Sunday, 26 January 2014

రోజా ... మరువలేని తెరాద్భుతం

రోజా ... మరువలేని తెరాద్భుతం 

అప్పటికీ ఇప్పటికీ ''రోజా ''సినిమా ,మణిరత్నం 
మాజిక్ ,రెహ్మాన్ మ్యూజిక్ ,మొత్తానికి మనసు ఒక 
గమ్మత్తైన మత్తులో పడి  ఈ రోజుకీ బయటకు రానంటూ 
ఉంది . ఏ సినిమా ఇష్టం అంటే ... ప్రొఫైల్ లో ఉండే 
ఒకే ఒక సినిమా రోజా . జీవితానికి బస్ అంతే . మనిషి 
జీవితం స్ప్రుశించగల ప్రతీ కోణం ప్రతీ అనుభూతి 
మాగ్సిమమ్ తెరావిష్కరణ చేసేసారు . 

రోజా ఎవరు ?అందరిలాగే అమ్మా నాన్నల ప్రేమతో 
ఊరి వాళ్ళ మధ్య అల్లరితో అమాయకంగా చిరు 
గాలికి తోటలో ఊగుతూనో ,మంచులో తడుస్తూనో 
పసి బిడ్డంత స్వచ్చమైన నవ్వుతో ఎగిరే మన 
ఆడపడుచు . కాకుంటే వాళ్ళ అమ్మా నాన్నలకి 

రెండో అమ్మాయి . 

సినిమాకి ''రోజా '' అని పేరు పెట్టడం ద్వారానే 
ఒక అమ్మాయే ఈ కధకు హీరో అని తన జీవితపు నడక 
ఎగిసిన అలలు కుంగిన కలతలు ఎదుర్కున్న సవాళ్లు 
.... ఇవే దీనిలో ఉన్నాయి అని చెప్పకనే చెప్పారు దర్శకులు . 
ఏముంటుంది పెద్ద....  ఆడవాళ్ళ జీవితం లో వ్రాయడానికి .... 
వాళ్ళు పుట్టారు . ఏదో పెళ్లి చేసుకున్నారు . ఇద్దరు 
పిల్లలు ,వాళ్లకు వేళ కు ఇంత బువ్వ పెట్టడం . 
ఏముంటుంది ?ఏమి చూపిస్తారు . 

కాదు .... కాదు ఏదో ఉంది . వాళ్లకు కూడా 
రోషం ఉంది ,మనసు ఉంది , ధైర్యం ఉంది ,
గెలుపు ఉంది .... అన్నిటికీ మించి ప్రశ్నించే 
చూపుడువేలు ఉంది ...... అవసరానికి యముని 
అయినా ఎదిరించి భర్తను గెలుచుకొనె సంకల్ప శక్తి ఉంది . 
క్షణం క్షణం ఏమి జరుగుతుందా అని ముందుకు వాలి 
చూసేంత చక్కని స్క్రీన్ ప్లే తో కధ ముందుకు వెళుతూ ఉంటె 
రోజా మన ఊరి ఆడబిడ్డ అయినట్లు మన భుజాన్ని 
తనకు ఆసరా ఇస్తాము . తన బరువుని కొంత 
పంచుకుంటాము . కన్నీళ్లు నింపు కుంటూనే తను 
గెలవాలి అని కోరుకుంటాము . 

ఆడదానికి ప్రాణానికి మించిన సృష్టి భారాన్ని ఉంచింది 
ప్రకృతి . ఇక దానితో పాటు ఆ భారాన్ని మోయగలదా 
అని సహనానికి పరీక్షలు ,నెలకు మూడు రోజుల 
నరకం ఎలాగు తప్పదు . అనిర్వార్యం అయినంత మాత్రాన 
బాధ బాధ కాకుండా పోదు . ఇక లోపల ప్రాణి 
ఊపిరి పొసుకున్నప్పటి  నుండి ఇమడని తిండి ,
తిరిగే కళ్ళు ,కాళ్ళ వాపులు ఎలా కాపాడుకోగలవు నీ 
రూపాన్ని అని అనుక్షణం సవాళ్ళు విసురుతూనే ఉంటుంది 
ప్రకృతి . ఇక ఆ రూపం ఈ భూమికి వచ్చే రోజు అయితే 
జీవన్మరణ సమస్య సృష్టిస్తుంది .... నీ ప్రాణమా ?పసి ప్రాణమా ?
తేల్చుకో అని .... బిడ్డ పుట్టుక సమస్య అయినపుడు 
బయట నిలబడిన వాళ్ళు పెద్ద ప్రాణం కావాలి అని 
సంతకం పెడుతారు.  అదే ప్రశ్న తల్లిని అడిగితే 
''బిడ్డ ప్రాణమే ''కావాలి అని సంతకం చేస్తుంది . 
తన ప్రేమను,సృష్టి ని మోయగల అర్హతను నిరూపించుకుంటుంది. 

బిడ్డ ప్రాణానికే ఇంత కష్టపడే తల్లికి .... భర్త ప్రాణం 
ప్రశ్న అయితే ..... రేకు విచ్చుకున్న తొలి మురిపాలను 
ఉగ్రవాదం  పేరుతో దూరం చేస్తే ,తన సంకల్ప బలంతో 
ఊరు కాని ఊరులో ,బాష తెలియని ప్రాంతం లో 
ఎలా గెలుచుకుంటుంది భర్త ప్రాణాన్ని ?చిన్న మురిపాలతో 
సాగిపోయే కొత్త దంపతుల కధ ,ఉగ్రవాద  నేపధ్యాన్ని 
పరిచయం చేస్తూ దేశ భక్తిని రగులుస్తూ వెళ్ళే తీరు 
ప్రతీ ప్రేక్షకుడిని మంత్రించేస్తుంది . మళ్ళా మళ్ళా 
చూడాలి అనిపించేస్తుంది .నవరసాలను దర్శకుడు 
పండించే తీరు చూసి తీరాల్సిందే . 

కధ  తెలియని వాళ్ళు   ఎవరున్నారు .... ఇంకో 
సారి ఆ రుచి ని గుర్తు చేసుకుందాము . 

రోజా చిన్న పల్లెటూరి లో పుట్టి ఆట పాటలతో 
అల్లరితో ''నింగి హరివిల్లు వంచి చూడాలి ''
అని గంతులు వేస్తూ ఎగిరే అమాయకపు లేడి పిల్ల . 
అక్కకు పెళ్లి చూపులకు వచ్చిన కంప్యుటర్ ఇంజినీర్ 
చెల్లి అయిన రోజాను చేసుకుంటాడు . అక్కను ఇక 
తప్పని సరి అయి వాళ్ళ బావకు ఇచ్చి చేస్తారు . 
అందరు అక్క పెళ్లి చెడగొట్టింది అని అనేసరికి ఆ 
అమాయకపు రోజా మొగ్గ దిగులుతో ముడుచుకు 
పోతుంది . పెళ్ళంటే నే ఉహ తెలియని తనకు ఇలాంటి 
పరిస్థితి తెచ్చిన పెళ్లి కొడుకు మీద కోపంగా మారిపోతుంది . 
ఇంట్లో తల్లీ కొడుకులు ఇంగ్లీష్ లో మాట్లాడుకొనే ఒక 
నేపధ్యం లో ఆ పల్లెటూరి మొగ్గ ఇంకా ముడుచుకొని 
పోతుంది . మనసులో మాట చెప్పుకోలేనంత ఒంటరి 
అయిపోతుంది . అందుకే నాకు పాయసం చేసిస్తావా 
తల్లి అని అడిగిన పై ఆఫీసర్ ముందు ,నేనిక మా ఊరు 
వెళ్లి పోతాను , ఇంక ఇక్కడ ఉండను అని కుండ బద్దలు 
కొట్టేస్తుంది . 
అప్పటికి విషయం అర్ధం అయిన భర్త రోజా వాళ్ళ 
అక్క విజ్ఞప్తి తోనే తను రోజా నచ్చింది అని చెప్పాను 
అని చెప్పి అపార్ధాన్ని తొలగిస్తాడు . వాళ్ళ అక్కతోనే 
మాట్లడిస్తాడు . 

