Friday, 30 August 2013

నా జీవితపు కలాం కల నేరవేరిందోచ్చ్ :)))))))))))))))))))


రైలు కిటికీల నుండి బయట కనపడే చీకటి చూస్తున్నాను . 
మనసులో ఏదో ఆనందం ఎప్పటి కల ..... అసలు నిజం అవుతుందా అని 
ఊహించని కల ..... నిజంగా మనసు చాలా హుషారుగా ఉంది . 
ఎనిమిది మంది హై స్కూల్ఆడ పిల్లలు వాళ్లకు ఎస్కార్ట్ గా నేను నెల్లూరు జిల్లా 
నుండి . వాళ్లకు ఎస్కార్ట్ కి ఎఫిషియెంట్ టీచర్ కావాలి ,నాకు కలాం గారిని 
చూడాలనే కల నిజం కావాలి . పలితం ఇదిగో ఈ పిల్లలతో హైదరాబాద్ కు 
ప్రయాణం . పిల్లలకు చాలా హుషారుగా ఉంది రైల్ ప్రయాణం . ఒక్కరు నా స్కూల్ 
మిగిలిన వాళ్ళు వేరే స్కూల్స్ . వీళ్ళకు కలాం గారి గొప్పదనం పరిచయం చేస్తే 
ఎంత గొప్ప వ్యక్తిని కలుసుకొనే అవకాశం వచ్చిందో తెలుస్తుంది ,ఈ రోజు ఆంధ్ర జ్యోతి 
నవ్య లో ఆయన గూర్చి బాగా వ్రాసారు . పిల్లలలో చిన్నపాటి ఆలోచన వేసే 
అవకాశం వచ్చినా వదులుకోవడం నా టీచర్ వృత్తికి చేసే ద్రోహమే . చెప్పి 
వాళ్లకు ఇచ్చాను .చదువుతూ  చర్చించుకుంటూ ఉన్నారు . ఈయన అన్నం 
తిన్నాడా ?ఫోన్ చేసాను .నా సంగతి నీకు ఎందుకు ?నీ కల నెరవేరుతుంది 
కదా ... టకామని ఫోన్ పెట్టేసారు . ఏమి చేద్దాము .కొన్ని సార్లు మన మనసు 
తెలుసుకోవాలి అంటే అవతలి వాళ్ళు అచ్చంగా పిల్లలు అయిపోవాలి . ఆ కుతూహలం ,
పెదాలపై విరిసే నవ్వు ,సంతోషం తో మోగే చప్పట్లు ..... కావాలి పిల్లలుగా . 

పాపా కలాం గారిని చూసే అవకాశం వచ్చింది అనగానే మా పాప 
''సూపర్ మా వదులుకోవాకు . అసలు నువ్వు ఎస్కార్ట్ వెళ్ళడం ఆ పిల్లలు చేసుకున్న 
అదృష్టం '' అనింది . బాబుకు చేసాను '' మా అది నా డ్రీం మా .నువ్వు నిజం చేసుకుంటున్నావు . 
నిజంగా నువ్వు గ్రేట్ మా ''అన్నాడు . 
ఇంకా మా తమ్ముడు కూతురు అయితే ''అత్తమ్మా ముందు చెప్తే నేను వచ్చేదాన్ని ''
అని బాధపడింది . పిల్లలకు బాగానే అర్ధం అవుతుంది .... పెద్దలకే .ఎందుకు ఫీలింగ్స్ ని 
చంపుకుంటారు . పిల్లలవి బలహీనమైన వోట్లు .ఇంట్లో చెల్లవు . అందుకే ఇరవై రెండేళ్ళు 
కాపురం లో ఎప్పుడూ ఉపయోగించని భార్య అనే వీటో పవర్ ఉపయోగించి .... కొంచెం 
మనసు కష్టం గానే బయలుదేరాను . నా లైఫ్ స్పాన్ లో నాతో జీవించి ఈ దేశం కోసం 
ఉన్న ఒక విజన్ ని చూడటానికి .... ఆ లైటనింగ్ కాండిల్ నుండి కొంత అయిన వెలుగు పొందటానికి . 
                                                                @@@@@ 
సెక్రటరీ గారు ఎక్కడా రాజీ పడకుండా రెండు లక్షలు  ఖర్చు పెట్టి మరీ గౌలి దొడ్డి స్కూల్ 
లో మంచి స్టేజ్ ,భోజనాలు అన్నీ సూపర్ గా అరేంజ్ చేయించారు. ''వేదిక మీద పెద్ద అక్షరాలతో 
''Infinite sermon to swaroes'' మెరిసిపోతూ స్వరోస్ అంటే ఎత్తుకు ఎగరాలి అని ... 
మా సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ గారు మా పిల్లలకు ఆ పేరు పెట్టారు . మూడో జోన్ కి సరిగ్గా 
వేదిక ఎదురుగానే సీట్స్ ఇచ్చారు. మా ముందు ఉండే సోఫా వెనుక గా నిలబడి 
దూరంగా మోగుతున్న స్వాగత బాజాలు వింటూన్న అందరిలో ఏదో ఉత్సాహం ,
చాలా చాలా .... అదిగో ''స్వారోస్ టవర్ ''ఫౌండేషన్ స్టోన్ వేసి కలాం గారు వస్తూ ఉన్నారు . 
నేను మొదటి వరుసలో సోఫా వెనుక నిల్చొని కమెరా తీసి ఆయన రెడ్ కార్పెట్ మీదకు 
వస్తూనే తీద్దాము అని నిలోచొని ఉన్నాను . పిల్లలు ,పెద్దలు అందరిలో ఏదో ఉత్సాహం 
చప్పట్లే చప్పట్లు . న పక్కనే మొత్తం మీడియా కెమరాలు షూట్ చేస్తూ కలకలం . 

అదిగో వచ్చేసారు . చూస్తూ ఉన్నాను కలా ,నిజమా ?ఎనబై చిల్లర వయసు . 
నేరుగా వచ్చి నా ముందు సోఫాలో కూర్చున్నారు . పక్కన సెక్రెటరీ గారు . 
నా ముందు ఆయన .యెవరిని చూడాలి అని ఇన్ని కష్టాలు ఓర్చుకొని వచ్చానో 
అయన . నా చేతిలో కెమరా చూసి ప్రెస్ అనుకున్నారో ఏమో అక్కడ సెక్యురిటీ కూడా 
ఏమి అనలేదు . అలాగే నిల్చొని చూస్తూ ఉన్నాను  . మనసు లో నుండి 
ఎక్కడో '' హీ ఈస్ దేర్'' హెచ్చరిస్తుంది చూడమని . చూస్తున్నాను .కాని 
తెలీడం లేదు .ఉన్నట్లుండి నేను  రెండుగా విడిపోయిన ఫీలింగ్.... ఏమిటో అది 

ఆయన స్టేజ్ మీదకు వెళ్లి ఆంకరింగ్ చేసిన పిల్లలను అభినందించారు . మెల్లిగా 
మొదలైన ఆయన మెసేజ్ ''బాగున్నారా?'' అడిగారు . తెలుగు అనగానే అందరికి 
సంతోషాల వెల్లువ . ఆపకుండా చప్పట్లు . చిన్నగా మొదలైన వాక్ప్రవాహం మెల్లిగా 
చిన్న పద్యాలుగా పలికిస్తూ ,మురిపిస్తూ ,నవ్విస్తూ వ్యక్తిత్వ మార్పుకు 
మాకు తెలీకుండానే శ్రీకారం చుట్టిస్తూ హృదయం కదిలిపోతుంది అందరికి . 
పెద్దలు , పిల్లలు అందరు ఆయన ఏమి పలకమంటే అది హుషారుగా పలుకుతూ ... 
 ''Iam born with potential 
Iam born with goodness 
Iam born with confidence 
so Iam not ment for crawling 

bcoz I have wings
I will fly .... I will fly ....I will fly ''

''I enjoy my neighbours victory also '' 
what a man .... man of misson ....man of vision 
......which I felt a great opportunity that god gave for me. 
thank you god . 

అగ్ని లో  ఏదైతే ఎనెర్జీ పొందానో అదే ఎనెర్జీ నిరంతరంగా అందరి హృదయాలలో 
ప్రవహిస్తూ . నేను గర్వంగా చెప్పగలను నేను చూసాను ''తన కోసం 
మాత్రమె కాక ఒక దేశం కోసం తపిస్తూ కొట్టుకునే గుండెని '' 
తరువాత అంతా మౌనంగా ఉండటమే నేను చేసింది . ఎందుకో నాకే తెలీదో 
ఒక్కో సారి అనంతమైన సైలన్స్ లోకి వెళ్లి పోతాను . నాకే తెలీకుండా . 
                                              @@@@@@@@@ 

పక్క రోజు ఖాళీ . రాత్రికి ట్రైన్ .ఫ్రెండ్ కి చేసాను . నేను దారి చెపుతాను రండి 
అంది . ఒక్క దాన్ని వెల్లడమా ... చూద్దాము . ఇప్పటికైనా ప్రపంచం తెలుసుకోక పోతే 
ఎలా . ఆఫీస్ కి వెళ్లి మేడం కోసం చూస్తూ రిసిప్షన్ లో కూర్చున్నాను . నేను వచ్చాను 
అనేది నాకే కల లాగే ఉంది . లేకుంటే ఇంతకు ముందు కలలో వచ్చానో ?
మేడం వచ్చారు . ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని ఆఫీస్ అంతా చూపించారు , 
తన కొలీగ్స్ ని పరిచయం చేసారు . కాలం తో పరుగులు పెడుతూ సెకన్ల కు 
కూడా విలువ ఇవ్వాల్సిన ఉద్యోగాలు అర్ధం అయింది . అందరు సిస్టం ల ముందు కూర్చొని 
బుర్రను కొద్దిగా దానికి కలిపి కుస్తీ పడుతున్నారు . మేడం నన్ను పరిచయం చేయగానే 
కొని సెకన్లు త్యాగం చేసి నన్ను పలకరించడం ,చిరు నవ్వు ,కొంచెం కాఫీ ,టీ  
అంత పని వత్తిడిలో నా కిచ్చిన మనస్పూర్తి గౌరవంగా నేను ఫీల్ అయ్యాను . 
వాళ్ళ హెడ్ గారు కూడా నన్ను ఆప్యాయంగా పలకరించి అతిధి మర్యాదలు 
చేయడమే కాక గబుక్కున నా కప్ కూడా పక్కన పెట్టేసారు . తాగిన కప్పులు 
పక్కన పెట్టేంత సంస్కారం తనది . కాని ఇల్లాలిగా తన చేత చేయించినందుకు 
నాకు కష్టం అనిపించింది . కాని అది తన మీద వంద రెట్లు గౌరవాన్ని పెంచింది . 
అయితే ఇదంతా మా ఫ్రెండ్ తన చుట్టూ తన చిరు నవ్వుని ,చక్కని మనసు ని 
ఉపయోగించి చేసుకున్న స్నేహ పరిమళపు తోట . లేకుంటే చూడని నన్నే 
నా ఆకలి చూసి అన్నం తెచ్చింది . మాట వరసకు చెప్పాను మూడు రోజుల నుండి అన్నం సరిగా 
తినలేదు అని .... అంతే ఇంటి నుండి ఆకు పప్పు ,చిక్కుడు తాలింపు ,గుంత పొంగాలాలు 
పెరుగు అన్నం కొసరి కొసరి వడ్డిస్తూ ..... నా కైతే అవి తింటూ ఉంటె 
ఇంటి మీద బెంగ తన్నుకోచ్చేస్తూ ఉంది .బెంగ వచ్చేస్తే ఇక కోటి రూపాయలు 
ఇచ్చినా ఉండను . మా పుట్టింట్లో అయినా సరే . ఎమివ్వగలం అ ప్రేమకు బదులుగా 
''అన్న దాత సుఖీభవ ''అంతే . 
ఆ లిఫ్ట్ లో అన్ని అంతస్తులు ఎక్కడం దిగటం చూడటం ,ఎక్కడా ఆకాశమే కనపడదే . 
ఏమో గుహలో ఉన్నట్లే ఉంది . అంత కలగానే ఉంది కాని నా మోచేయికి 
రోడ్ మీద దాటే టపుడు ఆటో తగిలిన గాయానికి ఆ మేడం దగ్గర ఉంది 
ఫర్స్ట్ ఎయిడ్ చేయిస్తూ టించర్ వేయించారు చూడండి .... అప్పుడు చురుక్కుమని 
''అబ్బ '' మంట . హమ్మయ్య కల కాదు . 

బయటకు వచ్చినాక వాళ్ళ ఆఫీస్ చూసాను .... కింద నుండి పైకి . 
నాకు ఎలా ఉంది అంటే ''హనీ ఫాబ్ ''అవును తేనే పట్టు .యెవరికి వాళ్ళు 
పని చేసుకుంటూ .... పరుగులు పెడుతూ . వీళ్ళు అందరిని సమన్వయం చేస్తూ 
హెడ్స్ ఉన్నట్లే తేనే పట్టు లో కూడా ఆ ఈగల మధ్య సమన్వయము చేయడానికి ఎవరు ఉంటారో ? 
నోటీస్ బోర్డ్ లో చూసాను .యెవరికొ ''RIP'' .తప్పదు అలా క్షణాల్లో పరుగులు 
పెడుతుంటే .... పని వాళ్ళు కంపనీ ను గుర్తుంచుకుంటే .... పై వాళ్ళు 
కింది వాళ్ళ ఆరోగ్యాన్ని ఆహారాన్ని గుర్తుంచుకోవాలి . లేకుంటే స్కిల్డ్ హాండ్స్ ని 
వాళ్ళు కోల్పోతారు . ఎందుకంటె సిస్టం లను కొనగలం కాని వాటిని పని చేయించే 
స్కిల్ ని కొనలేము ఎన్ని కోట్లు పోసినా . ఒక సంస్థకు వాళ్ళ నమ్మకమైన 
ఉద్యోగుల కంటే ఆస్థి ఇంకేమి ఉంటుంది . 
                                             @@@@@@@@@@ 
తిరుగు ప్రయాణం లో నాలుగు రోజుల కోసం నా వొడిలోకి చేరిన ఎనిమిది 
చిన్ని గువ్వలు నన్ను విడి పోలేక ఏడుస్తుంటే ఏమి చేసేది ?జీవితం 
లో ఇవన్నీ మామూలే .... ఈ జ్ఞాపకాలతో ముందుకెళ్లాలి అని చెప్పి 
వాళ్ళలో నేను వేసిన విత్తనాలు మొలకెత్తి దేశానికి సౌభాగ్యాన్ని 
చేకూర్చాలి అని దేవుడిని వేడుకోవడం తప్ప . 


Wednesday, 21 August 2013

నా పరిచయం ''జాజి మల్లి గారి ''బ్లాగ్ స్పాట్ లో

నా పరిచయం ''జాజి మల్లి గారి ''బ్లాగ్ స్పాట్ లో 

కాకుంటే తన్నీరు శశి ... పన్నీరు కాదు :)
నా మనసు చూసి వ్రాసున్తరేమో మల్లీశ్వరి గారు 
(ఇలా ఊహిస్తే బాగుంది కదా )

మల్లీశ్వరి గారికి బోలెడు థాంక్యులు 

(link ikkada)


Sunday, 18 August 2013

జగద్గురువు ఆయన

ఈ రోజు మధ్యాహ్నం స్కూల్ లో డ్యూటీ చూసుకొని రెండప్పుడు 
బస్స్టాండ్ పక్కగా వస్తూ ఉన్నాను . చూడగానే భలే సంతోషం . 
150 సంవత్సరాలు నిండిన సందర్భంగా ''వివేకానందుని రధ యాత్ర''
అసలు నేను డ్యూటీ చూసుకొని వచ్చేదాకా ఉండదు అనుకున్నాను . 
వెంటనే పుస్తకాల వ్యాన్ వద్ద వాలిపోయాను .యెవరికైనా ఇవ్వాలి అంటే 
చిన్నబుక్స్  ఇస్తాను . నేను ఇచ్చిన పుస్తకాలు పిల్లలు అపురూపంగా దాచుకుంటారు . 
 ఈ సోషల్ వెబ్సైట్ ల కాలం లో అక్కడ ఎవరూ కొనే వాళ్ళు ఉండరు అనుకున్నాను . 
కాని చక్కగా ఎంత మంది యువకులు ,పెద్ద వాళ్ళు ..... హమ్మయ్య 
పెద్దవారిని గౌరవించడం , పక్క వారిని ప్రేమించడం ,మన దేశానికి వారసులుగా 
నిలవడం .... బ్రతికి ఉంది మనలో ఇంకా భారతీయత . వివేకానందుని పేరు 
గౌరవింప బడుతున్నంత కాలం మన యువకుల వెన్నెముక లు 
దేశానికి బలంగా ఉంటూనే ఉంటాయి . ప్చ్.... అమ్మాయిలూ ఎవరూ 
కొనేవాళ్ళు లేరు . ఒక స్త్రీ చక్కటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే ఎన్ని తరాలు 
ప్రభావితం చేయగలదు . ఎందుకో దీనిపై ఎవ్వరూ పెద్దగా దృష్తి పెట్టరు. 


 వరలక్ష్మి వ్రతం రోజు వేరే సినిమాకి అనుకోని ఈ హాల్ దగ్గరికి రాగానే 
దానిలోకి వెళ్ళిపోయాను . డైలాగ్స్ భారవి అనగానే ఒక ఎక్స్పెక్టేషన్ 
''పరవశిస్తాము పల్లకీలు మోస్తాము అని ''ఇక రాఘవేంద్ర రావు డైరక్షన్ 
అనగానే కొంచెం సినిమాటిక్ గా తీసినా మంచి చరిత్ర అందరికి చేరాలి 
అంటే అలాగే తీయక తప్పదు . ఇంకా సాయిబాబా మత్తులో నుండి 
బయటకు రాలేదు నాగార్జున నటన నుండి . 
ముందు పాట  ఏమి పెద్దగా నచ్చలేదు . నేను కొంచెం దిగులులో ఉన్నాను . 
కాబట్టి కొంచెం సేపు ఈ సినిమాకి రాక పోయి ఉంటె బాగుండేది ఏమో 
అనిపించింది . రోహిణి అమ్మగా చాలా బాగా చేసింది . మెల్లిగా సినిమాలో లీనం అయిపోయాను . 
గ్రాఫిక్స్ ఒక్కో సారి పెద్దగా రుచించవు . కౌశిక్ చిన్నప్పుడే బాల సన్యాసిగా 
మారడం అందరి వద్ద వినయంగా జ్ఞానం నేర్చుకోవడం ముఖ్యంగా 
నాగార్జున కాటి కాపరిగా ఎదురు వచ్చే సీన్ ,శ్రీ హరి మాయ మాయ అనే 
పాట బాగున్నాయి . కెమరా చాలా బాగుంది . శంకరాచార్యుల కధ పెద్దది 
కాబట్టి రాయలేకపోయారో ఏమో కాని స్క్రిప్ట్ పెద్దగా నచ్చలేదు . 
పద్మ పాదుడు గురువు పిలవగానే నీళ్ళ పై పరిగెత్తే కధ  చూపించి ఉంటె 
శిష్యులు గురువు పై ఉండాల్సిన నమ్మకం అందరికి తెలిసి ఉండేది . 

శంకరాచార్యులు అంటే అందరికి  గౌరవం . నాకైతే ''భజ  గోవిందం ''ఎప్పుడూ 
పాడుకుంటూనే ఉంటాను . ఆయన మీద పెద్ద వివాదాలు కూడా లేవు .. 
రెండు తప్ప . 
సన్యసించినాక  తల్లికి తల కొరివి పెట్టాడు అనేది ఒకటి . 
నువ్వు సన్యాసివి కాని సంసారివి కాని ఈ దేహం అమ్మ తన రక్త మాంసాలతో 
చేసుకున్న కుండ . అది నీ వెంట ఉన్నంత కాలం దానిపై అధికారం తల్లిదే . 
దానికి వివరణ చెప్పించడం బాగుంది . 

రెండోది మండన మిశ్రుడి భార్య  కామ శాస్త్రం లో సందేహాలు అడిగితే 
రాజులో పరకాయ ప్రవేశం చేసి సంసార సౌక్యాలు అనుభవించాడు అన్నది . 
ఉభయ  భారతి గారు ఎంత గొప్ప జ్ఞానో ఆమెను సభకు న్యాయ నిర్ణేత గా 
ప్రకటించినపుడు ఆమె మహిమ గల మాలలు వేసినపుడు ,తన 
భర్త అయినా సరే న్యాయంగా వ్యవహరిస్తున్నప్పుడు మనకు అర్ధం అవుతుంది . 
ఇది నిజం కూడా . అలాంటి వ్యక్తి భర్తను ఓడిస్తే చాలదు భార్యను ఓడించాలి 
అని అంతమంది  ముందుకావాలని  కామ శాస్త్ర ప్రశ్నలు అడగదు . 
మనకు కధ చదివితే తెలుస్తుంది ఆమె ఎంతటి జ్ఞాని అని . ముందు 
ముందు శంకరుడు గురువు గా ప్రకటింపబడి అన్ని శాఖలను ఒక్క
శాఖ గా మార్చి ఎన్నో పీటాలు స్థాపించి భారతీయ ఔన్నత్యాన్ని 
భుజాలపై మోయాల్సిన వాడు. అటువంటి వాడు చపల చిత్తుడైతే  
అతని జన్మకే అర్ధం ఉండదు . తన శరీర ఔన్నత్యాన్నీ ,సన్యాస 
మార్గాన్ని ఎలా కాపాడుతాడో చూద్దాము అని పెట్టింది అమ్మ పరీక్ష . 

శంకరులు కూడా తన శరీరపు ఔన్నత్యాన్ని కాపాడుతూ పరకాయ 
ప్రవేశం చేసి మాయలో పడకుండా తిరిగి వస్తాడు . కృష్ణుని కధలో 
చదువుతాము . ఆయనను గోపికలతో కృష్ణుడు బ్రహ్మచారి అయితే 
దారిమ్మని యమునని అడగండి అని . అలాగే యమున దారి ఇస్తుంది . 
కూరలో గరిట కు కూర రుచి ఎంత అంటుతుందో ... శంకరాచార్యుల 
వారికి అంటిన పాపము అంతే . మాయను జయించిన ఆయన కాక పోతే 
ఆ ''జగద్గురు ''బిరుదుకు అర్హత ఎవరికి ఉంది ? 

ఇంకో విషయం ఈ సినిమా ''ఓన్లీ ఫర్ యూత్ ''అంట . నిజమే మొన్న 
చాగంటి కోటేశ్వర రావు గారి ప్రసంగం లో విన్నాను . యువత చెడిపోతుంది 
అంటున్నారు . వారి తప్పు ఏముంది ,వారి చుట్టూ చెడ్డ నే అందుబాటులో 
ఉంది . మంచి విషయాలు మనసు నియంత్రణ ,వెళ్ళవలసిన మార్గము 
భారతీయ ఔన్నత్యము వారికి చెపుతున్నారా అని . ఏ తల్లి తండ్రులు 
ర్యాంకుల గూర్చి కాకుండా విలువలతో కూడిన జీవితం గూర్చి ,
ఇలాంటి మహనీయుల గూర్చి పిల్లలకు చెపుతున్నారో ఆలోచించుకోండి . 

పగిలిన కుండలు దేనికీ పనికి రావు . వెన్నెముక ,వ్యక్తిత్వము  
లేకుండా మీరు సమాజానికి ఇచ్చే పిల్లల వలన ఆ కంపెనీలు 
బాగుపడతాయి కాని లోకానికి మీరు ఇచ్చేది ఏమి లేదు . 
మూట లు దాచుకోవడం తప్ప ఒక మంచి కుటుంభాన్ని కూడా మీరు 
ఇవ్వలేరు . 
మీరు చేయలేని పని అదిగో నిస్వార్ధమైన వ్యక్తి ''కలాం ''గారు 
తన కలగా రూపొందించారు ''లీడ్ ఇండియా '' 
మూడు రోజుల కోచింగ్ ,ఆరు సెషన్స్ . పిల్లవాడి మనసులో 
విత్తనం వేయాల్నే గాని అది అతని దారినే మార్చివేస్తుంది . 
మీ పిల్లల స్కూల్స్ వారిని అడిగి పెట్టించి చూడండి . 
నా నలభై రెండేళ్ళు లోకాన్ని చూసిన వయసు , ఇరవై ఒక్కేళ్ళు 
టీనేజ్ పిల్లలతో సర్వీస్ లో ఉన్న కమిట్మెంట్ తో చెపుతున్నాను . 
విలువలు నేర్పించని తల్లి తండ్రులు పిల్లలను కనకూడదు . 
మన బాధ్యత మనం చేయాలి . అప్పుడే దేశం మంచి పౌరులతో 
విలసిల్లుతుంది . 

Wednesday, 7 August 2013

మది నిండిన సౌందర్యం

      
                                                                    
కధ కొంచెం ఉంది కదా . అది మళ్ళా వ్రాస్తాను . 
ప్రస్తుతానికి రవీంద్రుని తలుచుకుంటూ ఈ కవిత . 
ఇది ''కవి సంగమం ''లో ఇప్పుడే పోస్ట్ చేసాను . 
''కవి సంగమం '' అంటే ఫేస్బుక్ లో ఒక గ్రూప్ .  
  ఫేస్బుక్ లో దాదాపు పద్నాలుగు వందల మంది 
ఉండే ఒక గ్రూప్ .దానిలొ సాహితీ ప్రేమికులు తమ అక్షరాలూ 
పంచుకోవడానికి ,భావాలను పెంచుకోవడానికి వీలు ఉంటుంది . 
దీనిని ఒక మంచి ఆశయం తో స్నేహ పూర్వ వాతావరణం కల్పిస్తూ 
''యాకూబ్'' గారు చక్కగా నిర్వహిస్తున్నారు . దీని క్యాప్షన్ ఏమిటో 
తెలుసా ? 

''పచ్చటి చెట్టు నువ్వైతే పిట్టలు అవే వాలుతాయి ''
మరింకేమిటి మీరు  కూడా సాహితీ పక్షులు అయితే చక్కగా ఈ చెట్టు పై 
వాలి కువకువ లాడండి . ప్రస్తుతానికి ఈ కవిత చదువుకోండి . 

     మది నిండిన సౌందర్యం                8/8/2013       
                                                                    
దోసిలొగ్గి ఒక్కటే అడిగాను 
నా హృదయం నిండిపోయే సౌందర్యం కావాలి అని ... 
అలివికాని ఆరాటం తో సౌందర్యం కోసం పరుగు 
ఎక్కడ  నా హృదయపు ఆర్తి ని తీర్చే 
మౌన తపస్విని 
అదిగో కొండ కొమ్మ పై వాలిన మబ్బు సొబగులోనా 
లేత చివురు కుండే మత్తు ఎరుపులోనా              
అమ్మాయి మెడ వంపులోనా 
నది చుట్టే కొండ మలుపులోనా 
బోసి నవ్వులోనా 
మట్టిని తాకే తొలి చినుకులోనా 
మదిని ఒరుసుకొనే జ్ఞాపకం లోనా 
చిరునవ్వు వంపే మల్లెల జల్లు లోనా 
చెలి పలుకులోనా 
మధు పాత్రలోనా 
ఒక్క సారి తాకితే నా ఉనికే సౌందర్యం కావాలి 
ఎక్కడుందో ఇవ్వండి 
ఎన్నో సార్లు చాపి ఎన్నో కానుకలు అందుకున్న చేతులను చాపి 
రిక్త హృదయం తో ఆర్తిగా అడిగాను

చిరునవ్వుతో చేయి చాపి నా రిక్త హృదయాన్ని 
ప్రేమగా తాకిన స్పర్శ ..... 
ఒక్క సారి తనువెల్ల పులకరించి శాంతి సౌందర్య ఆవిష్కరణ 

ప్రభు బదులుగా నీకు ఏమి ఇవ్వగలను 
ప్రేమతో నిండిన ఒక చిరునవ్వు తప్ప .......  

             (రవీంద్రునికి అక్షరాంజలి )

Tuesday, 23 July 2013

చెప్పనా .... చిన్ని ఆశ

కాలింగ్ బెల్ కొట్టబోతూ ఉంటె ముక్కుకి తగిలి నోటిలో ని చెరువు 
పెదాలు తడిపేసే కమ్మని వాసన.... కచ్చితంగా బజ్జీలే అనుకున్నాడు 
క్రిష్ ఉరఫ్ పెళ్లి అయినాక కృష్ణ . 
చెప్పుల శబ్దం వినిపించింది కాబోలు తలుపు తనే తెరిచింది సత్య . 
స్వాగతం చెపుతూ చిన్న చిరునవ్వు . కలా  నిజమా .... చిన్నగా 
గిల్లుకొని ''ఇష్''అన్నాడు బాధతో . పక పక నవ్వు వెనుకనే మంచి నీళ్ళు ,
ఫాన్ ఆన్ చేసి వెళ్ళింది .''కూర్చోండి '' చెప్పి లోపలి వెళ్ళింది సత్య . 
తమ ఇల్లేనా?తన భార్యేనా?చుట్టూ చూసుకొని తన ఇల్లే అని నిర్ధారించుకున్నాడు . 

అయితే టి .వి చెడిపోయి ఉంటుంది . దాని వైపు చూసాడు . బాగానే ఉంది . 
అయినా అది చెడిపోతే సత్య ఇలా ఉంటుందా ఏమిటి ?ఇంతకు ముందు చెడిపోతే 
నూరిన కారాలు మిరియాలు గుర్తుకు వచ్చి మనసులోనే కెవ్వు మన్నాడు . 

తింటూ ఉండండి చేతిలో ప్లేట్ ఉంచింది . నోరు ఊరిస్తూ రెండు అరటికాయ బజ్జీలు . 
రోటి లో దంచిన ఉల్లి కారం . తింటూ ఉండండి మిరపకాయలు ఉల్లి ముక్కలతో 
స్టఫ్ చేసి తీసుకొని వస్తాను . ''అబ్బ మిరపకాయ బజ్జీలు అదీ స్టఫ్ చేసి ,
ఏ మాటకు ఆ  మాటే గాజుల చేతి మహత్యం కాబోలు ఆ టెస్ట్ ఏ హోటల్ లో తిన్నా 
రాదు .సత్య చేతిలోనే ఏదో ప్రత్యేకత ఉంది '' 
నా భార్య ... అనుకోగానే ఏదో గర్వం మెల్లిగ ఒక ముక్క తుంచి కారం లో 
అద్దాడు. నోట్లో నీళ్ళు ఊరిపోతూ .... నోట్లోకిఒక్క ముక్క  వెళ్ళగానే ఆహా స్వర్గం ఎక్కడో 
లేదు . భార్య చేసిన బజ్జీలలోనే ఉంది . పొంగు కొచ్చిన ఆనందం లో పోర పోయింది.  

''అయ్యో అయ్యో మెల్లిగా '' తెచ్చిన ప్లేట్ చేతిలో ఉంచి తల మీద సుతారంగా తట్టింది . 
మెల్లిగా ముక్కుకు సోకిన గోరింటాకు వాసన,చెంపకు తగిలిన ఆ చేయి మెత్తదనం ,
ఆహా అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు .... తల మీద ఆ చేతిని అలాగే పట్టుకొని మెల్లిగా 
అరచేతిని బుగ్గ మీదకు ఆనించు కున్నాడు . 
''ముందు ఇవి తినండి మహా ప్రభు .నెను ఎక్కడకు పోను కాని ''చేతిని వదిలించు కొని 
ప్లేట్ వైపు చూపించింది . 
లేతబంతి పూవు రంగులో రెండు బుజ్జి పడవలు ప్లేట్ లో ఒదిగి ,
వాటి వీపుల మీద సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు కొంచెం నిమ్మ రసం 
పిండిందేమో మెరుస్తూ ఉన్నాయి . దాని పై చిన్నగా తలలు ఊపుతూ ఆహ్వానిస్తూ 
లేత కొత్తిమీర తుంపులు పక్కనే జాతీయ అభిమానం కాబోలు కాషాయపు 
రంగు కెరట్ తురుము .... మొత్తానికి ఏదో ట్రాన్స్ లోకి వెళ్లి పోయి ఒక్క 
మిరప బజ్జీ ని చేతిలోకి తీసుకున్నాడు . ఇంకా అది నోటిలోకి వెళ్ళబోతుంది 
అనగా .... ఉలికిపాటు .బజ్జీ ప్లేట్ లోకి వదిలేసాడు . ఎడమ కన్ను టపా టపా 
కొట్టుకుంటూ ''ఏమి ఉంటుంది?ఈ రెండేళ్ళ చరిత్రను తవ్వసాగాడు ..... 

''అయ్యో ఏమైంది ?'' భర్త మొహం చూసి ఆందోళనగా అడిగింది సత్య . 
అప్పుడు వెలిగింది కృష్ణ కి ఒక సందేహం . ''సత్య శ్రావణ మాసానికి చీర కొనాలా ?'' 
అడిగాడు పీచు పీచు మంటున్న గుండెను తడుముకుంటూ .కాలనీ లో కెల్లా తన 
చీరె గొప్పగా ఉండాలని తనచే పర్సనల్ లోన్ పెట్టి మరీ పోయిన సారి కొన్న 
అప్పు ఇంకా  తీరలేదు. 

''అయ్యో శ్రీరామచంద్ర మీవన్నీ భయాలే '' నవ్వింది అభయం ఇస్తున్నట్లు . 
''మొన్న సుష్మ పెళ్ళికి వెళ్ళినపుడు అమ్మ చీర తీసి ఇచ్చింది '' 

పీల్చుకున్న ఊపిరి శక్తిని ఇచ్చింది కాబోలు ,మొగుడు పోస్ట్ భాద్యత కూడా 
తట్టింది కాబోలు ''పర్లేదు లేవోయ్ .యెదైనా మామూలు చీర తీసుకో . 
వర లక్ష్మి వ్రతం చేసుకోవద్దా?'' ప్రేమగా అడిగాడు . 

హమ్మయ్య దారికి వచ్చాడు అనుకుంది కాబోలు ''ఎందుకు లెండి ఖర్చు ?
రేపు పిల్ల పాపా పుడితే కావొద్ద?''అభయం ఇస్తూ అనునయంగా చెప్పింది . 
''పర్లేదు తీసుకో ''నిజంగానే భార్య మీద బోలెడు ప్రేమ . 

''సరే ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ....'' ఒక్క క్షణం ఆగింది . 
''చెప్పు చెప్పు ''అన్నాడు ఆత్రుతగా నువ్వు అడగాలే కాని వెండి కొండ 

అయినా తేనా అన్నట్లు మొహం పెట్టి , 
''ఒక బ్లౌజ్ కొనుక్కుంటాను '' 

''ఓస్ ఇంతేనా .... నీకెన్ని కావాలో అన్ని తీసుకో . 
అసలు నేనే షాప్ దగ్గరకి తీసుకువెళతాను
 పద''చెప్పాడు బజ్జీలు తింటూ .
 హుషారు లో ఈలపాట 
కూడా వచ్చేస్తూ ఉంది . 

''ఏమండీ '' చిన్నగా దీర్ఘం ''చెప్పు'' అడిగాడు ధీమాగా . 
''మరేమో బ్లౌజ్ కి చిన్న లేసులు ,కుందంస్ కుట్టించు కుంటాను . అది ఇప్పుడు 
ఫేషన్ '' .... ''అలాగే అలాగే '' హుషారుగా భార్యను ఎక్కించుకొని బండి 
మీద రివ్వున బజార్ కి వెళ్ళిపోయాడు . 
''ఏమిటో ఈ భార్యలు బొత్తిగా నోట్లో నాలుక లేదు .భర్త ని అడగాలి అన్నా 
మొహమాటం  '' ప్రేమగా మనసులో విసుక్కున్నాడు . 
                                                              
                                                                                        (ఇంకా ఉంది )

Monday, 22 July 2013

బ్లాగు లోకం లో ''లాస్య రామకృష్ణ ''గారు ప్రచురించిన నా ఇంటర్వ్యు

బ్లాగు లోకం లో ''లాస్య రామకృష్ణ ''గారు ప్రచురించిన నా ఇంటర్వ్యు 

(link ikkada )

లాస్య గారికి నా బ్లాగ్ తరుపున కృతజ్ఞతలు

బ్లాగు - ఇది శశి ప్రపంచం 
బ్లాగు లంకె- http://itissasiworld.blogspot.in



పేరు
శశి కళ వాయుగుండ్ల 

ఊరు
నెల్లూరు జిల్లాలో చిన్న పల్లె 

హాబీస్
బుక్ రీడింగ్ , సినిమాలు 

పుట్టిన రోజు
మే పన్నెండు 

అభిమాన రచయిత
మల్లాది , దాశరది రంగా చార్య 

నచ్చే రంగు
తెలుపు 

నచ్చే సినిమా 
రోజా 

ఇష్టమైన ఆహారం
ఏవైనా పర్లేదు వెజ్ మాత్రమే 

ఇష్టమైన పుస్తకం
రైలు బడి 

ఇష్టమైన ప్రదేశం
మా ఊరు ,తిరుమల 

జీవితం అంటే
ఎన్నో అనుభవాలు పొందడం కోసం మనం వేసే ఒక నాటకం 

ఇతరులలో నచ్చేవి
నిస్వార్ధమైన స్నేహం,ఆప్యాయంగా మాట్లాడే మాటలు 

సాహిత్యం తో మీ ప్రయాణం
రెండు కవిత సంకలనాలు వెలువర్చాను. (జాబిలి తుణకలు, స్వర్ణ ముఖీ సవ్వడులు నానీల సంకలనం) ఇప్పుడు బ్లాగ్ మరియు ప్రస్తుతం కధలు వ్రాస్తున్నాను 



మీ రోల్ మోడల్
వివేకానంద ,అబ్దుల్ కలాం 

తెలుగు బాషకు మీ వంతు ప్రయత్నం
మా బడి లో పిల్లలకు కధలు, కవితలు వినిపిస్తూ వారి చేత కూడా వ్రాయిస్తూ ఉంటాను 
...... లాస్య రామకృష్ణ

ఈనాడు ఆదివారం అనుబంధం లో ''ఆత్మ జ్ఞానం '' గూర్చి ''కరణం జనార్ధన్ ''
గారు వ్రాసిన ఆర్టికల్ చాలా చాలా బాగుంది .లింక్ ఇస్తున్నాను తప్పకుండా
చదవండి

(eenaadu article link ikkada )
‚



- లాస్య రామకృష్ణ 


ఇంకో విషయం నిన్నటి ఈనాడు అనుబంధం లో ''ఆత్మజ్ఞానం ''గూర్చి 
కారణం జనార్ధన్ గారు వ్రాసారు.చాలా బాగుంది .చదవండి . 



Saturday, 13 July 2013

ఈ రోజు సాక్షి ఫండే లో ఉత్తరం దక్షిణం చూసారా?

ఈ రోజు సాక్షి ఫండే లో ఉత్తరం దక్షిణం చూసారా?

(14/7/2013 funday link ikkada )

అసలు ఆదివారమే అన్నిటికన్నా ఇల్లాళ్ళు బిజీ గా ఉండే రోజు .
యూత్ పార్లమెంట్ పోటీలకు స్క్రిప్ట్ వ్రాయాలి . నాకేమో ఈ సభల గూర్చి జ్ఞానము
సున్నా . అదొక పక్క. మా నాయన భోజనానికి వస్తాను అన్నాడు . ఎలాగు కూతురి
మనసు నాయన ఆతిద్యం తగ్గితే ఒప్పుకోదు . మధ్యాహ్నం డ్యూటీ ఉంది .
ఇన్నిటి మధ్య కలం నుండి ఓ కవితకు రాలాలి అని ఆరాటం . అదిగో మనసుకు
ఇంకో పోరాటం . ''విభు నీ మాట మీరడని దేవ భూమి నుండి కర్మ భూమి కి
పారిజాతాన్ని తీసుకు పోయిన ఫలం అనుభవింపక తప్పదు సత్య'' అని శచీ దేవి
శపిస్తూ ఉంటె కొందరు దెబ్బ తగిలితేనే తెలుసుకుంటారు అని మనసులో అనుకోని
చిరునవ్వు నవ్వుతూ ఆమె ముచ్చట తీర్చే మా ఎన్. టి . ఆర్ .

ఇన్నిటి మధ్య ఈ ఉత్తరం దక్షిణం తలలో తిరుగుతూనే ఉంది . చిన్ని రాయి నిశ్చల
తటాకం లో అలలు రేపినట్లు .... లాభం లేదు ఇవి నా బ్లాగ్ చూసే విజ్ఞుల తలపుల్లో
వేసేస్తే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని ఉదయాన్నే ఇక్కడకు వచ్చేసాను .

ఇక్కడ ''రైట్ టు మ్యారిటల్ ప్రాపర్టీ ఆక్ట్ '' గూర్చి ఇరువురి వైపు ఉదాహరిస్తూ వ్యాసం
వ్రాసారు వ్యాస కర్త (అనొచ్చా?ఏమనాలో ) చూడండి . తరువాత నా మనసులో మాటచెపుతాను . 


అభిప్రాయాలు మీద నాకు పెద్ద ఇది లేదు . ఎందుకంటె అవి గుడ్డి వాళ్ళు ఏనుగు ను చూసి 
వర్ణించినట్లే ఉంటుంది . అందరి అభిప్రాయాలు సమీకరించుకొని ఎక్కువ మందికి 
అంటే క్రీమీ లేయర్ ని కాకుండా ప్రయోజనం కలిగేటట్లు ''ఆక్ట్'' లు తయారు చేస్తారు . 
వాటికి కాల దోషం పడితే ఎలాగు సవరణలు చేస్తారు . 

భర్త నుండి విడిపోయిన భార్య కు ఆర్ధిక ఆధారం లేనందున ఈ ఆక్ట్ చేసారు . 
ఎలాగు పిల్లలు ఉంటె విడాకుల తీసుకున్న వాళ్ళ పిల్లలుగా వారికి 
భవిష్యత్తు లో చదువుకు గాని ,పెళ్లి కి కాని కొంత ఆర్ధికంగా మెరుగుగా ఉండటం 
వారికి ప్రయోజనమే . ఇలాగ ఆడ వాళ్ళ వైపు సగం వ్రాసారు బాగుంది . 

కాని ఉద్యోగం చేసే వాళ్ళు చిన్న కారణాలకు విడిపోతున్నారు . వీళ్ళు కష్టపడి 
సంపాదించిన దానిలో ఇవ్వాలి అనడం ఎంత న్యాయం ?భవిష్యత్తు లో 
ఆస్తి కోసం పెళ్లి చేసుకొని విడాకులు అడిగే వాళ్ళు వస్తారు కాబట్టి ఈ ఆక్ట్ 
ఎంత వరకు సమంజసం ?అని సగ భాగం వ్రాసారు . ఇదే నా మనసులో మెదులుతుంది . 

నిజంగా మన వాళ్ళు ఎంత మంది చిన్న కారణానికి విడిపోతున్నారు . లెక్కలు వేసి 
శాతాలు తీస్తే కాని తెలీదు . భాదితులలో ఈ శాతం ఎంత అని ? నిజానికి 
ప్రతి భార్య భర్త బంధం లో ఏమి జరిగింది అనేది వంద శాతం ఎవరు బయటికి 
చెప్పరు .విన్న దానిని బట్టి చిన్న కారణం అని మనం నిర్ణయించుకుంటాము అంతే . 
తాగే భర్త ను వదిలేస్తే హవ్వ ఎంత చిన్న విషయం అంటారు . ఆ వాసన తన మనసుని 
ఎంత నలిపెస్తుందో ,పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకం గా ఎలా మారుతుందో ,
అప్పుడు మైకం లో ఆతను మాట్లేడే మాటలు తన ను  ఎంత నరకానికి 
గురి చేస్తుందో ఆమె పూర్తిగా చెప్ప లేదు .ఇంకా చెప్పలేని పరువు సమస్యలు 
నాలుగు గోడల మధ్య ఎన్నో ఉంటాయి .   
నేనేమి ఊరికే చెప్పడం లేదు . నా చుట్టూ ఉన్న ఎందరో ఇల్లాళ్ళ సమస్యలు 
చూస్తూనే ఉన్నాను . 
ఇప్పటికీ కొంత మందిని వదిలేస్తే ''విడాకులు '' అనే సమస్య పరువు గలవాల్లకు 
నరకమే . బిడ్డ సంతోషం కోసమే ఆ వైపు అడుగు వేస్తున్నారు . 
నా దగ్గర బంధువు లే చూసాను . వాళ్ళ బిడ్డను నరకం లో వదల లేక , 
విడాకులు తీసుకో లేక ఆ తల్లి తండ్రులు కుమిలి ఏడ్చిన సంగతి . 
తరువాత ఆ అమ్మాయి కొన్నేళ్ళు సొంత అన్న అయినా సరే మగ వాళ్ళను 
చూస్తే గజ గజ వణికి పోతున్నప్పుడు నా బిడ్డ లాంటి అమ్మాయికి 
వచ్చిన కష్టానికి నా కైతే ఇలాంటి ఎన్నో ఆక్ట్ లు పెట్టాలి అనిపించింది . 

ఇంకా వ్యాస కర్త చెపుతారు ... సంపాదించుకొనే స్త్రీలు ఇండిపెండెంట్ గా ఉండాలి 
అని భావిస్తూ విడాకులు తీసుకుంటున్నారు . నిజానికి ఇంట్లో అవే కష్టాలు 
పడే వాళ్లకు విడాకులు తీసుకోవాలి అనే ఉంటుంది ,అప్పటికి అంత నరకాన్ని 
చూసే ఉంటారు . కాకుంటే ఆర్ధికంగా బలం కల వాళ్ళు బయటకు వచ్చారు 
అంతే . ఉద్యోగం వచ్చినంత మాత్రాన అందరు విడాకులు తీసుకోరు . 
చిన్న విషయాలనే భూతద్దం లో చూడటం కొందరు చేస్తుండవచ్చు . 
కాని అది ఎంతో చిన్న కోణం . వాస్తవం గా ఎన్ని సమస్యలు తమ బిడ్డలు 
పరువు కోసం సర్దుకు పోతున్నారో ఆడ పిల్లలను కన్న తల్లి తండ్రులకు ,
సహృదయులు అయిన అన్న తమ్ములకు మాత్రమె తెలుసు . 

ఇంకా భారతీయ స్త్రీలు సమస్యలు ఎన్నో ఉన్నాయి . కొందరి తొందరపాటు ని 
బట్టి అందరు తప్పు చేస్తున్నారు అనుకో వద్దు . రెండు చేతులు కలిస్తేనే 
చప్పట్లు . విడాకులు కు ఒక కేస్ వెళ్ళింది అంటే  ఎంతో కొంత రెండో 
వైపు సమస్య ఉండే ఉంటుంది . 

నిజానికి ఆస్తి కోసం భారత దేశం లో పెళ్ళిళ్ళు జరిగే రోజు వస్తే ఈ ''ఆక్ట్ '' 
సవరణ కచ్చితంగా వస్తుంది వ్యాస కర్త గారు . 
కాని నిజానికి మన చుట్టు  పక్కల పరిస్థుతులలో ఇంకా చాలా ఆక్ట్ లు 
స్త్రీ ల కోసం చేయాల్సిందే . 

రెండు వైపులా సమర్ధించడం సమంజసం కాక పోయినా ఇలాంటి ఒక 
సమస్య పై ఇంట్లో ఉండే నా లాంటి ఇల్లాలి ని కూడా నోరు విప్పేలా 
చేసారు అంటే ''ఉత్తరం దక్షిణం ''వ్రాసిన వాళ్ళను అభినందించాల్సిందే .