Tuesday, 17 November 2015

అనుకోని అతిధి

''పొద్దునే  వచ్చిన వానా ,పొద్దు పోయి వచ్చిన చుట్టం 
పోనే పోరు '' 
అనుకోని అతిధులు వచ్చినా హోస్టింగ్ చేయడం ఎలాగో నాకు 
తెలుసు . కాని నేను అతిధి గా వెళ్ళాల్సి రావడం చాలా ఇబ్బంది 
అనిపించింది . 
అబ్బ ఏమి వర్షాలు .... ఏమి వరదలో  ఏమిటో ! 
అటు చెన్నై నుండి ఇటు నెల్లూరు వరకు అందరినీ తల క్రిందులు 
చేస్తూ ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని పరిగెత్తే టట్లు చేస్తున్నాయి . 
అటు చిత్తూరు ,ఇటు నెల్లూరు , కడప , ఇక తిరుమల కొండ 
  ,పొంగని వాగు వంక , నది లేదు . దేవుడు సముద్రాన్ని 
సృష్టించబట్టి ఇన్ని నీళ్ళు తనలో దాచుకుంటుంది కాని లేకుంటే 
ఈ నీళ్లన్నీ ఎక్కడికి పోవాలా !!!! 
ఉదయం వాన మబ్బు లో  ఇక పోలేము స్కూల్ కి అనుకున్నాను . 
అక్కడ క్వార్టర్స్ లో ఉంటూ ఇక్కడికి వస్తూ అటో కాలు ఇటో కాలుగా 
ఉన్నాను . మొన్న ఈయన గారు టూ వీలర్ పై నుండి పడి 
ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటి నుండి , ఒక్కరినే వదలాలి 
రాత్రి  అంటే  భయంగా ఉంది . పక్కన తోడూ , కాసింత వెచ్చదనం , 
ఊరట ఇచ్చే మాట , జీవితం లో ఒక పార్ట్ అనుకొనే దశ నుండి 
అవసరం అనుకొనే  దశకు వచ్చేసినట్లు ఉన్నాము . 
రెక్కలు వచ్చిన చిన్న పక్షులు ఎప్పుడో గూడు విడిచి ఎగిరిపోయి 
వాటి బ్రతుకు పోరాటం లో మునిగిపోయి ఉన్నాయి . 
ఏదో భారత దేశ గృహస్తు జీవన విధానం పుణ్యమా అని ఒకరికి ఒకరం , 
ఈ పద్దతే లేకుంటే ఒంటరి బ్రతుకే నేమో !!!
ఉదయాన్నే చూస్తే న్యూస్ పేపర్ టైం కి వచ్చేసి ఉంది . 
''అరె  చిన్న పిల్లవాడు ఇంత వానలో సమయానికి పేపర్ 
అందిస్తే , పెద్దవాళ్ళం   కర్తవ్యాన్ని నిర్వహించొద్దా ?'' ఆత్మ సాక్షి 
ప్రశ్నిస్తూ  ఉంది. రెడీ అయిపోయి స్కూల్ కి వెళ్ళిపోయాము . 

ఇంటికి వెళ్ళే వేళకి చుట్టుకున్న ప్రశ్నలు అందరి దగ్గర నుండి , 
''ఎలా వెళుతారు ? సూళ్ళూరు పేట నాలుగు పక్కల నీళ్ళే , 
మీ ఇంటికి దారి ఎక్కడ ఉంది ? ''
దేవుడా హై వే  పై దారి మూసుకోనక ముందే ఇంటికి చేరాలా !
ఆటో తో బస్ క్రాస్స్ చేసి ఎక్కేసాము హమ్మయ్య అనుకుంటూ . 
సరిగా మూడు కిలో మీటర్లు వెళ్ళగానే బస్ ఆపేశారు . 
నిమిషాల్లో ముందు వెనుక లారీలు , బస్ లు పై నుండి 
వర్షం . హై వె రెండు వైపులా కాళింగి నది నుండి పొంగిన నీళ్ళు . 
వరుసలో మాది పదో బస్ . రోడ్ మీదకు వచ్చిన ప్రవాహం 
 తగ్గితే వెళ్లిపోతాము అనే ఆశ . నిముషాలు అర గంటగా
మారిపోయిన తరువాత , ఇక ఏవి అవతలకి వెళ్ళవు అని కబురు . 
చెన్నై నుండి వస్తున్న పసి బిడ్డలు పాలకి అప్పుడే ఏడుపు మొదలు పెట్టారు . 
ఊరికి ఇంత  దూరం లో ఏమి దొరుకుతాయి ?

ఇంకా ఇంటికి వెళతాము అనే ఆశ చావలేదు . దిగి వాహనాల వరుస 
వెంబడి ముందుకు వెళ్లి చూసాము . ఉరకలు వేస్తూ రోడ్డు కు ఆ వైపు నుండి 
ఈ వైపు యెర్రని నీళ్ళ ప్రవాహం . ముందు నిలబడిన రెండు బస్ ల టైర్లు మునిగి 
వాటిలోకి నీరు వెళ్లి పోతూ ఉంది . అవి కూడా పడిపోతాయో ఏమో ! అలా 
ఊపెస్తున్నాయి నీళ్ళు . అంతా  అధికార యంత్రాంగం , పోలీస్ లు 
మీడియా నిలబడి , ఆదిలిస్తూ హెచ్చరికలు చేస్తూ బాధ్యతలో తల మునకలుగా 
ఉన్నారు . మమ్మల్ని చూసి వెనక్కి వెళ్లి పొండి , ఈ రోడ్డు కూడా మునిగి
 పోతూ ఉంది  అన్నారు .    
వెనక్కి నలుగురం నడక ప్రారంభించాము . ఇలా యెంత దూరం నడవడం !
భయం , చలి తడి బట్టలు, పాదాలు ముందు కు వెళ్ళ మని మొండికేస్తున్నాయి . 
ఇళ్ళ దగ్గర నుండి అందరికీ ఫోన్ లు , ఎక్కడ ఉన్నారు అని భయంతో 
కూడిన ఆరాలు . మూడేళ్ళు పిల్లల గలిగిన వాళ్ళ కళ్ళ నుండి నీళ్ళు 
ఉబుకుతున్నాయి . మనసు ఇంటికి లాగుతుంటే , పాదాలు తప్పనిసరై 
వెనక్కి వెళుతూ ఉన్నాయి . ఎన్ని కార్లు ను బ్రతిమిలాడినా ఎక్కించు 
కోవడం లేదు . అదిగో ఆటో ! ప్రాణం లేచి వచ్చింది . 
వంద అయితే వస్తాను , ప్రాణ సంకటం లో డిమాండ్ గెలుస్తుంది . 
ఎక్కగానే ఇంకో ఫోన్ . హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ చెన్నై నుండి బయలుదేరింది . 
''బాబు రైల్వే స్టేషన్ కి పోనివ్వు '' చెప్పాము . 
శ్రీహరి కోట సర్కిల్ కి రాగానే అర్ధం అయింది ,సూళూరు పేట 
మొత్తం జల దిగ్భందమే !! నేను నీళ్ళలోకి రాను అని మొండికేసాడు ఆటో . 
లోపలి కి  వెళ్లక పొతే రైలు వెళ్ళిపోతుంది , ఉన్న ఒక్క ఆశ చేజారినట్లే !
మా ఏడుపు మొహాలు చూసి , సరే బై పాస్ మీద ఆ వైపుకు తీసుకువెళతాను . 
ఆ వైపుకు వెళ్ళాము . చెంగాళమ్మ గుడి కి వచ్చేసరికి రోడ్ మీద నీళ్ళు 
పొంగుతూ .... ఇక ఇటు వెళ్ళ లేమా , ఒక్క సారి నిరాశ అందరిలో 
ఉప్పెన కంటే పెద్దదిగా ముంచేస్తూ . ముందు నడుము లోతు 
నీళ్ళు , కాళింగి నది గేట్ విరిగి పొంగిపోయింది . అందరిలో చిన్న 
తెగింపు . ఎలాగోలా దాటేద్దాము కానీండి , లేకుంటే ఇక ఊర్లోకి 
వెళ్ళలేము . ఇంకా నీళ్ళు వచ్చేస్తున్నాయి . 
డివైడర్ను  కాళ్ళతో నీళ్ళలో తడుముకుంటూ నడుస్తున్నాము . 
ఉన్నట్లుండి ప్రవాహానికి తూలీ పడిపోతూ పక్క వాళ్ళను 
పట్టుకుంటూ దాటేసాము . అందరం నీళ్ళు కారిపోతున్నాము . 
పళ్ళు కట కట కొట్టుకుంటూ .... తుపాను చలి ( ఎపుడైనా చూసారా ? )
మళ్ళీ ఆటో ,రైల్వే స్టేషన్ వైపు పోతూ ఉంటె అందరిలో ఆశ , 
వెళ్లి  పోదాములే  ఇంటికి . లోపలి వెళ్ళగానే ప్లాట్ పాం నిండా జనాలు . 
కూర్చొను కూడా స్తలం లేదు . అంతా చలి లా ముసురుకున్న దిగులు . 
ఇంతలో పిడుగు లాగా న్యూస్ . '' హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ఇటు 
రాదు , గుత్తి వైపు మళ్ళించారు '' 
ఒక్క సారి అందరిలో అప్పటిదాకా కూడకట్టుకున్న శక్తి ఏమైందో !!
ఉసూరుమంటూ ..... ఇక ఏమి చేస్తాము , స్కూల్ కి వెళదాము 
తిరిగి . అక్కడ ఉన్న చిన్న క్వార్టర్స్ లో ఉన్న వాళ్లకు పోగా 
మాకు పొడి బట్టలు , దుప్పటి దొరుకుతాయా !అన్నం 
దిగుల్లేదు . అసలు ఈ దిగులుకు ఆకలి వేయడం లేదు . ఫోన్ లు 
రావడం లేదు . బి ఎస్ ఎన్ ఎల్ టవర్ పోయింది . ఎక్కడా 
నో సిగ్నల్ . చుట్టూ చీకటి . ఆటో వాళ్ళను నమ్ముకొని అంత 
దూరం పోవాల్సిందే . వాన ఆగడం లేదు . 
సరే నైటీ అన్నా కొందాము . 
''ఈ రోజు సోమవారం ఎక్కడా షాప్స్ ఉండవు ''సమాధానం . 
ఇక్కడ షార్ ఉద్యోగులు అందరు ఆదివారం షాపింగ్ చేస్తారు కాబట్టి , 
ఆదివారం సెలవు ఉండదు . సోమవారం సెలవు షాప్స్ కి . 
షాప్ దగ్గర దిగేసరికి అక్కడే మా బంధువులు ఉండే విషయం 
గుర్తుకు వచ్చింది . మిగిలిన వాళ్ళను వదిలి ఎలా వెళ్ళేది !
వాళ్ళది పాపం చిన్న ఇల్లు . విషయం చెప్పాను . మేడమ్స్ 
''మీరు వెళ్ళండి . మేము స్కూల్ కి వెళతాము '' చెప్పారు . 

నిజానికి వాళ్ళు పెద్దగా తెలీదు . నాన్న వాళ్ళ పిన్నమ్మకు 
మనుమడు . ఎప్పుడైనా నాన్న తో వెళ్ళినపుడు చూస్తాను . 
ఇప్పుడు వెళ్ళాలి తప్పదు . వెళ్లాను . ముందు షాప్ . 
వెనుక ఇల్లు . పెద్ద ఇల్లు కాదు . రెండు మంచాలు పట్టే రూం . 
వెనుక వంటిల్లు . వెనుక పెరడు . ఒక మంచం మీద పిల్లలు 
పడుకొని ఉన్నారు . పాప మూడు , బాబు ఆరు తరగతులు . 
ఎంతో  ప్రేమగా ఆహ్వానించారు . సునీల్ నా కోసం వెంటనే 
వెళ్లి పాల పేకెట్ తెచ్చి కాఫీ పెట్టించాడు . నాకు ఇబ్బందిగా 
ఉంది , వాళ్లకు భారం అవుతాను అని . నిజానికి 75 ఏళ్ళనాటి 
ఇల్లు . ఆ మంచాల దగ్గర తప్ప మిగిలిన దారిలో చుక్కలుగా 
నీళ్ళు పడుతూ ఉన్నాయి . పాత కాలం గచ్చు పీలుస్తూ 
ఉంది . ఇంత అసౌకర్యం లో కూడా సునీల్ , బాగ్య నా సౌకర్యం 
కోసం తపన పడటం వాళ్ళ ఔదార్యాన్ని సూచిస్తూ ఉంది . 
పొడి బట్టలు తెచ్చి ఇచ్చింది . కాఫీ త్రాగేసరికి కొంచెం 
అక్కడకు అలవాటు పడ్డాను . పిల్లలు కబుర్లు చెపుతూ 
ఉన్నారు . కొత్త పెదమ్మ వాళ్లకి కొత్త గా ఉంది . 
వాళ్ళ వోడాఫోన్ నుండి మా ఎదురింటి వారికి అక్కడ 
నా క్షేమ సమాచారం అందించి , మా వారిని కొంచెం గమనించుకోమని 
చెప్పాను . వాళ్ళు అందరు పక్కన కూర్చొని క్షేమ సమాచారాలు 
మాట్లాడటం , బంధువుల విశేషాలు , పిల్లల ముద్దు మాటలు ... 
ఎన్ని రోజు అయిందో మన వాళ్ళతో ఇలా గడిపి !ఏదో ఒక 
రొటీన్ చక్రం  లో టార్గెట్ ల వెనుక పరిగెత్తడం అలవాటు , 
ఇదేదో కొత్తగా ఉంది . చక్కగా వేడి కారం దోసాలు తిని 
నిద్ర లేచే సరికి ,ఇంటి ముందు ఎక్కడిదో చిన్న పిల్లి పిల్ల , 
ఎవరో వదిలేసారు . పిల్లలు దానితో ఆడుకుంటూ ఉంటె , 
నేను ఎంజాయ్ చేస్తూ .... వాళ్ళ బుక్స్ చదివించి అలవాటు 
ప్రకారం ఐ క్యూ చూసాను . పాప కరక్ట్ గా ఉంది . బాబు తెలుగులో 
డల్ . చిన్నప్పుడు చదువుతూ వ్రాయించని ఫలితం . 
బాబుకి కౌన్సిలింగ్ ఇచ్చాను . కొత్త వాళ్ళ మాటలు తల్లి తండ్రుల 
తిట్లు కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి . 

