Tuesday, 4 September 2012

సత్యభామ సరదాలు 4(2)

సత్యభామ సరదాలు 4(2) ...రెండో భాగం 
జరిగిన కధ:సత్య మీద చిన్న విషయానికి మూర్తి 
కోప పడ్డాడు అని, సత్య మాట్లాడకుండా అలుగుతుంది.
అతను ఆఫీస్ కి వెళ్ళిన తరువాత వెనుక ఇంట్లో గొడవ 
జరుగుతూ ఉంటె చూస్తూ ఉంటుంది.ఈ లోపల కాలింగ్ బెల్ మోగితే
 తెరవటానికి వెళుతుంది.

తలుపు తీసి చూసిందిఎవరై ఉంటారా ఈ టైం లో అనుకుంటూ...
ఎదురుగా వెంకటమ్మ ,సత్య పని మనిషి.మొహం దిగులుగా వాడి పోయి ఉంది.
''ఏమి ఉదయం రాలేదు?''అడిగింది సత్య కోపంగా.
''ఏమి చేసేదమ్మా ,మా ఇంటాయానికి బాగాలేదు .ఆస్పత్రికి 
వెళ్లి సూపిచ్చుకొని వస్తుండా?''కదిలిస్తే కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి.

అంతా బాగానే ఉంది కాని నీకు ఇంటాయన ఎక్కడి నుండి వచ్చాడు?
ఆసక్తిగా అడిగింది సత్య.
వెంకటమ్మ పదిహేను ఏళ్ళ ప్పుడే ఒకరి తో 
వెళ్లి పోయింది.వాళ్ళ బాషలో లేచి పోయింది.
మోజు తీరగానే వాడు వదిలేసాడు.తరువాత ఇంకో పెళ్లి.
వాడు సాయంత్రం అయితే తాగుడు,తన్నుడు.
ఇక లాభం లేదు.బతికుంటే చాలని వాడిని వదిలేసింది.
(నయం వాళ్ళలో  ఈ మాత్రం స్వేచ్చ ఉంది.లేకుంటే అన్నానికి కూడా 
లేక చచ్చి పొయ్యేవాళ్ళు...పరువు ..పరువు అంటూ)

తరువాత ఇంకో పెళ్లి అయితే వాడికి ఎప్పుడూ అనుమానమే.
కూర్చున్నా, లేస్తున్నా ఎవరో ఒకరికి ముడి పెట్టి వీదిలోకి 
లాక్కొచ్చి తన్నటమే.
ఇవన్ని పడ లేక అందర్నీ వదిలేసి హాయిగా అందరిళ్ళలో 
పని చేసుకుంటూ ఒక్కటే ఉంటూ ఉంటుంది.నమ్మకస్తురాలు.
చక్కగా పని చేస్తూ ఉంటుంది అని అందరు అభిమానిస్తారు.
పనిలో పని అందరికి అక్కడివి ఇక్కడికి,ఇక్కడివి అక్కడికి 
కబుర్లు మోసుకేలుతూ  ఉంటుంది.
లేకుంటే ఈ అపార్ట్మెంట్స్ లో ఎవరు ఎవరో కూడా తెలీదు.

''చెప్పవే....ఈ ఇంటాయన  ఎవరు?''అడిగింది.

రెండో వాడె నమ్మా,వంట్లో బాగా లేదు .ఇంత గంజి 
పోసే వాళ్ళు లేక నా దగ్గిరికి  వచ్చేసాడు''
''ఎందుకు రానిచ్చావే?మళ్ళ తాగి తన్నటానికా?
నీ డబ్బులు లాక్కొని నిన్ను పస్తులు ఉంచటానికా?''
అసహ్యంగా మొహం పెట్టి అడిగింది.

''పోనీమ్మ పరాయ్యోల్లకైనా బాగా లేకుంటే సాయం చెయ్యమా...
యెంత తన్నినా మొగుడే కదా...ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి 
తాగి నపుడు తన్నినా తాగనపుడు భలే సూసుకోనేవోడు .
నువ్వు నా లచ్చిందేవి అనేటోడు''ఏమి గుర్తుకు వచ్చిందో 
సిగుపడుతూ నవ్వుకుంటుంది.
పిచ్చి మొహం ది ..మొగుడంట..మొగుడు...ఏమిటి గొప్ప?
మండిపోతూ ఉంది సత్యకి.
''నీ మొహం అందర్నీ నమ్మేస్తావు.వాడికి బాగా దొరికావు 
చాకిరికి...ఇంతకీ జబ్బు ఏమిటి?''
''ఏమోనమ్మా  ఒకటే దగ్గుతున్నాడు,పుల్ల  లాగా అయిపోయి నాడు.
ఆస్పత్రికి వెళితే రక్త పరిక్ష అని రక్తం తీసుకొని రేపు రమ్మన్నారు.
మళ్ళా ఆసుపత్రికి రేపు పోవాలా...నువ్వు ఇబంది పడుతుంటావు అని 
ఇట్తోచ్చినా.''
వివరాలు  విన్న సత్య ఉలిక్కిపడింది.''దగ్గా కొంపతీసి జ్వరం కూడా వస్తుందా?''
''అవునమ్మా,అమ్మ అందుకే ఓ రెండు వందలు ఇయ్యమ్మా
ఈ సారి లెక్క అప్ప చెప్పేస్తా''
దేవుడా భయం తో గుండెల మీద చెయ్యి వేసుకొని ....కొంపతీసి 
క్షయ,ఎయిడ్స్ బాప్రే...తనకు వచ్చిన ఆలోచనకే చిగురాకులా 
భయం తో వణికి పోయింది.

వణుకుతున్న కంటం  తో ''ఒసేయ్ నువ్వు రెండు వందలు 
ఏమి మళ్ళ ఇవ్వక్కర్లేదు కాని వాడికి ఏ రోగమో ఏమో ,
అంటూ వ్యాదేమో వాడు పిలిచినా వేల్లవాకే ...
ప్రాణాలకే ప్రమాదం''పరుగున వెళ్లి మూడు వందలు తెచ్చి 
చేతిలో పెట్టింది.
భయం తో సత్య గుండెలు దడ దడ లాడిపోతున్నాయి. 
వెంకటమ్మ అదేమీ లెక్క చెయ్యటం లేదు 
''పోనీండి  వెదవ ప్రాణాలు.వాడిని అట్టా సూస్తుంటే 
ప్రాణం తరుక్కొని పోతుంది.అందరం ఎప్పుడో ఒకప్పుడు 
సచ్చేవాల్లమే.మొగుడు కదా ..ఎట్ట వదిలేస్తాము''
వెళ్ళిపోయింది.

హతాసురాలై పోయి అలాగే దిగులుగా కూర్చండి పోయింది
సత్య.యేవో ఆలోచనలు....సాయంత్రం  అయినా అన్నం తినలేదని 
కూడా గుర్తుకు రాలేదు.అలాగే పడుకొని గమ్మున ఉండిపోయింది.
ఒక్క సారి పక్కింటి ఆమె నవ్వు గుర్తుకు వచ్చింది.
మళ్ళా మనసు బగ్గుమన్నది.చా...మొగుడు అయితే ఏది 
పడితే అది అనేస్తాడా?నాకు మనసు ఉండదా?నేను మనిషిని 
కాదా?చా అసలు ఇంకా మాట్లాడకూడదు.
మనం మనిషి అని గమనింపు లేని వాళ్ళతో ఏమిటి మాట్లాడటం.
మనసు కలుక్కుమనింది.ఈ లోపల మళ్ళా కాలింగ్ బెల్...
ఆయనే అయి ఉంటారు అనుకుంటూ వెళ్ళింది...
(సశేషం....ఈ సారి తప్పకుండా ఇద్దరినీ కలిపెస్తాను...
మీ మీద ఒట్టు)

4 comments:

మాలా కుమార్ said...

కథ బాగుంది .

Geeta said...

hmm..kalipeyali kachitanga:)

సుభ/subha said...

శశి గారూ గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలండీ మీకు.

జలతారు వెన్నెల said...

అన్యాయం, మళ్ళీ కాలింగ్ బెల్ దగ్గరే ఆపారు.. తొందరగా రాయండి శశి గారు.