Saturday, 27 September 2014

ఒక నేల కన్నీరు

ఒక నేల కన్నీరు ..... పాటక చేరి లో 
''సోన కాలువల పురా గాధ '' అనే 
పుస్తకం పై అభిప్రాయం ''సారంగ ఈ మాగజైన్ ''
లో చదవండి . 

(oka nela kanneeru link ikkada )


Sunday, 21 September 2014

అక్కినేని ..... ఆత్మీయతల గని

 ''అక్కినేని వారికి కొంచెం లేట్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు '' 
మా ఎన్ . టి . ఆర్ అన్నగారికి కూడా ఎప్పుడు చెప్పలేదు . 
అదీ నిన్న చెప్పలేదు . ఈ రోజు ఎందుకు చెప్పాలి అనిపించింది అంటే 
మధ్యాహ్నం ''మనం'' మీద టి . వి లో చూసిన ప్రోగ్రాం . 
ఎంత చక్కగా వాళ్ళ నాన్నగారిని గుర్తుకు తెచ్చుకున్నారో . 
ఆయనే బ్రతికి ఉన్నట్లు ఆయన తరుపున అభిమానులకు 
ఎంత బాగా థాంక్స్ చెప్పారో . పాపం నాగార్జున కు ,సుశీలాకు 
కళ్ళు తడుస్తూనే ఉన్నాయి . ఒకరు స్క్రిప్ట్ వ్రాసి ఇస్తేనో ,
ఆక్షన్ చేపెతేనో వచ్చేవా అవి !ఒక కుటుంభ పెద్దగా అందరితో 
ఆత్మీయంగా ముడి వేసుకొని ఆయన పెంచిన బంధాలు అవి . 


ఇంకా అమెరికా లో ఉన్న ఆయన అభిమానులు  ''స్టాంప్ ''కూడా 
ఆయన ఫోటో తో విడుదల చేసారు . చనిపోయినా బ్రతికి ఉండటం 
అంటే అది . అది ఏ కొందరికో దక్కుతుంది . 
మా ఎన్ . టి.  ఆర్ కి ఉన్నారు లెక్కకి అంత మంది పిల్లలు . 
ఏ రోజైనా అందరు ఒక తాటి మీద నిలిచి స్టాంప్ వేస్తారా ?
సరే లెండి పోలికలు ఎందుకు ?పైనున్న అన్నగారు బాధ పడతారు :(

నాగార్జున అంటే మా వారికి ప్రాణం . నాగార్జున వాళ్ళ నాన్న 
గూర్చి అన్న మాటలు ఎంత బాగున్నాయో !

నాన్న అంటే ప్రేమ 
నాన్న అంటే మనసు 
నాన్న అంటే మనిషి ..... చాలు మనిషి ఎలా ఉంటె జీవితం 
పరిపూర్ణంగా ప్రశాంతంగా జీవించగలడో ఆ  రహస్యం ఇదే . 

ఇప్పుడు ఆయన గూర్చి పోస్ట్ ఏమి వేయను కాని నేను  
అప్పుడు వ్రాసిన ''మనం'' మళ్ళీ లింక్ ఇస్తాను . 
(manam post link ikkada )
నివాస్ కూడా ''ఈ సినిమా మళ్ళీ చూడాలి ''అని ఫీల్ అయ్యాడు . 
వీలు అయితే మీరు కూడా మళ్ళీ చూడండి . మీ గుండె కూడా 
అక్కినేని ని చూసి లబ్ డబ్ అని కొట్టుకుంటుందేమో . 

ఆయన ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారు . ఆయన గూర్చి 
బాధ పడవలసినది ఏమి లేదు అని వాళ్ళ పిల్లలే చెపుతున్నప్పుడు 
మనం బాధపడవలసిన విషయం మాత్రం ఎక్కడ ఉంది .?
దీనికి బదులు మొన్న మెడిటేషన్ క్లాస్ లో విన్న నాలుగు మంచి మాటలు 
చెపుతాను . ఈయన ఇంట్లో పని వదిలిపెట్టి పోతావా అని అంటే ...... 
ఊహూ పిల్లలకు పెళ్లి అయినాకా కూడా ఇంట్లో పనులే ముఖ్యం 
అనుకుంటే నేను జ్ఞానం ఎప్పుడు తెలుసుకోవాలి అనుకోని మరీ 
వెళ్లాను . 

క్లాస్ శ్రీనివాస్ గాంధి గారు చెప్పారు . 
హై స్కూల్ పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అక్కడికి 
వచ్చారు . ఏదో లాభం వస్తుందనో ఎవరో ఆశ పెడితేనో వారు 
అక్కడకు వచ్చారా ?లేదే . ఏ శక్తి ఇంత మందిని ఇక్కడకు 
లాక్కొని వస్తుంది . అందరు కలిసి సామూహిక ధ్యానం అంటే 
శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటారు . చిన్న పిల్లల అనుభవాలు 
వింటూ ఉంటె ,ఇతరుల మనసు లోని ఆలోచనలు కూడా 
వాళ్ళు చెపుతూ ఉంటె మనం ఆశ్చర్య పోతాము . 

చిత్రంగా ఆ రోజు జన్మల గురించి ఇంకా ధ్యాన పరిచయం 
గురించి చెప్పారు . కొంత వరకు ఆధ్యాత్మిక వాతావరణం లో 
పుట్టిన వారికి పునర్జన్మ ల మీద నమ్మకం తప్పక ఉంటుంది . 
ఒక్కో ఆత్మ ఎన్ని జన్మలు ఎత్తుతుందో తెలుసా ?
కీటకాలు కావొచ్చు , చెట్లు కావొచ్చు ,జంతువులు కావొచ్చు , 
మనుషులు కావొచ్చు అందులో ఆడ ,మగ ఎవరైనా  కావొచ్చు ,
కొన్ని వందల జన్మలు ఎత్తి ఉండవచ్చు . నిజమా అంటే .... 
పాలల్లో వెన్న ఉన్నంత  నిజం . కాకుంటే నీలోకి నువ్వే ప్రయాణం 
చేసుకొని చూసుకోవాలి . ఎందుకు ఇన్ని ఎత్తడం అంటే 
ఆ జన్మ యొక్క పరిపూర్ణమైన అనుభవాలను పొందడానికి . 
అసలు పాతవి చూసే కొద్ది .... ఎన్నో సార్లు ఆడవాళ్ళుగా , 
ఎన్నో సార్లు మగవాళ్ళుగా మనమే ఉండటం చూసి ఎలా 
పుడితే ఏముంది ,అందరం అక్కడి వాళ్ళమే ,ఆత్మలమే 
అని అవగతం అయ్యి ఈ తేడాలు పెద్దగా పట్టించుకోము . 
లడ్డూల రుచి నాలుక పూర్తిగా గ్రహించినపుడు అవంటే 
మనకు వెగటు వేసినట్లు ఈ జన్మలు అంతే . ....... 
దీనిలో ఏమి లేదు అని మనకు వెగటు పుట్టే దాకా 
పుడుతూనే ఉంటాము . 

మన శరీరం వేరు ,మనం వేరు అనే కాన్సెప్ట్ నమ్మడానికి 
మనకు చాలా కష్టం . కాని ధ్యానం చేసి చూసినపుడు 
ఆ అనుభవాన్ని చూడటానికి మనకు సరిపోయే ఎనెర్జీ 
వచ్చినపుడు అది మనం ఫీల్ అవ్వగలం . 

నేను మాత్రం చదువుకున్న దాన్ని ఇవన్నీ నమ్ముతానా !
కాని భారత దేశపు ఆధ్యాత్మికత నన్ను దానిలోకి లాక్కెళ్ళి 
మరీ చూపిస్తూ ఉంటుంది . మన సుకర్మ లు పాప కర్మ లు 
బాలెన్స్ అయి మనం సత్వ దశలో ఉన్నప్పుడు మనకు 
ఎక్కడో ఒక దగ్గర లేదా ఎవరో ఒకరి ద్వారా ధ్యాన పరిచయం 
కలుగుతుంది . దాని సాధన చేస్తామా లేదా అనేది మన ఇష్టం . 
కాని దాని పరిచయం జరిగింది అంటే దానిలో మనం ముందుకు 
సాగవలసిన సమయం వచ్చింది అనేది స్పష్టం . 


ఒక రోజు తెల్లవారు జామున ధ్యానం చేసినపుడు నాకు 
ఈ ఆత్మ వేరు అనే  అనుభవం కలిగింది . ఉన్నట్లుండి  
నేను ఒక గుహలో ఉన్నట్లు ఆ గుహ నా శరీరం అయినట్లు , 
నేను వేరుగా, శరీరం వేరుగా అనిపించింది . నేను ఎందుకు 
ఇక్కడ ఇరుక్కొని ఉన్నాను అనిపించింది . ఇక ఇప్పుడు 
నేను ఆత్మ వేరే, శరీరం వేరే అంట .... అది పలానా 
వాళ్ళు చెప్పారు అనాల్సిన పని లేదు . ఎందుకంటె 
అది నేను చూసాను కదా . కాకుంటే మళ్ళా మన 
మామూలు జీవితం లోకి వచ్చేస్తాము ,అంతా మామూలుగా 
నడిచిపోతుంది అంతే . 

అక్కినేని గారు మనం డైరక్టర్ విక్రం గారిని అడిగారంట ..... 
''నాగార్జున కి ,చైతన్య కి హీరోయిన్స్ ని పెట్టావు ,నాకు 
పెట్టలేదే అని '' చనిపోయే ముందు కూడా ఎంత హుషారు . 
అందరికీ పంచి పెట్టగలిగినంత  ఆనందం . మనలో ఏది ఉంటె 
అదే అందరికీ పంచుతాము . కావాల్సింది అక్కినేని 
గారి లాంటి నిష్కల్మషమైన పసిబిడ్డ లాంటి  మనసు. 
దేవుని రాజ్యం పిల్లలదే అంటే అర్ధం ఇదే . దేవుని రాజ్యం 
అంటే సంతోషం తో నిండినది .... దానిలోకి బోలెడు కల్మషాలు 
అహాలు గల పెద్దలు ఎప్పటికీ ప్రవేశించలేరు . 
మిగిలిన జీవితాలలోకి తొంగి చూసే పని ఆపేసి మీ 
జీవితాన్ని మీరు పసి పిల్లలుగా పరిపూర్ణంగా అనుభవించండి . 
మీలో ఉన్న ఆనందాన్ని మీ చుట్టూ ఉన్నవారికి పంచండి . 
అప్పుడు మీరు కూడా చనిపోయినా అందరి హృదయాలలో 
బ్రతికే ఉంటారు . 
                      @@@@@@@@@@@  

Thursday, 18 September 2014

పుట్టిన రోజు ముచ్చట (4)

పుట్టిన రోజు ముచ్చట (4)

(puttina roju muchchata 3 parts link ikkada )


''అమ్మా ఇవేంటి ''మూడేళ్ళ మాధురి వీపు మీదెక్కి ఊగుతూ 
నా వళ్ళో ఉన్న రంగుల పేపర్స్ చూపించి అడిగింది . 
పక్కన ఉన్న రెండు నెలల బాబు నివాస్ ని పాప కాలు 
తగలకుండా చిన్నగా జరిపాను . నిద్ర లో విసిగించాను కాబోలు 
''ఊ '' అని చిన్నగా మూలిగాడు . చిన్నగా కాళ్ళు విదిలించాడు . 
మధురి గబుక్కున చిచ్చు గొట్టి ''అమ్మ లేరా ''అని నచ్చచెప్పింది . 
వేలెడంత లేదు పిల్లలు అంటే ఎంత ఇష్టమో . వీడికి ఇది కూడా 
అమ్మే . 

''చెప్పమ్మా '' మళ్ళీ అడిగింది . చిన్నప్పటి నుండి కూడా మరీ 
మొండికేసి విసిగించదు . మెల్లిగా అడిగి తీసుకుంటుంది . మనం 
ఏమైనా చెపితే శ్రద్ధగా వింటుంది . 
''మరి నీ పుట్టిన రోజు వస్తుంది కదా . నువ్వు కేక్ కట్ చేసేటపుడు 
ఇవన్ని ఇంట్లో చుట్టూ తగిలిస్తాము '' చెప్పాను . 
''పుట్టిన రోజు అంటే ''.... బాబోయ్ మాటలు ముద్దుగా ఉంటాయి ,
కాని ఈ పిల్లల ప్రశ్న లకు సమాధానం చెప్పటం మొదలు పెడితే 
ఇక అంతం ఉండదు . 
''అంటే ఇప్పుడు ఇక్కడ తమ్ముడ్ ఉన్నాడు కదా !
అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు ?''
''నీ పొట్టలో ''చెప్పింది . కళ్ళలో కరక్ట్ చెప్పాను అనే వెలుగు . 
చిన్నగా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని ..... 
''అలాగే నువ్వు నా పొట్టలో ఉన్నావు . నీ పుట్టిన రోజు అప్పుడు 
ఇదిగో తమ్ముడి లాగా పుట్టావు ''చెప్పాను . 
''నా పుట్టిన రోజు నాకెలా తెలిసింది ?''అయిపోయాను . ముందు 

విషయం డైవర్ట్ చేయాలి . 

''నువ్వు ఎప్పుడు పుడితే అప్పుడే బంగారు అది . 
చూడు నీకోసం చిన్న టోపీ చేసాను . అది పెట్టుకొని కేక్ 
కట్ చేస్తువు సరేనా ?''
''మరి ఇన్ని టోపీ లు ఎందుకు ?''
''ఇంకా పిల్లలు అందరు వస్తారు కదా వాళ్లకి . ఇంకా వాళ్లకి 
నువ్వు చాక్లెట్స్ , కేక్ ఇవ్వాలి . ఇస్తావా ?''
''ఇంకా నానమ్మకి ,జేజినాయనకి ,బాబాయిలకి ,అత్తమ్మకి 
కోట తాతయ్యకి ,అమ్మమ్మకి , రాణి పెదమ్మకి ,హర్షా కి 
అందరికీ పెడతావా ?''
''ఊ పెడతాను . తమ్ముడికి కూడా ''గుర్తు చేసింది . 

దీని మొహం . దీనికే ఉన్నాడు తమ్ముడు . ప్రతి విషయానికి 
ముందో వెనకో తమ్ముడు అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ,
రైల్ ఇంజెన్ బోగీలను లాక్కోచ్చినట్లు . 
''తమ్ముడు తినడమ్మా ,పాలు ఒక్కటే తాగుతాడు . చిన్నవాడు కదా ''

ఇదేమిటి ఇదేమిటి అని అడుగుతూ ఉంది . 
కలర్ పేపర్స్ తో కట్ చేసిన పాప పేరు , టోపీలు ,పేపర్స్ తో 
తోరణాలు నేను హనుమకొండ లో షాప్స్ లో చూసినవన్నీ 
పుట్టిన రోజు వరకు చేస్తూనే ఉన్నాను . పాపకు ఏది కొరత 
ఉండకూడదు అని తపన .  అసలు దీనికి పుట్టిన రోజు చేయాలి 
అని ఎప్పటి కోరిక . ఏదో ఈ నివాస్ పుట్టాడు కాబట్టి ఇప్పటికి 
మెటర్నిటీ లీవ్ లో ఉండి చేయగలుగుతున్నాను . 

పుట్టిన రోజు ఉదయం నుండే సందడి . వాళ్ళ అత్తతో వెళ్లి అందరికి 
చాక్లెట్స్ ఇచ్చి కేక్ కటింగ్ కి రమ్మని అందరిని పిలిచి వచ్చింది . 
మధ్యాహ్నానికి మా అమ్మ నాన్న ,రాణి అక్క వాళ్ళ బాబు 
హర్షా అందరు వచ్చారు . సాయంత్రం అయ్యేసరికి ఇల్లంతా 
బంధువులు ,చుట్టూ పక్కల వాళ్ళు ఇల్లంతా సందడి . 
వచ్చే వాళ్ళను పలకరిస్తూ బాబాయిలు ,జేజి నాయన 
అంతా సందడి . డెకరేషన్ చూసి అందరు మెచ్చుకున్నారు . 
కేక్ తీసుకొచ్చి లోపల పెట్టారు . 

వచ్చిన వాళ్ళను పలుకరిస్తూ మర్యాదలు చేస్తూ బాబును 
చోసుకుంటూ ఉన్నాను . ఇంతలో ఎందుకో హేమా ఏది 
అనుకున్నాను . హాల్ లో కనపడలేదు . ముందు షాప్ వెనుక 
ఇల్లు కాబట్టి షాప్ లోకి వెళ్లాను . ఏమైనా వీధిలోకి వెళ్ళిందా ?
ఎందుకో భయం వేసి బయటకు వెళ్లి చూసాను . బంగారు నగలు 
కూడా ఉన్నాయి వంటి మీద పాపకి ఏమై  ఉంటుంది?
పాప ఇక్కడకు వచ్చిందా ?మామగారిని అడిగాను . 
''రాలేదే లోపలే ఉందేమో ''అన్నారు . 

లోపల ఉందా ,లేకుంటే...... గబా గబా పరిగెత్తి వంటింటి వైపుకు వెళ్లాను . 
టేబుల్ వెనుక చిన్నగా అలికిడి . చూడగానే ఒకటే నవ్వు నాకు . 
టేబుల్ అందక కాళ్ళు పైకెత్తి ఒక వేలు కేక్ మీద ముంచి క్రీమ్ 
ను తింటూ ఉంది . ''ఓయ్ ''అరిచేసరికి ఉలిక్కి పడింది . 
''తినకూడదమ్మ ఎంగిలి ''చెప్పి చేయి కడిగేసి తీసుకొచ్చాను . 
''ఇంకొంచెం ''అడిగింది . 
''అలాగేలే కేక్ కట్ చేసినాక తిందువు ''నవ్వుతూ చెప్పాను . 
ప్రతి ఒక్కటి అదలా ఎంజాయ్ చేస్తూ ఉండటం నాకు భలే సంతోషాన్ని ఇస్తూ ఉంది . 

కేక్ కట్ చేయగానే అందరు చప్పట్లు కొట్టి 
''హాపీ బర్త్ డే మాధురి '' అంటూ ఉంటె దానికి సంబరం 
చప్పట్లు కొడుతూ ఉంది . 
ఒక్కొక్కరికీ కేక్ పెట్టింది . అందరు అక్షింతలు వేసి డబ్బులు , 
బహుమతులు ఇస్తూ ఉంటె నాకు ఇస్తూ ఉంది . 
అమ్మమ్మ వచ్చి ముద్దు పెట్టుకొని చిన్న ప్లాస్టిక్ కుర్చీ 
గులాబి రంగుది ఇచ్చింది . వెంటనే ఎక్కి కూర్చుంది . 
దాని సంతోషం చూసి నాకు భలే సంతోషంగా ఉంది . 
ఇందుకు కదా నేను పుట్టిన రోజు చేయాలి అనుకున్నది . 

కాని ఏ వయసులో ముచ్చట ఆ వయసులో చేసినపుడు 
దానికి అందం ఇంకా పెరుగుతుంది . ఇప్పుడు చేయబట్టి 
ఎంత ఆనందంగా ఉంది పాప . హమ్మయ్య ఇప్పటికి 
దాని పుట్టిన రోజు ముచ్చట నాకు తీరింది . 

                                  @@@@@@@@@@@   
(అయిపొయింది ) 

Thursday, 11 September 2014

''దేహళి ''... ప్రతి కూతురు కూడా

''కాపురానికి వెళ్ళిందా అమ్మ పాప ''
''అవునక్కా '' ఇప్పుడే అమ్మాయి అల్లుడు
వెళ్ళిపోయి ఇంట్లో మనసులో ఏదో వెలితి .
అర్ధం చేసుకుంది ఎదురింటామె .
''ఇంక అంతే లేమ్మా . దగ్గరే కదా వస్తూ పోతుంటారు లే ''
ఓదార్పుగా అంది . నిజమే ఇద్దరు కూతుర్లను కన్నది .
ఈ బాధను వాళ్ళు కూడా దాటే ఉంటారు . కొంత ముందు
వెనుకగా అందరు దాటుతారు .

ఇంట్లోకి వచ్చేసరికి నివాస్ బెడ్ రూమ్ వైపు చూపిస్తూ
సైగ చేస్తున్నాడు . ఎవురున్నారు ?ఇంట్లో ఈయన
ఒక్కరే  ఉన్నారు .
''వెళ్లి చూడు . నాన్న ఏడుస్తున్నాడు ''వాడికి కొత్తగా
ఉంది . వాడు విజయవాడ కు వెళ్ళినపుడు కూడా
ఎవరం ఏడవలేదు . దగ్గరగా ఉన్న నెల్లూరు కు
అక్కను పంపిస్తే ఎందుకు ఏడవటం పాపం వాడికి
అర్ధం కాలేదు . నాకు కూడా అర్ధం కాలేదు .
ఎంతో పెద్ద సమస్యలు వచ్చినా నేను ఏడుస్తాను కాని
ఆయన ధైర్యం చెపుతూ ముందుకు తీసుకెళుతారు .

వెళ్లి చూసేసరికి దిగులుగా మొహం మీద మోచేయి ఉంచి
పడుకొని ఉన్నాడు ,చేయి పక్కన చిన్నగా జారుతున్న
తడి ......
''ఏమిటి ఏమైంది ?''ఓదారుస్తున్నాను కాని నాకే తెలీకుండా
నా కళ్ళలో కూడా ఊరుతున్న తడి .
ఏమిటో ఎవరు ఎవరికీ ఏమి కారు ,ఇదంతా ఒక నాటకం .
ఊహు ఎంత సముదాయిస్తున్నా పైకి వస్తున్న దుఃఖం .
''ఎందుకొచ్చిన వేదాంతాలు ,సిద్దాంతాలు రాద్దంతాలు ,
కాసింత కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటించలేనపుడు ''
విసుగు అనిపించింది . 