తిరిగి స్కూల్ కు వెళుతూ ఉంటె సునీల్ బాగ్య 
''ఇది మీ అవ్వ గారిల్లు కూడా . మీరు ఎప్పుడైనా రావొచ్చు '' 
ఇంతకంటే ఒక గృహస్తు జీవనానికి పరీక్ష ఏమి ఉంటుంది . 
వాళ్ళు ఎప్పుడో గెలిచారు . 
అనుకోని అతిధి లాగా వచ్చిన వాన కూడా ఇలాగా సింపుల్ 
గా వెళ్లిపోవాలి కాని ఇలాగా జనాల్ని బాధ పెడితే ఎలా !
''రెయిన్ రెయిన్ గో అవే , కం అగైన్ అనదర్ ఇయర్ '' 
                       @@@@@@@ 
                          



  

4 comments:

వనజ తాతినేని said...

చాలా ఆసక్తిగా చదివించింది . ఒకోచోట సస్పెన్స్ ఏమి ఇబ్బంది పడబోతున్నారోనని . అతిధి ని ఆదరించడం భాగ్యం కదా శశీ ! అక్కడ కూడా టీచరమ్మ అవతారం !/ బహు బాగు . వచ్చే ఏడు దాకా వర్షం రాకుండా ఉంటుందా ? నెల్లూరు కి తుఫాన్ వస్తేనే కదా వర్షం . మళ్ళీ వస్తుంది చూడు .. :)

శశి కళ said...

thuphan maatram vaddu vanajakka . vaanaa raavaave ,kaani melligaa raave .
pantalanu antha lala posi pove :)

Raja Rao said...

చాలా ఇబ్బంది పడ్డారు. Please take care. How is bavagaru now. God bless u all.

శశి కళ said...

thanks rajarao annayya ,andaram baagunnamu