Thursday, 19 March 2015

ఒరే సాయి .... మాకేంటి !!ఆహా మాకేంటిది అని ?

''సారీ అండి పొరపాటు జరిగింది ''బాధపడుతూ నివాస్ కాలేజ్ 
నుండి ఫోన్ . 
సీతమ్మ వాకిట్లో సినిమాలో అడ్డాల గారు మహేష్ బాబు ఫ్రెండ్స్ చేత 
''భలే ఉండాడ్రా  మీ వోడు దిట్టంగా ''అనిపించి , మళ్ళా మహేష్ 
ఫాన్స్ ఇబ్బంది పడుతారని నాలుక కొరుక్కొని ''మనోడికి ఏమి 
తక్కువ రా పెళ్ళికి వెళ్లి నల్లబడ్డాడు కాని ''అనిపిస్తాడు . అక్కడ కాబట్టి 
బాలెన్స్ చేసాడు . 
ఇక్కడ అలా కాదే !!! మూడు గంటల్లో చూపే ఉద్వేగాలు ఇప్పుడు 
మూడు నిమిషాల డాక్యుమెంటిరీ లో చూపినట్లు ఆ కాలేజ్ వాళ్ళ 
ఫోన్ వలన మేము అన్ని ఉద్వేగాలు అనుభవిస్తిమి !

ఏదో అవసరం ఉండి ఈయనకు ఫోన్ చేస్తే వేరే సార్ తో మాట్లాడుతున్న 
మాటలు వినిపించాయి . 
''ఏమిటి బాక్ లాగ్స్ అంటున్నారు ?ఎవరికీ ?''
''నివాస్ కాలేజ్ వాళ్ళు చేసారు . వీడికి త్రీ వన్ లో ఒక 
బాక్ లాగ్ ఉందంట ''మాటల్లో కొంచెం కంగారు . 
కొద్దిగా మార్కులు ఎక్కువ తక్కువ అవుతాయి కాని మా పిల్లలు 
ఎప్పుడూ ఫెయిల్ అని మమ్మల్ని కంగారు పెట్టలేదు . 
కొంచెం కన్ఫ్యుస్ అయ్యాను . మందు ఈయనని ఓదార్చాలి 
అని 
''సరే ఉంటె ఏమి చేద్దాములే . వ్రాసుకుంటాడు అంతే కదా ''
అన్నాను . నిజమే కదా పాపం అది పిల్లలకే ఎక్కువ సమస్య . 
వాళ్లకు అవసరమైన సపోర్ట్ ఇవ్వాల్సిన మనం ఇంకా బాధ పడి 
తిట్టేస్తే ,పాపం వాళ్ళు ఇంకా ఏమి అయిపోతారు . పోనీ దేవుడు 
ఏదో ఒకటి వ్రాయకుండా వాళ్ళను భూమి మీదకు పంపాడు కదా !!

''అది కాదబ్బా !మొన్న నెలలోనే కదా మీ బాబు అన్నింటిలో 
పాస్ అయ్యాడు . డెబ్బై శాతం పైన వచ్చాయి అని ఫోన్ చేసారు . 
ఇప్పుడు పక్కన సార్ తో అదే చెపుతున్నాను . 
మా పిల్లలు అబద్ధాలు చెప్పరు సార్. ఒక వేళ ఫెయిల్ అయినా 
చెపుతారు . డబ్బులు కావాలన్నా పర్స్ లో నువ్వే తీసుకోరా 
అంటాను . అంత నమ్మకం వాడంటే '' చెపుతూ ఉన్నారు . 
పాపం నిజంగానే పిల్లలు అంటే ఎంత నమ్మకం . ప్రతి తల్లి తండ్రికి 
ఇలాగే ఉంటుంది . అందుట్లో ఎదిగొచ్చిన కొడుకును చూస్తే తండ్రికి 
కోతకి  కి వచ్చిన పంటను చూసినంత సంబరం ,భరోసా . 
తల్లిగా నా బాధ ఎలా ఉన్నా ..... ఈయన బాధ పడుతుంటే 
చూడలేకపోతున్నాను . 
''మరి అడగక పోయారా వాళ్ళని '' కొంచెం కోపంగా అన్నాను . 
''అడిగాను , వి . సాయి శ్రీనివాస్ కదండీ .... అని అడిగారు . 
మళ్ళీ ఫోన్ రాలేదు '' 
అవును ఈయన ఫోన్ కి సిగ్నల్స్ సరిగా రావు .  
నేను కనుక్కుంటాను ,అని చెప్పి పెట్టేసాను . 

ఇంతలో నాకే ఫోన్ . తీశాను . 
''నమస్తే మేడం . నివాస్ కాలేజ్ నుండి '' 
నాకు లోపల మండిపోతూ ఉంది . 
''మేడం ఇంకో బాబు ఇదే పేరుతో వేముల అని ఉన్నాడు అండి . 
మీ బాబే అనుకోని ఫోన్ చేసాము . మీ బాబు కి బాక్ లాగ్స్ 
లేవు . ''ఇంకా ఏదో వివరణ ఇస్తూ ఉన్నాడు . నాకు ఇంకా 
నమ్మకం కుదరడం లేదు . నివాస్ ఏమైనా మేము బాధ పడుతాము 
అని ఇలాగ చెప్పిస్తునాడా ! 
''పర్లేదండి .... ఏమైనా బాక్ లాగ్స్ ఉంటె చెప్పండి . మేము టీచర్స్ మీ 
ఏమి అనుకోము ''గట్టిగా అన్నాను . 
నిజంగా ఇలాటివి తట్టుకొని నిలబడాలి అంటే పేరెంట్స్ ఎంత 
గుండె దిటవు చేసుకుంటున్నారో ,ఇది పరువు సమస్యగా ఎంత 

బాధ పడుతున్నారో అర్ధం అవుతుంది . నిజంగా వాళ్ళ మనసులకు 
ఇంత కంటే నరకం లేదు . 
''లేదు మేడం ఏమి లేవు . బాబుకు మంచి మార్క్స్ వచ్చాయి . సారీ ''
పెట్టేసాడు . 
ముందు ఈయనకి ఫోన్ చేయకపోతే ఎంత బాధ పడుతుంటాడో..... 
గబా గబా ఫోన్ చేసాను . సిగ్నల్ సరిగా లేక వినపడటం లేదు . 
''మన వాడికి ఏమి లేవు . అది తప్పు '' అనేది వినపడి కొంత 
స్థిమిత పడ్డాడు . 
ఇంటికి వచ్చినాక తాను ఎంత కంగారు పడింది చెపుతూ ఉంటె 
కొంచెం ఆనందం కలిగింది . ఒక మంచి తండ్రి ని దగ్గర నుండి 
చూసినందుకు ..... అయినా ఒక సారీ ఇప్పుడప్పుడే ఈ భాద ను 
తొలగించేస్తుందా !
ఒరే సాయి .... మాకేంటి !! ఆహా మాకేంటిది అని ? :-)
                                *********** 

Tuesday, 17 March 2015

టీచర్ ..... మంచి పుస్తకం

టీచర్ ..... మంచి పుస్తకం 
పుస్తకాలు చదవడం అంటే నాకు జాలరి పిలకాయలకి 
సముద్రం దొరికినంత సంబరం . ఒక్కో సారి పద్దతిగా వరుసలో 
చదువుతాను . ఒక్కో సారి వెనుక వ్రాసింది , ఒక్కో సారి ముందుమాట , 
ఒక్కో సారి ఏదో ఒక పేజ్ ..... అదో సముద్రం అయినట్లు నా ఇష్టం ,
దానికి నాకు మధ్య పరిచయం పెరిగేటట్లు ,లేకుంటే చదివేది లేదు ... పక్కన పడేయ్యటమే . 
ఇదేదో నాకు తగ్గ పుస్తకం లాగుంది . 
వెనుక మాట చూస్తే టీచర్స్ ,తల్లి తండ్రులు కూడా బోలెడు సార్లు 
చదవాలి అనిఉంది . ఏముందబ్బ అంత గొప్పదనం !!!
చదివితే సరి . మామూలే ఏదో ఒక పేజ్ తీశాను . పిల్లవాడి చదువుకు 
డబ్బులు లేవని బడి మానిపించిన నాన్న ,పిల్లవాడిని చుట్టలు 
తెమ్మని పంపితే బడిని వదలలేక వాడు అక్కడే కూర్చొని బాధ పడే కధ . 
హ్మ్ .... నిట్టూర్చాను . 
ఎన్ని చూడలేదు నా సర్వీస్ లో . సగం లో మానేసే వాళ్ళు ,పెళ్లి చేసుకొని 
వెళ్లి పోయేవాళ్ళు .... నా శక్తి మేరకు కౌన్సిలింగ్ ఇవ్వడం ,కాని 
ఇంత మంచి సంభంధం వస్తుందని హామీ ఎక్కడ మేడం అంటే ,నేను 
ఎక్కడ ఇవ్వగలను ! :(
అరె ఇలాంటి కధ  కూడా దీనిలో ఉందే !!వారాల కృష్ణమూర్తి గారి 
కధ . నర్మద అనే తెలివి గల అమ్మాయి పెళ్లి కోసం డాక్టర్ చదువు 
వదిలేసుకోవడం . నదులు వృధాగా సముద్రం లో కలిసినట్లు ఎందరు 
ఆడపిల్లల తెలివి పెళ్లి లో కలిసిపోయింది ,అని మాష్టారు బాధపడటం . 
ఇప్పుడు ఇంటరెస్ట్ గా అసలు ఈ బుక్ కధా కమామీషు ఏమిటి అని 
మొదలుపెట్టాను . 
''కత్తి నరసింహా రెడ్డి ''గారి సంపాదకత్వం లో ''స్టేట్ టీచర్స్ యునియన్ ''
వారి ఆధ్వర్యం లో సేకరించిన టీచింగ్ కి ,విద్యార్ధుల కి సంబంధించి
సేకరించిన కధల పుస్తకం ఇది . ఇన్ని కొణాలుగా నా టీచర్ అనుభవాలను 
 ఇంత మంది అక్షరాలఅద్దం లో  చూసుకున్నట్లు ఉంది . 

చాగంటి సోమయాజులు ,సింగమనేని నారాయణ ,మధురాంతకం రాజారాం ,నామిని ,
సాకం నాగరాజు ,సుధామూర్తి ,చుక్కా రామయ్య ,అబ్దుల్ కలాం గారు ఇంకా ఇప్పటి 
వారు అప్పటి వారు ఎవరైతేనేమి చదువు గొప్పదనానికి చేతులు మొక్కిన వారు ,
గుండె గోడలకి అక్షరాలతో ఆలోచనలు అద్దిన వారు .... మొత్తం ముప్పై . బాపు 
గారి కధ చదివితే ఎదిగే కొద్దీ ఒదిగిన గొప్పదనం ,పుస్తకాల విలువ ..... 
అబ్బ ! చక్కని సేకరణ . చక్కని ముద్రణ . తప్పకుండా నా లైబ్రరీలో ఉంచుకోవాల్సిన 
పుస్తకం . ఎందుకంటె ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్ధి కదా :)
ప్రతులకు :
విశాలాంధ్ర బుక్ హౌస్ 
లేదా ,
కత్తి నరసింహా రెడ్డి 
3-2-798 ,ఎస్ . టి . యు భవన్ 
కాచిగూడ 
హైదరాబాద్ -27 
ఫోన్ : 040 - 24655753 
వెల : 150 రూ 
                                     @@@@@@@@@@@@@@@ 



Friday, 6 March 2015

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

మళ్ళీ మళ్ళీ ఇది రాని  రోజు 
ఎన్ని రోజులు అయింది సినిమా వచ్చి .... ఇప్పుడేమిటి ఇంకా వ్రాసేది !!!
పర్లేదు ఎంత మంది చెపితే ఏమిటి ,ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువ 
ఉంటుంది ,ఎవరి కోణం వారిది అని చదువుకున్న వాళ్ళం మనకు 
తెలీదా ఏమిటి !
ఏముంది మామూలే ఇంట్లో ఈయనకి నాకు తీరి సినిమాకు వెళ్లేసరికి 
ఇన్ని రోజులు గడిచి హాల్ లో మేమిద్దరం ,ఇంకెవరో దూరంగా ఇద్దరు 
అంతే . ఏమి పర్వాలేదు ,మా కోసం ప్రివ్యు వేసారని ఫీల్ అవుదాము . 


ముందే ఇది క్ర్రాంతి మాధవ్ ,ఓనమాలు మార్క్ అనుకున్నాను . సరేలే 
నిత్యా ని ఒకసారి చూడొచ్చు అనుకోని వచ్చాను . స్టోరీ ఒక ప్రేమ కధ . 
ప్రేమ విలువను తెలిపే కధ . అంటే ఇలాంటి కధను వాల్మీకి ఇంతకు ముందు 
వ్రాసి ఉన్నాడు . ఆయనెవరు అంటారా ?కళ్ళు పోతాయి ''ఉత్తర రామాయణ ''
కర్త . మనసులు ముడిపడిన వాళ్ళు దూరంగా ఉన్నా సరే ఆ ఒకరితోనే 
వాళ్ళ మనసు నిండిపోతుంది . వేరేవాళ్ళను ఊహించలేరు . అందుకే కదా 
సీతమ్మ తాను చనిపోతే రాముడు మళ్ళీ పెళ్లి చేసుకోడు అని తెలుసు కాబట్టి 
వారసులను కని ఆయనకు ఇచ్చి రాణి గా తన బాధ్యతను నిర్వహించి 
భూమిలో కలిసిపోతుంది . ఇంత ఆదర్శ ప్రేమ అందరికి రాదు కదా !
కాని దానిని మనం చేరుకోగలం . మన భాగస్వాములలో మంచి ని 
ప్రేమను మాత్రమె ఫీల్ అవుతూ పోతుంటే , ఇక వాళ్ళే మనలో నిండిపోతారు . 
కాబట్టి అసాధ్యం కాదు మనసు పెట్టాలి కాని . 

రాజా రామ్ (శర్వానంద్ )కాలేజ్ లో చదువుకుంటూ ,పరుగు పందెం లలో 
గెలిచి, చిన్నప్పుడే తండ్రి దూరం అయినా తన కోసమే బ్రతుకుతున్న 
అమ్మ కోరిక నే తన లక్ష్యంగా ప్రాక్టీస్ చేసేవాడు . వాళ్ళ అమ్మ సంపాదన 
ఎంత తక్కువ అంటే ,సంగీతం ట్యుషన్ ల మీద వచ్చే ఆదాయం మాత్రమే . 
కనీసం తనకు ఇష్టం అయిన స్పైక్ షూస్ కొనలేక ,పందెం లో షూస్ లేకుండా 
పరిగెడుతూ గెలుస్తూ ఉంటాడు . అప్పుడు పరిచయం అయిన బురఖా 
అమ్మాయిని(నిత్య నాజీర గా ) కేవలం కళ్ళు చూసి ప్రేమించేస్తాడు . 
ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని తన ప్రేమ ను కూడా పొందుతాడు . 

ఇక మామూలే ... అమ్మాయి తల్లి తండ్రులు నిత్యాని మలేషియా పిలిపించి 
మతాంతర వివాహానికి ఒప్పుకోరు . కాని నిత్యా మాటను కాదనలేక 
పరువును వదులుకోలేక వాళ్ళ నాన్న ఆత్మ హత్య చేసుకోవడం నిత్యను 
బాధ పెట్టి, నాన్న కోసం తన ప్రేమను వదులుకుంటాను అని ,రాజా రామ్ 
ని వేరే పెళ్లి చేసుకొమ్మని వ్రాస్తుంది . అక్కడ రాజారాం కూడా అమ్మ పోయిన 
బాధలో ఉంటాడు . అలా చాలా ఏళ్ళు గడిచినాక పదహారేళ్ళ కూతురు 
మేహాక్ ని తీసుకొని నిత్య ,రాజారాం ప్రేమను చూపించి తన మనసుకు 
ప్రేమ గొప్పదనం తెలియచేయాలి అని తీసుకుని వస్తుంది . 
అయితే నిత్య కి కూతురు ఎలా వచ్చింది ?రాజ రామ్ కి కూతురు 
ఎలా వచ్చింది ?ఇద్దరు కూతుళ్ళు ఉంటె వాళ్ళు ఎలా ప్రేమను గెలుస్తారు ? 
తెర మీద చూడాల్సిందే . (ఆన్ లైన్ లో ఉన్నట్లుంది ) 

డైలాగ్స్ మొదట గా చెప్పుకోతగినవి . 
''గెలుపు తో ఉండు . అదెప్పుడూ ముందే ఉంటుంది . 
ఇంకొకరి ఓటమి తో ఉంటె ఎవరో ఒకరి వెనుకే ఉంటావు ''
సాయి మాధవ్ బుర్రా  చాలా చక్కగా వ్రాసారు . ముఖ్యంగా సాయిబుల అమ్మాయి 
అనే పదం వస్తే నాకు భలే సంతోషం వేసింది . ఎందుకంటె ఇది మా నెల్లూరి 
పదం . ఇంకా బురఖాలో బంతి పువ్వు , అసలు ఈ పువ్వు పేరు 
ఎవరికి గుర్తు ఉంది !వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ కధ కొన్ని వేరే సినిమా 
సన్నివేశాలు గుర్తుకు తెచ్చినా మరీ బోర్ కొట్టలేదు . ఫోటోగ్రఫీ 
నాకు బాగా నచ్చింది . చిన్న విశాఖ పట్నాన్ని బాగానే ఉపయోగించారు . 
సంగీతం పెద్దగా ఇంప్రెస్స్ చెయ్యలేదు . సాహిత్యం బాగుంది కాని 
ఏదో లింక్ మిస్ అయింది . ఈయన కి సంగీతం ఇష్టం . హ్యాపీ డేస్ 
పాటలు ఇప్పుడు విని కూడా భలే ఫ్రెష్ గా ఉన్నాయి కదా అంటూ 
ఉంటారు . ఇక్కడ ఏమి పెద్దగా లేవు అనేశారు . క్రాంతి మాధవ్ 
నాచురల్ గా ఉండాలి అనుకున్నా ప్రేక్షకుల కోసం ఒక కల సాంగ్ అన్నా 
హుషారుగా చెయ్యాల్సింది . 
రెండో భాగం లో మాత్రం క్రాంతి మాధవ్ డ్రీం ,స్క్రీన్ ప్లే చక్కగా 
పని చేసింది . నిత్య నటన , మెచ్యురిటీ హైలెట్ . కాసేపు విసుగును 
మర్చిపోయి వాళ్ళు కలిస్తే బాగుండును అనుకుంటూ చూస్తాము . 
కాకుంటే క్రాంతి మాధవ్ గారు ఆయన చూపించాలి అనుకున్నది 
చక్కగా వరుసగా చూపించేస్తూ వెళ్ళిపోతారు రెండో భాగం లో . 
ఒకటే కధ ,కొంత రిలీఫ్ గా ఒక హాస్య ట్రాక్ ఉంటె బాగుండును 
అనిపించింది . ఎంత తోటకూర పప్పు కమ్మగా ఉన్నా కొంచెం 
ఉప్పు మిరపకాయలు ,గుమ్మడి కాయ వడియాలు ఉంటె ఇంకా 
బాగుంటుంది కదా !
 క్రాంతి మాధవ్ గారి సినిమా ఆయనంత సంస్కారంగా కనీసం 
హీరోయిన్ నడుము కూడా చూపించనంత గౌరవంగా 
(నడుము చూపించడం తప్పని కాదు ,కాని అందం మనసుకు 
హత్తుకునేటట్లు సన్నివేశం లో ఒదగాలి కాని మనిషిని 
పశువు తనానికి దిగ జార్చకూడదు . ఒక అందమైన ఫీలింగ్ ని 
దాచుకొని మన ఇంట్లో వాళ్ళతో అపురూపంగా పంచుకునే టట్లు 
ఉండాలి )
ఉంది . ఇంకో మంచి భావాలు కల దర్శకుడు తెలుగు కళామ తల్లికి 
లభించినట్లే . వీలు అయితే హాల్ లోనే చూడండి . 
                                @@@@@@ 

Monday, 2 March 2015

ఇప్పుడు కాసిన్ని కార్టూన్స్ .... కొంచెం ఆయుష్షు

ఇప్పుడు కాసిన్ని కార్టూన్స్ .... కొంచెం ఆయుష్షు 
ఎప్పటి నుండి వేద్దాము అనుకున్న పోస్ట్ ఇది !!
ఏదో ఇప్పుడు ''మాలిక వారి మహిళా ప్రత్యెక సంచిక ''
లో వచ్చిన నా కార్టూన్స్ ''భక్తి -ముక్తి '' పుణ్యమా అని 
వేస్తున్నాను . 
అప్పట్లో ''తండ్రి -తనయ '' అని తండ్రి ప్రేమ మీద కధల 
సంచిక మాలిక వెబ్ మాగజైన్ లో వచ్చింది . దానిలో 
''గొడుగు '' అని నా కధ  ప్రచురితం అయింది . 
తరువాత ప్రమదాక్షరి క్రింద 
''తండ్రి - తనయ '' కధా సంకలనం 
ప్రచురించారు . హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో 
(మహిళలేనిర్వహించారు ) 
లకారం పైనే బుక్స్ అమ్మారు అంటే 
ఇక ఆలోచించండి . 
నేను నా కవితల కు ముందు మాటలు ,
సమీక్షలు చదివాను కాని
 ''గొడుగు '' కధకు మందా భానుమతి గారు వ్రాసిన సమీక్ష 
చాలా చాలా నచ్చింది . 
నాకు ఎప్పుడూ ప్రోత్సాహం ఇచ్చే వలబోజు జ్యోతక్క కి 
కృతజ్ఞతలు . ఇప్పుడు మార్చ్ మాలిక సంచిక లో నా 
కార్టూన్స్ (మొదట గా ప్రచురణ ) చూసి ఆల్ ది బెస్ట్ చెప్పెయ్యండి :)

(bhakthi mukhti cartoons link )