Saturday 1 February 2014

''స్వర్ణముఖీ సవ్వడులు'

పోయిన ఏడాది ఏప్రిల్ లో వచ్చిన పుస్తకం గూర్చి ఇప్పుడు 
ఎందుకు అనుకున్నాను ,కాని పుస్తకం లేబుల్ కింద నా 
బుక్ లేకపోవడం నాకే నచ్చలేదు . అందుకే వ్రాస్తున్నాను . 

(kinige lo book link ikkada )


కాసుల ఎండమావుల వెంట పరిగెత్తే లోకం లో ఒక్క క్షణం 
ఆగి హృదయాన్ని చిగుర్చి నిలవడం,చిన్ని చిరు మొగ్గగా 
మారి పువ్వుగా విరియడం .....పండుగ.మనిషి లోకం 
చేసుకోగల పండుగ.మరి అదే చెట్టు రెండో పూవును 
సృజించి లోకానికి అందిస్తే .......అనుభూతులను 
అక్షరాలుగా మలిస్తే .......అదే నా ''ఇంకో పువ్వు ''
''స్వర్ణముఖీ సవ్వడులు'' 

దీని గూర్చి రెండు మాటలు నా కలం రాల్చేముందు 
ఒక చిన్న విషయం 

విత్తనం లో నిద్రాణమైన చైతన్యం జీవపు తడి తగలగానే భూమి తల్లి 
గర్బాన్ని చీల్చుకొని మొలకెత్తుతుంది.అది సృష్టి నైజం .
నాలోని సాహిత్యపు విత్తనం ఎలా రూపొందిందో .......
గోరు ముద్దల కధలు ఊహల్లో చిత్రించుకున్నప్పుడో ,
నాన్న వేలు పట్టుకొని విశాలాంధ్ర వ్యాన్ లో కోడి పుంజు కధలు,
ఎలుగు భడవ కధలు ,బాల సాహిత్యం మొత్తం కళ్ళతో తడిమినపుడో,
అమ్మ నేర్పిన తత్వాలలోనో,అక్షరాలు గుర్తించడం రాగానే అమ్మమ్మ 
ఇంట్లో చదివిన రామకృష్ణ కధామృతాలు,వేదాంత బేరి,సుందరకాండ...
ఒకటేమిటి తెచ్చినవన్నీ చదివేయాలి అనే ఆత్రుత లోనో.....
ఎక్కడో ఈ విత్తనం రూపొంది ఉంటుంది.
హైస్కూల్  కి రాగానే కొంత వరకు పిల్లల కధలు గా మారి పుస్తకాలలో చేరింది.
ఇరవై ఏళ్ళ క్రితం ఉపాధ్యాయురాలిగా చేరినప్పటి నుండి కొంత చిగుర్చి 
పిల్లల నాటికలుగానో,పాటలుగానో ప్రశంస లు తెచ్చినా పూర్తి స్తాయి 
కవితా ప్రస్తానం 2006 తరువాతనే.అప్పుడు నేర్చుకున్న ధ్యానం నాలో 
నిగూఢమైన శక్తి ని వెలికి తెచ్చింది.సహోద్యోగి కవితల పుస్తకం చూసి 
నా చుట్టూ ఉండే విద్యార్ధులకు అర్ధం అయ్యే విధంగా చిన్న కవితలతో 
వెలికి తెచ్చినదే నా మొదటి పువ్వు ''జాబిలి తునకలు''

సూర్యోదయ అస్తమయ కొలతల మధ్య ఇమడని నా గురుకుల బడి 
బాధ్యతలలో వ్రాసిన కవితలు పదుల సంఖ్య లోనే.కాని వాటిలోనే 
బహుమతులు తెచ్చుకున్నవి,ప్రచురణ పొందినవి అయిన పది కవితలతో 
మిత్రులతో కలిసి ''దశ దిశలు''సంకలనంగా వెలువడినా అది పూర్తి స్తాయిలో  
నాదే కాదు.
అప్పుడు ఆకర్షించిన ప్రక్రియ నానీలు.నాలుగు పాదాలతో నాలుగు దిక్కులను 
తాకేంత భావ చిత్రం గీసే ప్రక్రియ నాకు యెంత గానో నచ్చి ......ఒక సంకలనం 
నా రెండో పూవుగా వికసించింది.ప్రతీ నానీ నా భావవర్ణాలను అద్దుకొని
సాహిత్య లోకంలో ఉదయించింది. అదే ''స్వర్ణముఖీ సవ్వడులు''
నా దారి ప్రక్కన సమకాలీనాలు,సార్వజనీనాలు అయిన ప్రతి విషయం 
నా నానీల కొలను లో ప్రతిఫలించింది.
ఊరును గుర్తు చేసుకుంటూ......''రెండు పాయల మధ్య మా ఊరు 
                                               అమ్మ దోసిట్లో ఎత్తుకున్నట్లు''
ఎవరికి ఉండదు కన్న ఊరి మీద  కలవరం.
                                            ''ఊరును వదిలేసినా 
                                            ఉత్తేజానికి ఊపిరి పోస్తూనే ఉంది ''
తాళి పడగానే ఆడ పిల్ల అయిపోయే వాళ్ళకే కాదు ,ఉద్యోగాల కోసం 
ఊరు వదిలే వాళ్లకు కూడా ........
ఇంకా ప్రపంచీకరణ నేపధ్యం లో ''ఆకుపచ్చని చీర కాలుతూ ఉంది 
                                             మాయదారి సెజ్ మంటల్లో''
ఆకలి కి బువ్వ  పెట్టె చేతులే  ఆకలి అని అడుక్కుంటూ ఉంటె  .....
                                              ''భూమి తడిసి పోయిందని చెప్పానా?
                                                అవును రైతు కన్నీళ్ళతో''
అక్షరాలూ పరుచుకుంటూ వెళితే పుస్తకం శూన్యంగా మారిపోతుంది.
నా తల్లి తండ్రులను,భగవంతుని తలుచుకుంటూ ఈ పుస్తకం ఒకరికి అంకితం....

''శశి అలివికాని పనులు పెట్టుకుంటావు''అని ఆర్ధిక బాధ్యతల మధ్య ప్రేమగా 
కసురుకుంటూ .....సందె వేళలో ఏకాంత దీపాన్ని వెలిగించగానే చల్లబడి
 ''నీ కోసం పదిహేను వేలు దాచాను పుస్తకం వేయించుకో ''
అనే ప్రేమ గుస గుస......''పర్లేదండి.అదేమీ అవసరం కాదు కదా''
అని నేను మనస్పూర్తిగా అన్నా 
''లేదు వేయించుకో.....''అని ఉత్సాహం ఇస్తూ 

''శశి ఈ లోకం లో నేను భరించలేనిది ఏమిటో తెలుసా ,
ఏ విషయం లో అయినా నువ్వు బాధపడి  ఉంటావేమో 
అనే ఊహా మాత్రపు ఆలోచనని ......నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి''

అని ప్రతి అడుగులో చేయూత  నిచ్చే శ్రీవారికి అంకితం ఇస్తూ .....
              ''నాడు వేసినవి ఏడు అడుగులే 
                జీవితం తో గుణిస్తే లక్ష అడుగులు''
                
                 ''పూల తీగకు చెట్టు ఆసరా 
                  ఋణం తీర్చుకుంది పరిమళంతో''
ఈ అక్షర పరిమళం వారికే అంకితం.
మదిలోని కలకలం ఆగేంత వరకు ఏ రచయితా కలం ఆగదు.
అదిగో పచ్చటి గుబురుల మధ్య చిన్నగా ఊపిరి పోసుకుంటున్న 
నా ఇంకో పసి మొగ్గ.....బహుశా కధాసంకలనం కాబోలు .......

2 comments:

Anonymous said...

challa bavundi. keep it up Sasi sister.

శశి కళ said...

thankyou bro.mee peru vrayaledhu :)