Friday, 6 March 2015

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

మళ్ళీ మళ్ళీ ఇది రాని  రోజు 
ఎన్ని రోజులు అయింది సినిమా వచ్చి .... ఇప్పుడేమిటి ఇంకా వ్రాసేది !!!
పర్లేదు ఎంత మంది చెపితే ఏమిటి ,ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువ 
ఉంటుంది ,ఎవరి కోణం వారిది అని చదువుకున్న వాళ్ళం మనకు 
తెలీదా ఏమిటి !
ఏముంది మామూలే ఇంట్లో ఈయనకి నాకు తీరి సినిమాకు వెళ్లేసరికి 
ఇన్ని రోజులు గడిచి హాల్ లో మేమిద్దరం ,ఇంకెవరో దూరంగా ఇద్దరు 
అంతే . ఏమి పర్వాలేదు ,మా కోసం ప్రివ్యు వేసారని ఫీల్ అవుదాము . 


ముందే ఇది క్ర్రాంతి మాధవ్ ,ఓనమాలు మార్క్ అనుకున్నాను . సరేలే 
నిత్యా ని ఒకసారి చూడొచ్చు అనుకోని వచ్చాను . స్టోరీ ఒక ప్రేమ కధ . 
ప్రేమ విలువను తెలిపే కధ . అంటే ఇలాంటి కధను వాల్మీకి ఇంతకు ముందు 
వ్రాసి ఉన్నాడు . ఆయనెవరు అంటారా ?కళ్ళు పోతాయి ''ఉత్తర రామాయణ ''
కర్త . మనసులు ముడిపడిన వాళ్ళు దూరంగా ఉన్నా సరే ఆ ఒకరితోనే 
వాళ్ళ మనసు నిండిపోతుంది . వేరేవాళ్ళను ఊహించలేరు . అందుకే కదా 
సీతమ్మ తాను చనిపోతే రాముడు మళ్ళీ పెళ్లి చేసుకోడు అని తెలుసు కాబట్టి 
వారసులను కని ఆయనకు ఇచ్చి రాణి గా తన బాధ్యతను నిర్వహించి 
భూమిలో కలిసిపోతుంది . ఇంత ఆదర్శ ప్రేమ అందరికి రాదు కదా !
కాని దానిని మనం చేరుకోగలం . మన భాగస్వాములలో మంచి ని 
ప్రేమను మాత్రమె ఫీల్ అవుతూ పోతుంటే , ఇక వాళ్ళే మనలో నిండిపోతారు . 
కాబట్టి అసాధ్యం కాదు మనసు పెట్టాలి కాని . 

రాజా రామ్ (శర్వానంద్ )కాలేజ్ లో చదువుకుంటూ ,పరుగు పందెం లలో 
గెలిచి, చిన్నప్పుడే తండ్రి దూరం అయినా తన కోసమే బ్రతుకుతున్న 
అమ్మ కోరిక నే తన లక్ష్యంగా ప్రాక్టీస్ చేసేవాడు . వాళ్ళ అమ్మ సంపాదన 
ఎంత తక్కువ అంటే ,సంగీతం ట్యుషన్ ల మీద వచ్చే ఆదాయం మాత్రమే . 
కనీసం తనకు ఇష్టం అయిన స్పైక్ షూస్ కొనలేక ,పందెం లో షూస్ లేకుండా 
పరిగెడుతూ గెలుస్తూ ఉంటాడు . అప్పుడు పరిచయం అయిన బురఖా 
అమ్మాయిని(నిత్య నాజీర గా ) కేవలం కళ్ళు చూసి ప్రేమించేస్తాడు . 
ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని తన ప్రేమ ను కూడా పొందుతాడు . 

ఇక మామూలే ... అమ్మాయి తల్లి తండ్రులు నిత్యాని మలేషియా పిలిపించి 
మతాంతర వివాహానికి ఒప్పుకోరు . కాని నిత్యా మాటను కాదనలేక 
పరువును వదులుకోలేక వాళ్ళ నాన్న ఆత్మ హత్య చేసుకోవడం నిత్యను 
బాధ పెట్టి, నాన్న కోసం తన ప్రేమను వదులుకుంటాను అని ,రాజా రామ్ 
ని వేరే పెళ్లి చేసుకొమ్మని వ్రాస్తుంది . అక్కడ రాజారాం కూడా అమ్మ పోయిన 
బాధలో ఉంటాడు . అలా చాలా ఏళ్ళు గడిచినాక పదహారేళ్ళ కూతురు 
మేహాక్ ని తీసుకొని నిత్య ,రాజారాం ప్రేమను చూపించి తన మనసుకు 
ప్రేమ గొప్పదనం తెలియచేయాలి అని తీసుకుని వస్తుంది . 
అయితే నిత్య కి కూతురు ఎలా వచ్చింది ?రాజ రామ్ కి కూతురు 
ఎలా వచ్చింది ?ఇద్దరు కూతుళ్ళు ఉంటె వాళ్ళు ఎలా ప్రేమను గెలుస్తారు ? 
తెర మీద చూడాల్సిందే . (ఆన్ లైన్ లో ఉన్నట్లుంది ) 

