Tuesday, 14 February 2017

ప్రేమతో ఒక అడుగు

 ఇప్పుడు కోట్ల హృదయాలు లో 
ఒకటే నినాదం 
అందరి ఆశలు విజయం చేరాలని 

నింగికెగసే ఒక్క జ్యోతి 
శతాధిక ఉపగ్రహాలను గమ్యం చేరుస్తూ 

అక్కడ కక్ష్య లో తిరిగేవి 
ప్రాణం లేని ఉపగ్రహాలు కాదు 
గగనాన భారతదేశం ఎగురవేసిన 
కీర్తి బావుటాలు 

గెలవాలి పి . ఎస్ . ఎల్ . వి సి 37 
నిలపాలి భారత కీర్తిని నింగిన  వేగుచుక్కలా 

రేపటి ప్రయోగం  చరిత్రగా నిలిచిపోవాలి 
భారతదేశం గెలవాలి 
ఆ గెలుపు నీది నాది మనందరిదీ 

              ******** 
ఫిబ్రవరి 15 , 2017 ఖగోళపు విజయాన్ని నమోదు 
చేయపోతుంది . ఎన్నో విజయాలు మనకు 
అందించిన పి . ఎస్ . ఎల్ . వి ద్వారా ప్రపంచం లోనే 
మొట్టమొదటగా 104 ఉపగ్రహాలు (మూడు మనవి , మిగిలినవి 
విదేశాలవి ) కక్ష్యలో ప్రవేశపెట్టపోతున్నారు . 

శ్రీహరి కోటకు దగ్గరలో సూళ్లూరుపేట కూల్ లో పనిచేస్తూ 
నేను కూడా పిల్లల చేత ఏదో ఒకరీతిలో శుభాకాంక్షలు 
చెప్పిద్దాము అనుకున్నాను . ఎలా ? ఇదే ఆలోచిస్తూ ఉన్నాను . 

మంచి సంకల్పానికి విశ్వము ఎప్పుడూ తోడే . 
సైకత శిల్పం చేయమని సెక్రటరీ గారి నుండి ఆదేశం . 
గైడ్ కూడా వచ్చారు , సనత్ . 

ఉదయమే పిల్లలు మేము కాళింగి నది ఒడ్డున మొదలు 
పెట్టాము . ఒక మంచి పని చేస్తున్నాము అనే భావనతో 
మనసు చాలా ఆనందంగా ఉంది . పైగా పక్కనే 
చెంగాళమ్మ కు చేస్తున్న కోటి కుంకుమార్చన మంత్రాలు , 
మాకు కొత్త శక్తినిస్తున్నాయి . 
ఎండను లెక్క చేయకుండా ఒకే దీక్ష , ఒక మంచి 
సందేశాన్ని ఇస్రో వాళ్లకు ఇచ్చి శుభాకాంక్ష తెలియచేయాలని . 
చిన్నారి చేతుల్లో ఒక రాకెట్ భారత పతాకాన్ని గుర్తు చేస్తూ 
ఊపిరిపోసుకుంది . 

చేసిన పనికి ఎదురుగా నిలబడిన సైకత శిల్పం 
చూస్తుంటే ఏంటో తృప్తి మా అందరిలో . 

మొన్ననే వీరభద్రుడి గారి ప్రేమ మీద వ్రాసిన కవరుపేజ్ స్టోరీ 
చదివాను . ఈ  ప్రేమికుల దినోత్సవం రోజు అది మళ్ళీ 
గుర్తుకు వచ్చింది . ప్రేమలో కూడా కొన్ని స్థాయిలు ఉన్నాయి . 
మొదటిది నాకు మాత్రమే నువ్వు సొంతం కావాలి , మొత్తం 
నాకే కావాలి అనే ప్రేమ . ఇందులో ఒక్కరు మాత్రమే ఉంటారు . 

రెండోది నువ్వు సంతోషంగా ఉండాలి . నువ్వు సంతోషంగా 
ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను అనే ప్రేమ . 
దీనిలో మనం  కూడా ఉంటారు . 
ప్రేమ ఇక్కడ తన పరిధిని పెంచుకుంటూ పోతుంది . 
తన నుండి మన కు వెళుతూ . 

మూడోది అందరు బాగుండాలి . విశ్వం బాగుండాలి అనే 
ప్రేమ . ఇది మొత్తం సృష్టి నే తనలో ఇముడ్చుకోగలదు . 
ఆధ్యాత్మిక మార్గం లో సృష్టింపబడిన ఈ ప్రేమ ప్రతి ఒక్కరి 
సహానుభూతి పొందుతుంది . 

మరి ఈ రోజు ఒక జాతి ని మొత్తం మా ప్రేమ లో ఉంచుకొని 
ఆ అత్యున్నతమైన ప్రేమ వైపు వేసిన అడుగు ఇది 
అనిపించింది . 

మనం ఒక్కోసారి ఒక్కోలాగా కనిపిస్తూ ఉంటాము . 
అవన్నీ సముద్రం పైన ఎగసిపడుతున్న అలలే . 
ఎవరు అందులో తొంగి చూస్తే వారి ఆరా లోని 
అనుభూతే అక్కడ కనపడుతుంది . స్నేహం అయితే స్నేహం 
ప్రేమ అయితే ప్రేమ  కోపం అయితే కోపం  . ఈ పై పై అలలు అన్నీ 
పక్క వారి మనసు సృష్టి . 
లోతులో గంభీరంగా సాగే సముద్రమే మనం . 
అక్కడ జరుగుతున్న ప్రయోగాలు ,ఒక్కో అడుగుగా
మనలోపలికి చేసే ప్రయాణాలు ఎవ్వరికీ కనపడవు . 

ఒక్క సంతోషకరమైన విషయం ఏమిటంటే మనకు 
తెలీకుండానే ప్రతీ జన్మకి మనలోని ప్రేమను 
విశాలం చేసుకుంటున్నాము . 
మనిషి మనిషిగా మారడం కంటే కావలిసినది ఏముంది !

అతని నుండి స్వార్థరహితంగా ఇచ్చే ప్రేమ తప్ప సృష్టి 
ఆశించేది ఏముంది . 
                                    @@@@@@ 
No comments: