Tuesday, 10 September 2013

మనః ప్రవేశం


                           మనః ప్రవేశం   

పెళ్లి జరిగి పోయింది...జంట మమతల ముడిని అక్షితలతో 
అందరు ఆశీర్వదించారు.అప్పగింతలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఏమిటో అనుకోకుండా అన్ని కుదిరిపోయాయి...పిల్ల  అదృష్టవంతురాలు...
ఎవరి నోట విన్నా ఇదే మాట....."అవును అదృష్టవంతు రాలినే...కాని ఈ 
రోజు నుండి నా వ్యక్తిత్వాన్ని అంతా వేరొకరి కోసం చంపుకొని బతకాలి 
కాబోలు....లేదు అలా కాదు ఎవరి కోసం తను రాజి పడదు...ఏమిటి 
ఆయన గొప్ప....లేదు తను తన వ్యక్తిత్వాన్ని చంపుకోదు"

అబ్బాయికి సెలవలు లేవు అని వారం లోపలే పెళ్లి కుదిర్చేసారు . 
అవును అంతా అబ్బాయి ఇష్టమే . ఇంత పందిరికి అల్లుకున్న జాజి తీగ 
ను పుటుక్కున తెంచి అల్లుకోమంటే ఎలా ?అమ్మ నాన్న చెల్లి ,పిన్ని 
బాబాయి ఎన్ని బంధాలు ..... ఒక్క సారి ఈయన కోసం తెంపు కోవాలా ? 
ఏమి అడిగినా పెళ్లి కొడుకు ఇష్టం అంటారు . ఏమి నేను మనిషిని 
కాదా .....  లేదు తనను తక్కువ చేస్తే సహించేది లేదు మనసులో అనుకుంది 
సుజిత . ఒక్క సారి కనులు తిప్పి పక్కకు చూసింది . 
ఒక వైపు నుండి తెల్లని చెంపలు ,చక్కటి మీసం దాని కింద 
చిన్నగా విచ్చుకున్న నవ్వు ..... తల తిప్పి చూసేసరికి విసురుగా తల తిప్పుకుంది 
ఏదో పని ఉన్నట్లు . 

అప్పగింతలు మొదలు అయ్యాయి.

అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నల మధ్య కూర్చుంది . 
ఎదురుగా అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ల మధ్య 
.....మధ్యలో పళ్ళెం లో పాలు ఉంచారు.
అమ్మాయి తరుపు వాళ్ళు పాట పాడుతూ అమ్మాయితో 
తమ అనుభందాన్ని గుర్తు తచ్చుకొని....కన్నీళ్ళని 
పాటలుగా మార్చి చల్లుతున్నారు....అమ్మాయి అమ్మా,నాన్న అమ్మాయి 
రెండుచేతులూ పెట్టుకొని పాలలో ముంచి ఎదురుగా అబ్బాయి చేతుల్లో ఆ చేతులు 
ఉంచారు.
''ఇక నుండి మా అమ్మాయి మీది''
కళ్ళలో నుండి నీటి ప్రేమ చెలమ బుగ్గలపై జాలువారుతూ 
''పాల ముంచినా నీట ముంచినా మీదే భారం''
అమ్మాయి  ఆటలు ,పాటలు ,నవ్వులు ఇక ఆ ఇంట్లో వినిపించవు ,
తను నకో ఇంటి పిల్ల ఈ రోజు నుండి 
అమ్మ నాన్నలకు ఒక కంటి నుండి ఆనంద బాష్పాలు ,ఇంకో కంట కన్నీరు . 
తప్పదు ఏ ఆడపిల్ల తండ్రి కి రాదూ ఇలాటి సందర్భం .చిత్రమ్ దీని కోసమే 
అమ్మాయి చిన్నప్పటి నుండి ఒక్కో రూపాయి దాచుతూ ఊహల్లో 
తన పెళ్లి వేడుకలు చూస్తూ ఆనంద పడుతుంటారు . 
  
"అత్తావారింటికి అంపేదేలాగమ్మ?అల్లారి ముద్దుల అపరంజి  బొమ్మ....పోయి రావే 
పడతి అత్తా వారింటికి.."అయిన వాళ్ళ గొంతు చెవులలో మోగుతూ ఉంది 
కారులో అత్తా వారింటికి పోయే వరకు....పక్కన ఉన్న అబ్బాయిని కూడా 
పట్టించుకోకుండా విషాదపు సరిగమలు .....మనసున మెలేస్తుంటే....వింటూ ఉంది.
ఎందుకు వెళ్ళాలి ఈ అబ్బాయి ఒక్కడి కోసం తన ఇన్నేళ్ళ నేస్తాలని ,ఊరిని 
అందరిని వదులుకొని ..... దిగులుగా చూస్తూ ఉంది సందె పొద్దు లో కుంగుతున్న 
 సూర్యుడిని చూస్తూ . 

సాయంత్రానికి అత్తగారింటికి చేరారు.గృహ ప్రవేశం జరుగుతూ ఉంది.
అమ్మాయి మనసులోని గుబులు అబ్బాయికి తెలుస్తూ ఉంది.
చూపులతోనే ఓదార్పు.
పూజారి కూర్చోపెట్టి పూజ చేసారు.మనసుని మరల్చుకొని పూజ చేసింది.

ఇప్పుడు దంపతతాంబూలం ఇవ్వండి...పూజారి ఇద్దరికీ చెప్పాడు
ఇప్పటిదాకా అబ్బాయి బ్రహ్మచారి.
ఇప్పుడు అన్ని ఆశ్రమాలకు పోషణ కర్త అయిన గృహస్తు.
ఇక నుండి ఏమి చేసినా భార్య తోటే.
దంపత తాంబూలం అంటే అబ్బాయి అమ్మాయి చుట్టూ చేతులు వేసి 
దోసిలి ఉంచితే అమ్మాయి ఆ దోసిలిలో తన దోసిలి ఉంచి దానిలో నారికేళం ఉంచి 
ఇవ్వాలి.అప్పుడు ఇద్దరు  కలిసి దంపత తాంబూలం ఇచ్చినట్లు.

అబ్బాయి చిన్నగా  అమ్మాయి చుట్టూ చేయి వేసాడు.
మెల్లిగా తలెత్తి సీరియస్గా చూసింది.
మళ్ళా తల వంచేసింది....అబ్బాయిలో ఉలుకిపాటు.
మెల్లగా దూరంగా జరిగి చేతులు చుట్టూ వేసి దోసిలి పట్టబోయాడు 
దూరం పెరిగి వీలు కాలేదు....పూజారి దగ్గరగా జరుగు బాబు...
పెద్దలు చూస్తూ ఉన్నారు.మెల్లిగా జరిగాడు
ఊహూ....ఇక అమ్మాయికి తప్పలేదు...
కొంచం మెల్లిగా దగ్గరికి జరిగింది.
నది మెల్లిగా కొండవంపు లోకి జరిగినట్లు....
అబ్బాయి దోసిలిలో తన దోసిలి ఉంచింది.
అరిచేతులు వణికి పోతున్నాయి...
అరిటాకులు గాలి స్పర్శకు మెల్లిగా  ఊగినట్లు.....
చేతుల్లో తాంబూలం ఉంచారు....భయంతో చేతులు చాప లేకపోతుంది.
నల్లని  మీసాల కింద గుంభనగా విచ్చుకున్న చిన్న నవ్వు.
తన అరచేతులతో మెల్లిగా పైనున్న అర చేతులను 
స్పృశించాడు  ధైర్యం చెపుతున్నట్లు....మెల్లిగా తలెత్తింది చూసింది . 
భరోసా నిండిన ప్రేమతో కూడిన చూపు మెల్లిగా నిమురుతూ ఉంది . 
అరచేతుల స్పర్శ నేనున్నాను అని చెపుతూ....పెళ్లి మంత్రాలు గుర్తుకు తెస్తూ ఉంది.

"మాంగల్యం తంతునానేనా "
"పడతీ నా జీవన హేతువుగా ఉండమని ఈ మాంగల్యం కట్టి నిన్ను 
నా జీవితం లోనికి ఆహ్వానిస్తున్నాను"
అరిచేతుల కంపనాలు ...ఆ ఆహ్వానాన్ని బలపరుస్తూ
నీవు నా దానివి అని చెపుతున్నాయి.
తాంబూలం ఇవ్వటానికి ముందుకు చేతులు చాపారు.    .      
చెవుల పక్కన అతని చాతి స్పర్శ ,గుండె చప్పుడు....
పెళ్లి నాటి ప్రమాణాలు గుర్తుకు తెస్తున్నాయి...

"ధర్మేచ,అర్ధేచ,కామేచ,మోక్షేచ...నాతి చరితవ్య"
"నాతి  చరామి"...."పడతీ నా చతుర్విద పురుషార్ధములలో 
నిన్ను వీడి చరించనని ప్రమాణం చేస్తున్నాను....
నేను నీ వాడిని....నీవే నా జీవన హేతువు...."
ఆ మాట నిజమని నిరూపిస్తూ దగ్గరగా నిమురుతున్న స్పర్శ.
ఒక్క సారి తల ఎత్తి చూడాలని అనుకుంది.
విషాదపు చాయలు తగ్గి బుగ్గలపై  మెల్లగా యెర్రని సిగ్గు చాయలు......
అప్పుడే ఉదయిస్తాను అని భానుని  సంకేతాలు పంపినట్లు.
తాంబూలం ఇచ్చేసారు.

ఇక గడప పై కలిశం లో బియ్యం ఉంచారు.అమ్మాయి దానిని ముందుగా 
కాలితో గృహం లోకి పంపి తానూ వస్తే ఆ ఇంట సిరి సంపదలతో
 విలసిల్లు తుందని సూచిస్తుంది.చేసింది.

ఇక చుట్టూ ఆడ పిల్లల అల్లరి....అమ్మాయి పేరు అబ్బాయిని,
అబ్బాయి పేరు అమ్మాయిని చెప్పి లోపలి కి 
వెళ్ళమని....అబ్బాయి చిన్నగా నవ్వాడు...
పక్కన ఉన్నా చిన్నదాన్ని చూస్తూ గర్వంగా 
పేరు చెప్పేసాడు.....ఇక ఇప్పుడు అమ్మాయి వంతు.
అమ్మాయికి గొంతు పెగలటం లేదు.
చెప్పమని గోల....అబ్బాయి చిన్నగా చూస్తున్నాడు .
తన గొంతులో తన పేరు వినాలని ఆశ కాబోలు....
భార్య తన సొంతం ,తనది .... తన నోటితో తన పేరు ఎలా పలుకుతుంది . 
మొదటి సారి విన్నది మదిలో నిలుపుకోవాలి ..... 
కలకాలం దాంపత్యాన్ని పండించే తాంబూలం లాగ 

"ముత్యమంటి సిగ్గు నునుపైన బుగ్గల నిమురుతూ 
ఆల్చిప్పల చూపుల్ని నిలవనీక జారుస్తూ 
చిగురాకుల ఎరుపునే అమ్మాయికి అలుముతూ 
అరుణ కాంతులతో అమ్మాయి ......
పగడపు దీవి లా మెరిసింది....."
చుట్టూ ఉన్నా పెద్దరికం పరిస్తితిని అర్ధం చేసుకుంది.

పర్లేదమ్మ ....అబ్బాయి పేరుకి 
చివర బావ అని కలిపి చెప్పు......సిగ్గు దొంతరలు తోలిగించుకొని .
చిన్నారి పెదాలు చిగురాకులా కదిలాయి.
ముత్యాల పలు  వరుస తళుక్కున మెరిసింది ....
ఇంట్లోని చీకట్లు తరిమే మెరుపులా
చిన్నగా ద్వని తరంగం గాలిపై వీణని మీటినట్లు....
మనసైన బావ పేరు మెల్లిగా గాలిలో సవ్వడి చేస్తూ 
తాకాల్సిన మది తలుపు తోసుకుంటూ వెళ్లిపోయింది . 

అంతే మరలా తల ఒంచేసింది
"వినపడలేదు....మళ్ళ చెప్పాల్సిందే"ఆడపిల్లల అల్లరి.
ఆశక్తతో అబ్బాయి వంక  ఓరగా చూపు.
మనసుల సవ్వడి అప్పుడే మొదలైందేమో ...
అబ్బాయికి అర్ధం అయ్యింది.

"నాకు వినపడింది"చెప్పాడు నవ్వుతూ.
మోసం అందరు అరిచారు....
కాని తప్పదు ఇద్దరు దొంగలు ఒకే పార్టీ అయిపోయారు . 
మాకు ఇంకేమి పని .  తొలగి దారి ఇచ్చారు....

గృహప్రవేశం చెయ్యమని....

తల కొంచం పైకి  ఎత్తి చూసింది అబ్బాయిని .....
కృతజ్ఞతల మాలలు వేసి మనః  ప్రవేశానికి రమ్మని....

3 comments:

శిశిర said...

చాలా బాగుందండీ.

sreelu said...

ఎంత బాగుందో.......

శశి కళ said...

shishira garu,shrilu thank you lu