డైలాగ్స్ మొదట గా చెప్పుకోతగినవి . 
''గెలుపు తో ఉండు . అదెప్పుడూ ముందే ఉంటుంది . 
ఇంకొకరి ఓటమి తో ఉంటె ఎవరో ఒకరి వెనుకే ఉంటావు ''
సాయి మాధవ్ బుర్రా  చాలా చక్కగా వ్రాసారు . ముఖ్యంగా సాయిబుల అమ్మాయి 
అనే పదం వస్తే నాకు భలే సంతోషం వేసింది . ఎందుకంటె ఇది మా నెల్లూరి 
పదం . ఇంకా బురఖాలో బంతి పువ్వు , అసలు ఈ పువ్వు పేరు 
ఎవరికి గుర్తు ఉంది !వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ కధ కొన్ని వేరే సినిమా 
సన్నివేశాలు గుర్తుకు తెచ్చినా మరీ బోర్ కొట్టలేదు . ఫోటోగ్రఫీ 
నాకు బాగా నచ్చింది . చిన్న విశాఖ పట్నాన్ని బాగానే ఉపయోగించారు . 
సంగీతం పెద్దగా ఇంప్రెస్స్ చెయ్యలేదు . సాహిత్యం బాగుంది కాని 
ఏదో లింక్ మిస్ అయింది . ఈయన కి సంగీతం ఇష్టం . హ్యాపీ డేస్ 
పాటలు ఇప్పుడు విని కూడా భలే ఫ్రెష్ గా ఉన్నాయి కదా అంటూ 
ఉంటారు . ఇక్కడ ఏమి పెద్దగా లేవు అనేశారు . క్రాంతి మాధవ్ 
నాచురల్ గా ఉండాలి అనుకున్నా ప్రేక్షకుల కోసం ఒక కల సాంగ్ అన్నా 
హుషారుగా చెయ్యాల్సింది . 
రెండో భాగం లో మాత్రం క్రాంతి మాధవ్ డ్రీం ,స్క్రీన్ ప్లే చక్కగా 
పని చేసింది . నిత్య నటన , మెచ్యురిటీ హైలెట్ . కాసేపు విసుగును 
మర్చిపోయి వాళ్ళు కలిస్తే బాగుండును అనుకుంటూ చూస్తాము . 
కాకుంటే క్రాంతి మాధవ్ గారు ఆయన చూపించాలి అనుకున్నది 
చక్కగా వరుసగా చూపించేస్తూ వెళ్ళిపోతారు రెండో భాగం లో . 
ఒకటే కధ ,కొంత రిలీఫ్ గా ఒక హాస్య ట్రాక్ ఉంటె బాగుండును 
అనిపించింది . ఎంత తోటకూర పప్పు కమ్మగా ఉన్నా కొంచెం 
ఉప్పు మిరపకాయలు ,గుమ్మడి కాయ వడియాలు ఉంటె ఇంకా 
బాగుంటుంది కదా !
 క్రాంతి మాధవ్ గారి సినిమా ఆయనంత సంస్కారంగా కనీసం 
హీరోయిన్ నడుము కూడా చూపించనంత గౌరవంగా 
(నడుము చూపించడం తప్పని కాదు ,కాని అందం మనసుకు 
హత్తుకునేటట్లు సన్నివేశం లో ఒదగాలి కాని మనిషిని 
పశువు తనానికి దిగ జార్చకూడదు . ఒక అందమైన ఫీలింగ్ ని 
దాచుకొని మన ఇంట్లో వాళ్ళతో అపురూపంగా పంచుకునే టట్లు 
ఉండాలి )
ఉంది . ఇంకో మంచి భావాలు కల దర్శకుడు తెలుగు కళామ తల్లికి 
లభించినట్లే . వీలు అయితే హాల్ లోనే చూడండి . 
                                @@@@@@ 

No comments: