Tuesday, 17 March 2015

టీచర్ ..... మంచి పుస్తకం

టీచర్ ..... మంచి పుస్తకం 
పుస్తకాలు చదవడం అంటే నాకు జాలరి పిలకాయలకి 
సముద్రం దొరికినంత సంబరం . ఒక్కో సారి పద్దతిగా వరుసలో 
చదువుతాను . ఒక్కో సారి వెనుక వ్రాసింది , ఒక్కో సారి ముందుమాట , 
ఒక్కో సారి ఏదో ఒక పేజ్ ..... అదో సముద్రం అయినట్లు నా ఇష్టం ,
దానికి నాకు మధ్య పరిచయం పెరిగేటట్లు ,లేకుంటే చదివేది లేదు ... పక్కన పడేయ్యటమే . 
ఇదేదో నాకు తగ్గ పుస్తకం లాగుంది . 
వెనుక మాట చూస్తే టీచర్స్ ,తల్లి తండ్రులు కూడా బోలెడు సార్లు 
చదవాలి అనిఉంది . ఏముందబ్బ అంత గొప్పదనం !!!
చదివితే సరి . మామూలే ఏదో ఒక పేజ్ తీశాను . పిల్లవాడి చదువుకు 
డబ్బులు లేవని బడి మానిపించిన నాన్న ,పిల్లవాడిని చుట్టలు 
తెమ్మని పంపితే బడిని వదలలేక వాడు అక్కడే కూర్చొని బాధ పడే కధ . 
హ్మ్ .... నిట్టూర్చాను . 
ఎన్ని చూడలేదు నా సర్వీస్ లో . సగం లో మానేసే వాళ్ళు ,పెళ్లి చేసుకొని 
వెళ్లి పోయేవాళ్ళు .... నా శక్తి మేరకు కౌన్సిలింగ్ ఇవ్వడం ,కాని 
ఇంత మంచి సంభంధం వస్తుందని హామీ ఎక్కడ మేడం అంటే ,నేను 
ఎక్కడ ఇవ్వగలను ! :(
అరె ఇలాంటి కధ  కూడా దీనిలో ఉందే !!వారాల కృష్ణమూర్తి గారి 
కధ . నర్మద అనే తెలివి గల అమ్మాయి పెళ్లి కోసం డాక్టర్ చదువు 
వదిలేసుకోవడం . నదులు వృధాగా సముద్రం లో కలిసినట్లు ఎందరు 
ఆడపిల్లల తెలివి పెళ్లి లో కలిసిపోయింది ,అని మాష్టారు బాధపడటం . 
ఇప్పుడు ఇంటరెస్ట్ గా అసలు ఈ బుక్ కధా కమామీషు ఏమిటి అని 
మొదలుపెట్టాను . 
''కత్తి నరసింహా రెడ్డి ''గారి సంపాదకత్వం లో ''స్టేట్ టీచర్స్ యునియన్ ''
వారి ఆధ్వర్యం లో సేకరించిన టీచింగ్ కి ,విద్యార్ధుల కి సంబంధించి
సేకరించిన కధల పుస్తకం ఇది . ఇన్ని కొణాలుగా నా టీచర్ అనుభవాలను 
 ఇంత మంది అక్షరాలఅద్దం లో  చూసుకున్నట్లు ఉంది . 

చాగంటి సోమయాజులు ,సింగమనేని నారాయణ ,మధురాంతకం రాజారాం ,నామిని ,
సాకం నాగరాజు ,సుధామూర్తి ,చుక్కా రామయ్య ,అబ్దుల్ కలాం గారు ఇంకా ఇప్పటి 
వారు అప్పటి వారు ఎవరైతేనేమి చదువు గొప్పదనానికి చేతులు మొక్కిన వారు ,
గుండె గోడలకి అక్షరాలతో ఆలోచనలు అద్దిన వారు .... మొత్తం ముప్పై . బాపు 
గారి కధ చదివితే ఎదిగే కొద్దీ ఒదిగిన గొప్పదనం ,పుస్తకాల విలువ ..... 
అబ్బ ! చక్కని సేకరణ . చక్కని ముద్రణ . తప్పకుండా నా లైబ్రరీలో ఉంచుకోవాల్సిన 
పుస్తకం . ఎందుకంటె ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్ధి కదా :)
ప్రతులకు :
విశాలాంధ్ర బుక్ హౌస్ 
లేదా ,
కత్తి నరసింహా రెడ్డి 
3-2-798 ,ఎస్ . టి . యు భవన్ 
కాచిగూడ 
హైదరాబాద్ -27 
ఫోన్ : 040 - 24655753 
వెల : 150 రూ 
                                     @@@@@@@@@@@@@@@ 



No comments: