Monday, 3 July 2017

వండుకోలేరా !


వండుకోలేరా !
ఈ రోజు సాక్షి ఫ్యామిలీ లో నా కథ 
సాక్షి వాళ్లకు కృతఙ్ఞతలు 

 ఇంకొన్ని సంసారం లో సరిగమలు కావాలంటే 
నా సత్యభామ కథలు చదవండి 
satyabhama saradaalu storiesబయట రవి గొంతు వినిపిస్తూ ఉంది చిన్నగా 
'' అక్కా  బావకు కోపం వచ్చినట్లు ఉంది. తలుపు 
ఇంతసేపు తియ్యలేదు. ''

 విసురుగా తలుపు తీశాను. ఎదురుగా రజని , రవి 
 చేతిలో బరువులు , మళ్ళీ బాగ్. 
''ఎంతసేపు బెల్ కొట్టాలి. చేతిలో బరువులు ఉన్నాయి ''
అడిగింది రజని. 
సమాధానం  చెప్పాలి అనిలేదు ,లోపలనుండి ఆవేశం వస్తూ 
ఉంది . విసురుగా తలుపు వేసి లోపలికి వెళ్లాను . 
'' మాట్లాడరేమిటి ?''  రెట్టించింది 

'' ఈ మాత్రానికే ఇంత లా అడుగుతున్నావే. మధ్యాహ్నం వస్తాను 
అని ఇప్పుడు వచ్చావు. అన్నం  వండుకోకుండా ఎదురు చూస్తూ 
ఉన్నాను.పోనీ పాపం అమ్మకు  కావాలి అని నువ్వు అడిగితె 
 చూడు , అదీ నేను చేసిన తప్పు.నిన్ను కాదు మీవాళ్ళను అనాలి . 
బార్డర్ దాటేసిన విషయం మనసుకు తెలుస్తూ ఉంది . 

తెలీని , నేను ఆకలితో ఎంత ఇబ్బందిపడుతూ ఉన్నాను మధ్యాహ్నం 
నుండి. 

అయ్యో అనపోయి , మౌనంగా ఉండిపోయింది పక్కన తమ్ముడిని 
చూస్తూ. 
అనాలి . ఏదో ఒకటి మాట్లాడాలి. ఈ  వదిలేదు లేదు. 

మౌనంగా ఉండేసరికి ఏమి అనాలో తెలీడం లేదు. 
''మీ అమ్మ నాన్నకు తెలీదా నేను ఇక్కడ ఇబ్బంది పడుతానో అని , 
 వీడిది ఏముందిలే అనుకున్నారు. నేను అంటే లెక్కే లేదు '' అంటూ చూసాను రవి వైపు . 

ఇంజినీరింగ్ చేరిన తరువాత నల్లపడుతున్న మీసకట్టు గడ్డం పెద్దరికాన్ని 
అద్దుతున్నట్లున్నాయి ,కంట్లో నీటిపొర ఆపుకుంటూ ఉన్నాడు. 

ఛీ , నేను ఏమన్నాను ఇప్పుడు , లోపలకు పోయి పడుకున్నాను. 
 మూసుకున్నా నిద్ర రావడం లేదు. ఆకలి కరకర లాడుతూ ఉంది. 
అహాన్ని చంపుకొని ఉపమా అన్నా అడిగి తినడం మేలు. 
మగాడ్ని నేను అడిగేంది ఏమిటి తానే బ్రతిమిలాడని , లోపలనుండి 
ఎవరో రాజేస్తున్నారు . 

ఎంతసేపు అయుంటుంది ? రూమ్ లో చీకటి చేరుతున్నా లైట్ 
వేసుకోబుద్ది కావడం లేదు. 
అయినా ఈ ఆడవాళ్ళకు ఇంత పొగరు ఎందుకు ? ముఖ్యంగా 
పుట్టింటికి పొతే  మాట వినరు . 

''ఇష్ ..... '' కుక్కర్ విజిల్ 
ఆహా వీనులవిందుగా ఉంది. దానితో పాటే గాలిలో తేలుతూ సాంబారు వాసన . 
ఆకలి పదిరెట్లు పెరిగినట్లు ఉంది. 
వెళ్లి పెట్టమని అడిగితె బాగుండును . 
ఛా , నేను అడిగేది ఏమిటి ?రజని వచ్చి బ్రతిమిలాడినా పోకూడదు. 
ప్రేమతో  చాలా అలుసుఅయిపోయాను. ఆడవాళ్ళని భయం లో ఉంచాలి 
అని బామ్మ చెపుతూ ఉండేది . 

టేబుల్  కంచాలు పెడుతున్న చప్పుడు. 
మెల్లిగా తలుపు తీసిన సౌండ్ , కళ్ళు తెరవకుండా వింటూ ఉన్నాను. 

''భోజనానికి రండి '' 
బింకంగా కళ్ళు మూసుకున్నాను. 
''రవి కూడా ఎదురు చూస్తున్నాడు '' 

విసుర్రుగా లేచి కంచం ముందు కూర్చున్నాను . 
వేడిఅన్నం పొగలు కక్కుతూ ఉంది . పక్కనే రెండురోజుల 
 పెట్టిన కొత్త ఆవకాయ! ఆగలేక  ముద్ద కలిపి నోటిలో ఉంచుకున్నాను . 
 కారం సర్రున  నాలుక మీద , అబ్బా ! 

చిన్నగా , కొత్త కారం జాగ్రత్త . కొంచెమే కలుపుకోండి . 
నీళ్లు తాగి స్థిమితపడి మెల్లిగా తింటూ ఉంటే ఒక్కో ఆదరువు కంచం 
 వస్తూ ఉంది. కాకరకాయ పొట్లాలు, 
 అత్తగారు చేసి పంపినట్లు ఉంది . భలే చేస్తుంది. గుర్తు పెట్టుకొని 
పంపింది. నోట్లో ఉంచుకుంటే  రుచి. 

మెల్లిగా సాంబారు వడ్డించింది. మునక్కాయలు ఊరునుండి 
తెచ్చిందిలాగా ఉంది. మునివేళ్లతో గుజ్జు వచ్చ్చేస్తుంది. 
వడియాలు , గుమ్మడికాయ వడియాలు వచ్చి చేరాయి . 
ఉదయం నుండి తినక పోవడం మేలు అయింది . ఆకలికి 
ఇంకా రుచిగా ఉన్నాయి. 
వడ్డిస్తున్న రజని వేళ్ళు చూస్తూ ఉంటె ప్రేమగా నిమరాలి అనిపిస్తూ 
ఉంది. పక్కన వీడు !

''ఏమి రవీ బాగా చదువుతున్నావా ?'' 
''చదువుతున్నాను బావా '' భయంగా చెపుతున్నాడు. 

భయం లేదన్నట్లు నవ్వాను. 
''బాగా చదువు . మీ నాన్నకు వ్యవసాయమే ఆధారం. నువ్వు బాగా 
చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఆయనకు భారం తగ్గుతుంది . 
నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు '' 

బిడియంగా తల ఊపాడు . 
గర్వాంగా రజని వైపు చూసాను. నవ్వుతూ ఉంది , మెచ్చితిని అన్నట్లు . 

ఎంతైనా భార్య కళ్ళలో మెప్పు చూస్తే ఆ కిక్కే వేరబ్బా . 

'' ఇంకొంచెం తినురా '' అన్నాను రవి ని చూస్తూ 

పెరుగులోకి రాగానే , పక్కనే తోట లో పండిన బంగినపల్లి మామిడి 
 నూరు ఊరిస్తూ . 
'' ఈ ఏడాది మీ నాన్నకు కాపు బాగా వచ్చినట్లు ఉంది '' 

''అవును. మీ కోసం ఈ చివరి  కాపులో  కాయలు ఏరి మాగపెట్టారు '' 
నిజమే మావయ్యకు నేనంటే చాలా ప్రేమ . మనసులో గర్వంతో 
 సంతోషం. 
 మెల్లిగా ఆఖరున కప్పు తెచ్చి పెట్టింది . 
అబ్బా , అన్నాను . 

