Tuesday, 25 February 2014

హర హర మహాదేవ ... ఆశ్రిత మందారా

హర హర మహాదేవ ... ఆశ్రిత మందారా 
నాకు కృష్ణుడు అంటే  బోలెడు ఇష్టం . 
శివుడు అంటే బోలెడు గౌరవం . 
ఎందుకంటె ఇదిగో మా అమ్మమ్మ వాళ్ళ 
ఇంట్లో చిన్నప్పటి నుండి ఈ రామేశ్వరం ఫోటో 
చూస్తూ పెరిగాను . హాల్ లో వేలాడదీసిన 
ఊయల పై పెద్ద ఊపులు ఊగుతూ ఆ ఫోటో 
దగ్గర కు వెళ్ళినపుడు ఫోటో ఇంకా పరిశీలనగా 
చూసేదాన్ని . ఇప్పుడు ఈ ఫోటోలో సీతా రాములు 
ఒక జంట ,శివ పార్వతులు ఒక జంట . కాని నాకెందుకో 
శివ పార్వథులనె చూస్తూ ఉండేదాన్ని . 

ఆ కధ  కూడా తెలుసు .  

(my old post odugu yeduguthavu link )

అసలు పెళ్లి మంత్రాలు సంస్కృతం లో ఉండేసరికి 
వాటి విలువ చాలా మందికి తెలీడం లేదు . 
పెళ్లి కొడుకు చెపుతాడంట 
''సఖీ నీ ద్వారా పది మంది సంతానాన్ని ఇవ్వు . 
పదకుండో  బిడ్డగా నన్నే స్వీకరించు '' అని . 

భారత దేశం లో పెళ్లి ముఖ్యంగా ''గృహస్థ ఆశ్రమ ''
నిర్మాణానికి , పిల్లలను కానీ పితృ ఋణం 
తీర్చుకోవడానికి ఉద్దేశింప బడినది . దానికి 
భార్య చాలా ముఖ్యం . ఏదో లే ఒక ఒక మనిషి 
ఉంది అన్నట్లు కాకుండా ... నిజంగా భార్య ను 
ఎలా గౌరవించాలో ఇద్దరి సమతుల్యత లోనే 
జీవితం తృప్తి గా ఎలా సాగుతుందో ''అర్ధ నారీశ్వరుడి ''
గా శివుడు ఆచరించి చూపాడు . 
సమస్య లు వచ్చినపుడు నీదే తప్పు అంటే నీదే తప్పు 
అనుకోవడం కాకుండా ... అవతలి  ప్రేమతో 
వారి కోణం నుండి కూడా ఆలోచిస్తే ,భార్య ను 
తగు రీతిలో గౌరవించి ఒకరికి ఒకరు గా మాత్రమె 
కాదు .... ఒకరిలో ఒకరుగా జీవిస్తారు . 

''బ్రహ్మ కుమారీ '' లో చెపుతారు . శివుడు వేరు , 
  శంకరుడు వేరు . శంకరుడు కూడా ''శివ శక్తి ''
కోసం నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు అని . 

 అది నిజం . లింగోద్భవ కధలో నేల నుండి నింగికి 
ఎగిసి ఆది అంతాలు లేని ఒక శక్తి స్వరూపాన్ని 
ఆ రోజే శివరాత్రి అని ఒక కధనం . 

ఏది ఏమైనా పురుషుడు శ్రమ , స్త్రీ ప్రేమ శక్తి . 
శక్తి ని తనకు అనుగుణంగా ప్రేమతో మార్చుకొంటే 
వారి అనురాగ లయ విన్యాసాలకు పుడమి మొత్తం 
పులకరించి పచ్చల అందాలు అద్దుకుంటుంది . 
ప్రకృతి పురుషుల సంగమమే సృష్టి కి అస్తిత్వాన్ని 
అందిస్తుంది . 
దాని గూర్చి  పోస్ట్ ఇప్పుడు లింక్ ఇస్తున్నాను . 
చదివి ఆ ఆది దంపతుల ఆశీస్సులు పొందండి . 
   ''హర హర మహాదేవ శంబో  శంకర ''
                     @@@@@ 
(నిజానికి ఏమి పోస్ట్ వేయడానికి ఈ ''రాష్ట్ర విభజన ''
సమయం లో మనస్సు రాలేదు . చెప్పలేను కాని 
ఇక్కడ అందరి లో బయటకు రాని  ఏదో బాధ తో 
ఉన్నారు . కనీసం దుఖం రూపం లోనో లేదా 
కోపం రూపం లోనో లేదా నిరసనగా నో అది 
బయటకు రాకుండా  ఉండి ,ఒక రకమైన నిర్వేదం 
అందరిలో ఇక్కడ చూస్తున్నాను . 
రాజధాని కోసం పై వాళ్లు  ఏదో కొట్టుకుంటున్నారు ,
 స్వార్ధ పరులు  హడావడి చేసుకుంటున్నారు . 

కాని నిజంగా సామాన్యుడి కి తన జీతం గురించి 
పిల్లల చదువులు , కొలువుల గురించి  చెప్పలేని 
దిగులు .   దగ్గరకు తీస్తుంది అనుకున్న అమ్మ 
 వీపు మీద బాది రూం లో పడేస్తే మోకాళ్ళలో 
 పిల్లవాడు దిగులు . చేసేది లేదు . జీతాలు 
ఇబ్బంది  మాత్రం  దాని పై ఆధార పడిన 
వ్యాపారాలు అన్నీ కుదేలే .  ఏమీ  చేయలేము . 
కాలం  నడవడం తప్ప )

Tuesday, 18 February 2014

గొప్పలు ఎందుకు?

ముద్ద నోట్లో  పెట్టుకోగానే మొహం లో రంగులు మారిపోయాయి 
నరేష్ కి . ''ఛీ ఉప్పు'' అనుకోని పక్కన తింటూ ఉండే ఫ్రెండ్స్ 
వైపు చూసాడు మొహమాటంగా ఏమి అనుకుంటారో అని .... 
వాళ్ళకి  కూడా నచ్చకపోయినా మొహమాటానికి మౌనంగా 
తింటూ ఉన్నారు . కోపం తో భార్య వైపు చూసాడు . 

 కాపురానికి వచ్చి మూడు రోజులు అయింది . 
ఊరు కాని ఊరుకు వచ్చీ రాగానే 
''నువ్వు వంట బాగా చేస్తావు అని 

మీ అమ్మ వాళ్ళు   చెప్పారు . 
మా ఫ్రెండ్స్ అందరికి ఆ విషయం చెప్పాను . 
ఈ రోజు భోజనానికి పిలిచాను అని ''
పురమాయించే సరికి ఉదయం నుండి పది 
 మందికి ఒక్కటే అన్నీ సిద్ధం చేసింది . కొంచెం ఉప్పు ఎక్కువ 
అయినందుకు ఈ కోపం . 
కళ్ళ నీళ్ళు నింపుకుంటూ మౌనంగా 
లోపలి వెళ్ళింది . 

  వెనుకనే లోపలి కి వెళ్ళింది సరిత . ఓదార్పుగా చూస్తూ 
''పర్లేదులే రమా ,మరీ తినలేనంత ఉప్పు కాదు . పప్పు 
చాలా బాగుంది తెలుసా ?'' చెప్పింది ప్రేమగా . 

''లేదండి నాకు కొంచెం వంట వచ్చు కాని ఇంత మందికి 
ఎప్పుడూ చెయ్యలేదు . నేను నీ వంట గూర్చి గొప్పగా 
చెప్పాను నువ్వు సూపర్ గా చెయ్యాలి అని ఉదయం 
నుండి టెన్షన్ పెట్టారు . పొరపాటుగా ఉప్పు ఎక్కువ అయింది ''
బాధగా చెప్పింది . 

''పర్లేదులే నువ్వు మా నరేష్ భార్య వనే అభిమానంతో నిన్ను 
ప్రేమగా చూసుకుంటాము కాని నువ్వు వంట బాగా  చేస్తావనో 
కట్నం తెచ్చావు అనో  ఇంకోటో ఇంకోటో  గొప్పతో కాదు . 
అయినా అందరి  ముందు విసుక్కో కుండా భర్త గౌరవం 
కాపాడుతూ లోపలి వచ్చావు . ఈ సంస్కారం చాలదా 
నిన్ను గౌరవించడానికి ?ప్రేమించడానికి ?''
మెల్లిగా కళ్ళు తుడుచుకుంది రమ. 

''నువ్వేమి బాధ పడ వాకు నరేష్  ఏదో భార్య గొప్ప 
చెప్పాలి అని తెలీక చేసి ఉంటాడు . నేను చెపుతాలే . 
ఈ సారి వారం మా ఇంటికి రండి . నువ్వు  ఆ రోజు 
తొందరగా వచ్చి హెల్ప్ చెయ్యక పోతే ఉప్పే కాదు 
కారం కూడా ఎక్కువ వేసి కసి తీర్చుకుంటాను ''
నవ్వుతూ తమాషాగా చెప్పిన సరిత ను చూసి ఆపుకోలేక 
రామ కూడా నవ్వేసింది . 
''అదీ అలాగే నవ్వుతూ ఉండు ''చెప్పింది ప్రేమగా సరిత . 
తరువాత నరేష్ దగ్గరకు వెళ్ళింది . 

''సారీ సరిత మిమ్మల్ని భోజనానికి పిలిచి మంచి 
భోజనం పెట్టలేకపోయాను . ''చెప్పాడు కొంచెం బాధగా . 

''పర్లేదు నరేష్ తను ఆ మాత్రం చేయడం గొప్ప కదా . 
మేము ఏమి అనుకోవడం లేదు . 
నువ్వే ముందు ఎక్కువ చేసి చూసుకున్నావు . 
ఇప్పుడు బాధ పడుతున్నావు . నీకు రవి తెలుసు కదా ,
మా బంధువుల అబ్బాయి ''

''తెలుసు ఎల్ . కె. జీ నుండి ఫర్స్ట్ రాంకర్ కదా ,
మంచి జీనియస్ అని చెపుతుంటావు. ఇప్పుడు 
ఎంసెట్ కూడా బాగా వ్రాసి ఉంటాడు కదా ''
చెప్పాడు నరేష్ . 

''అవును జీనియస్ .... కాని ఇప్పుడు ఈ ప్రపంచం లో లేడు '' 

ఉలిక్కిపడ్డారు నరేష్ తో పాటు మిగిలిన మిత్రులు . 
అమాయకంగా ఎప్పుడూ పుస్తకాలు 
ముందు వేసుకొని చదువుకుంటూ 
ఉండే రవి మొహం గుర్తుకు వచ్చి అందరి కన్నులపై 
సన్నటి నీటి పొర . 

''ఏమైంది '' ఒకే సారి అన్నారు . తాము విన్నది 
తప్పు అయితే బాగుండును అనుకుంటూ . 

''ఏమవుతుంది ? ఎంసెట్ లో ఫస్ట్ రాంక్ రాదేమో అని 
రిజల్ట్స్ రాక ముందే దిగులుపడి ఆత్మహత్య 
చేసుకున్నాడు ''

సరిత కళ్ళ నుండే జాలువారే కన్నీరు రవితో తనకు 
ఉండే అనుభందాన్ని ఒక సారి తడుముకుంటూ ఉంది 
జ్ఞాపకాల నీడల్లోకి మసక వెలుతురు లాగా వెళ్లి . 

''ఆ అబ్బాయి దిగులుగా ఉండేది ఎవరు గమనించలేదా ?
 అయినా ఫస్ట్ రావాలి అని అంత పట్టుదల ఎందుకు ?''
బాధగా అడిగాడు నరేష్ ... పూయకుండా నేల రాలిపోయిన 
చిన్నారి మొగ్గ ను గుర్తు చేసుకుంటూ . 

