ఉగాది రోజు ఇలాంటి పోస్ట్ వేస్తానని ....అందులో నా బ్లాగ్ మొదలైన తరువాత
మొదటి ఉగాది ఇలాటి పోస్ట్ వేస్తానని అనుకోలేదు.......
గురువారం రాత్రి చాప తీసుకొని మిద్ది పైకి పడుకొని చుక్కలతో
కబుర్లు చెప్పటానికి పోతున్నాను.బోజనాలు అయిపోయినాయి.
ఇక మిగిలినదంతా నా టైం.దానిని ఇలాగే వాడుకుంటూ ఉంటాను.
మెట్లు ఎక్కుతూ ఉంటె రాజ్ ప్లస్ లో వేసిన పోస్ట్ గుర్తుకు వచ్చింది.
''మన పుస్తకాలు,మన ఇష్టాలు,మన పనులు అన్నీ ప్లస్ లో పోస్ట్లకు
సమాధానాలు చెప్పటం లో మాడిపోతున్నాయి...వాటిని బతికించుకోవాలంటే
ప్లస్ లో నుండి వెళ్లిపోవాలి అని సారాంశం.''(ప్లస్ ను వదిలి పోను...అని సెటైర్
వేసాడు చివరలో)
నిజమే చాలా టైం దానికే ఇవ్వాల్సి వస్తుంది...కాని దేశ విదేశాలలో ఉన్న వాళ్ళు
యెంత దగ్గరగా,ఆప్యాయంగా.....పలకరింపులు,సంతోషాలు,బాధలు,సహాయాలు
కలికాలం లో ఇంతటి ఆప్యాయతని టైం కోసం ఎలా వదులుకోవటం.....
కాదు....ఇలా కాదు..మధ్యే మార్గం ...ప్రతి శుక్రవారం రాత్రి ప్లస్లో ఒకరి పోస్ట్లో
రచ్చబండ ...కాదు..కాదు...
రచ్చా స్క్వేర్ బండ పెడితే సరి.....వాళ్ళ రచ్చ అంతా
గుర్తుకు వచ్చి పెదాలపై చిన్న నవ్వు...పెద్దదిగా విరుస్తూ ....నేనంటే పెద్ద కామెంట్స్
పెట్టను ...కాని వాళ్ళ రచ్చ అంతా ఆప్యాయంగా ఫీల్ అవుతుంటాను.
చిన్నగా మెట్లు ఎక్కుతూ ఉంటె మెట్ల పక్కన వేపకొమ్మల నుండి క్రింద ఉన్న
చిన్న గుడి దగ్గర వెలిగే దీపపు కాంతులు వెలుగు నీడలుగా గాలికి ఊగుతూ
ముద్దుగా తొంగిచూస్తున్న వేప పూత ఉగాదిని వాకిళ్లలోకి రమ్మని ఆహ్వానిస్తూ..
బాబుని షార్ట్ టర్మ్ కోసం హాస్టల్ కి పంపి వారం అయింది....వాడు లేకుండా
ఉగాది...పడుకొని చుక్కలు చూస్తూ వాడి అల్లరిలోకి జారిపోయాను....
పక్కన అలికిడి.....ఈయనే ఎప్పుడు వచ్చారో.....''బాబు ఫోన్ చేసాడు ...వాడి ఫ్రెండ్
రేపు వస్తాడంట....ఏమైనా చెయ్యి ..వాడికి రేపు పంపిద్దాము''...నన్నంటాడు కాని
ప్రేమ ఎక్కువ అని వాడిని వదిలి ఫీల్ అయ్యేది ఆయనే ఎక్కువ....చిన్నగా యేవో
మాట్లాడుకుంటూ ఉన్నాము.
''అమ్మా''పెద్దగా కేక పెట్టింది పాప.ఏమైంది ఉలిక్కిపడ్డాము ''ప్రసన్నా ఆంటీ వాళ్ళ నాన్న ఉన్నట్లుంది కింద పడిపోయాడంట''గస పోస్తూ చెప్పింది.
ఈయన టవల్ పైన వేసుకొని పరిగెత్తారు.నేను మిద్ది పైనుండి కిందకు చూసాను.
గార్డెన్ మధ్యలో కింద పోర్షన్ అతను చొక్కా వేసుకుంటూ పరిగిస్తూ ఉన్నాడు.అంటే అక్కడికే ....కాంప్లెక్స్ లో కింద నాలుగు,పైన నాలుగు ఇళ్లు,ముందు చిన్న తోట,పక్కన మూడు కార్లు పెట్టగల పార్కింగ్.
ప్రసన్నా వాళ్ళు కింద పోర్షన్ లో ఉంటారు.
మేము ఫస్ట్ ఫ్లోర్ లో....వాళ్ళ అమ్మ వాళ్ళు కాంప్లెక్స్ పక్కన చిన్న ఇంట్లో ఉంటారు.
ఇప్పుడు వాళ్ళ నాన్న బయట కూర్చొని ఉన్న అతను ముందుకు పడిపోయాడు.
అందరు అక్కడికే వెళుతున్నారు.
నేను కిందకు వచ్చేసరికి ఆడవాళ్ళు ,పిల్లలు అందరు వచ్చేసి ఉన్నారు.
మరి కార్ వచ్చిన వాళ్ళు కావాలి కదా....లాస్ట్ పోర్షన్ లో రియల్ ఎస్టేట్
వాళ్ళు ఉన్నారు.వాళ్ళ ఆయన స్నానం చేస్తూ ఉన్నారు.విషయం తెలీగానే పరిగెత్తి
కార్ తీసాడు.(నేను వెంటనే సెలవలలో కార్ నేర్చుకోవాలి అని నిర్ణయం
తీసుకున్నాను)
ప్రసన్న,వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ను పట్టుకొని ఏమి చెయ్యాలో తెలీక ఏడుస్తున్నారు.
కొత్త కార్ తెలుపు ది మొన్ననే తీసుకొచ్చారు వాళ్ళు....ప్రసన్నా వెంటనే
ఎందుకో వద్దులెండి....ఆటోలో వెళతాము అనింది.వాళ్ళు గట్టిగా అరిచారు.
ముందు మనిషి ముఖ్యం .....ఇవన్ని ఆలోచిస్తావేంటి అని....గబా గబా అందరు కలిసి
హాస్పిటల్ కి వెళ్ళిపోయారు.ప్రసన్నకు ఇద్దరు పిల్లలు.''మానస్,రిషి''మా వారు
రిషిని బండిలో ఎక్కించుకొని వెనకే వెళ్ళిపోయారు.ఇంటి వొనర్ ఆంటీ
అందరికి కుర్చీలు వేసారు. బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాము.
పిల్లలను వళ్ళో కూర్చోపెట్టుకొని.....పిల్లలు....రెండేళ్ళు దగ్గర నుండి ఇరవై
ఏళ్ళ వరకు ఉన్నారు....అందరు బిక్క మొహాలు వేసుకొని ....ఏమి జరుగుతుందో
అని బయపడుతున్నారు.పాపం పిల్లలు ఇక్కడ కలిసి మెలిసి ఉంటారు.
పెద్ద వాళ్ళు చిన్న పిల్లలను దగ్గరకు తీస్తారు,నేర్పిస్తారు....వాళ్ళు అంతే......
మూడేళ్ళ నిశ్చల్ వచ్చాడు వాళ్ళ అమ్మ దగ్గరకు''అమ్మా మానస్ ఏడుస్తున్నాడు''
అన్న ఏడుస్తున్నాడని వాడి కళ్ళలో కన్నీళ్ళు.ఏదో తరగతి చదువుతున్న
మానస్ కళ్ళలో వాళ్ళ తాత జ్ఞాపకాలు నీళ్ళుగా.....వాడొక్కడే మిగిలాడు.
అందరు హాస్పిటల్కి వెళ్ళారు.
వెంటనే అందరం లేసి దగ్గరకు తీసుకున్నాము వాడిని .....నడుముకు చుట్టుకున్న
చేతుల్లోని బయం ,పొట్టకు తగిలే కంటి చెమ్మ తప్ప,ఎవరి బిడ్డ అని తల్లి మనసు
చూస్తుందా....దగ్గరగా తీసుకొని లాలిస్తుంది కాని.
ఫోన్ వచ్చినపుడల్లా ఉలికి పడుతున్నాము....ప్రసన్న వాళ్ళ ఆయన లేడు.
నెల్లూరికి వెళ్ళాడు.ఇద్దరు ఆడవాళ్లే ఉండేది....అందరికి వాళ్ళు ఎవరు అనేది
గుర్తు లెదు...అవతల వాళ్లకి కష్టం అనేది తప్ప...పిల్లలు అయితే...పరిగెత్తి
ఏమి పనులు చెపితే అది చెయ్యటం కలిసి మెలిసి....అవతల వారి కష్టం తీరితే
చాలు అన్నట్లు....అదుగో కార్ వచ్చేసింది.ఎమైందా అని తొంగి చూసాము.
అర్ధం అయిపొయింది...గొల్లుమన్నా ఏడుపులు చూసి.....వొనర్ ఆంటీ పెద్దరికం
తో సూచనలు చెయ్యటం ప్రారంబించింది.మరి భర్తని హాస్పిటళ్ళు అన్నీ తిరిగి
క్యాన్సుర్ కి అర్పించింది.అనుభవం సూచనలు ఇస్తుంది.''కొడుకు పాట్నా లో
ఉన్నాడు.వచ్చేసరికి రేపు సాయంత్రం అవుతుంది....ఐస్ బాక్ష్ తెపొండి''
ఎవరు ఎవరికి చుట్టాలు.....సాటి మనిషికి సాయం చెయ్యటానికి ఏమి కావాలి ...
మనం మనుషులమే అనే స్పృహ తప్ప....శవాన్ని బాక్సలో ఉంచారు.
ఒక్కక్కోరే వస్తున్నారు.అవును అందుకే నలుగురు కావాలి అనేది....నువ్వు
గొప్ప అనుకున్నావో నువ్వు ఒక్కడివే మిగులుతావు........
''యెంత గొప్ప చావు.....ఎనబై ఏళ్ళ మనిషికి ...చక్కగా ఇప్పుడే భార్య పెట్టింది
సంతోషంగా తిన్నాడు...ముందుకు వాలాడు''అనుకుంటూ వెళుతున్నారు.
''త్రయంబకం యజామహే సుగందిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యో మ్రుత్యోవ మామ్రు తాత్''
మృత్యుంజయ స్తోత్రం......మృత్యువుని జయించలేము...కాని మృత్యు
బయాన్ని జయించాలి.ఉన్న కాలాన్ని మన కోసమే కాదు ...పక్క వారి
కోసం కూడా వినియోగిస్తే అదే జన్మకు సార్ధకత.......
దోస పాదు నుండి దోస పండు పండినపుడు దానికే తెలియ కుండా
తొడిమ పాదు నుండి ఊడిపోతుంది.దగ్గరకు వెళ్లి చూస్తె కాని తెలీదు.
అలాగే మన జీవితం నుండి మనకే తెలీకుండా బంధాలు తెంచుకొని
వెళ్లి పోవాలని ఈ మంత్రం చదువుతారు.
''యావత్ పవనో నివసతి దేహే
తావత్ ప్రుచ్చతి కుశలం గేహే
గతవతి వాయవ్ దేహా పాయె
భార్యా బిబ్నతి తసమిన్ కాయే''
భజ గోవిందం....భజ గోవిందం...
''
శ్వాస వెళ్లి పోయినాక మిగిలిన వారే కాదు
భార్య కూడా ఆ కాయాన్ని పలకరించదు''
పక్క రోజు (అంటె ఈ రోజు)ఒక వ్యాన్ వచ్చింది ....ఐ కేర్ హాస్పిటల్
నుండి ...
.ఆయన కళ్ళు డొనేట్ చేసి ఉన్నారు....ఈ గొప్ప విషయం చాలదా
ఆయన కోసం నలుగురు పరిగెత్తి సహాయం చెయ్యటానికి....
జీవితం తరువాత కూడా ఇంకొరికి వెలుగు దానం చేసిన ఆయన
గొప్పదనానికి నమస్కరించాటానికి.......ఉగాది రోజు ఒక కొత్త పాటం......
ఇక్కడ పిల్లలు అంతా కలిసి సహాయం చేసుకోవటం,చిన్న పిల్లలు కూడా
ఒకరి కన్నీళ్లు తుడవటం చూసి నా మనసుకి తృప్తిగా ఉంది.....
''అవును భారతీయ సంస్కృతీ బతికి ఉంది......
చిన్న పిచుకులకు కూడా వరి వెన్నులు పెట్టిన సంస్కృతీ....
పండుగ రోజు ఉన్నంతలో దానాలు చేసి తృప్తి పడే సంస్కృతీ....
మనతో పని చేసే పశువులకు కూడా పూజ చేసే సంస్కృతీ....
కల్లా కపటం లేక కష్ట సుఖాలు పంచుకొనే సంస్కృతీ......
మానవత్వాన్ని మనుషులలో వెలిగించే సంస్కృతీ.....
చిన్న పిల్లల్లో.....ఆ రేపటి దివ్వేల్లో.....
వారి రక్తంలో......వారి హృదయాలను మనం స్వార్ధం తో
వారి హృదయాలను మూసేయ్యకపోతే........
వెలగనివ్వండి...రేపటి మానవత్వాన్ని భారతీయతను ఇందనంగా
పోసుకొని.......మనం కూడా మనుషులం అనిపించుకోవాలి కదా......