Monday, 30 September 2013

ఆత్త్తారింటికి వెళ్ళారా ?

ఆత్త్తారింటికి వెళ్ళారా ?

''సింహం నేను ఒకటే ,కాకుంటే అది గడ్డం గీసుకోదు 
నేను గీసుకుంటాను అంతే '' (అర్ధం ఇదే అనుకుంటాను )
అధ్దో విజిల్స్ ....  విన్నాను .  కలెక్షన్స్ రికార్డ్ లెవల్ . 
ఇక్కడ ఏమి హుషారు లేదు . ఏమిటబ్బా ? 

కోటకు పని మీద వెళ్లి ఆ దారి కూడా చూస్తే పని అయిపోతుంది 
అని మా మేన కోడల్ని తోడు తీసుకొని వెళ్లాను . పవన్ కళ్యాణ్ 
అంటే ఏడు సముద్రాలు దాటి మాంత్రికుడి ప్రాణం తేవాలి కాని 
సముద్రాలు దాటోచ్చి అత్తను బ్రతిమిలాడి తీసుకుపోవడమా ?
సరే లెండి ... బంగారం లో కూడా పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ 
చూసాము కదా అని సర్దుకున్నాను . 

కధలోకి వస్తే స్పెయిన్ లో స్టీల్ ఫాక్టరీ ఓనర్ పవన్ (గౌతం )
తాతయ్య . వాళ్ళ నాన్న కూడా అదే ఫాక్టరీ చూసుకుంటూ ఉంటాడు . 
ఎవడో వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే గౌతమ్ బాబు సింపుల్ 
గా వాడిని సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళి వాడి మనుషులను 
కొట్టి వాడికి ''పులి చనువు ఇచ్చింది కదా అని దానితో ఫోటో 
దిగాలి అనుకోకు ''అని త్రివిక్రమ్ మార్కు పంచ్  ఇచ్చి 
వచ్చేస్తాడు . మా బుడ్డి పిల్ల పక్కన చేరి అత్తమ్మ ఇదొక్కటే 
ఫైట్ బాగా చూడు అనింది . ఏమిటి చూసేది ఫాస్ట్ గా 
అయిపోయింది . ఎవరు ఎవర్ని కొట్టారో అర్ధం కాలేదు అన్నాను . 
పాపం డైరక్టర్ కి ఇదే అనుమానం వచ్చింది ఏమో మళ్ళా 
రివైండ్ చేసాడు . మామూలే ఎన్ని ఏ . కె . నలబై ఏళ్ళు పేలినా 
గౌతం వాళ్ళను డిష్యుం .... డిష్యుం ..... (నా కైతే ఆరడుగుల 
బుల్లెట్టు పాట కొంచెం పవన్ ఇంట్రడక్షన్ అప్పుడు పెట్టి ఉంటె 
బాగుండును అనిపించింది )

ఇంటికి వచ్చినాక వాళ్ళ తాత కోరిక మేరకు ఆయన ఎనబై 
జన్మ దినానికి ఎప్పుడో ప్రేమ వివాహం చేసుకొని వాళ్ళ 
నాన్న తన భర్త ను కాల్చి అనుమానించాడు అని ఇప్పటి 
దాకా తండ్రి ఇంటికి రాని తన మేనత్త ను ఒప్పించి ఇంటికి 
తీసుకుని రావడానికి తనతో ఒక పది మంది సేవకులను 
సూట్కేస్ ల కొద్ది డబ్బు ను వెంట తీసుకొని బయలుదేరుతాడు . 

విమానాశ్రయం లో వాళ్ళ మామ కారు వెనుక వెంబడించ 
దానికి కారు లేక పాపం అక్కడ ఉన్న కారు ఓనర్ కి 
జస్ట్ అరవై లక్షలు ఇచ్చి ఆ కార్ ఎక్కి వాళ్ళ మామ ను 
వెంబడిస్తాడు . ఏమిటి అరవై లక్షలా .... అంటున్నారు . 
అసలు మా పవన్ కి డబ్బు అంటే లెక్కా జమా ..... 
వచ్చి చూడండి ఎన్ని లాజిక్ లు లేని మాజిక్ లో :)

దారిలో వాళ్ళ మామకి హార్ట్ అటాక్ వస్తే కాపాడి వాళ్ళ అత్తకు 
తానెవరో చెప్పకుండా కార్ డ్రైవర్ గా చేరుతాడు . అదేమిటి 
అంటే .... పాపం పవన్ కి మాత్రం ఏమి తెలుసు ,త్రివిక్రమ్ కి 
ఏమి తెలుసు ఎక్కడికి అక్కడ కధ ఏది దొరికితే అది వ్రాసుకుంటూ 
పోయారు . అక్కడ అత్త ఇంట్లో అప్పుల బాధలు ,ఇంకా 
ఇద్దరు  ఆడపిల్లలు ప్రణవి ,సమంత (శశి ) మధ్య బాధలు 
ఇంట్లో అత్త మరుదులు ,ఆడ పడుచు ఇంకా... ఇంకా..... 

ఇన్ని బాధలు పడి పెద్ద అమ్మాయిని చేసుకుందాము అంటే 
ఆమె వేరే వాడిని ప్రేమిస్తుంది ,మన హీరో గారు వెళ్లి ఆ 
అబ్బాయిని తీసుకోచ్చేటపుడు డి .ఎస్ . పి కూడా జీప్ 
ఎక్కుతాడు . మంచిజోష్ వస్తుంది అనుకున్నాను . ఆలీ ని 
ఉపయోగించుకోలేదు . ఎలాగు పవన్ కళ్యాన్ బాగానే నవ్విస్తాడు 
కదా . అబ్బో ఇప్పుడు పెళ్లి కూతురు రౌడీల చేసింగులు 
ఫైటింగ్ లు...... ఏదో ఒక డైలాగ్ లేకుంటే పవన్ కల్యాన్ 
సినిమాలో కిక్  ఎక్కడ ఉంటుంది ? 
ఆయన స్పెట్స్ జీప్ మీద పెట్టి ''ముట్టుకుంటే నన్ను కొట్టినట్లే 
పెట్టుకుంటే నేను చచ్చినట్లే ''అంటాడు . ఇక దాన్ని తాకాలని 
రౌడీల పరుగో పరుగు . నేను మాత్రం ఛా ,స్పెట్స్ గాల్లోకి విసిరేసి 
కొట్టకూడదా .... పీటర్ హైన్ ఉంది ఏమి లాభం అనుకున్నాను . 
వెంటనే పవన్ కళ్యాణ్ స్పెట్స్ గాల్లోకి ఎగరేసి అందరిని 
డిష్యుం .... డిష్యుం .... 

సరే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అబ్బాయిని తీసుకుని వెళ్లి అందరిని 
ప్రణవి పెళ్ళికి ఒప్పిస్తాడు . పాపం శశి పెళ్లి విలన్ తో కుదుర్చి 
వాళ్ళ అత్త సింపుల్ గా '' నువ్వు మా అల్లుడు వి అని తెలుసు 
మా ఆయన రక్తం చూసిన ఇంటికి నేను రాను అని పంపేస్తుంది ''
పవన్ కళ్యాన్ ఇంటి బయటకు వచ్చేస్తాడు . 

ఇప్పుడు గౌతం ఏమి చేస్తాడు ?నాకే కాదు పాపం త్రివిక్రమ్ కి 
కూడా ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు . బోలెడు ముక్కలు 
తీసి అతికించి శుభం కార్డ్ వేస్తాడు . పాటలు ముఖ్యంగా 
''కాటమ  రాయుడా ''పాట  సినిమా లో కంటే ప్రోమో లో 
బాగున్నాది . ఇక మిగిలిన పాటలు , బ్యాక్ గ్రౌండ్ ''పిల్లా 
నువ్వు లేని జీవితం ''గబ్బర్ సింగ్ పాటలు గుర్తుకు వచ్చాయి . 

ఇంకా నేను story చెప్పను . పవన్ ఫాన్స్ ఫీల్ అవుతారు . 
మన పవన్ కళ్యాణ్ కోసం అయినా ఓపిక చేసుకొని 
''అత్తారింటికి '' వెళ్లి రండి . 

Wednesday, 25 September 2013

లాంతరు చెండు

లాంతరు చెండు 
(ఎర్ర అరుగులు కధల సీరీస్ )
 
''మీ ఇంట్లో కొత్త చింతకాయ తొక్కు ఉందా కాంతమ్మ ?''
అడిగింది పక్కింటావిడ ని మా అమ్మమ్మ . ఆపుకున్నా 
ఆగని ఆనందం హడావాడీ .... అమ్మమ్మ మాటల్లో . 
''ఏమిటి సంగతి ?చిన్నమ్మాయి పిల్లలు వస్తున్నారా 
కోట నుండి సెలవలకు ''అడిగింది ఆవిడ . 
పెదమ్మ రాజేశ్వరి కావలి లోనే కాపురం . మామయ్య కు 
పెళ్లి కాలేదు . ఇక బయటి నుండి వచ్చే బంధువులు అంటే 
మా అమ్మమ్మకు మేమే . అందులో కావలి వాళ్లకు పిల్లలు 
అంటే భలే ప్రేమ . పెదమ్మకు ఐదుగురు ,అమ్మకు నలుగురం 
మేము వెళ్ళాము అంటే ఎర్ర అరుగులు పిల్లల కేరింతలతో 
సందడి చేయాల్సిందే . పట్నం ఇంకా పూర్తిగా మారని 
పల్లె లాంటి ఊరు ప్రేమ పలకరింపుల పన్నీటిని చల్లుతూ 
ఉంటుంది ఎండాకాలపు మండుటెండ లను మరిపిస్తూ . 

రోడ్ కి ఆ వైపున సులోచన అత్త ఇల్లు . సాయంత్రం అరుగుల 
మీద కూర్చుని పలకరిస్తూ ఉంటారు . 
''ఎలా ఉండారు చిన్నమ్మాయి ?మీ అమ్మ ఎక్కడ ?''
అడిగింది మా అమ్మను పలకరిస్తూ . 
అమ్మమ్మ లోపల నుండి వస్తూ '' రా సులోచన ,ఇందాకే 
పిల్లలకు  జడ వేస్తే బాగుండును అనుకున్నాము '' 
''అదే నమ్మ ... నేను కూడా మల్లె మొగ్గలు చూసి అనుకున్నాను . 
ఇంకా పిల్లలకు వేయాలని అనుకోలేదే అని  . మొగ్గలు ఏమి ఉండాయి 
చక్కగా సూది మొన లాగా . గుత్తంగా కుడితే భలే కుదురుతుంది 
జడ '' 
చెవిలో పూల జడ మాట పడగానే ఆడ పిల్లలకి హుషారు . 
మా పెదమ్మ కూతుర్లు శైలక్క , వనజ . కాని మేము 
ఊరి నుండి వచ్చాము . చెల్లి సునీత రెండేళ్ళ పిల్ల కాబట్టి 
నాకు, అక్కకే వేస్తారు . హయ్య కుచ్చుల జడ ముందుకు 
వెనక్కి ఊపుతూ ఉంటె భలే ఉంటుంది . నాకు భలే హుషారు 
వచ్చింది . ''అమ్మమ్మ ఎప్పుడు కుడతారు .... ఎప్పుడు కుడతారు 
నాకు ఇప్పుడే కావాలి ''అమ్మమ్మ కాళ్ళు చుట్టుకున్నాను . 

''ఇప్పుడంటే ఇప్పుడే ఎలా కుదురుద్ది . రేపు వేయిస్తాను లేమ్మా . 
పూలు కావద్దా ?'' 
సరే కుట్టిస్తారు అని గారెంటీ వచ్చింది కాబట్టి నా మొండి కొంత సడలించాను. 
''అత్తా ... ఇక్కడిదాకా కుడుతావా ?ఇక్కడిదాకా నా అని 
నా నడుము దాకానా కాళ్ళ దాకానా ?''అని చూపిస్తూ 
సులోచన చుట్టూ ,అమ్మ చుట్టూ ఒకటే పరుగులు . 
అక్క కూడా నవ్వుతూ ఉంది . 

అమ్మ నవ్వుకుంటూ
 ''పరిగెత్త వాకే పడతావు . ఆడుకోపో ''
ఇంట్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు
 కాబట్టి ఉయ్యాల బల్ల ఊగలేము . 
''జుయ్య్ ''తూనీగా లాగా యెర్ర అరుగుల మీదకు పెదమ్మ పిల్లలతో ఆటలు . 
అదే పడవ,అదే బస్  ,అదే ఇల్లు 
ఒక్క అరుగు మా ఆటల్లో ఎన్ని వేషాలు వేస్తుందో . 
పిల్లల నవ్వులు పూసి ఆత్మీయతల బరువుతో మా అరుగు 
నడుం వంచి మా సవారీకి తయారు అయ్యి మురిసి పోయింది . 

ఆడ వాళ్ళు పూల జడ అని నిర్ణయించారు అంటే చుట్టు 
పక్కల వారికి కూడా సందడే సందడి .సహాయం చేసే వాళ్ళు ,
సలహాలు ఇచ్చే వాళ్ళు ,నేర్చుకునేవాళ్ళు ,చూసి మురిసే 
పెద్ద వాళ్ళు .... ఎంత మంది కుడితే ఒక్కరికి పూల జడ 
అయ్యేను . అక్కడ మల్లెలా కడుతారు ఆత్మీయతల మాలలు 
కాని ,పూల పరిమళాల వీస్తాయి ,స్వచ్చమైన ప్రేమలు కాని . ... 

ఇప్పుడు మొదలు పెట్టారు చర్చ . ఏమి జడ వేయాలి ?
ఒకటా రెండా ?చక్రాల జడ ,పాయల జడ ,పెద్ద జడ , 
పూలు చుట్టే జడ ,బిస్కెట్ లాగా వేసే జడ ...... 
పిడికెడు జుట్టు పిల్లలకు ఉండాలే కాని రెండు మూరల 
సవరం కలిపి ఇలాగ ఘుమ ఘుమ లాడే జడ అల్లెయ్యరు . 

ఒక్కో సారి కొత్తజడ వేస్తే అందరిలో గొప్ప ,ఒక్కో సారి 
పెద్ద జడ వేస్తే గొప్ప . జడను బట్టి పూలు తెప్పించాలి . 
అమ్మమ్మ ,అమ్మ అందరు కలిసి పెద్ద జడే వేద్దాము అనుకున్నారు . 
అంటే చాల మంది సహాయం కావాలి . పూలు కూడా 
చాలా కావాలి . ఉదయాన్నే వెళ్లి అందరి పెరట్లోని ఆకు (మరువం )
చాలా కోసుకు రావాలి . మూడు చెండ్లు ,నాలుగు 
ఈనె పుల్లలు పూలు గుచ్చి జడకు అటూ ఇటూ ఉంచి 
ఎంత పనో . అయినా పని అనుకుంటే కష్టం . కాళ్ళకు 
చుట్టుకుంటూ అద్దం లో జడ చూసుకుంటూ మురిసి పోయే 
చిన్ని పాపల్ని చూసుకుంటే ,రంగు రంగుల పట్టు పరికిణీలు 
గజ్జలతో కలిసి ఇల్లంతా చిందులు వేస్తుంటే ఎంత సంబరం ... 
పిల్లలు లేని ఇల్లు చూసిందంటే దిగులుతో దాని గుండె 
ముడుచుకోనిపోతుంది . 

ఉదయమే తూముల దగ్గరకు వెళ్లి మూడు లీటర్ల మల్లె 
పూలు తెమ్మని ,అక్కకు చెప్పి రమ్మని మా మావయ్య 
సుబ్రహ్మణ్యం కు అందరు ఆర్డర్ ఇచ్చేసారు . పిల్లల పని 
అంటే మగ వాళ్ళు కూడా మురిపెంగా అన్నీ కొనిచ్చి 
సహాయం చేస్తారు . 
అందరిలో హుషారు ఱెపు ఇక్కడ ఒక పూల జడ కాదు 
రంగుల ముగ్గు ముచ్చటగా చిన్నారి పాపాయిల జడను 
అల్లుకుంటుంది .... 
జడ కుప్పెల తాళం వింటూ మురిసిపోతుంది . 

''వేళ్ళ  సందున జాలువారే 
విరి బాలల సొగసు 
కోటి ఇంద్రధనుసులు కట్టేసి 
తెచ్చినట్లు 
ఎంత చక్కటి కళ 
ఒక తరం నుండి 
ఇంకో తరానికి సాగిపోతూ 
ఆత్మీయతల ముగ్గులే 
అరమరిక లేక పూయిస్తూ 
చిన్నారుల నవ్వులా ?
జడల పై విరిసిన పువ్వులా ?
ఇంటికి ఏది కళ 
తెలియని తికమక 
మళ్ళీ మళ్ళీ వస్తే బాగుండును ఇంకా ..... '' 
                                              ( ఇంకా ఉంది )
(మా పెదమ్మ రాజేశ్వరి గారు ఈ రోజు 
శివైక్యం చెందారు . ఆ బాధతో ఆవిడకు 
అంకితంగా ఇది  మొదలు పెట్టాను . 
ఒక్కో సారి వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇంత 
ప్రేమగా చూసుకోవాలి . దీని వలెనే బాధ అంతా 
అనిపిస్తుంది . ఒక్కో సారి వాళ్ళు అలా చూసుకోబట్టే 
కదా పక్క వారిని ప్రేమించడం మనకు కూడా అలవాటు 
అయింది అనిపిస్తుంది . ఆవిడ ఆత్మకు శాంతి 
కలగాలి అని కోరుకుంటున్నాను )

Tuesday, 24 September 2013

అమ్మ ఒక్క చాన్స్

అమ్మ ఒక్క చాన్స్ .....ఒకె ఒక్క చాన్స్ అని మా 
''నివాస్ ''గాడు అడగ లేదు కాని ...... 
నేనే ఇంతకు ముందు వాడు నటించిన షార్ట్ ఫిలిం ''నాటకం '' 
కూడా నా బ్లాగ్ లో షేర్ చెయ్యలేదు . 
రెండో ఫిలిం ట్రైలర్ ''బిస్కట్ బాబా '' షేర్ చేద్దాము అని 
అనిపించి చేస్తున్నాను . 

ఎందుకంటె పెద్ద కారణం లేదు .పిల్లలు ఆల్రౌండ్ గా 
డెవలప్ అయితేనే బాగుంటుంది అని నాకు  అనిపిస్తూ 
ఉంటుంది . అలా చేస్తే సంతోషం కూడా . 
అయితే చదువు అశ్రద్ధ చేయనంత వరకే నా ప్రోత్సాహం . 
మీరు ప్రోత్సాహం ఇవ్వండి మరి :)
(bicuit baba video link ikkada )

Tuesday, 17 September 2013

దండన కాదు, లాలనతోనే మంచి బుద్ధులు..

(andhra bhomi 17/9/2013 na article link ikkada )

దండన కాదు, లాలనతోనే మంచి బుద్ధులు..

  • -తన్నీరు శశికళ
  •  
  • 17/09/2013
పాలబుగ్గలపై నల్లటి ముంగురులు వాలుతూ ఉంటే, బెరుకు నిండిన కళ్ళతో అమ్మ కొంగు
 వదల్లేక, వదల్లేక స్కూల్ వ్యాన్ ఎక్కి టాటా చెప్పే చిన్నారుల మోముల్లో అమా యకత్వాన్ని
 ప్రత్యక్షంగా చూడాల్సిందే. అప్పుడు ఆ పసివాళ్ల మోములో వారి భవిష్యత్తును
ఊహించుకుంటూ మురిసిపోని తల్లిదండ్రులు ఉండరు.
 ఎదురింటివాళ్ల అబ్బాయికి ఐ.ఐ.టి.లో సీటు వచ్చింది.. పక్కింటి అమ్మాయికి
 ఏటా పది లక్షల జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది.. సహోద్యోగి కొడుకు ఒలింపియాడ్‌లో ఫస్ట్..
 ఇలాంటి విషయాలు విన్నప్పుడు తమ పిల్లలు కూడా మంచి మార్కులు, ప్రైజ్‌లు,
 ఉ ద్యోగాలూ దక్కించుకోవాలని ఎ ల్‌కెజిలో ఉన్నపుడే పిల్లల గురించి
బోలెడు జాగ్రత్తలు తీసుకునే అ మ్మానాన్నలూ ఉన్నారు.
అయతే, చిన్న మొలక...
అప్పుడే నీడ నివ్వాలని పది బిందెలు నీళ్ళు పోస్తే ఏమవుతుంది?
 నీట మునిగి, ఆ మొలకే కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది.
 పిల్లలను కొత్తగా బడికి పంపేవాళ్ళు- ఇంకా తమ చిన్నారులు స్కూలు వాతావరణానికి
 అలవాటు పడలేదని గ్రహించాలి. పిల్లల చదువు, వారి స్నేహాలు, అలవాట్లు,
 ప్రవర్తన వంటి విషయాలపై పేరెంట్స్‌కు సహజంగా ఆసక్తి ఉంటుంది. కానీ,
చదువు అనేది పిల్లల పాలిట పెనుభారంగానో, ఇతరులతో పోల్చి గేలి చేసే
విషయంగానో భావించరాదు. ఆటపాటల్లో, అభిరుచి ఉన్న విషయాల్లో ప్రోత్సహిస్తే
 చిన్నారులు చక్కగా పెరుగుతారు.

‘సర్వశక్తులూ నీలో కలవు, సంశయించక ముందుకు నడువు’’-
 అని ఏనాడో ఉపదేశించారు వివేకానంద స్వామి. పిల్లల్లో శక్తియుక్తులు
చ క్కగా వికసించేటట్లు, ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రోత్సహిస్తే పేరెంట్స్
తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చినవారు అవుతారు.

గుర్తించే శక్తి : నేడు మరీ చిన్న పిల్లలను సైతం కానె్వంట్లకు పంపుతున్నారు.
 వీళ్ళకు చేతి వేళ్ళు కూడా ఇంకా గట్టిపడవు. వీరి చేత అక్షరాలు రాయంచడం కంటే-
వారు చూసిన వస్తువులను బయట ఎక్కడైనా కనిపిస్తే గుర్తుపట్టేలా ప్రోత్సహించాలి.
వాళ్ళు గుర్తుపట్టకపోతే చెప్పాలే తప్ప తిట్టకూడదు. వస్తువులను గుర్తించడం వల్ల
 వారి మెదడు చురుకుగా పనిచేస్తుంది. పిల్లలందరి తెలివి తేటల సామర్థ్యం (ఐ.క్యూ)
ఒకేలా ఉండదు. అది ఒక్కొక్కరికి ఒక్కో వయసులో బాగా పనిచేస్తుంది.
 అందుకని అక్షరాలను, వస్తువులను గుర్తించేలా వారిని బలవంతపెట్టకూడదు.
 ఆ పని వారి రోజువారీ జీవితంలో ఒక ఆటగానే ఆనందదాయకంగా ఉండాలి.

ఊహాశక్తి: పుస్తకాల్లో బొమ్మలు చూపించి పిల్లల్లో ఊహాశక్తిని పెంచాలి.
జంతువుల బొమ్మలు చూపించి, అవి మాట్లాడినట్లు మనమే మాట్లాడి
 చూపిస్తే వాళ్ళు ఊహించడానికి ప్రయత్నిస్తారు. బొమ్మలను చూపిస్తూ కథలు చెపితే,
 ఆ విషయాలపై ఊహించుకుంటూ కొత్త ఆలోచనల వైపు పయనిస్తారు.
సృజనాత్మకత: చాలా పాఠశాలల్లో పిల్లలకు డ్రాయంగ్ పుస్తకాలు ఇచ్చి,
రంగులు వేయమంటూ సృజనాత్మక శక్తిని పెంపొందిస్తూ ఉంటారు.
ఇంకా ప్లాస్టిక్ బ్రిక్స్‌తో లారీ, హెలికాప్టర్ మొదలగునవి చేసే కిట్ ఇస్తే వాళ్ళు
 ఇంకా కొత్తవి తయారుచేస్తూ తమ సృజనాత్మకతను మరింతగా పెంచుకుంటారు.

నాయకత్వ లక్షణాలు: సామాన్యంగా నాయకత్వ లక్షణాలు అంటే-
 అందరినీ బెదిరించడం, తమ మాటనే నెగ్గించుకోవడం అని చాలామంది
అనుకుంటారు. అందరితో కలిసిపోవడం, పంచుకోవడం, ఒక జట్టుగా తిరగడం-
ఇవీ నాయకత్వ లక్షణాలు. చాక్లెట్స్, బొమ్మల పుస్తకాలు,
 ఆట వస్తువులు పక్కవారితో పంచుకోవడం, అందరితో కలిసి ఆనందించడం,
పక్కవారికి సహాయం చేయడం వంటివి పిల్లలకు నేర్పాలి.
ఎప్పుడూ తమ పిల్లలే ఆధిక్యంతో ఉండాలని, ఎదుటివారు ఓడిపోవాలని కోరుకుంటే-
 వారిని స్వార్థపరులుగా తయారుచేసి నట్లవు తుంది. భవిష్యత్‌లో వారు
ఒంటరితనంతో బాధపడే ప్రమాదం ఉంది.

 పిల్లల ముందు వాళ్ళ టీచర్లను అగౌరవంగా మాట్లాడటం,
 పిల్లల ముందే టీచర్‌తో వాదించడం వంటివి చేయకూడదు. పిల్లలకు, టీచర్ల
మధ్య భక్తి, ఆప్యాయత పెరిగేలా చొరవ చూపాలి.

 పిల్లలు ఎప్పుడూ పెద్దలను గమనిస్తుంటారు. పరిశుభ్రంగా ఉండటం,
 ఉ దయం లేవగానే దుప్పట్లు మడతపెట్టడం, బ్రష్ చేసుకొని పాలు తాగడం..
ఇలాంటి మంచి అలవాట్లను చిన్న వయసులోనే నేర్పిస్తే గనుక పెద్దయ్యాక
 కూడా వారు ఒక పద్ధతి ప్రకారం ఉంటారు.

ఎట్టి పరిస్థితిలోనూ తల్లిదండ్రులు పిల్లల ఎదుట పోట్లాడ కోవడం,
పరస్పరం నిందించుకోవడం, కించ పరచు కోవడం వంటి చేష్టలకు దిగకూడదు.
 ఇలా చేస్తే పిల్లల మనసులో వారు గౌరవ భావాన్ని కోల్పోతారు.
ఇంటికి వచ్చిన పెద్దలను పలకరించడం,
మర్యాదతో నమస్కరించడం, మంచినీళ్ళు ఇవ్వడం వంటివి అలవాటు చేస్తే
పిల్లలు చక్కని సంస్కారవంతులుగా మారుతారు.

చిన్నారులు వారి పనుల్ని హుషారుగా చేసు కుంటున్నారా?
స్కూల్‌లో పాఠాలు శ్రద్ధగా వింటున్నారా? వంటి విషయాలను ఆరా తీస్తుండాలి.
 దండించడమే అసలైన పరిష్కారం అనుకుంటే- ఆ లేతమొగ్గలు చదువంటే
 భ యపడి ముడుచుకుపోయ, మొద్దులుగానో,
 మొండివాళ్ళుగానో తయారవుతారు. వారికి అవసరమైన
 విషయాలను ప్రేమగా చెప్పాలి. హోమ్ వర్క్ చేయడం ఓ బాధ్యత అని మెల్లగా
చెబుతూ దాన్ని అలవాటు చేయాలి. అది పూర్తయ్యాక ఆడుకునేందుకు ప్రోత్సహించాలి.
 రాత్రి సమయంలో వారికి ఆనందం కలిగించే విషయాలను చెబుతూ ప్రేమతో నిద్రపుచ్చాలి.
ఇలాంటి పద్ధతులను పేరెంట్స్ పాటిస్తే పిల్లలే కాదు,
 భవిష్యత్‌లో సమాజం కూడా మంచి ప్రగతిని సాధిస్తుంది.

Tuesday, 10 September 2013

మనః ప్రవేశం


                           మనః ప్రవేశం   

పెళ్లి జరిగి పోయింది...జంట మమతల ముడిని అక్షితలతో 
అందరు ఆశీర్వదించారు.అప్పగింతలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఏమిటో అనుకోకుండా అన్ని కుదిరిపోయాయి...పిల్ల  అదృష్టవంతురాలు...
ఎవరి నోట విన్నా ఇదే మాట....."అవును అదృష్టవంతు రాలినే...కాని ఈ 
రోజు నుండి నా వ్యక్తిత్వాన్ని అంతా వేరొకరి కోసం చంపుకొని బతకాలి 
కాబోలు....లేదు అలా కాదు ఎవరి కోసం తను రాజి పడదు...ఏమిటి 
ఆయన గొప్ప....లేదు తను తన వ్యక్తిత్వాన్ని చంపుకోదు"

అబ్బాయికి సెలవలు లేవు అని వారం లోపలే పెళ్లి కుదిర్చేసారు . 
అవును అంతా అబ్బాయి ఇష్టమే . ఇంత పందిరికి అల్లుకున్న జాజి తీగ 
ను పుటుక్కున తెంచి అల్లుకోమంటే ఎలా ?అమ్మ నాన్న చెల్లి ,పిన్ని 
బాబాయి ఎన్ని బంధాలు ..... ఒక్క సారి ఈయన కోసం తెంపు కోవాలా ? 
ఏమి అడిగినా పెళ్లి కొడుకు ఇష్టం అంటారు . ఏమి నేను మనిషిని 
కాదా .....  లేదు తనను తక్కువ చేస్తే సహించేది లేదు మనసులో అనుకుంది 
సుజిత . ఒక్క సారి కనులు తిప్పి పక్కకు చూసింది . 
ఒక వైపు నుండి తెల్లని చెంపలు ,చక్కటి మీసం దాని కింద 
చిన్నగా విచ్చుకున్న నవ్వు ..... తల తిప్పి చూసేసరికి విసురుగా తల తిప్పుకుంది 
ఏదో పని ఉన్నట్లు . 

అప్పగింతలు మొదలు అయ్యాయి.

అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నల మధ్య కూర్చుంది . 
ఎదురుగా అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ల మధ్య 
.....మధ్యలో పళ్ళెం లో పాలు ఉంచారు.
అమ్మాయి తరుపు వాళ్ళు పాట పాడుతూ అమ్మాయితో 
తమ అనుభందాన్ని గుర్తు తచ్చుకొని....కన్నీళ్ళని 
పాటలుగా మార్చి చల్లుతున్నారు....అమ్మాయి అమ్మా,నాన్న అమ్మాయి 
రెండుచేతులూ పెట్టుకొని పాలలో ముంచి ఎదురుగా అబ్బాయి చేతుల్లో ఆ చేతులు 
ఉంచారు.
''ఇక నుండి మా అమ్మాయి మీది''
కళ్ళలో నుండి నీటి ప్రేమ చెలమ బుగ్గలపై జాలువారుతూ 
''పాల ముంచినా నీట ముంచినా మీదే భారం''
అమ్మాయి  ఆటలు ,పాటలు ,నవ్వులు ఇక ఆ ఇంట్లో వినిపించవు ,
తను నకో ఇంటి పిల్ల ఈ రోజు నుండి 
అమ్మ నాన్నలకు ఒక కంటి నుండి ఆనంద బాష్పాలు ,ఇంకో కంట కన్నీరు . 
తప్పదు ఏ ఆడపిల్ల తండ్రి కి రాదూ ఇలాటి సందర్భం .చిత్రమ్ దీని కోసమే 
అమ్మాయి చిన్నప్పటి నుండి ఒక్కో రూపాయి దాచుతూ ఊహల్లో 
తన పెళ్లి వేడుకలు చూస్తూ ఆనంద పడుతుంటారు . 
  
"అత్తావారింటికి అంపేదేలాగమ్మ?అల్లారి ముద్దుల అపరంజి  బొమ్మ....పోయి రావే 
పడతి అత్తా వారింటికి.."అయిన వాళ్ళ గొంతు చెవులలో మోగుతూ ఉంది 
కారులో అత్తా వారింటికి పోయే వరకు....పక్కన ఉన్న అబ్బాయిని కూడా 
పట్టించుకోకుండా విషాదపు సరిగమలు .....మనసున మెలేస్తుంటే....వింటూ ఉంది.
ఎందుకు వెళ్ళాలి ఈ అబ్బాయి ఒక్కడి కోసం తన ఇన్నేళ్ళ నేస్తాలని ,ఊరిని 
అందరిని వదులుకొని ..... దిగులుగా చూస్తూ ఉంది సందె పొద్దు లో కుంగుతున్న 
 సూర్యుడిని చూస్తూ . 

సాయంత్రానికి అత్తగారింటికి చేరారు.గృహ ప్రవేశం జరుగుతూ ఉంది.
అమ్మాయి మనసులోని గుబులు అబ్బాయికి తెలుస్తూ ఉంది.
చూపులతోనే ఓదార్పు.
పూజారి కూర్చోపెట్టి పూజ చేసారు.మనసుని మరల్చుకొని పూజ చేసింది.

ఇప్పుడు దంపతతాంబూలం ఇవ్వండి...పూజారి ఇద్దరికీ చెప్పాడు
ఇప్పటిదాకా అబ్బాయి బ్రహ్మచారి.
ఇప్పుడు అన్ని ఆశ్రమాలకు పోషణ కర్త అయిన గృహస్తు.
ఇక నుండి ఏమి చేసినా భార్య తోటే.
దంపత తాంబూలం అంటే అబ్బాయి అమ్మాయి చుట్టూ చేతులు వేసి 
దోసిలి ఉంచితే అమ్మాయి ఆ దోసిలిలో తన దోసిలి ఉంచి దానిలో నారికేళం ఉంచి 
ఇవ్వాలి.అప్పుడు ఇద్దరు  కలిసి దంపత తాంబూలం ఇచ్చినట్లు.

అబ్బాయి చిన్నగా  అమ్మాయి చుట్టూ చేయి వేసాడు.
మెల్లిగా తలెత్తి సీరియస్గా చూసింది.
మళ్ళా తల వంచేసింది....అబ్బాయిలో ఉలుకిపాటు.
మెల్లగా దూరంగా జరిగి చేతులు చుట్టూ వేసి దోసిలి పట్టబోయాడు 
దూరం పెరిగి వీలు కాలేదు....పూజారి దగ్గరగా జరుగు బాబు...
పెద్దలు చూస్తూ ఉన్నారు.మెల్లిగా జరిగాడు
ఊహూ....ఇక అమ్మాయికి తప్పలేదు...
కొంచం మెల్లిగా దగ్గరికి జరిగింది.
నది మెల్లిగా కొండవంపు లోకి జరిగినట్లు....
అబ్బాయి దోసిలిలో తన దోసిలి ఉంచింది.
అరిచేతులు వణికి పోతున్నాయి...
అరిటాకులు గాలి స్పర్శకు మెల్లిగా  ఊగినట్లు.....
చేతుల్లో తాంబూలం ఉంచారు....భయంతో చేతులు చాప లేకపోతుంది.
నల్లని  మీసాల కింద గుంభనగా విచ్చుకున్న చిన్న నవ్వు.
తన అరచేతులతో మెల్లిగా పైనున్న అర చేతులను 
స్పృశించాడు  ధైర్యం చెపుతున్నట్లు....మెల్లిగా తలెత్తింది చూసింది . 
భరోసా నిండిన ప్రేమతో కూడిన చూపు మెల్లిగా నిమురుతూ ఉంది . 
అరచేతుల స్పర్శ నేనున్నాను అని చెపుతూ....పెళ్లి మంత్రాలు గుర్తుకు తెస్తూ ఉంది.

"మాంగల్యం తంతునానేనా "
"పడతీ నా జీవన హేతువుగా ఉండమని ఈ మాంగల్యం కట్టి నిన్ను 
నా జీవితం లోనికి ఆహ్వానిస్తున్నాను"
అరిచేతుల కంపనాలు ...ఆ ఆహ్వానాన్ని బలపరుస్తూ
నీవు నా దానివి అని చెపుతున్నాయి.
తాంబూలం ఇవ్వటానికి ముందుకు చేతులు చాపారు.    .      
చెవుల పక్కన అతని చాతి స్పర్శ ,గుండె చప్పుడు....
పెళ్లి నాటి ప్రమాణాలు గుర్తుకు తెస్తున్నాయి...

"ధర్మేచ,అర్ధేచ,కామేచ,మోక్షేచ...నాతి చరితవ్య"
"నాతి  చరామి"...."పడతీ నా చతుర్విద పురుషార్ధములలో 
నిన్ను వీడి చరించనని ప్రమాణం చేస్తున్నాను....
నేను నీ వాడిని....నీవే నా జీవన హేతువు...."
ఆ మాట నిజమని నిరూపిస్తూ దగ్గరగా నిమురుతున్న స్పర్శ.
ఒక్క సారి తల ఎత్తి చూడాలని అనుకుంది.
విషాదపు చాయలు తగ్గి బుగ్గలపై  మెల్లగా యెర్రని సిగ్గు చాయలు......
అప్పుడే ఉదయిస్తాను అని భానుని  సంకేతాలు పంపినట్లు.
తాంబూలం ఇచ్చేసారు.

ఇక గడప పై కలిశం లో బియ్యం ఉంచారు.అమ్మాయి దానిని ముందుగా 
కాలితో గృహం లోకి పంపి తానూ వస్తే ఆ ఇంట సిరి సంపదలతో
 విలసిల్లు తుందని సూచిస్తుంది.చేసింది.

ఇక చుట్టూ ఆడ పిల్లల అల్లరి....అమ్మాయి పేరు అబ్బాయిని,
అబ్బాయి పేరు అమ్మాయిని చెప్పి లోపలి కి 
వెళ్ళమని....అబ్బాయి చిన్నగా నవ్వాడు...
పక్కన ఉన్నా చిన్నదాన్ని చూస్తూ గర్వంగా 
పేరు చెప్పేసాడు.....ఇక ఇప్పుడు అమ్మాయి వంతు.
అమ్మాయికి గొంతు పెగలటం లేదు.
చెప్పమని గోల....అబ్బాయి చిన్నగా చూస్తున్నాడు .
తన గొంతులో తన పేరు వినాలని ఆశ కాబోలు....
భార్య తన సొంతం ,తనది .... తన నోటితో తన పేరు ఎలా పలుకుతుంది . 
మొదటి సారి విన్నది మదిలో నిలుపుకోవాలి ..... 
కలకాలం దాంపత్యాన్ని పండించే తాంబూలం లాగ 

"ముత్యమంటి సిగ్గు నునుపైన బుగ్గల నిమురుతూ 
ఆల్చిప్పల చూపుల్ని నిలవనీక జారుస్తూ 
చిగురాకుల ఎరుపునే అమ్మాయికి అలుముతూ 
అరుణ కాంతులతో అమ్మాయి ......
పగడపు దీవి లా మెరిసింది....."
చుట్టూ ఉన్నా పెద్దరికం పరిస్తితిని అర్ధం చేసుకుంది.

పర్లేదమ్మ ....అబ్బాయి పేరుకి 
చివర బావ అని కలిపి చెప్పు......సిగ్గు దొంతరలు తోలిగించుకొని .
చిన్నారి పెదాలు చిగురాకులా కదిలాయి.
ముత్యాల పలు  వరుస తళుక్కున మెరిసింది ....
ఇంట్లోని చీకట్లు తరిమే మెరుపులా
చిన్నగా ద్వని తరంగం గాలిపై వీణని మీటినట్లు....
మనసైన బావ పేరు మెల్లిగా గాలిలో సవ్వడి చేస్తూ 
తాకాల్సిన మది తలుపు తోసుకుంటూ వెళ్లిపోయింది . 

అంతే మరలా తల ఒంచేసింది
"వినపడలేదు....మళ్ళ చెప్పాల్సిందే"ఆడపిల్లల అల్లరి.
ఆశక్తతో అబ్బాయి వంక  ఓరగా చూపు.
మనసుల సవ్వడి అప్పుడే మొదలైందేమో ...
అబ్బాయికి అర్ధం అయ్యింది.

"నాకు వినపడింది"చెప్పాడు నవ్వుతూ.
మోసం అందరు అరిచారు....
కాని తప్పదు ఇద్దరు దొంగలు ఒకే పార్టీ అయిపోయారు . 
మాకు ఇంకేమి పని .  తొలగి దారి ఇచ్చారు....

గృహప్రవేశం చెయ్యమని....

తల కొంచం పైకి  ఎత్తి చూసింది అబ్బాయిని .....
కృతజ్ఞతల మాలలు వేసి మనః  ప్రవేశానికి రమ్మని....