Wednesday, 25 September 2013

లాంతరు చెండు

లాంతరు చెండు 
(ఎర్ర అరుగులు కధల సీరీస్ )
 
''మీ ఇంట్లో కొత్త చింతకాయ తొక్కు ఉందా కాంతమ్మ ?''
అడిగింది పక్కింటావిడ ని మా అమ్మమ్మ . ఆపుకున్నా 
ఆగని ఆనందం హడావాడీ .... అమ్మమ్మ మాటల్లో . 
''ఏమిటి సంగతి ?చిన్నమ్మాయి పిల్లలు వస్తున్నారా 
కోట నుండి సెలవలకు ''అడిగింది ఆవిడ . 
పెదమ్మ రాజేశ్వరి కావలి లోనే కాపురం . మామయ్య కు 
పెళ్లి కాలేదు . ఇక బయటి నుండి వచ్చే బంధువులు అంటే 
మా అమ్మమ్మకు మేమే . అందులో కావలి వాళ్లకు పిల్లలు 
అంటే భలే ప్రేమ . పెదమ్మకు ఐదుగురు ,అమ్మకు నలుగురం 
మేము వెళ్ళాము అంటే ఎర్ర అరుగులు పిల్లల కేరింతలతో 
సందడి చేయాల్సిందే . పట్నం ఇంకా పూర్తిగా మారని 
పల్లె లాంటి ఊరు ప్రేమ పలకరింపుల పన్నీటిని చల్లుతూ 
ఉంటుంది ఎండాకాలపు మండుటెండ లను మరిపిస్తూ . 

రోడ్ కి ఆ వైపున సులోచన అత్త ఇల్లు . సాయంత్రం అరుగుల 
మీద కూర్చుని పలకరిస్తూ ఉంటారు . 
''ఎలా ఉండారు చిన్నమ్మాయి ?మీ అమ్మ ఎక్కడ ?''
అడిగింది మా అమ్మను పలకరిస్తూ . 
అమ్మమ్మ లోపల నుండి వస్తూ '' రా సులోచన ,ఇందాకే 
పిల్లలకు  జడ వేస్తే బాగుండును అనుకున్నాము '' 
''అదే నమ్మ ... నేను కూడా మల్లె మొగ్గలు చూసి అనుకున్నాను . 
ఇంకా పిల్లలకు వేయాలని అనుకోలేదే అని  . మొగ్గలు ఏమి ఉండాయి 
చక్కగా సూది మొన లాగా . గుత్తంగా కుడితే భలే కుదురుతుంది 
జడ '' 
చెవిలో పూల జడ మాట పడగానే ఆడ పిల్లలకి హుషారు . 
మా పెదమ్మ కూతుర్లు శైలక్క , వనజ . కాని మేము 
ఊరి నుండి వచ్చాము . చెల్లి సునీత రెండేళ్ళ పిల్ల కాబట్టి 
నాకు, అక్కకే వేస్తారు . హయ్య కుచ్చుల జడ ముందుకు 
వెనక్కి ఊపుతూ ఉంటె భలే ఉంటుంది . నాకు భలే హుషారు 
వచ్చింది . ''అమ్మమ్మ ఎప్పుడు కుడతారు .... ఎప్పుడు కుడతారు 
నాకు ఇప్పుడే కావాలి ''అమ్మమ్మ కాళ్ళు చుట్టుకున్నాను . 

''ఇప్పుడంటే ఇప్పుడే ఎలా కుదురుద్ది . రేపు వేయిస్తాను లేమ్మా . 
పూలు కావద్దా ?'' 
సరే కుట్టిస్తారు అని గారెంటీ వచ్చింది కాబట్టి నా మొండి కొంత సడలించాను. 
''అత్తా ... ఇక్కడిదాకా కుడుతావా ?ఇక్కడిదాకా నా అని 
నా నడుము దాకానా కాళ్ళ దాకానా ?''అని చూపిస్తూ 
సులోచన చుట్టూ ,అమ్మ చుట్టూ ఒకటే పరుగులు . 
అక్క కూడా నవ్వుతూ ఉంది . 

అమ్మ నవ్వుకుంటూ
 ''పరిగెత్త వాకే పడతావు . ఆడుకోపో ''
ఇంట్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు
 కాబట్టి ఉయ్యాల బల్ల ఊగలేము . 
''జుయ్య్ ''తూనీగా లాగా యెర్ర అరుగుల మీదకు పెదమ్మ పిల్లలతో ఆటలు . 
అదే పడవ,అదే బస్  ,అదే ఇల్లు 
ఒక్క అరుగు మా ఆటల్లో ఎన్ని వేషాలు వేస్తుందో . 
పిల్లల నవ్వులు పూసి ఆత్మీయతల బరువుతో మా అరుగు 
నడుం వంచి మా సవారీకి తయారు అయ్యి మురిసి పోయింది . 

ఆడ వాళ్ళు పూల జడ అని నిర్ణయించారు అంటే చుట్టు 
పక్కల వారికి కూడా సందడే సందడి .సహాయం చేసే వాళ్ళు ,
సలహాలు ఇచ్చే వాళ్ళు ,నేర్చుకునేవాళ్ళు ,చూసి మురిసే 
పెద్ద వాళ్ళు .... ఎంత మంది కుడితే ఒక్కరికి పూల జడ 
అయ్యేను . అక్కడ మల్లెలా కడుతారు ఆత్మీయతల మాలలు 
కాని ,పూల పరిమళాల వీస్తాయి ,స్వచ్చమైన ప్రేమలు కాని . ... 

ఇప్పుడు మొదలు పెట్టారు చర్చ . ఏమి జడ వేయాలి ?
ఒకటా రెండా ?చక్రాల జడ ,పాయల జడ ,పెద్ద జడ , 
పూలు చుట్టే జడ ,బిస్కెట్ లాగా వేసే జడ ...... 
పిడికెడు జుట్టు పిల్లలకు ఉండాలే కాని రెండు మూరల 
సవరం కలిపి ఇలాగ ఘుమ ఘుమ లాడే జడ అల్లెయ్యరు . 

ఒక్కో సారి కొత్తజడ వేస్తే అందరిలో గొప్ప ,ఒక్కో సారి 
పెద్ద జడ వేస్తే గొప్ప . జడను బట్టి పూలు తెప్పించాలి . 
అమ్మమ్మ ,అమ్మ అందరు కలిసి పెద్ద జడే వేద్దాము అనుకున్నారు . 
అంటే చాల మంది సహాయం కావాలి . పూలు కూడా 
చాలా కావాలి . ఉదయాన్నే వెళ్లి అందరి పెరట్లోని ఆకు (మరువం )
చాలా కోసుకు రావాలి . మూడు చెండ్లు ,నాలుగు 
ఈనె పుల్లలు పూలు గుచ్చి జడకు అటూ ఇటూ ఉంచి 
ఎంత పనో . అయినా పని అనుకుంటే కష్టం . కాళ్ళకు 
చుట్టుకుంటూ అద్దం లో జడ చూసుకుంటూ మురిసి పోయే 
చిన్ని పాపల్ని చూసుకుంటే ,రంగు రంగుల పట్టు పరికిణీలు 
గజ్జలతో కలిసి ఇల్లంతా చిందులు వేస్తుంటే ఎంత సంబరం ... 
పిల్లలు లేని ఇల్లు చూసిందంటే దిగులుతో దాని గుండె 
ముడుచుకోనిపోతుంది . 

ఉదయమే తూముల దగ్గరకు వెళ్లి మూడు లీటర్ల మల్లె 
పూలు తెమ్మని ,అక్కకు చెప్పి రమ్మని మా మావయ్య 
సుబ్రహ్మణ్యం కు అందరు ఆర్డర్ ఇచ్చేసారు . పిల్లల పని 
అంటే మగ వాళ్ళు కూడా మురిపెంగా అన్నీ కొనిచ్చి 
సహాయం చేస్తారు . 
అందరిలో హుషారు ఱెపు ఇక్కడ ఒక పూల జడ కాదు 
రంగుల ముగ్గు ముచ్చటగా చిన్నారి పాపాయిల జడను 
అల్లుకుంటుంది .... 
జడ కుప్పెల తాళం వింటూ మురిసిపోతుంది . 

''వేళ్ళ  సందున జాలువారే 
విరి బాలల సొగసు 
కోటి ఇంద్రధనుసులు కట్టేసి 
తెచ్చినట్లు 
ఎంత చక్కటి కళ 
ఒక తరం నుండి 
ఇంకో తరానికి సాగిపోతూ 
ఆత్మీయతల ముగ్గులే 
అరమరిక లేక పూయిస్తూ 
చిన్నారుల నవ్వులా ?
జడల పై విరిసిన పువ్వులా ?
ఇంటికి ఏది కళ 
తెలియని తికమక 
మళ్ళీ మళ్ళీ వస్తే బాగుండును ఇంకా ..... '' 
                                              ( ఇంకా ఉంది )
(మా పెదమ్మ రాజేశ్వరి గారు ఈ రోజు 
శివైక్యం చెందారు . ఆ బాధతో ఆవిడకు 
అంకితంగా ఇది  మొదలు పెట్టాను . 
ఒక్కో సారి వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇంత 
ప్రేమగా చూసుకోవాలి . దీని వలెనే బాధ అంతా 
అనిపిస్తుంది . ఒక్కో సారి వాళ్ళు అలా చూసుకోబట్టే 
కదా పక్క వారిని ప్రేమించడం మనకు కూడా అలవాటు 
అయింది అనిపిస్తుంది . ఆవిడ ఆత్మకు శాంతి 
కలగాలి అని కోరుకుంటున్నాను )

2 comments:

ranivani said...

పల్లెటూరి లో పుట్టి పెరిగిన వారందరికీ ఈ అరుగులమీద ఆటల అనుభవం ఓ తీపి జ్ఞాపకం .ఆ జ్ఞాపకాన్ని మరొక్కసారి గుర్తు చేసారు.మీ పెద్దమ్మ గారి ఆత్మ కు శాంతి కలుగుగాక!

శశి కళ said...

thank you naga rani garu