Sunday, 27 May 2012

ఇది పిల్లలకు బడి సమయం....పెద్దలకు?


బుజ్జి బుజ్జి పిల్లలు చక్కగా ''తలి నిన్ను తలంచి ''

అంటూ చక్కగా పలకా బలపం పట్టుకొని 
బడిలో చేరాల్సిన సమయం వచ్చింది.

మరి పిల్లల కంటే వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు 
అనే ఆందోళన పెద్దలలో ఎక్కువగా ఉంటుంది.

కొంచం చిన్నా జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు 
బడిలో సమయాన్ని చక్కగా ఉపయోగించుకోగలరు.

ఈ రోజు ఆంద్ర భూమిలో నా ఆర్టికల్ చదవండి.

అ’ అంటే అనురాగం, ‘ఆ’ అంటే ఆటపాటలు

  • - తన్నీరు శశికళ
  •  
  • 28/05/2012
మూడేళ్లు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం చేయస్తూ వేసవి సెలవుల తరువాత 
స్కూల్‌కి పంపటానికి తల్లిదండ్రులు పడే హడావుడి అంతా ఇంతా కాదు. 
వాళ్ళను ఎలా స్కూల్‌లో.. అంత సేపు ఇల్లు వదిలి ఉండేటట్లు ప్రిపేర్ చెయ్యాలి? 
లంచ్ సమయంలో బాక్స్ తీసి తింటారో లేదో? మిగిలిన పిల్లలతో కలిసిపోతారో లేదో? 
ఇవన్నీ కాకుండా చదువులో ముందం జలో ఉంటారో లేదో?
ఇలా చాలా ఆలోచనలు పేరెంట్స్‌కు రావడం సహజం.

పిల్లలపై అనురాగం, ఆప్యాయతలు చూపిస్తూ, ఆటపాటలతో లాలిస్తూ బడికి వెళ్లేలా
 వారిని మానసికంగా సిద్ధం చేయాలి. 
ముందుగా పిల్లలకు బొమ్మల పుస్తకాలు కొనిచ్చి మీరే ఒక్కో బొమ్మ చూపించి 
దాని గూర్చి చెపుతూ, 
‘ఇది నీ పుస్తకం.. జాగ్రత్తగా ఉంచుకో..’-అని చెపుతూ పుస్తకాలు చదివించాలి.
దానిలో బొమ్మలు ఉంటాయనే ఆలోచన మెల్లగా వాళ్ళలో ప్రవేశపెట్టండి.
 ఇంకా పలక, బలంతో వాళ్లు గీతలు, సున్నాలు రాసేలా ప్రోత్సహించండి.
 ఆ పుస్తకాలు, పలక బ్యాగ్‌లో పెట్టడం నేర్పించండి. అలా స్కూల్‌కి వెళ్ళటానికి
 వారిని సిద్ధం చెయ్యండి.

మామూలుగా పిల్లలకు నాలుగు విషయాలు రావాలి.
స్కూల్‌కి వెళ్ళటం ద్వారా... చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం. 
వీటిలో వినటం, మాట్లాడటం మనం వాళ్ళకు ఇంట్లోనే చక్కగా నేర్పించవచ్చు.
 తద్వారా వాళ్ళు స్కూల్‌లో మిగిలిన రెండూ నేర్చుకుంటారు. 
మామూలుగా ఇవి పక్కవాళ్ళతో, మనతో ఉంటూ నేర్చుకుంటారు. 
కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగా నైపుణ్యాలు పెరుగుతాయి. 

ముఖ్యంగా తల్లిదండ్రులిద్దరూ దీనిపై శ్రద్ధ వహించాలి.
కచ్చితంగా రాత్రి నిద్రపోయేముందు పిల్లల పక్కన పడుకొని బొమ్మల పుస్తకాలు 
తీసుకొని, బొమ్మలు చూపిస్తూ కథలు చెప్పాలి. 
వాళ్ళు ఊ కొడుతూ వింటూ ఇంకా.. ఇంకా అన్నారంటే శ్రద్ధగా వింటున్నారని అర్థం. 

దీనివలన వారిలో ఊహాశక్తి కూడా పెరుగుతుంది. వీడియోలు చూపిస్తే లాభం లేదు. 
పుస్తక పఠనమే పిల్లలకు అలవాటు చెయ్యాలి.
ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
కథ మరీ పెద్దది కాకూడదు. చెప్పిన కథే కొన్ని రోజులు చెపుతూ ఉండాలి.
కథ ఎప్పుడూ సుఖాంతంగా ఉండాలి.
ఇంకా మధ్యలో జంతువుల అరుపులు అవీ కూడా చెప్పగలిగితే వారికి
అది కూడా ఒక ఆటలాగా ఉంటుంది. 

మాట్లాడటం అలవాటు చెయ్యటానికి వాళ్ళని- ‘అమ్మకు కథ చెప్పు’ అని అభినయంతో
చెప్పేటట్లు ప్రోత్సహించవచ్చు. వినేవాళ్ళుకూడా భలే భలే అని వారిని అభినందించాలి.
 ఇంకా కొందరు స్కూల్‌కి వెళ్ళేలోపు ఇంట్లోనే అక్షరాలు కూడా నేర్పిస్తూ ఉంటారు.
ఇందులో తప్పేమీ లేదు. కానీ కొంచెం వాళ్ళ వేళ్ళకు శ్రమ లేకుండా చూసుకోవాలి.
 రాయించటం కంటే ఆ అక్షరాలు ఎక్కడ ఉన్నా.. అంటే పేపర్లో, టీవీలో గుర్తుపట్టేటట్లు
 ప్రోత్సహించాలి.
 చిన్న చిన్న రైమ్స్ (తెలుగు అయితే మేలు. మాతృభాష మననుంచే వారికి రావాలి)
 పలికించి డాన్స్‌చేయిస్తే చదువంటే ఒకేసారి భయపడకుండా ఉంటారు.

ఇంకా కొంతసేపు మీ నుండి దూరంగా ఇరుగుపొరుగు పిల్లలతో ఆడుకునేటట్లు చెయ్యాలి. 

ఇక వాటర్ బాటిల్ తీసి తాగటం, బాక్స్ ఓపెన్ చేసి తినటం, తినేముందు చేతులు కడుక్కోవటం ఇలా...
 అప్పుడప్పుడూ చేయిస్తుంటే కొత్తగా ఫీల్ అవ్వరు. 
ఎలాగూ బడిలో టీచర్లు ఇవన్నీ చూసుకొంటారు. కొంచెం మనం అలవాటు చేస్తే బాగుంటుంది. 
ఒకటి మాత్రం నిజం. అమ్మానాన్నల పర్యవేక్షణలోనే పిల్లలు అన్ని విధాలా చక్కగా ఎదుగుతారు.
‘మనం వాళ్ళకు ఇవ్వాల్సింది డబ్బు కాదు.. సమయం, ప్రేమ మాత్రమే’’.

1 comment:

వనజవనమాలి said...

baagaa cheppaaru Shashi..
Congrats!!