రజని మొహం లో నీకోసం ఏమి తెచ్చానో చూడు అనే  గర్వము. 

పల్లెటూరి పిల్లలను చేసుకొని త్యాగం చేస్తే చేసాము కానీ ఇలాంటి 
బోనస్ సంతోషాలు వస్తాయి . 

''దీనికోసమే ఉదయం బస్ ఎక్కలేకపోయాము. నాన్న పక్క ఊరికి 
వెళ్లి జున్నుపాలు తెచ్చి నీకోసం కాచి పంపారు '' 

కొంచెం నోట్లో వేసుకున్నాను . 
ఇంకా ఉంది కదా 

బోలెడు ఉంది. ప్రిజ్ లో ఉంచానులే అంది . 

చేతులు కడుక్కొని బెడ్రూమ్ లోకి వెళుతుంటే వెనుకే వచ్చింది. 

''రవి లాస్ట్ బస్ కి ఊరు వెళ్ళిపోతాడు '' 

''ఎందుకు ఉదయం వెళుదువులే రవీ '' చెప్పాను 
''ఉదయం కాలేజ్ కి వెళ్ళాలి బావా '' మెల్లిగా చెప్పాడు . 
ఇందాకటి భయం లేదు కళ్ళలో , ప్రేమ ఉంది . 

అనవసరంగా షో చేసాను . 
''వెళ్లనీయండి .మళ్ళీ కాలేజ్ కి అందుకోలేడు '' 

''సరే ఉండు , బైక్ మీద బస్ స్టాండ్ లో దిగపెడుతాను . 
అవును నువ్వు సెమిష్టర్ ఫీ కట్టాలి కదా, లక్ష రూపాయలు 
నేను ఇస్తాను. నాన్నకు డబ్బులు వచ్చినపుడు ఇమ్మని చెప్పు '' 

బీరువాలో డబ్బులు తీస్తూ ఉంటే బయట నుండి మాటలు 
వినిపిస్తూ ఉన్నాయి . 

''యెంత మంచివాడు అక్క బావ! ఇందాక మాత్రం భలే భయం వేసింది ''

రజని ఏమి చెపుతుందో ! 

గలగల మని నవ్వు . ఒక్క క్షణం మనసులో ఏదో తియ్యగా, వారం 
 అయిపొయింది ఈ తీపి తిని . 

'' మీ బావ ఆకలి వేస్తె రుద్రుడే , కడుపు చల్లపడితే  శంకరుడు ''
నవ్వుతూ అంది . 

వార్నీ , పెళ్లి అయి రెండేళ్లు కాలేదు. అప్పుడే నా వీక్నెస్ తెలిసిపోయింది . 
ఫర్లేదు ఎదురు తిరిగి గొడవ పెద్దది చేసే భార్య కాకుండా సర్దుకుపోయే 
పెళ్ళాం వచ్చింది . 
లేకపోతే పుట్టింటి వాళ్ళను అన్నందుకు ఎంత గొడవ అయిపోనూ. 
తాంక్ గాడ్ ! 

బైక్ తాళాలు ఇచ్ఛేటపుడు తన నవ్వుతో పాటూ మల్లెల్లో కలిసి నవ్వినా 
మరువం నవ్వు బోలెడు కృతఙ్ఞతలు నాకు చెప్పేసింది . 

ఏది ఏమైనా కోపం వచ్చినపుడు మాటలు తూలకుండా జాగ్రత్తపడాలి. 
మనను నమ్ముకొని అందరిని వదిలి పెట్టి వెంట వచ్చిన భార్యను 
కష్టపెట్టి మనం మాత్రం ఏమి సుఖపడగలం . సుఖానికి దగ్గరిదారి 
ఎదుటివారిని గౌరవించడమే ! 

                    @@@@ 

No comments: