Tuesday, 8 December 2015

మా నేల తల్లి 2

( నేల తల్లి పార్ట్ 1 లింక్ ఇక్కడ )
( link here )

''అబ్బా '' అరిచాను . గనిమ మీద నుండి జర్రున జారి .... 
కింద పడి  గౌను , కాళ్ళు మొత్తం బురదే .
పరిగెత్తాడు పాలేరు . లేపాలంటే ఒక చేతిలో పార , 
రెండో చేతిలో నాయన కోసం తీసుకొని పోయే క్యారియర్ . 
నేనే లేచి నిలబడ్డాను . దూరంగా పడింది కాలి చెప్పు . 
అంతా కోత కోసేసిన కయ్యాలు . ఇంకా వీళ్ళు దున్నుకోలేదు . 
నేల నీళ్ళు తాకి మెత్త బడుతూ నారు కోసం ఎదురు చూస్తూ 
ఉంది , అన్నం వండి బిడ్డ కోసం ఎదురు చూసే తల్లి లాగా , 
నిజంగానే నేల తల్లి . ఎదురు ఆశించకుండా మనకు ఆనందాన్ని 
పంచేవి , ఆకలి తీర్చేవి తల్లి అంత  గొప్పవే !!

''చెప్పు తెచ్చుకో బుజ్జమ్మా ,ఆలీసం అయితే సెట్టయ్య 
తిడతాడు '' 
''ఊహూ నేను పోను బురద , యాక్ '' 
గౌను వైపు చూస్తె బురద . 
పార చేతికిచ్చి , గనిమ మీద నుండి దిగి చెప్పు తీసుకొని 
వచ్చాడు . వేసుకున్నాను . 
''నేను నడవను . ఎత్తుకో '' చెప్పేసాను మొండిగా నిలబడి . 
''పద బుజ్జమ్మా , మళ్ళా ఇంకో మడి  దున్నాలా !!'' 
నచ్చ చెప్పాడు . 
''ఈ బురద అంతా  చూడు , నేను నడవను '' 
నిస్సహాయంగా చుట్టూ చూసాడు . 
దూరంగా ఎద్దుల బండి . మాదే . ఎద్దుల కొమ్ములకు 
రంగు చూడు . పెద్ద పండుగ కు పూస్తాము . ఇంకా గూడలి 
తిరణాలకి నాయనమ్మ వాళ్ళతో ఈ బండిలోనే పోయేది . 

''సరే బండెక్కి వస్తాలే '' చెప్పాను . హమ్మయ్య ఇంక 
పెద్ద కాలువలో నడిచే పని లేదు . 
బండి దగ్గరకు వస్తుంటే వాసన . పేడ ! 
''ఎక్కలేవులే బుజ్జమ్మా , ఎరువు బండి '' 
నిజమే దానిని తోలే వాడే ఎద్దుల కాడి మీద కూర్చుని ఉన్నాడు . 
వెనుక బుట్ట లాగ పెట్టి దాని నిండా గడ్డి , పేడ . 

ఇదంతా మా నాయనమ్మ ఇంటి నుండి వస్తున్నట్లు ఉంది . 
నాయనమ్మ ఇల్లు అంటే ఒక వీధి  చివరి నుండి ఇంకోవీధి  చివరి దాకా !
ముందు అంగళ్లు . వెనుక ఇల్లు . ఆ వెనుక పంచ . అక్కడ 
అవ్వ , మేనత్తలు ఎప్పుడూ విస్తరాకులు కుడుతూనే ఉంటారు . 
ఎక్కువ వస్తే అమ్మేస్తారు . వెనుక పెద్ద పెరడు , మునగ  చెట్లు
బాదం చెట్లు .... మా నాయనమ్మ అవన్నీ అమ్ముతుంది . 
మా అవ్వ , జేజినాయన , నలుగురు కొడుకులు 
ఎందరు ఉండారో అందరు పనిచేసేవారే , ఒకరు చేయడం 
ఒకరు ఖాళీగా ఉండడం లేదు . పని అందరిది . ఆదాయం అందరిది . 
 వెనుకరేకుల పంచ,  దానిలో పాడి , దాని పక్కన 
చీమ చింత గుబ్బల చెట్లు , దాని వెనుక రోజు పాలేరు 
వేసి పెట్టె పేడ  కుప్ప . అదే ఇక్కడకు తీసుకుని వచ్చి నట్లున్నారు . 

''యాక్ , ఏమి చేస్తారు దీన్ని ? ''
'' అది ఎరువు బుజ్జమ్మా , అది వేస్తె నేలకు సత్తువ
నాయనకు చాలా వడ్లు వస్తాయి '' 
ఓహో , పేడ వలన ఇంత  ఉపయోగమా !!
నేనింకా కళ్ళాపు చల్లడానికి అనుకున్నాను . 

''తొందరగా పొతే కరంట్ ఉంటాది , మోటార్ వేస్తె 
బురద కడి గేసుకోవచ్చు '' చెప్పాడు . 

హా ..... అని గునుస్తూనే మెల్లిగా ముందుకు కదిలాను .... 
అదాటున చూస్తె కలువ పూవుకు బురద అంటినట్లు  కనిపిస్తుందేమో ! 

పెద్ద కాలువ వచ్చేసింది . సన్నటి దారి మలుపు తిరుగుతూ లోపలి కి . 
వంగి చూసాను . నీళ్ళు పారుతూ ఉన్నాయి . పక్కన గడ్డి దుబ్బలు 
నాకంటే ఎత్తుగా . ఇంకా వాటి మొదుళ్ళ  లో చిన్న కలుగులు , 
వెనక్కి పరిగెత్తాను . నేను రాను . గుండె గబ గబ కొట్టుకుంటూ ఉంది . 

''నేను రాను , ఎత్తుకుంటేనే వస్తాను '' మొండిగా కూర్చున్నాను . 
ఎలాగా ఎత్తుకునేది , నిస్సహాయంగా చూసి పార పట్టుకో 
అని ఇచ్చి ఎత్తుకొని మెల్లిగా నీళ్ళలో దిగాడు . పాదాలు మునిగి 
కొంచెం పైకి పారుతున్నాయి నీళ్ళు . వీపు మీద నుండి చూసాను 
భయంగా , కలుగు దగ్గర రిబ్బను లా తిరుగుతూ ..... గబుక్కున కళ్ళు మూసుకున్నాను . 

''దిగమ్మ , పద '' 
''ఒక వైపు కయ్యల్లో వంగి నాట్లేస్తూ కబుర్లు చెప్పుకుంటూ , నవ్వుకుంటున్నారు 
ఆడవాళ్ళు . 
''మే కానీండి , పొద్దయి  పోతా  ఉండాది'' ఆదిలించినాడు . 
ఉలిక్కిపడి పని తొందరగా చేస్తున్నారు . 
పెద్ద పాలేరు అంటే సెట్టిగారు తరువాత , డబ్బులు , పని అన్నీ మందల 
చెప్పేవాడు కదా . 
''మా నాయన ఏడి ? '' అడిగాను . 
''ఆ పక్క మోటార్ కాడ ఉండాడు '' 
పొలానికి ఇబ్బంది లేకుండా రెండు వైపులా మోటార్లు . 
ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు , ఇంకా పంట కాలువ లో 
కూడా ఉంటాయి . కష్టం పడాలే కానీ ఆ తల్లి పచ్చటి సంపద 
దోసిట్లో పోస్తుంది . చెమట అంటే దానికి ఎందుకంత ఇష్టమో ! 
ఒక్కో సారి పొలాన్ని రెండు భాగాలుగా చేసి అటు తమదలొ , సజ్జలో 
ఇటు ఐ . ఆర్ . ట్వంటీ లో , మొలగోలుకులో వేస్తాడు . 
వర్షాన్ని బట్టి ,ఉండే కాలాన్ని బట్టి ఏవి ఎయ్యాలో మా నాయనకు 
భలే తెలుసు . 
గనిమ మీద నుండి పరిగెత్తుతూ వెళ్లాను . 
ఒక వైపు ఇందాక వచ్చిన బండి నుండి ఎరువు తీసి చల్లుతూ 
ఉన్నారు . 
ఇంకో వైపు పచ్చటి మొక్కలు . ఏమిటో అవి ? 
'' నాన్నా అని అరుస్తూ పరిగెత్తాను . 
ఆ పొలం వైపు వేలు చూపిస్తూ ..... 
ఏమైంది ? మా నాన్న కళ్ళలో ఆశ్చర్యం . 
                                           ( ఇంకా ఉంది )

No comments: