Tuesday, 18 February 2014

గొప్పలు ఎందుకు?

ముద్ద నోట్లో  పెట్టుకోగానే మొహం లో రంగులు మారిపోయాయి 
నరేష్ కి . ''ఛీ ఉప్పు'' అనుకోని పక్కన తింటూ ఉండే ఫ్రెండ్స్ 
వైపు చూసాడు మొహమాటంగా ఏమి అనుకుంటారో అని .... 
వాళ్ళకి  కూడా నచ్చకపోయినా మొహమాటానికి మౌనంగా 
తింటూ ఉన్నారు . కోపం తో భార్య వైపు చూసాడు . 

 కాపురానికి వచ్చి మూడు రోజులు అయింది . 
ఊరు కాని ఊరుకు వచ్చీ రాగానే 
''నువ్వు వంట బాగా చేస్తావు అని 

మీ అమ్మ వాళ్ళు   చెప్పారు . 
మా ఫ్రెండ్స్ అందరికి ఆ విషయం చెప్పాను . 
ఈ రోజు భోజనానికి పిలిచాను అని ''
పురమాయించే సరికి ఉదయం నుండి పది 
 మందికి ఒక్కటే అన్నీ సిద్ధం చేసింది . కొంచెం ఉప్పు ఎక్కువ 
అయినందుకు ఈ కోపం . 
కళ్ళ నీళ్ళు నింపుకుంటూ మౌనంగా 
లోపలి వెళ్ళింది . 

  వెనుకనే లోపలి కి వెళ్ళింది సరిత . ఓదార్పుగా చూస్తూ 
''పర్లేదులే రమా ,మరీ తినలేనంత ఉప్పు కాదు . పప్పు 
చాలా బాగుంది తెలుసా ?'' చెప్పింది ప్రేమగా . 

''లేదండి నాకు కొంచెం వంట వచ్చు కాని ఇంత మందికి 
ఎప్పుడూ చెయ్యలేదు . నేను నీ వంట గూర్చి గొప్పగా 
చెప్పాను నువ్వు సూపర్ గా చెయ్యాలి అని ఉదయం 
నుండి టెన్షన్ పెట్టారు . పొరపాటుగా ఉప్పు ఎక్కువ అయింది ''
బాధగా చెప్పింది . 

''పర్లేదులే నువ్వు మా నరేష్ భార్య వనే అభిమానంతో నిన్ను 
ప్రేమగా చూసుకుంటాము కాని నువ్వు వంట బాగా  చేస్తావనో 
కట్నం తెచ్చావు అనో  ఇంకోటో ఇంకోటో  గొప్పతో కాదు . 
అయినా అందరి  ముందు విసుక్కో కుండా భర్త గౌరవం 
కాపాడుతూ లోపలి వచ్చావు . ఈ సంస్కారం చాలదా 
నిన్ను గౌరవించడానికి ?ప్రేమించడానికి ?''
మెల్లిగా కళ్ళు తుడుచుకుంది రమ. 

''నువ్వేమి బాధ పడ వాకు నరేష్  ఏదో భార్య గొప్ప 
చెప్పాలి అని తెలీక చేసి ఉంటాడు . నేను చెపుతాలే . 
ఈ సారి వారం మా ఇంటికి రండి . నువ్వు  ఆ రోజు 
తొందరగా వచ్చి హెల్ప్ చెయ్యక పోతే ఉప్పే కాదు 
కారం కూడా ఎక్కువ వేసి కసి తీర్చుకుంటాను ''
నవ్వుతూ తమాషాగా చెప్పిన సరిత ను చూసి ఆపుకోలేక 
రామ కూడా నవ్వేసింది . 
''అదీ అలాగే నవ్వుతూ ఉండు ''చెప్పింది ప్రేమగా సరిత . 
తరువాత నరేష్ దగ్గరకు వెళ్ళింది . 

''సారీ సరిత మిమ్మల్ని భోజనానికి పిలిచి మంచి 
భోజనం పెట్టలేకపోయాను . ''చెప్పాడు కొంచెం బాధగా . 

''పర్లేదు నరేష్ తను ఆ మాత్రం చేయడం గొప్ప కదా . 
మేము ఏమి అనుకోవడం లేదు . 
నువ్వే ముందు ఎక్కువ చేసి చూసుకున్నావు . 
ఇప్పుడు బాధ పడుతున్నావు . నీకు రవి తెలుసు కదా ,
మా బంధువుల అబ్బాయి ''

''తెలుసు ఎల్ . కె. జీ నుండి ఫర్స్ట్ రాంకర్ కదా ,
మంచి జీనియస్ అని చెపుతుంటావు. ఇప్పుడు 
ఎంసెట్ కూడా బాగా వ్రాసి ఉంటాడు కదా ''
చెప్పాడు నరేష్ . 

''అవును జీనియస్ .... కాని ఇప్పుడు ఈ ప్రపంచం లో లేడు '' 

ఉలిక్కిపడ్డారు నరేష్ తో పాటు మిగిలిన మిత్రులు . 
అమాయకంగా ఎప్పుడూ పుస్తకాలు 
ముందు వేసుకొని చదువుకుంటూ 
ఉండే రవి మొహం గుర్తుకు వచ్చి అందరి కన్నులపై 
సన్నటి నీటి పొర . 

''ఏమైంది '' ఒకే సారి అన్నారు . తాము విన్నది 
తప్పు అయితే బాగుండును అనుకుంటూ . 

''ఏమవుతుంది ? ఎంసెట్ లో ఫస్ట్ రాంక్ రాదేమో అని 
రిజల్ట్స్ రాక ముందే దిగులుపడి ఆత్మహత్య 
చేసుకున్నాడు ''

సరిత కళ్ళ నుండే జాలువారే కన్నీరు రవితో తనకు 
ఉండే అనుభందాన్ని ఒక సారి తడుముకుంటూ ఉంది 
జ్ఞాపకాల నీడల్లోకి మసక వెలుతురు లాగా వెళ్లి . 

''ఆ అబ్బాయి దిగులుగా ఉండేది ఎవరు గమనించలేదా ?
 అయినా ఫస్ట్ రావాలి అని అంత పట్టుదల ఎందుకు ?''
బాధగా అడిగాడు నరేష్ ... పూయకుండా నేల రాలిపోయిన 
చిన్నారి మొగ్గ ను గుర్తు చేసుకుంటూ . 

''చిన్నప్పటి నుండి వాడి తెలివి కి అన్నీ ఫస్ట్ రాంక్స్ 
వచ్చేవి . ఇక వాళ్ళ పేరంట్స్ సంతోషం చెప్పలేము ... 
అడిగిన వాళ్లకు అడిగిన వాళ్లకు ఒకటే చెప్పడం వాడి రాంకుల 
గూర్చి . వాడిని ఒక షో పీస్ చేసేసరికి .... వాడికి 
అది అలవాటు అయిపోయింది . ఎప్పుడైనా రాదేమో అనిపిస్తే 
రాత్రి అంతా మేలుకొని చదివే వాడు . ఎలాగో సాదించేవాడు . 
అప్పటికీ వాళ్ళ నాన్నకు చెప్పేదాన్ని . ఎందుకు అలాగ 
అందరికి గొప్పలు చెప్పుకోవడం  వాడి పై అంత టెన్షన్ 
పెట్టొద్దు . వాడి ని లైఫ్ ని కూడా కొంత ఎంజాయ్ చేయనీయండి . 
చదువే జీవితం కాదు అని . 
కాని వాళ్ళ నాన్న వాడు నా కొడుకు సరిత సాధిస్తాడు చూడు 
అనేవాడు . ఇక వాడికి జీవితం లో ఎంత టెన్షన్ అయిన వాళ్ళే 
సృష్టించారో చూడండి . ఇప్పుడు పిల్లవాడే ప్రాణాలతో లేక 
పోయినాక ఆ ప్రాణం లేని రాంకులు ఏమి చేసుకుంటారు '' 

''ఇప్పుడు ఫస్ట్ రాకపోతే ఏమి కొంపలు మునిగి పోయాయి . 
దేవుడు ఏ రాత రాసుంటే ఆ తీరానికి చేరేంత మాత్రం 
కృషి చేస్తే చాలదా !పోయిన ప్రాణాలు తీసుకు రాగలరా ?
ఎవరు ఎంత సున్నితంగా రియాక్ట్ అవుతారో ఎవరికి తెలుసు ?''
బాధగా అన్నాడు నరేష్ . 

''ఇప్పుడు నువ్వు చేసింది మాత్రం తప్పు కాదా ?నువ్వు 
టెన్షన్ పెట్ట బట్టే కదా రమ ఉప్పు ఎక్కువ వేసింది . 
మళ్ళా నువ్వు తప్పు చేసి కోపం తన పైన చూపుతున్నావే ?''
నిలదీసింది సరిత . 

''సారీ రమ '' మనస్పూర్తిగా చెప్పాడు . 

''నువ్వే కాదు నరేష్ ,అందరు అలాగే ఉన్నారు . 
ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవడమే . దాని వలన 
ఏమి జరుగుతుంది ?టెన్షన్ పెరగడం తప్ప . ... 
కారు గొప్ప చెప్పుకుంటే దానికి రిపేర్ వస్తే 
అవమానం ,ఆస్తి గొప్ప చెప్పుకుంటే నష్టాలు 
వస్తే అవమానం ,పెళ్లి గొప్పలు చెప్పుకుంటే 
ఎంగిలి ఆకులగానో ,వాడిపోయిన పువ్వులగానొ 
మారిన డబ్బులకు లక్షల్లో అప్పులు,వడ్డీలు  కట్టుకుంటూ
మనసులోనే కుములుతుంటారు . ఎక్కడో 
దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం . 
మన మెప్పు అవతలి వాళ్లకు ప్రోత్సాహంగా మాత్రమె 
ఉండాలి కాని ,గొప్పలతో  టెన్షన్ పడేలా ఉండొద్దు . 

గొప్పలు చూపిస్తేనే లోకం లో ఫ్రెండ్స్ ఉంటారు 
అనుకుంటే అటువంటి వాళ్ళు మనకు గొప్పలు 
లేనపుడు మిగలరు . అలాంటి వాళ్ళు వెళ్లి పోయినా 
బాధ పడక్కర్లేదు . మన వ్యక్తిత్వం తో అభిమానించేవాళ్ళు 
కొందరు ఉన్నా చాలు . 
అందుకే పెద్దలు చెప్పారు 
''గంగి గోవు పాలు గరిటడు అయినా చాలు '' 
నిజానికి అలాంటి మంచి వాళ్ళతో 
ఉన్నపుడే మన ప్రశాంతంగా ఉండగలం ''. ... చెప్పింది సరిత . 

అవునని ఒప్పుకున్నారు అందరు . 
                 @@@@@@   

5 comments:

SubbaRao said...

nice post ....
this is my blog http://ourtechworld.weebly.com/

Mahesh said...

Very Nice.....Heart touching real facts of now a days....Hats off Sasi garu....I like your post very much

Tarangini said...

Naku ee kadha entaga nachchindiante matallo cheppalenu. Prati manishi lo unde oka balaheenatani dani phalitanni addamu lo choopinattuga undi. Thank u!

శ్యామలీయం said...

బాగుంది. మంచి విషయం ఎన్నుకున్నారు.

చాలాకాలం క్రిందట మా మేనమామ తన కూతురి మీద రంకెలేసాడు. నాకు ఆశ్చర్యం వేసి ఆరా తీస్తే తెలిసింది. నిరుడు స్కూల్ ఫస్టు వచ్చిందట. ఈ‌ ఏడు స్కూల్‌లో మూడవస్థానంలో వచ్చి, తనకు చాలా అవమానం ఐపోయిందట. ఇంతకీ అప్పడా పిల్ల చదువుతున్నది LKG లేదా UKG మాత్రమే.

శశి కళ said...

sorry for late reply .papam kontha mandhi naalugu saarlu koodaa comment pettaaru kadha meedha abhimanamtho.
naaku ippudu system ledhu. yeppudaina friends computer nundi post chesthunnanu.naa kadha mee hrudayaalalo sthanam sampadinchukunnanduku really thank you very much