''చిన్నప్పటి నుండి వాడి తెలివి కి అన్నీ ఫస్ట్ రాంక్స్ 
వచ్చేవి . ఇక వాళ్ళ పేరంట్స్ సంతోషం చెప్పలేము ... 
అడిగిన వాళ్లకు అడిగిన వాళ్లకు ఒకటే చెప్పడం వాడి రాంకుల 
గూర్చి . వాడిని ఒక షో పీస్ చేసేసరికి .... వాడికి 
అది అలవాటు అయిపోయింది . ఎప్పుడైనా రాదేమో అనిపిస్తే 
రాత్రి అంతా మేలుకొని చదివే వాడు . ఎలాగో సాదించేవాడు . 
అప్పటికీ వాళ్ళ నాన్నకు చెప్పేదాన్ని . ఎందుకు అలాగ 
అందరికి గొప్పలు చెప్పుకోవడం  వాడి పై అంత టెన్షన్ 
పెట్టొద్దు . వాడి ని లైఫ్ ని కూడా కొంత ఎంజాయ్ చేయనీయండి . 
చదువే జీవితం కాదు అని . 
కాని వాళ్ళ నాన్న వాడు నా కొడుకు సరిత సాధిస్తాడు చూడు 
అనేవాడు . ఇక వాడికి జీవితం లో ఎంత టెన్షన్ అయిన వాళ్ళే 
సృష్టించారో చూడండి . ఇప్పుడు పిల్లవాడే ప్రాణాలతో లేక 
పోయినాక ఆ ప్రాణం లేని రాంకులు ఏమి చేసుకుంటారు '' 

''ఇప్పుడు ఫస్ట్ రాకపోతే ఏమి కొంపలు మునిగి పోయాయి . 
దేవుడు ఏ రాత రాసుంటే ఆ తీరానికి చేరేంత మాత్రం 
కృషి చేస్తే చాలదా !పోయిన ప్రాణాలు తీసుకు రాగలరా ?
ఎవరు ఎంత సున్నితంగా రియాక్ట్ అవుతారో ఎవరికి తెలుసు ?''
బాధగా అన్నాడు నరేష్ . 

''ఇప్పుడు నువ్వు చేసింది మాత్రం తప్పు కాదా ?నువ్వు 
టెన్షన్ పెట్ట బట్టే కదా రమ ఉప్పు ఎక్కువ వేసింది . 
మళ్ళా నువ్వు తప్పు చేసి కోపం తన పైన చూపుతున్నావే ?''
నిలదీసింది సరిత . 

''సారీ రమ '' మనస్పూర్తిగా చెప్పాడు . 

''నువ్వే కాదు నరేష్ ,అందరు అలాగే ఉన్నారు . 
ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవడమే . దాని వలన 
ఏమి జరుగుతుంది ?టెన్షన్ పెరగడం తప్ప . ... 
కారు గొప్ప చెప్పుకుంటే దానికి రిపేర్ వస్తే 
అవమానం ,ఆస్తి గొప్ప చెప్పుకుంటే నష్టాలు 
వస్తే అవమానం ,పెళ్లి గొప్పలు చెప్పుకుంటే 
ఎంగిలి ఆకులగానో ,వాడిపోయిన పువ్వులగానొ 
మారిన డబ్బులకు లక్షల్లో అప్పులు,వడ్డీలు  కట్టుకుంటూ
మనసులోనే కుములుతుంటారు . ఎక్కడో 
దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం . 
మన మెప్పు అవతలి వాళ్లకు ప్రోత్సాహంగా మాత్రమె 
ఉండాలి కాని ,గొప్పలతో  టెన్షన్ పడేలా ఉండొద్దు . 

గొప్పలు చూపిస్తేనే లోకం లో ఫ్రెండ్స్ ఉంటారు 
అనుకుంటే అటువంటి వాళ్ళు మనకు గొప్పలు 
లేనపుడు మిగలరు . అలాంటి వాళ్ళు వెళ్లి పోయినా 
బాధ పడక్కర్లేదు . మన వ్యక్తిత్వం తో అభిమానించేవాళ్ళు 
కొందరు ఉన్నా చాలు . 
అందుకే పెద్దలు చెప్పారు 
''గంగి గోవు పాలు గరిటడు అయినా చాలు '' 
నిజానికి అలాంటి మంచి వాళ్ళతో 
ఉన్నపుడే మన ప్రశాంతంగా ఉండగలం ''. ... చెప్పింది సరిత . 

అవునని ఒప్పుకున్నారు అందరు . 
                 @@@@@@   

Wednesday, 12 February 2014

నేను అంటే ఏమిటో ?

''అమ్మా నేను ఒక్కదాన్నే రెండు గంటలు 
ప్రయాణం చేసి సి . టి . ఎస్ . జాబ్ డ్రైవ్ కి 
వెళ్లి వచ్చాను '' పాప ఫోన్ లో ఉత్సాహంగా 
చెపుతూ ఉంది . 
ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాను . ఒక్కటే బెంగుళూరు లో ... 
వెళ్లి  వారం కాలేదు. కనీసం మాతో చెప్పలేదు . 

''నిన్ను ఒక్కటే ఎవరు పొమ్మన్నారు . మాకు చెప్పే పని 
లేదా ? ఫ్రెండ్స్ ఏమయ్యారు ?''కొంచెం కోపం ,భయం 
కలగలుపుకొని గట్టిగానే అడిగాను . 

''వాళ్ళు ఈ డ్రైవ్ ముందే చేసారు . నలుగురు అందుకే రాలేదు . 
ఇదంతా ఇక్కడ కామన్ . ఎంత మంది డ్రైవ్ కి వస్తారో తెలుసా ?''

''కనీసం సువర్ణ పిన్ని కి  చెప్పకూడదా ?అసలు వాళ్ళు ఉన్నారు 
అనే కదా పంపాను '' ఇంకా కోపం తగ్గలేదు నాకు . 

''అమ్మా వాళ్లకి మధ్యలో ఫోన్ చేస్తూనే ఉన్నాను . నేను 
ఇలాగ ఒక్కదాన్నే ఫేస్ చేసినందుకు నువ్వు సంతోషిస్తావు  
అనుకున్నాను . ఈ జీవితం ఇలాగే ఉంటుంది . ఒక సారి 
సాఫ్ట్వేర్ ఎన్నుకుంటే దీనికి తగ్గట్లు ఈ నైపుణ్యాలు అన్నీ 
నేర్చుకోవాలి . లేదంటే ఈ దారి ఎన్నుకోకూడదు . 
జీవితాన్ని బట్టి ఒదిగి గెలవడమే నైపుణ్యం ''చెప్పింది . 

నిజమే ఇవన్నీ వాళ్ళు జీవితం లో సవాళ్లు ఎదుర్కున్నప్పుడల్లా 
నేను చెప్పి ధైర్యాన్ని నింపిన మాటలు . ఎలా మర్చిపోయాను 
 మాటలు . నేను  ఏమి  అయిపోతున్నాను . నా ధైర్యం 
ఎక్కడకు పోయింది ?

ఆడపిల్ల తల్లిని అనే భయం నాకెందుకు ఇప్పుడు ఇంత గట్టిగా 
ఎదురు అవుతుంది ?ఒక చదువుకొని ఉద్యోగం చేస్తున్న 
తల్లికి కూడా తన ఆడపిల్ల భద్రత విషయం లో ఈ సమాజం 
భరోసా ఇవ్వలేకపోతుందా ?హ్మ్ :(
మొన్న చాణుక్య ఒక విషయం షేర్ చేసాడు . 

''don't teach your girl how to dress 
teach your boy how to behave'' 

నిజంగా ఆడపిల్ల భద్రతా భయం తో సమాజం లో 
పిల్లల పెంపకం లో జెండర్ సమతుల్యతను 
దెబ్బ తీస్తున్నామా ?నా పిల్లలైనా చక్కగా 
పెరిగేటట్లు ప్రార్ధన చేస్తాను . సరే ఎంత మంది 
కోసం చేసినా అదే ప్రార్ధన కదా .... నాలాటి తల్లులకు 
పుట్టిన లక్షలాది పిల్లల మానసిక పెరుగుదల 
బాగుండాలి అని ఆ విశ్వ శక్తిని ప్రార్ధిస్తాను . 

''అచంచలమైన భారతీయ ఆత్మ  మా బిడ్డలందరి 
వెన్నెముకలు ద్రుడతరం చేయుగాక 

మానసిక కల్లోల్లాలు , పాశ్చాత్య పోకడలు అలలు 
వలె విరుచుకపడినా అమేయ మానసిక స్థిరత్వం తో 
ఒడ్డు  వలె నిలుతురుగాక    

వివేకానంద రాక్ లో  వెలిగిన చైతన్య జ్యోతి అందరి  
 హృదయాలనూ  వెలిగించుగాక 

ప్రకాశ కిరణాలుగా మారి వీరంతా ప్రపంచానికి 
వెలుగునిచ్చెదరు గాక ''

''అసతోమా సద్గమయా 
ప్రభూ వీరందరినీ నేను అంటే ఒక శరీరం కాదు 
అందరిలో ప్రతిపలిస్తున్న ఒక ఆత్మ 
అనే సత్యం వైపు నడిపించు ''

''తమసోమా జ్యొతిర్గమయా 
శరీర సుఖాలే పొందవలిసిన లక్ష్యము 
కాదు , విద్యా వివేక వినయాలతో 
నలుగురి కోసం బ్రతికినపుడే మనిషి 
బ్రతుకు కు పరమార్ధం 
అనే జ్ఞానాన్ని కలిగించు '' 

'' మృత్యోర్మా అమృతంగమయా 
తనలోని ఆత్మనే విశ్వమంత టి లో 
దర్శించినవాడు చనిపోయినా జీవం తో ఉండగలడను
జ్ఞానాన్ని ప్రసాదించు '' 

ఏమిటో ఈ మధ్య కధలు వ్రాయాలి అని తెగ అనిపించేస్తుంది . 
మొన్న తొమ్మి దో తేది  ఆదివారం ''ఉమా మహేశ్వర రావు '' 
గారి ''తొలి కధల'' మీద  ఆయనతో ''వాడ్రేవు వీర లక్ష్మి '' 
గారితో నెల్లూరు లోని ప్రభవ లో చంద్రా మేడం గారు 
''ఒక ఆత్మీయ ముచ్చట '' పెట్టారు . 
ఎలాగో కష్టపడి గొన్ని గంటల వెసులుబాటు తో 
అక్కడకు వెళ్లాను . ఎప్పుడో కనిపించే నన్ను 
నెల్లూరు రచయితలు అందరు చక్కగా రిసీవ్ 
చేసుకున్నారు . 
ఈ తొలి కధల ముచ్చట్ల లో భాగంగా అక్కడ చిన్న 
చర్చ వచ్చింది . ఆదేమిటి అంటే ''కధల్లో మాండలీకం 
వాడటం ఎందుకు ?'' 
''వాడకుంటే  బాగుంటుంది .ఎక్కువగా తప్పుడు మాటలు 
వస్తునాయి అని వీరలక్ష్మి గారి అభిప్రాయం '' 
నిజమే కాని ... నేను ఏమి చెప్పాను అంటే 
''కవిత అనే ప్రక్రియలో మనం మాండలికాన్ని దాచలేము . 
కధ అనే లైబ్రరీ లోనే దాన్ని మనం దాచుకోగలము . 
మాండలికం లో వ్రాసినపుడు అందరు మనది ఈ కధ 
అని భావిస్తారు '' అని చెప్పాను . 
మరి మీ అభిప్రాయాలు ఏమిటో మీరే ఆలోచించుకోండి . 

''తొలి కధలు '' మీద నా అభిప్రాయం ఈ సారి వ్రాస్తాను . 

ఇంటికి తిరిగి బస్ లో వస్తుంటే .... కొత్త పుస్తకం చేతిలో 
ఉంటె ఊరుకో బుద్ది కాదు . ''తొలి కధలు '' తీసి చూసాను . 
నా కొత్త సాహిత్య స్నేహితుడు ఉమా మహేశ్వర రావు 
గారు వ్రాసిన కామెంట్ చూసి ఆలోచనలో పడ్డాను . 
''కథలతో  జీవిస్తున్న శశి కళ  గారికి '' 
ఇంకో కొత్త ఐ . డి . నాకు . 

 పుట్టినప్పటి నుండి ఎన్ని గుర్తింపులు .... 
నాలోని ఒక్క నేను కు ఎన్ని విశేషణాలు.... 
ఇవన్నీ నేనేనా ? ఈ  రోజు ఉండే నేను మాత్రమె నేనా ?
లేక ఇవన్నీ కలిపిన నేను నేనా ?
ఏ నేను నేను ?
ఈ వాదం ముగిసేది కాదు .  తరిగేది కాదు .     


Saturday, 1 February 2014

''స్వర్ణముఖీ సవ్వడులు'

పోయిన ఏడాది ఏప్రిల్ లో వచ్చిన పుస్తకం గూర్చి ఇప్పుడు 
ఎందుకు అనుకున్నాను ,కాని పుస్తకం లేబుల్ కింద నా 
బుక్ లేకపోవడం నాకే నచ్చలేదు . అందుకే వ్రాస్తున్నాను . 

(kinige lo book link ikkada )


కాసుల ఎండమావుల వెంట పరిగెత్తే లోకం లో ఒక్క క్షణం 
ఆగి హృదయాన్ని చిగుర్చి నిలవడం,చిన్ని చిరు మొగ్గగా 
మారి పువ్వుగా విరియడం .....పండుగ.మనిషి లోకం 
చేసుకోగల పండుగ.మరి అదే చెట్టు రెండో పూవును 
సృజించి లోకానికి అందిస్తే .......అనుభూతులను 
అక్షరాలుగా మలిస్తే .......అదే నా ''ఇంకో పువ్వు ''
''స్వర్ణముఖీ సవ్వడులు'' 

దీని గూర్చి రెండు మాటలు నా కలం రాల్చేముందు 
ఒక చిన్న విషయం 

విత్తనం లో నిద్రాణమైన చైతన్యం జీవపు తడి తగలగానే భూమి తల్లి 
గర్బాన్ని చీల్చుకొని మొలకెత్తుతుంది.అది సృష్టి నైజం .
నాలోని సాహిత్యపు విత్తనం ఎలా రూపొందిందో .......
గోరు ముద్దల కధలు ఊహల్లో చిత్రించుకున్నప్పుడో ,
నాన్న వేలు పట్టుకొని విశాలాంధ్ర వ్యాన్ లో కోడి పుంజు కధలు,
ఎలుగు భడవ కధలు ,బాల సాహిత్యం మొత్తం కళ్ళతో తడిమినపుడో,
అమ్మ నేర్పిన తత్వాలలోనో,అక్షరాలు గుర్తించడం రాగానే అమ్మమ్మ 
ఇంట్లో చదివిన రామకృష్ణ కధామృతాలు,వేదాంత బేరి,సుందరకాండ...
ఒకటేమిటి తెచ్చినవన్నీ చదివేయాలి అనే ఆత్రుత లోనో.....
ఎక్కడో ఈ విత్తనం రూపొంది ఉంటుంది.
హైస్కూల్  కి రాగానే కొంత వరకు పిల్లల కధలు గా మారి పుస్తకాలలో చేరింది.
ఇరవై ఏళ్ళ క్రితం ఉపాధ్యాయురాలిగా చేరినప్పటి నుండి కొంత చిగుర్చి 
పిల్లల నాటికలుగానో,పాటలుగానో ప్రశంస లు తెచ్చినా పూర్తి స్తాయి 
కవితా ప్రస్తానం 2006 తరువాతనే.అప్పుడు నేర్చుకున్న ధ్యానం నాలో 
నిగూఢమైన శక్తి ని వెలికి తెచ్చింది.సహోద్యోగి కవితల పుస్తకం చూసి 
నా చుట్టూ ఉండే విద్యార్ధులకు అర్ధం అయ్యే విధంగా చిన్న కవితలతో 
వెలికి తెచ్చినదే నా మొదటి పువ్వు ''జాబిలి తునకలు''

సూర్యోదయ అస్తమయ కొలతల మధ్య ఇమడని నా గురుకుల బడి 
బాధ్యతలలో వ్రాసిన కవితలు పదుల సంఖ్య లోనే.కాని వాటిలోనే 
బహుమతులు తెచ్చుకున్నవి,ప్రచురణ పొందినవి అయిన పది కవితలతో 
మిత్రులతో కలిసి ''దశ దిశలు''సంకలనంగా వెలువడినా అది పూర్తి స్తాయిలో  
నాదే కాదు.
అప్పుడు ఆకర్షించిన ప్రక్రియ నానీలు.నాలుగు పాదాలతో నాలుగు దిక్కులను 
తాకేంత భావ చిత్రం గీసే ప్రక్రియ నాకు యెంత గానో నచ్చి ......ఒక సంకలనం 
నా రెండో పూవుగా వికసించింది.ప్రతీ నానీ నా భావవర్ణాలను అద్దుకొని
సాహిత్య లోకంలో ఉదయించింది. అదే ''స్వర్ణముఖీ సవ్వడులు''
నా దారి ప్రక్కన సమకాలీనాలు,సార్వజనీనాలు అయిన ప్రతి విషయం 
నా నానీల కొలను లో ప్రతిఫలించింది.
ఊరును గుర్తు చేసుకుంటూ......''రెండు పాయల మధ్య మా ఊరు 
                                               అమ్మ దోసిట్లో ఎత్తుకున్నట్లు''
ఎవరికి ఉండదు కన్న ఊరి మీద  కలవరం.
                                            ''ఊరును వదిలేసినా 
                                            ఉత్తేజానికి ఊపిరి పోస్తూనే ఉంది ''
తాళి పడగానే ఆడ పిల్ల అయిపోయే వాళ్ళకే కాదు ,ఉద్యోగాల కోసం 
ఊరు వదిలే వాళ్లకు కూడా ........
ఇంకా ప్రపంచీకరణ నేపధ్యం లో ''ఆకుపచ్చని చీర కాలుతూ ఉంది 
                                             మాయదారి సెజ్ మంటల్లో''
ఆకలి కి బువ్వ  పెట్టె చేతులే  ఆకలి అని అడుక్కుంటూ ఉంటె  .....
                                              ''భూమి తడిసి పోయిందని చెప్పానా?
                                                అవును రైతు కన్నీళ్ళతో''
అక్షరాలూ పరుచుకుంటూ వెళితే పుస్తకం శూన్యంగా మారిపోతుంది.
నా తల్లి తండ్రులను,భగవంతుని తలుచుకుంటూ ఈ పుస్తకం ఒకరికి అంకితం....

''శశి అలివికాని పనులు పెట్టుకుంటావు''అని ఆర్ధిక బాధ్యతల మధ్య ప్రేమగా 
కసురుకుంటూ .....సందె వేళలో ఏకాంత దీపాన్ని వెలిగించగానే చల్లబడి
 ''నీ కోసం పదిహేను వేలు దాచాను పుస్తకం వేయించుకో ''
అనే ప్రేమ గుస గుస......''పర్లేదండి.అదేమీ అవసరం కాదు కదా''
అని నేను మనస్పూర్తిగా అన్నా 
''లేదు వేయించుకో.....''అని ఉత్సాహం ఇస్తూ 

''శశి ఈ లోకం లో నేను భరించలేనిది ఏమిటో తెలుసా ,
ఏ విషయం లో అయినా నువ్వు బాధపడి  ఉంటావేమో 
అనే ఊహా మాత్రపు ఆలోచనని ......నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి''

అని ప్రతి అడుగులో చేయూత  నిచ్చే శ్రీవారికి అంకితం ఇస్తూ .....
              ''నాడు వేసినవి ఏడు అడుగులే 
                జీవితం తో గుణిస్తే లక్ష అడుగులు''
                
                 ''పూల తీగకు చెట్టు ఆసరా 
                  ఋణం తీర్చుకుంది పరిమళంతో''
ఈ అక్షర పరిమళం వారికే అంకితం.
మదిలోని కలకలం ఆగేంత వరకు ఏ రచయితా కలం ఆగదు.
అదిగో పచ్చటి గుబురుల మధ్య చిన్నగా ఊపిరి పోసుకుంటున్న 
నా ఇంకో పసి మొగ్గ.....బహుశా కధాసంకలనం కాబోలు .......