''ఛీ ఆడపిల్లను కనకూడదు ''అంటున్నారు .
''అబ్బో అప్పుడు ప్రపంచం ఏమి అయిపోవాలి ''మొండిగా అన్నాను .
అన్నీ తెలిసి  కూడా ఇలా బాధ పడటం నా మీద నాకే కోపంగా ఉంది .

''ఇరవై మూడేళ్ళు సాకి విద్యా బుద్ధులు చెప్పి ఎవరికో ఇచ్చెయ్యాలి ''
''ఆహా ఇయ్యాక పోతే ఏమి చేసుకుంటావు ?మా నాన్న మాత్రం
ఇస్తేనే కదా ఈ రోజు మీ దగ్గర ఉన్నాను ''అనునయంగా
చెప్పాను .

''రోజు ఇంటికి రాగానే పాపా పాప అని పిలిచే అలవాటు .
ఇప్పుడు ఇంకెవరున్నారు ?''

''మరీ చిత్రం గంట దూరం . చూడాలంటే ఎంతలోకి వెళ్ళొచ్చు .
కాదంటే వాళ్ళు అయినా తెచ్చి చూపిస్తారు . కావాలంటే
రోజు ఫోన్ లో మాట్లాడుకో '' ఏమి చెప్పకుండా మౌనంగా
లేచి ఆయన పనిలో మునిగిపోయారు .
రెండు రోజులకు ఇంట్లో వెలితి అలవాటు అయింది .
ఇక మేము  ఇద్దరమే ఉండాలి అనే సత్యం బోధపడింది .

ఇదిగో ఇదంతా ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసి మళ్ళా గుర్తుకు
వచ్చింది ,నీళ్ళలో రాయి వేస్తే ఒక్క సారి నీళ్ళు కలతబడినట్లు ,
కాసింత ప్రశాంతం కావాలంటే మళ్లి ఎన్ని రోజులు పడుతుందో ,
ఆడపిల్ల తల్లి తండ్రులకు :(

ఆడపిల్ల గడప మీద పెట్టిన దీపం అంట . ''దేహళి ''
రెండు లోగిళ్ళకు వెలుగు ఇస్తుంది నిజమే .
అప్పగింతల పాట మా అమ్మ నేర్పించింది .
''అత్తవారింటికి అంపే దెలాగమ్మా
అల్లారు ముద్దుల అపరంజి బొమ్మ
పోయి రావే పడతి అత్తవారింటికి
వెంకన్న మంగమ్మ అండ నీకుండా .....

పుట్టినింటికి కీర్తి
మెట్టినింటిలో శాంతి
నిలిపి వెయ్యేళ్ళు వర్ధిల్లవమ్మా !

అత్తవారింటికి అంపే దెలాగమ్మా
అల్లారు ముద్దుల అపరంజి బొమ్మ ''

మా మాధురి కూడా మాకు మంచి పేరు తెస్తుంది .
మా పాపే కాదు ప్రతి కూతురు కూడా ప్రపంచాన్ని
వెలుగుతో నింపుతున్న దీపాలే . కాదని హృదయం
ఉన్న ఎవరైనా అనగలరా ?

link ikkada




ప్రతి తండ్రికి కూతురి మీదేనా ప్రేమ ,కూతురికి తండ్రి మీద ఉండదా ?
ఏది గొప్ప అంటే లాజికల్ స్టెప్స్ తో తేల్చగల బంధాలా ఇవి !
నా కధ ''వర్షం లో గొడుగు '' ''మాలిక ఈ పత్రిక '' లో వచ్చినది . 
దాని మీద వ్రాసిన చక్కని విశ్లేషణ చూసి ఎప్పటి నుండో పోస్ట్ 
వేయాలి అనుకుంటుంటే ఇప్పటికి వీలు అయింది . 
వలబోజు జ్యోతి అక్కకు ధన్యవాదాలు . విశ్లేషణ వ్రాసిన 
మంధా భానుమతి గారికి ధన్యవాదములు . 


Monday, 1 September 2014

బాపు గారు మిమ్మల్ని మర్చిపోలేను

బాపు గారు మిమ్మల్ని మర్చిపోలేను .... 
ఇలా అంటే రమణ గారిని మర్చిపోయినట్లా ?
ఊహూ కాదు కాదు ఈయన గూర్చి అన్నవన్నీ ఆయన 
గూర్చి కూడా అనుకోండి . 31/8/2014 తేది మంచిదే కాదబ్బ . 
తలుచుకుంటే ఇంకా దిగులుగా ఉంది . పెద్ద ఈ ''బాపు ''గారు 
అదే లెండి సత్తి రాజు లక్ష్మి నారాయణ నాకేమి చిన్నాయనా ?
పెదనాయనా ?లేక అక్షరాలు దిద్దించిన అయ్యోరా ?నేను మనసులో 
పెద్ద బండరాయి పడినంత బాధ పడటానికి .... ఏమి నేర్పించాడు . 
కాదు కాదు నేర్పించాడు ,జీవితపు రసం ఎంత మధురంగా ఉంటుందో ,
కాపురాన్ని ఎంత అందంగా దిద్దుకోవోచ్చో ,రోటి పచ్చడి 
కమ్మదనము , అలకలోని అందము ..... ఒకటేమిటి మా 
పెద్దోళ్ళు మాకు చెప్పని కాపురం విషయాలు అన్నీ తెలుసుకున్నాము . 
మా కాపురాలు కాసింత నవ్వు కళ తో కళ కళ లాడుతున్నాయంటే 
ఆ జంట చూపించిన కళ తోనే అని చెపుతాను . 

అదేమిటి ఆయన బొమ్మలు వేసాడు . కార్టూన్లు వేసాడు . 

సినిమాలు తీసాడు,బుడుగు సీగాన పసూనంబ ,
సీతా కల్యాణం ,సాక్షి ..... 
 ఇవి కదా చెప్పాలి అంటే ..... 
ఏమో నాకు తెలీదు . 
ఇది నా ప్రపంచం నాకు తెలిసినవే చెపుతాను . 
 ఆయన అయ్యన్నీ చేసుండొచ్చు . 
ఇప్పుడు మీరు ఆ సినిమా ఎప్పుడు తీసారు ?
పద్మశ్రీ ఎప్పుడొచ్చింది ?
ఇయ్యన్నీ అడిగితే నాకు తెలీదు . 
అయినా ఆయనంటే ఇష్టం . 
ఎంత ఇష్టం అంటే నిన్న మా పాప హేమ మాధురి పెళ్లి శుభలేఖ లో 
సప్త పది గురించి ఆయన ఫాంట్స్ లోనే వ్రాయించాను . 
చాలా మంది ఆ ఫాంట్స్  అర్ధం కాలేదు అన్నా నా మటుకు నాకు 
తృప్తి గా అనిపించింది . 

పెళ్లి కాక ముందు పిన్నమ్మలకు చపాతీ లు చేసి 
ఇచ్చినపుడో ,వాళ్ళ పిల్లలను ఎత్తుకొని తిప్పినపుడో 
వాళ్ళ ఇచ్చే ఆంధ్ర భూమి ,ఆంద్ర జ్యోతి ,విపుల , చతుర 
వనితా జ్యోతి కొంచెం పెళ్లి అయ్యే ముందు వచ్చిన స్వాతి 
ఇదిగో ఇదే మాకు అందే విశాల ప్రపంచం . అందులో బాపు రమణ 
అనే పేర్లు వస్తే ఆగిపోయేవాళ్ళం . జోక్స్ చదివి మురిసిపోయేవాళ్ళం . 
ఇక ఆయన సినిమాల్లో చూపించేవి .... ఎన్ని చెపుతారో . 

''ఆరు నైదవతనములు ఏ చేతనుండు ,అరుగులలికే వారి అరచేతనుండు ''... 
అని ఇల్లు దిద్దుకుంటేనే కళ అని చెపుతూ ఈ కాలం లో కూడా 
రావణాసురులు ఉన్నారు పరాకుగా ఉండండి అని చెప్పకనే చెపితిరి . 
మగవాళ్ళు  కాసింత ఆశలు పెట్టి పొగిడితే పొంగిపోయే ఆడవాళ్ళకు 
''రాదే చెలి నమ్మరాదే చెలి మగ వారినెపుడూ నమ్మరాదే చెలి ''
మగవాళ్ళు కాసింత ఎక్కువ  సమానం ,
అదే లోకం తీరు సర్దుకుని పోమ్మా ,అని చూపిస్తిరి . 
మళ్ళా వ్యక్తిత్వం తో ఉంటూనే కాపురం లో తెగే దాకా జగడాలు 
ఉండకూడదు అని ''ఆగడాలు పగడాలు ఆలు మగల జగడాలు ''
అని మురిపిస్తిరి . ఒక్కో సినిమా ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచే 
ఒక్కో ఆణిముత్యం . 
రాధా గోపాళం  లో రాధ ను కేస్ వదిలేయమని భర్త గోపాలం 
ఆర్డర్ వేస్తూ ''నేను భర్త ని '' అని గర్వంగా అంటాడు . 

అప్పుడు రాధ అనే మాటలు నాకు ఎంతలా  గుర్తుంటాయో.... 
''నేను రాధ ని , నేను మనిషిని , నేను లాయర్ ని ''

మనసు పెట్టి వినగలిగిన మగవాళ్ళకు దానిలో ఎంత అర్ధం 
కనిపిస్తుంది . కావాల్సిందల్లా మగవాళ్ళం అనే దురహంకారాన్ని 
వదిలేసి విషయాన్ని మానవత్వం తో, తన భార్య కూడా మనిషి 
అనే జ్ఞానంతో చూడటమే . బాపు రమణ లు పై అందాలనే ఎప్పుడూ 
చూపించలేదు .... వాళ్ళ పాత్రలన్నీ మానవత్వం వెలిగిపోయే సగటు 
పాత్రలే .  
నిజంగా ఆడది మెచ్చినది అందం అంటారు . నిజంగా ఆడవాళ్ళలో 
ఇంత అందం ఉందా అని నేను అబ్బురంగా చూస్తుంటాను . 
అతిశయోక్తి లాగున్నా వాళ్ళు చూపించిన కోణాలన్నీ నిజమే . 
బాపు గారి బొమ్మలు నేను దగ్గర నుండి ఎప్పుడూ చూడలేదు . 
కనీసం ఇప్పటికీ నా దగ్గర కాలెండర్ లు కూడా లేవు . 
కాని మా పెద్దక్క అత్తగారింట్లో మా పెద్దక్క బావగారు వేసిన 
బాపు బొమ్మల నకళ్ళు చూసినపుడు నేను నిజంగా ఎంత 
ఆనందపడ్డానో .... ఆ బొమ్మల అందం నాకు అప్పుడే తెలిసింది . 
ఒక ఆశ్చర్యం ,ఒక అలక ,ఒక విరహం ,ఒక సరసం , ఒక ఆరాధన ,
ఒక విరుపు ,ఒక కంటి ఎరుపు ,మురళీ గానం లో పడి  మైమరుపు .... 
ఏమిటివి ఇన్ని భావాలు రంగులను పులుముకొని నా చుట్టూ .... 
నకళ్ళే ఇంత బాగుంటే నిజమైన చిత్రాలు ఇంకెలా ఉంటాయో !
ఇంత వరకు చూసిందే లేదు దగ్గర నుండి . 

చెప్పకూడదు కాని రమణ గారు చనిపోయినపుడు బాపు గారు 
కూడా ఇంకా ఎంతో కాలం బ్రతుకరు అనుకున్నాను . 
ఎందుకంటె మాకు మెడిటేషన్ క్లాస్ లో చెపుతారు 
ఒకటిగా పుట్టిన జంట ఆత్మలు  , లేదా ఆత్మీయంగా 
ఉండే భార్యా భర్తలు ,అన్నా చెల్లెళ్ళు ఎవరైనా కానీండి ,
వాళ్ళ హృదయాల మధ్య ఒక శక్తి ప్రసారం ఎల్లప్పుడూ జరుగుతూ 
ఉంటుంది . అందుకే ఒకళ్ళ దగ్గరుంటే మరొకరికి బలం 
వచ్చినట్లు ఉంటుంది . వాళ్ళలో ఒకరు చనిపోయినపుడు 
ఈ ప్రసారపు తీగ తెగిపోతుంది . ఆ దిగులు లోపలి పాకి 
వాళ్ళు కూడా చనిపోతారు .... ఒక వేళ  వాళ్ళు కూడా 
ధ్యానులై ఈ విషయపు ఎరుకతో ఉంటె తప్ప ..... 
పోయిన వాళ్ళతో త్వరగానే వెళ్ళిపోతారు . 

ఒక కంటితో అయినా మనం చూడగలం . 
కాని పరిపూర్ణత్వం కోసం దేవుడు రెండు కళ్ళు
సృష్టించాడు . 
అదే దేవుడు కళ కు పరిపూర్ణత్వం కోసం వాళ్ళను 
ఇద్దరుగా సృష్టించాడు . కళ్ళు వేరైనా వారి 
చూపు ఒక్కటే . రూపాలు వేరైనా వారి ఆత్మ ఒక్కటే . 
వారి కళా రూపాలు కలకాలం చూసి మనం ఆనందించడమే 
మనం వారికి ఇవ్వగల నివాళి . 
                                ******************