కోపం తొలగిపోయి ప్రేమ అంకురించే క్షణం ప్రతీ జీవితం 
లో చినుకు ముత్యమైనంత అద్భుతం . 
అంకురించిన తొలి ప్రేమ తొందరింతలు 
చిలకలుగా ముడిచి భర్తకు అందించక ముందే 
అతనికి ఏదో యుద్ధ విషయం డీకోడింగ్ చేయడానికి 
రమ్మని కాశ్మీరుకు రమ్మని పిలుపు వస్తుంది . 
అల్లుకోనంత వరకే తీగను దూరం చేయగలం ,ప్రేమతో 
అల్లుకున్న తీగ తొలి మురిపాలు తీరకుండా దూరంగా 
వెళతాను అంటే ఊరుకుంటుందా ?అత్తగారితో చెప్పి 
ఒప్పించి భర్తతో తను కూడా కాశ్మీర్ కి వెళుతుంది . 
అక్కడ ఫోటోగ్రఫీ చూసి తీరాల్సిందే ఇక కొత్త జంట 
వలపు తలపులు గడ్డి పరకతొ అరికాలు నిమిరినంత 
సున్నితంగా దర్శకుడు చూపిస్తుంటే మైమరిచి 
మురిసిపోయే లోపల ఉగ్రవాదులు జైలు లో ఉన్న 
తమ మనిషిని విడిపించుకోవడం కోసం భర్త 
ను కిడ్నాప్ చేస్తారు . 

ఊరు కాని ఊరులో బాష తెలియని ప్రాంతం లో 
పట్టుదల తో అందరిని అడుగుతూ మిలటరీ 
అధికారులను వెడుతూ భర్త కోసం పడిన పాట్లు 
చూసి తీరాల్సిందే . శెబాష్  అనాల్సిందే . 
''దేశం కంటే నే భర్తే ముఖ్యమా ?''అని అడిగిన 
మిలటరీ అధికారికి '' అవును నాకు నా భర్తే ముఖ్యం ''
అని గట్టిగా చెప్పి ఆడదాని ఔన్నత్యాన్ని ఆకాశానికి 
పెంచేస్తుంది . విడిపించలేము ... అని చెప్పిన మంత్రి గారిని 
మీ బిడ్డ యితే ఇదే మాట అనగలరా అని నిలదీసి 
మనసుని కదిలిస్తుంది . జైల్లో ఉన్న బందీని తన భర్త 
ప్రాణానికి బదులుగా విడిపించటానికి ఒప్పిస్తుంది . 

ఇక బందీ గా ఉన్న రిషీ తన భార్య జ్ఞాపకాలలో 
''నా చెలి రోజావే ''పాట పాడితే , ప్రేమావేశం లో ప్రేక్షకుడు 
మునిగి వాళ్ళు కలవాలి అని తపన పడిపోతాడు ,
బందీగా ఉన్నా ''ఝండా ''తగలపెడుతుంటే రిషీ 
ప్రాణాలకు తెగించి ఆపే తీరు ,ఇలా చేస్తే ఏమొస్తుంది 
అని ఉగ్రవాది తో వాదించే తీరు అంతర్లీనంగా మన 
దేశ భక్తిని ప్రేరేపిస్తుంది . ఇక ఉగ్రవాదాన్ని అప్పుడప్పుడే 
వచ్చే నూనూగు మీసాలకు అంటించే వైనం ,
పసి ప్రాణాలు ప్రయోజనం లేకనే గాలిలో కలిసిపోవడం 
తద్వారా ఉగ్రవాది మనసే మారిపోయే తీరు 
చూసి దర్శకత్వ ప్రతిభకు,సినిమా నిర్మాణం లోని 
ప్రతీ ఒక్కరికీ హాట్స్ఆఫ్ అనాల్సిందే . 

ఇన్ని కష్టాలు గడిచి ఉగ్రవాది మనసు మారి 
రిషీ ని వదిలేస్తే...  రెండు శరీరాలు ఏక మనస్కులై 
ఆ జంట మన ముందు నిలబడితే అందరి మనసులు 
ఉల్లాసం తో ఉరకలు వేస్తాయి . 

ఇది కధ  కాదు . ఒక దారి . ఒక కుటుంభం తన 
ప్రయోజనాలకే కాక దేశం లోని ఇతరులు గూర్చి 
ఆలోచించుకుంటూ వెళ్ళాలి అని చెప్పే ఒక సందేశం . 
అదే ఒక కుటుంభ జీవిత ప్రయోజనం . 
దేశం అంటే మట్టి కాదు .... ఇదిగో ఇలాంటి 
కుటుంభాలే . ఇలాంటి మంచి మనసులె . 
రోజా ఒక్క ఆడ పిల్ల కాదు . అందరి ఆడపిల్లలలోని 
చైతన్యం . దానిని గౌరవించిన జాతి వెలుగు 
దారిలో నడిచి పోతుంది ఆనడం లో సందేహమే 
లేదు . 

No comments: