Saturday, 28 November 2015

కేజ్రివాల్ మీద జాలితో




ఈ లాలు ప్రసాద్ యాదవ్ ఏమి చేసినా భలే తమాషాగా అనిపిస్తుంది . 
అందరు టికట్ రేట్ పెంచుతుంటే రైల్వే మంత్రిగా టికట్ రేట్ తగ్గించడం ,
ఐ . బిఎం లో గెస్ట్ లెక్చర్లు , మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి గా 
ఉంటారా అంటే సిగ్గుపడటం , నిన్నటికి నిన్న కేజ్రివాల్ ని హగ్ చేసుకోవడం .... 
అన్ని బోలెడు కాలక్షేపం చాటింగ్ లో . 
రాజకీయాలు నాకేమి పెద్దగా తెలీవు . కాని ఇలాంటివి వచ్చినపుడు 
పక్కన మేడమ్స్ ని అడుగుతుంటాను . 
''ఎలా తగ్గిస్తారు శైల  టికట్ ?మళ్ళీ బడ్జెట్ నష్టాలలోకి వెళ్లి పోతుంది 
కదా ! మళ్ళా లాభాలు పెరిగాయి అని గెస్ట్ లెక్చర్ ఎలా ఇస్తాడు ? ''
శైల వాళ్ళ శ్రీవారు రైల్ వేస్ లో ఏ . ఎస్ . ఎం . 
''ఏమి లేదులే శశి గూడ్స్ కి ఒక వాగన్ పెంచేశారు . అక్కడ కవర్ 
చేస్తారు '' 
మరి లోడ్ ఎక్కువైతే ఇంజెన్స్ ఇబ్బంది కాదా ! 
గెస్ట్ లెక్చర్స్ ఇచ్చే రాజకీయ నాయకులను ఒక్క కిచ్చారెడ్డి లక్ష్మా రెడ్డి ని 
ఒక్కటే చూసాను . మా లీడ్ ఇండియా ట్రైనింగ్ లో ఇచ్చారు . 
అప్పుడు దాని మీద రెస్పాన్స్ నేనే చెప్పాను . మెచ్చుకున్నారు కూడా !

ఇక ఇప్పుడు కేజ్రివాల్ వంతు . లాలు నే హగ్ చేసుకున్నాడు , 
నాకేమి ప్రేమ లేదో అని మొత్తుకుంటున్నాడు . 
ఆకు ముల్లు  సామెత ఇప్పుడు అర్ధం అయిందా !
తప్పు మాది కాక  పోయినా , మాది తప్పు అనేస్తే నిరూపించుకోవడానికి 
మేము ఎంత తంటాలు పడతామో అర్ధం అయిందా . 
తన దాకా వస్తేనే తెలుస్తుందని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు . 

కేజ్రివాల్ గారు బాధ పడకండి . మీ తప్పేమీ లేదని నమ్ముతున్నాము . 
లాలు సంగతి మాకేమి కొత్త కాదు :-)
                               @@@@@@@ 

Tuesday, 24 November 2015

మా నేల తల్లి ..... పచ్చని వరాలు (1)

మా నేల తల్లి .... పచ్చని వరాలు (1) ( ఎర్ర అరుగుల కధలు సీరీస్ )

''అమ్మా '' పిలిచాను . 
కుంపటి పై ఉడికే సాంబారు పరిమళం బయట వాన మట్టి 
తో కలుస్తూ ఒక చిన్నపాటి వెచ్చదనం ,కొంచెం హాయిగా ,కమ్మగా 
ఇంగువ , కరివేపాకును  కలుపుకుంటూ పలకరిస్తూ ఉంది . 
వాసన ను  బట్టి ఉప్పును లెక్కేసి కొంచెం ఉప్పు వేసి కలిపింది అమ్మ . 
ఇంకొంచెం ఘుమ ఘుమ ..... వెంటనే వేడి అన్నం తినాలి అనిపించేటట్లు . 
సాంబార  పొంగ కుండా కలుపుతూ ''చెప్పు '' అంది , మంచం పై 
పడుకున్న రెండేళ్ళ తమ్ముడు వాసు లేచాడేమో గమనిస్తూ . 

''ఇదిగో చూడు , ఇది సీ అంటే సముద్రం అన్న మాట '' 
వళ్లోని ఒకటో క్లాస్ పుస్తకం లో చూపించాను . నేను నేర్చుకున్న 

ఇంగ్లిష్ అమ్మకు నేర్పించి , మరల అమ్మకు ఒప్పచెప్పడం అమ్మ మాకు 
చేసిన అలవాటు . 
చిన్నగా నవ్వింది , బాగుంది అన్నట్లు . నిజంగానే అమ్మ నవ్వితే 
బాగుంటుంది . వీపు మీద వాలి ఊగాలి అనిపిస్తుంది . ఎప్పుడూ 
పని చేస్తూనే ఉంటుంది . 
''నీకు తెలుసా ! మనకు పది కిలోమీటర్ల దూరం లోనే సముద్రం 
ఉందంట . దాని పేరు బంగాళా ఖాతం . బోలెడు నీళ్ళు , అన్నీ 
ఉప్పు నీళ్ళే . యాక్ .... అయ్యేమి చేసుకుంటారు !పడవలు 
కూడా తిరుగుతాయంట , మా కుమారి మిస్ చెప్పింది '' కళ్ళు 
పెద్దవి చేసుకుంటూ గబ గబ చెప్పాను . మరి అమ్మ కూడా నాలాగా 
''ఓ యమ్మ '' అని అనాలి కదా . 
పోయిన ఏడాది నుండి కాన్వెంట్ కి వెళ్ళడం . పెద్ద కాన్వెంట్ కాదు . 
ఏదో ఒక రెడ్డిగారు వాళ్ళ పాప కోసం పెట్టిన కాన్వెంట్ . 
మా క్లాస్ లో అయితే నేను , మా పెదనాన్న కొడుకు ప్రసాద్ , 
ఇద్దరమే . ఒక్కో ఏడాది ఎన్ని క్లాస్ లు అయినా చదివెయొచ్చు . 
పుస్తకం అయిపోతే ఇంకో పుస్తకం . 
''తెలుసు లేవే .... ఇంకా అక్కడ చేపలు కూడా పడతారు . 
సముద్రం లో ఉంటాయి కదా ! ఎప్పుడైనా సముద్ర స్నానానికి 
వెళదాము . '' చెపుతూ ఉంది అమ్మ . 
బయట నుండి పిలుపు ''శెట్టేమ్మా '' అంటూ . 
తొంగి చూసాము . పెద్ద పాలేరు వీర రాఘవయ్య . 
''ఏమి రాఘవయ్య ?'' అడిగింది అమ్మ . 
''శెట్టేయ్య అన్నం తీసుకొని రమ్మన్నాడు '' చెప్పాడు . 

''ఏ కైల్లో ఉన్నాడు ?'' అడిగింది . 
''పెద్ద కైల్లో , నారేతలు వేయిస్తున్నాడు . తొందరగా రమ్మన్నాడు '' 
''అంటే అరటి తోటా అమ్మా ? '' కుతూహలంగా అన్నాను . 
''కాదులే శశి , దూరంగా ఉండే పెద్ద కయ్యలు '' చెప్పింది . 
మూడు దగ్గరల మూడు రకాలు వేస్తాడు మా నాయన . 
ఒక దగ్గర వరి , ఒక దగ్గర వేరు సెనగ , ఒక దగ్గర అరటి తోట . 
పెద్ద పొలం లో కొన్ని సార్లు తమదలు , ఏవో రక రకాలు 
ఏడాదికి రెండు సార్లు పంటలు , పక్కనే పోతున్న స్వర్ణ ముఖీ 
చల్ల కాలువ పుణ్యమా అని . ఎప్పుడూ ఏదో ఒక పంట 
వేస్తూనో , కోస్తూనో . మళ్ళా వచ్చి అంగడి పని చూసుకునేవాడు , 
బాబాయి లతో కలిసి . 

''ఉండు రాఘవయ్య , పులుసు ఉడుకుతూ ఉంది , సర్ది 
ఇచ్చేస్తాను . ఇదు నిమిషాలు '' చెప్పింది అమ్మ . 
''అమ్మా దాహం గుంది . కొంచెం నీళ్ళు పొయ్యి '' అడిగాడు . 

అమ్మ పైన ఉన్న క్యారియర్ తీస్తూ ఉంది . 
''నేను ఇస్తాను ... నేను ఇస్తాను '' పరిగెత్తాను చెంబు నిండా 
నీళ్ళు ముంచుకొని . ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాను కదా !
నాన్న బయట నుండి రాగానే నేనే ఇస్తాను . 

ముందు నిలబడి ఉన్నాడు . నీళ్ళు చూడగానే వంగాడు . 
అరిచేయి నోటికి ఆనించుకొని పొయ్యమన్నట్లు ..... 
ఇప్పుడేమి చెయ్యాలి ? నాకేమి అర్ధం కాలేదు . చెంబు 
తీసుకోవాలి . ఇదేమిటి ? 
''పొయ్యి బుజ్జమ్మా '' అన్నాడు . 
అరిచేతులో నీళ్ళు పోస్తే తాగుతున్నాడు . 
దూరంగా జరిగాడు . నేను అంత  ఎత్తు పోయ్యలేక , 
ముందుకెళితే .... 
''బుజ్జమ్మా , ఎంగిలి నీళ్ళు నీ గౌను పైన బడుతున్నాయి 
దూరంగా పొయ్యి '' అన్నాడు . 
ఇదేమో నాకు కొత్త . నాకు ఎలా తెలుసు !!
మొత్తం తాగేసి దూరంగా నిలుచున్నాడు . 
చెంబుతో కాకుండా ఇలాగా కూడా తాగుతారు కాబోలు . 

లోపలి వెళ్లాను . అమ్మ క్యారియర్ గిన్నెలు తీసి సర్దుతూ ఉంది . 
ఐదు గిన్నెలు . స్టీల్ వి . పై వరకు ఒక స్టాండ్ వాటిని 
పట్టి పెడుతూ , అది పడిపోకుండా అడ్డంగా ఒక స్పూన్ . 
దానితో వడ్డించు కోవచ్చు . 
ముందు ఒక దానిలో చింతకాయ పచ్చడి పెట్టింది . 
ఒక దానిలో తాళింపు . పై గిన్నెలో పెరుగు . ఒక దానిలో 
సాంబారు . కింద గిన్నెలో, వార్చిన అన్నం గిన్నె పైకి లేపి 
వేడి అన్నం నింపింది . చిన్న గిన్నె తీసింది ,రెండు స్పూన్ ల 
నేయి వేసి అన్నం మధ్యలో పెట్టింది గిన్నెని . పొలానికి వెళ్లేసరికి 
కరుగుతుంది . క్యారియర్ మొత్తం సర్దేసి రాఘవయ్య చేతికి 
ఇచ్చి '' ఆకులు అక్కడ ఉన్నాయి కదా ? '' అడిగింది . 
''అరిటాకులు లుండా యిలె చెట్టుకు '' చెప్పాడు . 

''పొలం నుండి బంతి పూలు , పచ్చి మిరప కాయలు తీసుకుని 
రమ్మని చెప్పు . ఉప్పుడు కాయలు ఊరేయ్యాలి ''చెప్పింది . 

''అట్నే శెట్టేమ్మ '' చెప్పేసి క్యారియర్ ఒక చేత్తో , రెండో చేత్తో 
రెండు పారాలు తీసుకున్నాడు . 

''అమా నేను కూడా కైలు దగ్గరికి పోతాను మా '' చెప్పాను . 
'' వద్దులేమ్మా , అంత దూరం నడవలేవు . ఎప్పుడైనా బండి 
మీద పోతువు లే '' 
చిన్నగా అపుడప్పుడు పడుతూ ఉన్న తుంపర , దూది వంటికి 
తాకుతున్నట్లు భలే ఉంది . 
''మా పోతాను మా '' ఇంట్లోనుండి బయటకు పరిగెత్తాను . 
''బుజ్జమ్మ వాన పెద్దది అయితే కష్టం ,వద్దమ్మ '' అన్నాడు . 
ఊహూ .... ముందుకు పరిగెత్తాను . 

''వాళ్ళ నాన్న మొండి వచ్చింది దీనికి . తీసుకొని పోలే . 
మళ్ళీ ఎవరైనా వస్తుంటే పంపెయ్యండి '' చెప్పింది అమ్మ . 

హయ్య .... గాలికి ఊగే పైరు . సరిగా గుర్తు లేదు కాని , 
ఇంతకూ ముందు వెళ్లాను . మోటార్ వేసి తొట్టి లో 
ఎగరొచ్చు . గనిమల మధ్య కాలవలో నడవొచ్చు . మా నాయన 
ఏమి అనడు . ఇంకా నీళ్ళ మోటార్ చాలా సేపు వేయిస్తాడు 
మా కోసం . పొలం కి వెళ్ళడం ఏమి హాయి . కాకుంటే ఒక్కటే 
బాధ . మధ్యలో ఉండే పెద్ద కాలువ . తాడి చెట్టు కంటే ఎక్కువ 
వెడల్పు అందుకు దాని మీద ఏమి వేయరు . నడిచి పోవాలి 
మధ్యలో , అది కాదు ఇంకో భయం ఉంది దానిలో .... 

సరే ముందు ఒకటిన్నర  కిలో మీటర్లు నడవాలి . 
ముందు పరిగెడుతూ ఉంటె వెనుక రాఘవయ్య వస్తున్నాడు 
''జాగ్రత్త '' అని అరుచుకుంటూ . 
నాకేంటి జాగ్రత్త చెప్పేది ఇంత  పెద్ద అయ్యాక .... 
''అబ్బా '' అని అరిచాను , వెనక నుండి పరిగెత్తాడు . 
                                           ( ఇంకా ఉంది ) 
                               ********* 


Sunday, 22 November 2015

మీరు మీకు తెలిసినవి చెప్పండి

 దేవుడా .... ఎక్కడున్నావు ? 
ఈ వానలు ఏమిటి తండ్రి అని అడగాలి అంటే భయం . 
మళ్ళీ ఎక్కడ లేకుండా పోతాయో అని !!
ఏడాది వానలు ఆరు రోజుల్లో కురిపిస్తే ఎట్టా చెయ్యాలి ?
నువ్వట్టా కురిపించావు , అయ్యి ఇట్టా కట్టలు తెంపుకొని 
సముద్రం లో కలిసిపోయాయి ! ఇక కురిపించి ఏమి లాభం ! 
కాసిని నీళ్ళు అయినా భూమి కింద దాచిపెట్టు , ఎండాకాలం 
కావొద్దా . .... 
లాభం అంటే గుర్తుకు  వచ్చింది ....... 
మొన్న రైల్వే స్టేషన్ లో చూసాను . చాలా మంది కూలీలు , 
ఆడవాళ్ళు మగవాళ్ళు ,పక్కన బిందెలు , కట్టెలు , బట్టలు . 
ఇంత తుఫాన్ లో ఎక్కడికి పోతున్నారు ! 
గుంటూరు నుండి వచ్చిన కూలీలు అంట . నారేతలు వేస్తారు అంట. 
రోజు కూలీ కాదు , ఎకరానికి ఇంత అని కాంట్రాక్ట్ . వాళ్ళ పని నచ్చి ఇక్కడ 
వాళ్ళు ఇంకొంచెం అదనంగా కూడా ఇస్తారంట . వానలు పడుతున్నాయి 
అని చూసుకుంటే కుదరదు , నారు ముదిరి పోతూ ఉంది . 
( ఇది ఇక్కడ వాళ్ళ పొట్ట గొట్టినట్లు కాదా ,ఏమో మరి !) 
వ్యవసాయం వ్యాపారపు హంగులు అద్డుకుంటూ  ఉంది .
తప్పదు లాభం , నష్టం అనేవి మన ప్రాణాలతో చలగాటం ఆడే 
స్థాయి  వచ్చేసినాక రైతు కూడా వ్యాపార మెళుకువలు నేర్చుకోవాల్సిందే !
నేర్చుకోకపోతే వచ్చిన ఇంకో పని చూసుకోవాల్సిందే . 

మరి మనకు తిండి గింజలో .... అనవాకండి . 
అన్నపూర్ణ ఏమవుతుంది . అన్నం పెట్టె దేవుడు రైతు , 
రక్తం తో తడిసి పుడుతుంది వడ్ల గింజ , కాకుంటి రైతు 
తెల్లని చెమట రక్తం తో .... ఇలాంటి ఎమోషన్స్ ఇప్పుడు 
వద్దు . 
ఇలాంటి సెంటిమెంట్స్ తరువాత ,ముందు సమస్య ఎక్కడ ? ఎలా 
ఉంది ? కొత్త వి ఇంప్లిమెంట్ చేస్తూ , పాత లోపాలు పూడ్చుకోవడం ఎలా 
అని కార్పోరేట్ కంపెనీ లాగా ఆలోచించండి . 
ఈ రోజు శంకర్ కార్టూన్ చూస్తె ఇవే మనసుకు వచ్చాయి . 
సానుభూతి మాటలు కావాల్సిందే ,కాని అవి మాత్రమె 
పని జరిపిస్తాయా ? చూడండి . యూనివర్సల్ టాపిక్కి  
పనికొచ్చే సైలెంట్ కార్టూన్ . 



పనిలో పని ... నా కార్టూన్ కూడా . రైతు మొక్కలు నాటే టప్పుడు 
ఎంత ఆశగా ఉంటాడో , అవి ఆక్ట్ ఆఫ్  గాడ్ లేదా మనుషుల్లోని 
రాజకీయ గ్రద్దలు తన్నుకుని పోయేటపుడు ఎలా ఉంటాడో చూడండి . 


ముందు వ్యవసాయాన్ని వ్యాపారం అనుకుంటే కొంత పరిష్కారం 
ఆలోచించవచ్చు . 
వ్యాపారానికి ఏమి కావాలి ? 
పెట్టుబడి ,ప్లానింగ్ ,కార్మికులు , పబ్లిసిటీ , మార్కెటింగ్ . 
ఇలాగా వాళ్ళు ఎడ్యుకేట్ అయితే బాగుంటుందేమో !  
పెట్టుబడి లో యెంత తాము పెట్టగలరు , బాంక్ నుండి యెంత 
తేగలరు ,యెంత బయట వడ్డీ కి తేవాలి ? 

మొదలు పెట్టె పంట కు డిమాండ్ ఉందా ? వ్యవసాయ అధికారుల 
సలహా పొందగలమా ? అసలు పంట సరియన సమయం లోనే 
మొదలు పెట్టామా ?
కొత్త పద్దతులు ,నైపుణ్యాల పెంపుదల 
అంతర పంటలు వేయడం , గట్లు వెంబడి వేయగల 
పంటలు వేసి కుటుంభ ఖర్చు కు ఉపయోగించుకోవడం . 
పశువులు ,కోళ్ళు పెంచుకోవడం . వాటికి కావలిసిన 
ఆహారాన్ని తానె ఉత్పత్తి చేసుకోవడం . 

పంటలు మార్చి వేయడం , ఎరువుల ఖర్చు , 
పురుగు మందుల ఖర్చు తగ్గించే ప్రక్రియల వైపు 
ఎడ్యుకేట్ అవ్వడం .

వర్షాలు వరదలు ,కరువు లాంటి వాటికి మనం ఏమి 
చెయ్యలేము ,కాని  చిన్నపాటి ఆదాయం వచ్చే 
కుటీర పరిశ్రమలు ఉంటె బాగుంటుంది . 

ఇక వర్షపు నీరు నిలువ చేయడం , చెరువుల్లో 
పూడిక , గట్లు బాగు చేసుకోవడం , పెద్ద కమతాలు గా 
వ్యవసాయం , నీళ్ళలో ఎక్కువ రోజులున్నా , తక్కువ 
నీరున్నా పాడవని విత్తనాలు వాడటం . 

ఇవన్నీ అందరికీ తెలిసినవే . ఇంకా మీకు ఏమైనా తెలిస్తే 
చెప్పండి . భవిష్యత్తు లో ఇది చూసిన  వారికి ఇలాగా 
అప్పట్లో ఉండేది అని తెలుస్తుంది :-) 
సానుభూతి వలన ప్రయోజనం లేదు , చాలా మంది 
దగ్గర స్మార్ట్ ఫోన్స్ లో  ఇలాటి విషయాలు వాళ్లకు ఎక్కువగా 
ప్రచారం చేస్తే బాగుంటుంది . మాకెందుకు అవన్నీ ప్రభుత్వం 
పనులు అనుకుంటున్నారా ? ధరలు చూసారా ?
మీ జీతం మారలేదు అనుకుంటున్నారు ఏమో ? మీకొచ్చే 
సామాన్లు విలువతో పోలిస్తే మీకు ఇప్పుడు జీతం సగం అయినట్లు లెక్క . 

మా బాబు రెండు నెలల క్రితం '' ఆకృతి 3డి సొల్యుషన్స్ '' లో 
''స్మార్ట్ విలేజ్ / సిటీ '' లో పాల్గొంటూ ఉంటె నేను ఒకటే మాట 
చెప్పాను . 
''రేయ్ , ప్రైజ్ రావడం ముఖ్యం కాదు . రైతు కు పనికి వచ్చేది 
కనిపెట్టారా , రైతు దెబ్బ తినేది ముఖ్యంగా నిలువ ఉంచుకోలేక 
పోవడం వలన , తన సరుకు అవసరం ఎక్కడ ఉందొ తెలుసుకోనలేక 
పోవడం వలన , వీటికి పరిష్కారాలు ఆలోచించరా '' అన్నాను . 

ఎలాగు ఏదో ఒక విషయం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము . 
అదేదో ఇలాగా అందరి మేలుకు ఉపయోగపడే ఆలోచన 
చేస్తే యెంత బాగుంటుంది ! మరి ఇప్పుడే ఆలోచించండి . 
                         @@@@@@@@  





Tuesday, 17 November 2015

అనుకోని అతిధి

''పొద్దునే  వచ్చిన వానా ,పొద్దు పోయి వచ్చిన చుట్టం 
పోనే పోరు '' 
అనుకోని అతిధులు వచ్చినా హోస్టింగ్ చేయడం ఎలాగో నాకు 
తెలుసు . కాని నేను అతిధి గా వెళ్ళాల్సి రావడం చాలా ఇబ్బంది 
అనిపించింది . 
అబ్బ ఏమి వర్షాలు .... ఏమి వరదలో  ఏమిటో ! 
అటు చెన్నై నుండి ఇటు నెల్లూరు వరకు అందరినీ తల క్రిందులు 
చేస్తూ ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని పరిగెత్తే టట్లు చేస్తున్నాయి . 
అటు చిత్తూరు ,ఇటు నెల్లూరు , కడప , ఇక తిరుమల కొండ 
  ,పొంగని వాగు వంక , నది లేదు . దేవుడు సముద్రాన్ని 
సృష్టించబట్టి ఇన్ని నీళ్ళు తనలో దాచుకుంటుంది కాని లేకుంటే 
ఈ నీళ్లన్నీ ఎక్కడికి పోవాలా !!!! 
ఉదయం వాన మబ్బు లో  ఇక పోలేము స్కూల్ కి అనుకున్నాను . 
అక్కడ క్వార్టర్స్ లో ఉంటూ ఇక్కడికి వస్తూ అటో కాలు ఇటో కాలుగా 
ఉన్నాను . మొన్న ఈయన గారు టూ వీలర్ పై నుండి పడి 
ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటి నుండి , ఒక్కరినే వదలాలి 
రాత్రి  అంటే  భయంగా ఉంది . పక్కన తోడూ , కాసింత వెచ్చదనం , 
ఊరట ఇచ్చే మాట , జీవితం లో ఒక పార్ట్ అనుకొనే దశ నుండి 
అవసరం అనుకొనే  దశకు వచ్చేసినట్లు ఉన్నాము . 
రెక్కలు వచ్చిన చిన్న పక్షులు ఎప్పుడో గూడు విడిచి ఎగిరిపోయి 
వాటి బ్రతుకు పోరాటం లో మునిగిపోయి ఉన్నాయి . 
ఏదో భారత దేశ గృహస్తు జీవన విధానం పుణ్యమా అని ఒకరికి ఒకరం , 
ఈ పద్దతే లేకుంటే ఒంటరి బ్రతుకే నేమో !!!
ఉదయాన్నే చూస్తే న్యూస్ పేపర్ టైం కి వచ్చేసి ఉంది . 
''అరె  చిన్న పిల్లవాడు ఇంత వానలో సమయానికి పేపర్ 
అందిస్తే , పెద్దవాళ్ళం   కర్తవ్యాన్ని నిర్వహించొద్దా ?'' ఆత్మ సాక్షి 
ప్రశ్నిస్తూ  ఉంది. రెడీ అయిపోయి స్కూల్ కి వెళ్ళిపోయాము . 

ఇంటికి వెళ్ళే వేళకి చుట్టుకున్న ప్రశ్నలు అందరి దగ్గర నుండి , 
''ఎలా వెళుతారు ? సూళ్ళూరు పేట నాలుగు పక్కల నీళ్ళే , 
మీ ఇంటికి దారి ఎక్కడ ఉంది ? ''
దేవుడా హై వే  పై దారి మూసుకోనక ముందే ఇంటికి చేరాలా !
ఆటో తో బస్ క్రాస్స్ చేసి ఎక్కేసాము హమ్మయ్య అనుకుంటూ . 
సరిగా మూడు కిలో మీటర్లు వెళ్ళగానే బస్ ఆపేశారు . 
నిమిషాల్లో ముందు వెనుక లారీలు , బస్ లు పై నుండి 
వర్షం . హై వె రెండు వైపులా కాళింగి నది నుండి పొంగిన నీళ్ళు . 
వరుసలో మాది పదో బస్ . రోడ్ మీదకు వచ్చిన ప్రవాహం 
 తగ్గితే వెళ్లిపోతాము అనే ఆశ . నిముషాలు అర గంటగా
మారిపోయిన తరువాత , ఇక ఏవి అవతలకి వెళ్ళవు అని కబురు . 
చెన్నై నుండి వస్తున్న పసి బిడ్డలు పాలకి అప్పుడే ఏడుపు మొదలు పెట్టారు . 
ఊరికి ఇంత  దూరం లో ఏమి దొరుకుతాయి ?

ఇంకా ఇంటికి వెళతాము అనే ఆశ చావలేదు . దిగి వాహనాల వరుస 
వెంబడి ముందుకు వెళ్లి చూసాము . ఉరకలు వేస్తూ రోడ్డు కు ఆ వైపు నుండి 
ఈ వైపు యెర్రని నీళ్ళ ప్రవాహం . ముందు నిలబడిన రెండు బస్ ల టైర్లు మునిగి 
వాటిలోకి నీరు వెళ్లి పోతూ ఉంది . అవి కూడా పడిపోతాయో ఏమో ! అలా 
ఊపెస్తున్నాయి నీళ్ళు . అంతా  అధికార యంత్రాంగం , పోలీస్ లు 
మీడియా నిలబడి , ఆదిలిస్తూ హెచ్చరికలు చేస్తూ బాధ్యతలో తల మునకలుగా 
ఉన్నారు . మమ్మల్ని చూసి వెనక్కి వెళ్లి పొండి , ఈ రోడ్డు కూడా మునిగి
 పోతూ ఉంది  అన్నారు .    
వెనక్కి నలుగురం నడక ప్రారంభించాము . ఇలా యెంత దూరం నడవడం !
భయం , చలి తడి బట్టలు, పాదాలు ముందు కు వెళ్ళ మని మొండికేస్తున్నాయి . 
ఇళ్ళ దగ్గర నుండి అందరికీ ఫోన్ లు , ఎక్కడ ఉన్నారు అని భయంతో 
కూడిన ఆరాలు . మూడేళ్ళు పిల్లల గలిగిన వాళ్ళ కళ్ళ నుండి నీళ్ళు 
ఉబుకుతున్నాయి . మనసు ఇంటికి లాగుతుంటే , పాదాలు తప్పనిసరై 
వెనక్కి వెళుతూ ఉన్నాయి . ఎన్ని కార్లు ను బ్రతిమిలాడినా ఎక్కించు 
కోవడం లేదు . అదిగో ఆటో ! ప్రాణం లేచి వచ్చింది . 
వంద అయితే వస్తాను , ప్రాణ సంకటం లో డిమాండ్ గెలుస్తుంది . 
ఎక్కగానే ఇంకో ఫోన్ . హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ చెన్నై నుండి బయలుదేరింది . 
''బాబు రైల్వే స్టేషన్ కి పోనివ్వు '' చెప్పాము . 
శ్రీహరి కోట సర్కిల్ కి రాగానే అర్ధం అయింది ,సూళూరు పేట 
మొత్తం జల దిగ్భందమే !! నేను నీళ్ళలోకి రాను అని మొండికేసాడు ఆటో . 
లోపలి కి  వెళ్లక పొతే రైలు వెళ్ళిపోతుంది , ఉన్న ఒక్క ఆశ చేజారినట్లే !
మా ఏడుపు మొహాలు చూసి , సరే బై పాస్ మీద ఆ వైపుకు తీసుకువెళతాను . 
ఆ వైపుకు వెళ్ళాము . చెంగాళమ్మ గుడి కి వచ్చేసరికి రోడ్ మీద నీళ్ళు 
పొంగుతూ .... ఇక ఇటు వెళ్ళ లేమా , ఒక్క సారి నిరాశ అందరిలో 
ఉప్పెన కంటే పెద్దదిగా ముంచేస్తూ . ముందు నడుము లోతు 
నీళ్ళు , కాళింగి నది గేట్ విరిగి పొంగిపోయింది . అందరిలో చిన్న 
తెగింపు . ఎలాగోలా దాటేద్దాము కానీండి , లేకుంటే ఇక ఊర్లోకి 
వెళ్ళలేము . ఇంకా నీళ్ళు వచ్చేస్తున్నాయి . 
డివైడర్ను  కాళ్ళతో నీళ్ళలో తడుముకుంటూ నడుస్తున్నాము . 
ఉన్నట్లుండి ప్రవాహానికి తూలీ పడిపోతూ పక్క వాళ్ళను 
పట్టుకుంటూ దాటేసాము . అందరం నీళ్ళు కారిపోతున్నాము . 
పళ్ళు కట కట కొట్టుకుంటూ .... తుపాను చలి ( ఎపుడైనా చూసారా ? )
మళ్ళీ ఆటో ,రైల్వే స్టేషన్ వైపు పోతూ ఉంటె అందరిలో ఆశ , 
వెళ్లి  పోదాములే  ఇంటికి . లోపలి వెళ్ళగానే ప్లాట్ పాం నిండా జనాలు . 
కూర్చొను కూడా స్తలం లేదు . అంతా చలి లా ముసురుకున్న దిగులు . 
ఇంతలో పిడుగు లాగా న్యూస్ . '' హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ఇటు 
రాదు , గుత్తి వైపు మళ్ళించారు '' 
ఒక్క సారి అందరిలో అప్పటిదాకా కూడకట్టుకున్న శక్తి ఏమైందో !!
ఉసూరుమంటూ ..... ఇక ఏమి చేస్తాము , స్కూల్ కి వెళదాము 
తిరిగి . అక్కడ ఉన్న చిన్న క్వార్టర్స్ లో ఉన్న వాళ్లకు పోగా 
మాకు పొడి బట్టలు , దుప్పటి దొరుకుతాయా !అన్నం 
దిగుల్లేదు . అసలు ఈ దిగులుకు ఆకలి వేయడం లేదు . ఫోన్ లు 
రావడం లేదు . బి ఎస్ ఎన్ ఎల్ టవర్ పోయింది . ఎక్కడా 
నో సిగ్నల్ . చుట్టూ చీకటి . ఆటో వాళ్ళను నమ్ముకొని అంత 
దూరం పోవాల్సిందే . వాన ఆగడం లేదు . 
సరే నైటీ అన్నా కొందాము . 
''ఈ రోజు సోమవారం ఎక్కడా షాప్స్ ఉండవు ''సమాధానం . 
ఇక్కడ షార్ ఉద్యోగులు అందరు ఆదివారం షాపింగ్ చేస్తారు కాబట్టి , 
ఆదివారం సెలవు ఉండదు . సోమవారం సెలవు షాప్స్ కి . 
షాప్ దగ్గర దిగేసరికి అక్కడే మా బంధువులు ఉండే విషయం 
గుర్తుకు వచ్చింది . మిగిలిన వాళ్ళను వదిలి ఎలా వెళ్ళేది !
వాళ్ళది పాపం చిన్న ఇల్లు . విషయం చెప్పాను . మేడమ్స్ 
''మీరు వెళ్ళండి . మేము స్కూల్ కి వెళతాము '' చెప్పారు . 

నిజానికి వాళ్ళు పెద్దగా తెలీదు . నాన్న వాళ్ళ పిన్నమ్మకు 
మనుమడు . ఎప్పుడైనా నాన్న తో వెళ్ళినపుడు చూస్తాను . 
ఇప్పుడు వెళ్ళాలి తప్పదు . వెళ్లాను . ముందు షాప్ . 
వెనుక ఇల్లు . పెద్ద ఇల్లు కాదు . రెండు మంచాలు పట్టే రూం . 
వెనుక వంటిల్లు . వెనుక పెరడు . ఒక మంచం మీద పిల్లలు 
పడుకొని ఉన్నారు . పాప మూడు , బాబు ఆరు తరగతులు . 
ఎంతో  ప్రేమగా ఆహ్వానించారు . సునీల్ నా కోసం వెంటనే 
వెళ్లి పాల పేకెట్ తెచ్చి కాఫీ పెట్టించాడు . నాకు ఇబ్బందిగా 
ఉంది , వాళ్లకు భారం అవుతాను అని . నిజానికి 75 ఏళ్ళనాటి 
ఇల్లు . ఆ మంచాల దగ్గర తప్ప మిగిలిన దారిలో చుక్కలుగా 
నీళ్ళు పడుతూ ఉన్నాయి . పాత కాలం గచ్చు పీలుస్తూ 
ఉంది . ఇంత అసౌకర్యం లో కూడా సునీల్ , బాగ్య నా సౌకర్యం 
కోసం తపన పడటం వాళ్ళ ఔదార్యాన్ని సూచిస్తూ ఉంది . 
పొడి బట్టలు తెచ్చి ఇచ్చింది . కాఫీ త్రాగేసరికి కొంచెం 
అక్కడకు అలవాటు పడ్డాను . పిల్లలు కబుర్లు చెపుతూ 
ఉన్నారు . కొత్త పెదమ్మ వాళ్లకి కొత్త గా ఉంది . 
వాళ్ళ వోడాఫోన్ నుండి మా ఎదురింటి వారికి అక్కడ 
నా క్షేమ సమాచారం అందించి , మా వారిని కొంచెం గమనించుకోమని 
చెప్పాను . వాళ్ళు అందరు పక్కన కూర్చొని క్షేమ సమాచారాలు 
మాట్లాడటం , బంధువుల విశేషాలు , పిల్లల ముద్దు మాటలు ... 
ఎన్ని రోజు అయిందో మన వాళ్ళతో ఇలా గడిపి !ఏదో ఒక 
రొటీన్ చక్రం  లో టార్గెట్ ల వెనుక పరిగెత్తడం అలవాటు , 
ఇదేదో కొత్తగా ఉంది . చక్కగా వేడి కారం దోసాలు తిని 
నిద్ర లేచే సరికి ,ఇంటి ముందు ఎక్కడిదో చిన్న పిల్లి పిల్ల , 
ఎవరో వదిలేసారు . పిల్లలు దానితో ఆడుకుంటూ ఉంటె , 
నేను ఎంజాయ్ చేస్తూ .... వాళ్ళ బుక్స్ చదివించి అలవాటు 
ప్రకారం ఐ క్యూ చూసాను . పాప కరక్ట్ గా ఉంది . బాబు తెలుగులో 
డల్ . చిన్నప్పుడు చదువుతూ వ్రాయించని ఫలితం . 
బాబుకి కౌన్సిలింగ్ ఇచ్చాను . కొత్త వాళ్ళ మాటలు తల్లి తండ్రుల 
తిట్లు కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి . 

తిరిగి స్కూల్ కు వెళుతూ ఉంటె సునీల్ బాగ్య 
''ఇది మీ అవ్వ గారిల్లు కూడా . మీరు ఎప్పుడైనా రావొచ్చు '' 
ఇంతకంటే ఒక గృహస్తు జీవనానికి పరీక్ష ఏమి ఉంటుంది . 
వాళ్ళు ఎప్పుడో గెలిచారు . 
అనుకోని అతిధి లాగా వచ్చిన వాన కూడా ఇలాగా సింపుల్ 
గా వెళ్లిపోవాలి కాని ఇలాగా జనాల్ని బాధ పెడితే ఎలా !
''రెయిన్ రెయిన్ గో అవే , కం అగైన్ అనదర్ ఇయర్ '' 
                       @@@@@@@ 
                          



  

Saturday, 7 November 2015

కంచె ..... ఇంకొన్ని మాటలు

 '' కంచె '' ఎప్పటిది . ఇప్పుడు వ్రాస్తున్నాను . చూడాల్సిన 
వాళ్ళు అందరు చూసి రేటింగ్ ఇచ్చెసినాక . ఇచ్చిన కాంప్లిమెంట్స్ తో 
క్రిష్ ఊపిరి పీల్చుకొని ఉంటాడు . మరి మా సీ సెంటర్స్ కి ఇప్పుడే 
వచ్చింది . ఇక ఇప్పుడే కదా చూస్తాము . 

అసలు ఈ ఫోటో పెట్టడానికే కొంత సేపు పట్టింది . ఎందుకంటె క్రిష్ చూపిన రెండు 
కోణాలు దీనిలో ఉండాలి అనుకుంటే ఈ ఫోటో ఆప్ట్ అయింది . 
నాకు ఫేస్ బుక్ నుండి మా పాప నుండి బాబు నుండి ముందే రివ్యు 
వచ్చేసింది . నువ్వు చూడాల్సిన సినిమా మా ,తప్పకుండా వెళ్ళు . 
ఎప్పుడు వస్తుందా అని అప్పటి నుండి వాల్ పోస్టర్స్ ని గమనిస్తూ 
ఉన్నాను , శ్రీవారిని కొంచెం ముందే మోటివేట్ చేసి . పిల్లలు చెప్పారు 
అంటే సినిమా నన్నేమి నిరాశ పరచదు ,ఖచ్చితంగా . 

సినిమా కధ కు వస్తే రెండో ప్రపంచ యుద్ధం నేపద్యం లో 
కులాలు అంతరాలు ఎదిరించి కలిసి పోవాలి అనుకునే 
ఇద్దరు ప్రేమికుల కధ . లవ్ అండ్ వార్ ఎప్పుడూ మానవాళి కి 
ఇంటరెస్టింగ్ విషయాలు . రెండిటిలో చిక్కటి స్క్రీన్ ప్లే ,ఘర్షణ 
ఉంటాయి . వీటికి సంభందం ఎలా కలిపాడు క్రిష్ అనేది ఇంకా 
ఇంటరెస్టింగ్ . వాళ్ళు కలిసారా లేదా అనేది ఆ రోజులకే కాదు 
 ఈ రోజు పరిస్త్తితుల్లో కూడా సాహసికమైన కధ . 

హీరో హరి  చిన్న కులం ,హీరోయిన్ సీత  జమిందారులు . 
కలపడమే మద్రాసు  లో కలిపేస్తాడు క్రిష్ . ఎక్కువ టైం 
తీసుకోకుండా ఒక్క పాటలోనే వాళ్ళ మధ్య ప్రేమను 
వండర్ఫుల్ సెల్యులాయిద్స్ గా మనసుకు తగిలించేస్తాడు , 
ఎప్పటికీ మాసిపోని గుర్తులుగా . ముందే తన ఊహల్లో ఆ ఫోటో 
ప్రేమ్స్ తీసుకొని ఉంటాడు . అలాగే దించేసాడు .
హీరో గా వరుణ్ తేజ , హీరోయిన్ గా ప్రజ్ఞ చాలా బాగున్నారు . 
''ఏమోయ్ షేక్ స్పియర్ '' అని హీరో చిన్న కవితలకు మురిసిపోయి 
సీత అందం బాగుంది . కాక పోతే కవితలు కాబట్టి 
''ఏమోయ్ కీట్స్ '' అనాలేమో . పర్లేదు . హృదయాలు ఒకటైనపుడు 
పేర్లు వాటికి సంభందించిన పరువు , పలుకుబడి , అంతస్తు 
అధికారం ,అవేమి అవసరం లేదు . చివరికి వాళ్ళ సొంత పేరుతో సహా . 

హీరోయిన్ కాస్ట్యూమ్స్ గూర్చి ఖచ్చితంగా చెప్పుకోవాలి . 
ఎవరు చెప్పారు విప్పుకుంటేనే  అందం అని , చక్కగా చీరలో 
యెంత బాగుందో !  కుటుంభం లో అందరం హాయిగా 
చూడొచ్చు . 
పాటలు , సంగీతం చాలా బాగున్నాయి . 
ముఖ్యంగా ఆ యుద్ధ వాతావరణం , పల్లె వాతావరణం 
అక్కడ దేశాలు మధ్య ఏర్పడ్డ కంచెలు , ఇక్కడ మనసుల మధ్య 
కొందరి వలన ఏర్పడిన కంచెలు .... ఒక్కో సీన్ అక్కడ కొంత 
ఇక్కడ కొంత పేర్లల్ గా చూపించడం , నిజంగా క్రిష్ కత్తి 
మీద సాము ని సక్సెస్స్ గా చేసాడు . అసలు ఈ రోజుల్లో 
ఈ కధ  తీసుకోవడమే ఈ టీం చేసిన సాహసం . 
ముఖ్యంగా ఒక అమ్మాయి జర్మన్ సేనలు ముందు నగ్నంగా నిలబడి 
వీళ్ళను కాపాడటం , శ్రీనివాసులు ఏడుస్తూ నీవు నా తల్లివి 
అని మనసు మార్చుకోవడం ,నిజమే మనది కాని శరీరం 
లోని నగ్నత  మన మాత్రుత్వాన్నే గుర్తు చేస్తుంది కానీ 
కోరిక రగిలించదు . యుద్ధం మధ్యలో చిన్ని పాపను 
చూపడం సినిమాలో భాగం అనుకున్నాను కాని పాపే 
ఈ సినిమాకి కేంద్రం అయిపోతుంది అనుకోలేదు . 
పాపను రక్షించడం .... 
చివరికి పాప కోసం అందరు ప్రాణాలు ఒడ్డి పోరాడటం గ్రేట్ . 

మధ్యలో హీరో చేత చెప్పిస్తారు ...... మనది ఎంత ఊరు , 
ఇంత ప్రపంచం లో , ఇంత గ్రహ కూటమి లో ,ఇంత విశ్వం లో 
మనం ఎంత . దీనిలో మనం దేని కోసం పోరాడటం . 
ఎక్కడా పోరాటమే , చివరికి ఆ చిన్ని పాప కూడా 
పాలు కోసం కాదు ప్రాణాలు కోసం పోరాడుతుంది . 
దానికి పాపం పుట్టాను అనే సంగతే తెలీదు . ఇక చావు గురించి 
తెలిసే అవకాశమే లేదు . ఎవరి కోసం చేస్తున్నాము ఇన్ని 
యుద్దాలు ముందు తరాలలో పుట్టబోయే వారిని కూడా 
ఫణం గా పెట్టి ...... వరుణ్ తేజ చేసిన రెండు సినిమాలలో 
స్పిరుచ్యువల్ బేస్ ఉండటం యాదృచ్చికం కావొచ్చు . లేదా అతని 
పాషన్ కావొచ్చు . కాని ఎందుకో ఈ వాక్యాలు మాత్రం క్రిష్ 
మైండ్ లోవి కాదు హృదయం లోవి అనిపించింది . 

సాయి మాధవ్ బుర్రా గురించి చెప్పుకోక పోతే ఈ రివ్యు కే  పెద్ద లోపం 
సీత చెపుతుంది హర్ష తో .. నన్ను మొదట ప్రేమించిన మగాడు అర్జున్ 
మా అన్నయ్య '' అని దేనిని నేను వదులుకోను అనే ప్రేమ , స్త్రీ 
సహజత్వాన్ని చిత్రిస్తూ , ఇక అర్జున్ చెప్పే మాట '' ఆఫ్ట్రాల్ స్త్రీవి '' 
మొత్తం వాస్తవ దుస్థితి రిఫ్లెక్షన్ ,
ఇంకా బామ్మ చెప్పే డైలాగ్ మనం మన గర్భాలలొ వారసులను కనివ్వడానికే , 
అదే గొప్ప అనుకోని సర్దుకుని పోవాల్సిందే . 
ఇంకా సైన్యం లో ఊరికినే చేరి కష్టాలు ను విసుక్కున్న శ్రీనివాసులు 
మారిపోయి పాపను రక్షిద్దాము  అన్నప్పుడు హీరో చెప్పే మాట 
''ఇప్పటిదాకా సైన్యం లో ఉన్నావు . ఇప్పుడు సైనికుడివి అయినావు '' 
నిజమే మనం కూడా ఇప్పటిదాకా మనుషుల్లో ఉన్నాము కాని 
మనిషి అయినామో లేదో తెలీడం లేదు . 
ఇక చివరగా ఒక్కటి ...... 
నేనంటే ఇష్టమా షేక్స్ పియర్ అన్న సీతతో 
''కాదు ప్రేమ '' 
''రెండింటికి తేడా ఏమిటి అంటే ''
''ఇష్టం ఉంటె రోజా పోవును కోసేస్తాము , 
ప్రేమ ఉంటె దానికి నీరు పోస్తాము '' 
ఎక్సలెంట్ . రెండికీ తేడా తెలీకనే ఈ కత్తి పోట్లు , 
ఆత్మ హత్యలు , ఆసిడ్ దాడులు . 

ఎటో పరిగెత్తుతున్న జనాలను విశ్వ మానవులుగా 
ఆలోచింప చేయడం లో ఈ సినిమా సూపర్ సక్సెస్ . 
ఎప్పుడూ  జేబు కోసం కాదన్నయ్యా ..... జనాల మంచి కోసం 
కూడా సినిమాలు తియ్యాల ..... అంతేనంటారా :-)