .
ఏమిటి నచ్చలేదా ?సరే ఇంకొంచెం చెపుతాను .
మెత్తగా ఉండే బుజ్జి పిల్లి పిల్ల ..... చిన్నగా మియాం అంటూ ....
వాళ్ళ అమ్మ దానిని నోటితో తీసుకొని పోతూ ఉంది .
చిన్న పిల్లి పిల్ల .... దానిని వాళ్ళ అమ్మ తీసుకుని పోతూ ఉంది . ఎక్కడికీ ?
నచ్చలేదా ?ఇంతే కధ .... ముగింపు కావాలా ?
అయ్యో ఇది నా కొత్త ప్రయోగం అండి . అన్నీ నేనే చెప్తే పాటకులు
ఏమి చేస్తారు ?ఓ కొడుతూ వింటారా .... వాళ్ళ బుర్రలకు పని ఉండొద్దా ?
అయినా నచ్చలేదా ?
ఇదే కధ మీ పిల్లల కు చెప్పండి . ఎంత నచ్చుద్దో !
ఒక బాబు అంటాడు ''బుజ్జి మియాం ని నా దుప్పట్లో పడుకోబెట్టుద్ది ''అని
ఇంకో పాప అంటుంది ''నా సైకిల్ బుట్టలో పెట్టడానికి ''అని
ఇంకో పిడుగు అంటాడు ''నా పుస్తకాల బ్యాగ్ లో పెట్టుద్ది . నేను మా
ఫ్రెండ్స్ కి చూపిస్తాను ''అని .... ఇంకా బోలెడు ఎండింగ్స్ చెపుతారు .
ఏమిటి ఇన్ని ఎండింగ్స్ ఉన్నా నచ్చలేదా ?మీ మేధావులతో ఇదే
తల నొప్పి .... మీకు నచ్చిన ఎండింగ్ చెపితే కాని మీకు నచ్చదు .
సరే ఇంకొంచెం చెపుతాను .
పిల్లి పిల్లకు కొంచెం శక్తి వచ్చింది . పరిసరాలు చూస్తూ ఉంది .
మెల్లిగా కుడి వైపు బద్దకంగా పంజా ఇసిరి కొట్టింది . చిత్రం కింద ఉండే
దారి కుడి వైపుకు వెళ్ళింది . అరె భలే ఉందే !అనుకుంది .
ఈసారి ఎడమకు పంజా విసిరింది . చిత్రం ఎడమకు వెళ్ళసాగింది .
కాసేపు ఎడమ కాసేపు కుడి ఇలాగా ఎన్నో సార్లు ప్రయోగాలు చేసింది .
అరె నాకు ఎంత శక్తి నేను ఎటు కావాలి అంటే అటు వెళ్ళగలను .
ఏమైనా చేయగలను !అనుకుంది . ఒక నిమిషం గమ్ముగా ఉంది .
చిత్రం అది ఏమి చేయకపోయినా ముందుకు వెళుతూనే ఉంది అని
గ్రహించింది . ఎడమ పంజా విసిరింది . అయినా చిత్రం ఎడమ వైపుకు కదలలేదు .
బిత్తర పడిపోయింది . అయ్యో నా శక్తి ఏమైంది ?అనుకుంది .
ఏమి చెయ్యాలి ? గమ్ముగా కూర్చుంటే ఏమైనా అవుతుందేమో .... అని భయం
వేస్తూ ఉంది . మళ్ళా ధైర్యం తెచ్చుకుంది . మెల్లిగా తల పైకి ఎత్తి
చూసింది . మెత్తగా తన నడుమును పట్టుకొని ప్రేమగా ముందుకు
చూస్తూ దృడంగా అడుగులు వేస్తూ ఏదో శక్తి ..... అర్ధం అయింది .
ఆకాశాన్ని అంటుతూ అంతటా నిండి నిబిడీకృతమైన ఈ శక్తి ప్రతిబింబ మైన
చిన్న అణువును నేను . నా ప్రమేయము నామ మాత్రమె .
సురక్షితమైన గమ్యానికి చేర్చగల శక్తి వడిలో ఊగే బుజ్జి పిల్లను నేను .
ఈ ప్రయాణాన్ని గమనిస్తూ ఆనందిస్తూ అనుభవాలని ,జ్ఞాపకాలను పోగు
చేసుకొని పరిపూర్ణ జ్ఞానం తో ఎదగడమే నేను చేయవలసినది .
అంటే అది చక్కగా అమ్మ స్పర్శను అనుభవిస్తూ తన శక్తి కి గర్వపడకుండా
చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఆనందం లో మునిగిపోయింది .
అరూపమైన ఇరుసులో నిలబడి చలించే ప్రాణికి గమ్యం తో పని ఏముంది ?
ప్రయాణం తో తప్ప ?
ఎక్కడికి వెళుతున్నామో అర్ధం అయితే ఆనందం .
అర్ధం కాక పోతే మహదానందం ..... ఇప్పటికైనా కధ నచ్చిందా ?
మనలో మాట గణపతి స్వామీ ''రమణి మహర్షి '' దగ్గరకి వచ్చిన భక్తునికి
రమణ మహర్షి వైపు చూపుతూ ఇలా అన్నారంట ,
''మా తమ్ముడు వేయి రూపాయలు సంపాదిస్తున్నాడు ,నేను వంద రూపాయలు
సంపాదిస్తున్నాను . నువ్వు పది రూపాయలు అయినా సంపాదించుకోవా ?''అని .
మరి మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు ?ఒక్క సారి లెక్కలు చూసుకోండి !