Wednesday, 16 October 2013

లాంతరు చెండు (పార్ట్ 4 ) (ఎర్ర అరుగుల కధలు సీరీస్ )


(part 3,2,1 link ikkada )
           లాంతరు చెండు (పార్ట్ 4 )  (ఎర్ర అరుగుల కధలు సీరీస్ )
''పూల జడ నాకు వెయ్యరా ?ఎందుకు వెయ్యరు ?
నాకు పూల జడ ............... వాఆఆఆఆఆ ''
కళ్ళు చేతులు విదిలిస్తూ కింద పడుకొని ఏడుస్తూ 
ఉన్నాను . 
''ఏయ్ శశి లే . మట్టి కదా . ''
చుట్టూ ఉండే వాళ్ళు లేపుతున్నారు . 
కాని మొండిగా విదిలించేస్తే 
లేపలేక ఉన్నారు . 
ఒకటే పట్టు .... పూల జడ కావాలి .... 

మా రాణి అక్క ,శైల అక్క అందరు బిక్క మొహాలు వేసుకొని చూస్తున్నారు . 
ఏమైనా దొరకక పోతే ఏడవటం తెలుసు కాని ఇలా మొండిగా సాదించడం 
వాళ్లకు తెలీదు . 
అందుకే వాళ్ళ ఎనిమిది మందితో వేగడం ఒక ఎత్తు 
నాతో వేగడం ఒక ఎత్తు పెద్ద వాళ్లకి . 

''చిన్నమ్మాయికి ఎప్పుడూ బాధలే అమ్మ . ఎలా చేస్తావే ఈ పిల్లతో ''
బాధగా అనింది పెదమ్మ అమ్మను చూస్తూ . 
అమ్మ ఏమి అనలేక కళ్ళలో నీళ్ళు నింపుకుంటూ ఉంది . 
''ఇద్దరికీ ఎలా వేస్తారే ?నీ అఘాయిత్యం కాక పోతే . 
ఇంకో రోజు వేస్తార్లె . మొండి వేస్తె ఎలా ?'' సులోచన అత్త అంటూ ఉంది . 
''నాకే వెయ్యండి . అక్కకు వద్దు . నేను ఎందుకు పూలు అన్ని కోసుకొని 
వచ్చింది '' ఏడుస్తూనే చెపుతున్నాను . 
''అది కాదమ్మా '' 
''ఊహు నాకు జడ కావాలి '' నన్ను సముదాయించ కుండా  వాళ్ళు అక్కకు 
జడ వేయలేరు . 
కోపం వస్తే పూలు అన్ని కూడా లాగెస్తాను . అంత మొండి . 

అమ్మ బాధపడుతూ రేపు వేస్తాము లెమ్మా అని అంటూనే ఉంది . 
ఏమిటి రేపు పెద్ద .... అదేదో అక్కకే రేపు వేయండి అని నా పట్టుదల . 

వీళ్ళతో పని కాదని  రూట్ మార్చేసా .... 
''నాన్నా నాకు పూల జడ కావాలి ''
 పెద్దగా ఏడుస్తూ కింద మళ్ళా దొర్లి ఏడుపు కొనసాగించాను . 
అందరు ఉలిక్కిపడ్డారు . 
''ఈ పిల్ల చెప్పినా చెపుతుంది . ఇంకేమి లేదు వాళ్ళ నాన్న అప్పటి కప్పుడు 
పూలు తెప్పించి కుట్టమంటాడు . ఏమి చేద్దాము ?''
మా అమ్మ భయం మా అమ్మది . 
మా నాన్నకు కాని పిల్లలు ఏడ్చారు అని 
తెలిస్తే ఇంక కావలికి పంపించడు సెలవలకి .

మెల్లిగా నన్ను కూర్చోపెట్టి కళ్ళు తుడిచింది పెదమ్మ . 
''మా అమ్మ కదా ఏడవద్దమ్మ . చూడు మొహం అంతా ఎలా అయిపోయిందో ''
సముదాయించింది . 
''నాకు పూల జడ కావాలి పెదమ్మా ''మళ్ళా ఏడ్చాను . 
మొండి తగ్గి బోలెడు బాధ గొంతులో . 
పిల్లలు ఏడుస్తారేమో అనే ఊహే భరించలేని వాళ్లకి 
నేను అలా ఏడుస్తుంటే చూడలేక పోతున్నారు . ఎలా చెప్పాలో తెలీడంలేదు . 

''ఎలా వేస్తారు చెప్పమ్మా ?నీకు క్రాఫ్ కదా !సవరం కూడా అల్లలేము ''
మెల్లిగా విషయం చెప్పింది పెదమ్మ . 
నేను ఒక్క క్షణం నిర్ఘాంత పోయాను . అసలు ఆ విషయమే ఆలోచించలేదు . 
మరి ఎందుకు వీళ్ళు నన్ను ఆశ పెట్టాలి . అయినా క్రాఫ్ ఉంటె నాది తప్పా ?
నలుగురు పిల్లలతో వేగుతూ ఇద్దరికీ జడ వేయలేను అని నాకు అమ్మ 
బేబీ క్రాఫ్  చేయించింది .తప్పు ఎవరిది ?మనసు లో బాధ మొహం లో 
ప్రతిఫలించి అసలే ఎడుపుతూ చిన్నపోయిన మొహం ఇంకా చిన్నగా . 
అందరికి బోలెడు జాలి ........... నాకేమి వద్దు . 
దూరంగా వెళ్లి దిగులుగా కూర్చున్నాను . 

రంగుల పూలు రాసులుగా పోసుకొని 
నవ్వులు విరజిమ్మల్సిన చందమామ 
దిగులు మబ్బును కప్పుకొని 
చిన్నపోయిన మొహం తో .... 

అందరు ఏదో మాట్లాడుకున్నారు . ఇప్పుడు కాని వాళ్లకు దేవుడు 
వాళ్లకు శక్తి ఇస్తే అందరు ఒకే గొంతుతో నాకు బారెడు జడ రావాలి 
అని కోరుకుంటారు ఏమో . 

పెదమ్మ ''దామ్మ శశి ''పిలిచింది పెదమ్మ . 
''రాణి నువ్వు జరుక్కోవే . ముందు శశి కి వేస్తాము '' అనింది 
సులోచన అత్త . 
ఎలా వేస్తారు అత్త ?అడిగాను . 
''మరే అసలు జడ అసలు బాగోదు తెలుసా ?అందుకు నీకు కృష్ణుడి లాగా 
కొండి వేసి లాంతరు చెండు నీకే పెట్టేస్తాము . '' చెప్పింది . 
ఏదో నాకు కూడా వేస్తారు అనగానే నాకు ఉత్సాహం . 
''అదిగో చూడు కృష్ణుడి కి కొండి అంటేనే ఇష్టం . వాళ్ళ అమ్మ కూడా 
రోజు వేసి దాని మీద నెమలీక పెట్టేది '' చెపుతూ ఉన్నారు . 
రాముడికి అద్దం లో చందమామ చూపించిన అమ్మ కూడా ఇలాగే 
చెప్పి ఉంటుంది . 
అవును నిజమే . కృష్ణుడు భలే ఉంటాడు . నాకు చాలా ఇష్టం . 
''మరి లాంతరు చెండు నాకు పెడితే .... అక్కకో '' అన్నాను . 
''పర్లేదులే ఏదో కుట్టేస్తాము . నువ్వే బాగుంటావు చూడు '' 
పకపకా నవ్వేసాను . అందరిలో కొండంత బరువు దిగినంత హాయిగా . 

ఆడవారి వేళ్ళు చక చక కదులుతూ చిన్నారి పాప తల మీద ముచ్చటగా 
ఒక్క జడ అల్లి దాని చుట్టూ గాజుతో అల్లిన చిన్న కొండి  ఉంచి ముచ్చటైన 
లాంతరు చెండు ముడవగానే అన్ని వైపులకు దాని పరిమళాలు . 
తరువాత అక్కను కూర్చో పెట్టి రంగుల జడ అల్లేశారు . 

ఇద్దరికీ మంచి దుస్తులు వేసి పెదమ్మ ,అమ్మ అమ్మమ్మ చెప్పిన నగలు 
అన్నీ మాకు అలంకరించారు . వాళ్ళు అన్నీ చేసేలోపు అమ్మమ్మ 
వెండి గిన్నెలో అన్నం కలుపుకొని వచ్చి చిన్న చిన్న ముద్దలు చేసి నోటిలో 
పెట్టింది . ఎందుకంటె అసలు కధ  ఇప్పుడు కదా మొదలు . 
మళ్ళా నిద్రకు వచ్చాము అంటే అన్నం తినము . 
మళ్ళా రాత్రి ఆకలితో నిద్ర పోలేము అని వాళ్లకు బాధ . 

అమ్మ చెప్పింది ''శశి అక్కని కూడా అందరి ఇళ్ళకి తీసుకెళ్ళి చూపించవే . 
శేషత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళండి ''చెప్పింది . 
అంటే ఇప్పుడు మేము ట్రంక్ రోడ్ మీద అందరి ఇళ్ళకి ఇటు జండా మాను 
వైపు కావమ్మ అక్క వాళ్ళ ఇంటి దాకా ,అటు కొత్త బజారు దాకా వెళ్లి 
మా పూల జడలు చూపించి రావాలి . మళ్ళీ శేషత్తమ్మ ఇంటికి అంటే 
ఒంగోల్ బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళాలి . 

అమ్మ ఒక్క నిమిషం అని కాటుక చిన్న చుక్కగా తీసుకొని మా ఇద్దరికీ 
కింది పెదవి కింద గడ్డం మీద దిష్టి  చుక్కగా పెట్టింది. పెళ్లి అప్పుడు 
చుక్క బుగ్గ మీద పెడతారు . మామూలుగా పిల్లలు బాగున్నారు అనిపిస్తే 
మా అమ్మ అలా పెడుతుంది . 

ఒక్కో ఇంటికి వెళుతూ ఉంటె వాళ్లకి బోలెడు హుషారు మమ్మల్ని చూడగానే . 
ముందు నన్ను చూస్తారు . లాంతరు చెండు ఎవురు కుట్టారే ?భలే ఉన్నావు . 
బుగ్గలు పుణికి మళ్ళీ అక్కను రమ్మంటారు ,తిప్పి చూస్తారు . జడ భలే 
కుట్టారే ,ఎవురు సులోచనా ఏనా ?''ప్రేమగా అడుగుతారు . 
కబుర్లు చెప్పించుకుంటారు . 

పక్కన వాళ్ళు ఎవరి పిల్లలు అంటే .... కాంతమ్మ మనవరాళ్ళు ,చిన్నమ్మాయి 
పిల్లలు అని చెపుతారు. అందరు ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం ,
గొప్పగా చూడటం ..... నేనైతే కిరీటం పెట్టుకొని తిరిగే మహా రాణి అయినా నా 
దర్పం చూసి చిన్నపోవాల్సిందే . 
ఒక్కరి ఇంటి ముచ్చట అందరు తమదిగా పంచుకొని మురిసిపోయే రోజులు . 
కొందరు పిల్లలం వచ్చాము అని ఒకటో రెండో రూపాయలు చేతిలో పెడుతారు ,
అక్క బుద్ధిగా ''వద్దండి అమ్మ అరుస్తుంది'' అని చెపుతుంది . 
నేను మాత్రం ''తీసుకో అక్క వాళ్ళ పాప జడ కుట్టించుకున్నప్పుడు అమ్మమ్మ 
ఇచ్చింది లే ''అని సత్యాలు చెపుతాను . 
'
'నా తల్లే ఎంత తెలివే నీకు ''అని నా ముద్దు మాటలకు మురిసిపోతారు . 
తిరిగి .... తిరిగి ..... అలసిపోయి ఇంటికి వచ్చాము . 
నాకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి . అలాగే సోఫాలో వాలిపోయాను . 
అయ్యో పిల్లలు అలిసిపోయారమ్మ .... ఒక్క నిమిషం ఉండండి అని 
అమ్మమ్మ పెరటి దగ్గరికి లాక్కొని పోయింది .

 ''ఇంకా ఏంది అమ్మమ్మ ''
''ఒక్క నిమిషం తల్లి ''చెప్పి చిన్న మట్టి కుండ లో గుడ్డ వత్తి నూనె లేకుండా 
వెలిగించి మా చుట్టూ తిప్పింది . 
''ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో దిష్టి వీధిలో దిష్టి 
ఆడ వాళ్ళ దిష్టి మగ వాళ్ళ దిష్టి నా దిష్టి చీపో ... చీపో '' 
మూడు సార్లు ఇటు మూడు సార్లు అటు తిప్పింది . 
నేను ఆవలింతలు కూడా మర్చిపోయి చూస్తూ ఉన్నాను కుతూహలంగా . 
కుండ లో వత్తి వెలుగుతుండగానే ఒక నీటి పళ్ళెం లో దానిని బోర్లించింది . 
కుండ లో నుండి వేడి గాలి బయటకు వచ్చి నీటి లో నుండి 
''గుడ ... గడ ''శబ్దం . 
''ఏంటి అమ్మమ్మ ఇది ''కుతూహలంగా అడిగాను . అది నాకు భలే నచ్చేసింది . 

అలాగ నేను కూడా ప్రయోగం చేద్దాము అనుకున్నాను . 
''అయ్యో దిష్టి అమ్మ . ఎంత ఉందో చూడు ''చెప్పింది అమ్మమ్మ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని . 
''దిష్టా ?బాబోయ్ . అమ్మమ్మ ఇప్పుడు అది ఎక్కడికి పోయింది ?''
''నా వల్ల  కాదె తల్లి నీకు చెప్పడం . నిద్ర వస్తుంది అన్నావు కదా . 
మిద్ది మీద మావయ్య పరుపులు వేసాడు పడుకో పో . 

''దిష్టి కి అమ్మా నాన్న ఉంటారా ?పాపం దిష్టి ఎక్కడకు పోయిందో ఏమో '' 
ఎదురుగా పైన కుసుమహర స్వామి ఫోటో ''ఈయన కధ  ఏమిటో . 
ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి ''కలల్లో తెలుస్తాయో ఏమో 
కంటి పాపల పై వాలిన నిద్ర దుప్పటిని కప్పుకొని ఆ రాజ్యానికి వెళ్ళిపోయాను . . . 
                     
                            *******************
                                                                    (అయిపోయింది )
(ఇంకేమైనా కధలు ఇక్కడ వ్రాయాలి అనిపిస్తే వ్రాస్తాను. 
లేకుంటే ఇంక పుస్తక రూపం లోనే )
పెదమ్మ గూర్చి ఇంకో రెండు ముక్కలు .... మొన్న బై ఎలెక్షన్ అప్పుడు 
కావలి దగ్గరగానే డ్యూటీ . క్యారియర్ పెదమ్మ పంపింది . తీసి చూడగానే 
సంతోషం తో కూడిన నవ్వు నా పెదాల మీద .... ఇక్కడ నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ ,
నా సంతకం తో ఆ పోలింగ్ బూత్  లో ఎలెక్షన్ కూడా రద్దు అవుతుంది . 
ఇక్కడ చూస్తే నా కిష్టం అని నూనె వంకాయ కూర కలిపిన అన్నం ,పెరుగు 
కలిపిన అన్నం చక్కగా సర్ది మళ్ళా స్పూన్ చేయి కడుక్కోకుండా,నా పనికి 
ఇబ్బంది కాకుండా ఇంకా .... నాకు చాలా ఇష్టం అని పక్కింట్లో అడిగి చిన్ని 
జామ పిందెలు వేసి పంపించింది . మిగిలిన స్టాఫ్ అన్నానికి రండి మేడం అన్నా 
కూడా మీరు వెళ్ళండి అని పంపేసి మా పెదమ్మ ను తలుచుకుంటూ తిన్నాను . 

మొన్న సెప్టంబర్ 22 నాన్న మా నలుగురు పిల్లలను తీసుకుని వెళ్ళారు . 
విషయం పెదమ్మ మంచం లో పడిపోయింది . చూసాను . ఏమి మాట్లాడాలి . 
అందరు వెళ్ళినాక వెళ్లి కూర్చున్నాను .ఎలా చనిపోతామో అని భయంగా 
ఉందా ?అడిగాను . చిన్నగా తల ఊపింది . పెదమ్మకి  ,అమ్మకి పెళ్ళికి 
ముందే చాలా పెద్ద గురువు గారి దగ్గర అమ్మమ్మ మంత్రం బోధ చేయించింది . 
అంటే ఎన్ని ఏళ్ళు నుండి ఈ మార్గం లో ఉన్నారు వాళ్ళు .  
మాకు ఉహ తెలిసినప్పటి నుండి వాళ్ళ దగ్గర మేమే విన్నాము
 తత్వాలు ,బోధలు .... వాళ్లకు మేము ఏమి చెప్పాలి ?

''మంచి వారు మన సద్గురు మూర్తి మర్మము తెల్పినారే 
సంచితములు విడగొట్టి వైచి వగ దెంచి వేసినారే 

తారక చైతన్యమును కనుటకు దారి చూడు మనెనే 
చూరు కింద ఆ కాకి చందమున చూపు చూడమనెనే 

సమ్మతముగా సద్గురు పాదమ్ములు నమ్మి కొల్వుమనెనే 
బ్రహ్మ కల్పములు మారిన నీకిక జన్మము లేదననే ''

ఈ పాట గుర్తుకు వచ్చింది . 
''మీరు గురు బిడ్డలు . ఆయనే మిమ్ములను తీసుకొని వెళుతాడు . 
భయం లేదు . కర్మ తోలగాలంటే మంత్రం జపం చేసుకో . ''
అని చెప్పే పైకి వెళ్ళే దారి మొత్తం గుర్తు చేసాను . 
ఆమె మనసు కొంత నెమ్మది అయినట్లు అనిపించింది . 
వచ్చేసాము . 
మూడు రోజులకు ఫోన్ . ఆమె ఇక లేదు . 

కాని నేను వచ్చిన పక్క రోజు 
 '' శశిఎంత బాగాచెప్పింది ''అని చెప్పి ఆనంద పడిన విషయం 
మా వనజక్క చెప్పినపుడు ,మా చిలక పలుకులకే మురిసిపోయే 
ఇలాంటి తల్లులను ఇచ్చినందుకు 
ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను . 
పిల్లల తెలివి తేటలకే కాదు వారి అల్లరికి , మొండికి ,కోపానికి 
విసిగించినడానికి పొంగిపోయే ఇలాంటివాళ్ళ ను మన జన్మలో 
కలిగి ఉన్నందుకు ఎంత అదృష్టం . అయినా ఇది ఇప్పుడు చరిత్ర . 
తరువాత ఎవరికి గుర్తు ఉంటుందో చెప్పలేము . 
మా పెదమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటూ ఆవిడకే అంకితం . 
                                @@@@@@@@@@@@ 

2 comments:

Srilatha said...

It's too good... No other words to say more

శశి కళ said...

some times silence speaks louder than words.thanks srilatha garu